న్యూఢిల్లీ: ముడిచమురు రేట్లు, కనీస మద్దతు ధరల పెంపు వంటి అంశాలతో ద్రవ్యోల్బణం ఎగిసే అవకాశం ఉన్నప్పటికీ.. రిజర్వ్ బ్యాంక్ ఈ దఫా పరపతి విధాన సమీక్షలో కీలక పాలసీ రేట్లను పెంచకపోవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతానికి యథాతథ స్థితే కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సోమవారం రెండో ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇవి ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సారథ్యంలో పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) మూడు రోజుల పాటు ఈ సమీక్ష జరగనుంది. ఆగస్టు 1న కీలకపాలసీ రేట్లపై ఆర్‌బీఐ నిర్ణయాన్ని ప్రకటించనుంది. ధరల పెరుగుదల భయాల నేపథ్యంలో జూన్‌లో ఆర్‌బీఐ రేటును 0.25% పెంచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇది 6.25%. రేట్ల పెంపు విషయంలో ఆర్‌బీఐ ప్రధానంగా పరిగణనలోకి తీసుకునే రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో ఏకంగా 5 నెలల గరిష్టమైన 5 శాతానికి ఎగిసింది. ఇంధన ధరలు ఎగియడమే ఇందుకు కారణం. ప్రస్తుతం క్రూడాయిల్ రేట్లు మూడేళ్ల గరిష్ట స్థాయి నుంచి కిందికి దిగి వచ్చినప్పటికీ.. ద్రవ్యోల్బణం, కరెంటు అకౌంటు లోటు పెరగొచ్చన్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఆర్‌బీఐ ఏం నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రెండు శాతం అటూ, ఇటూగా ద్రవ్యోల్బణం 4% స్థాయికి పరిమితమయ్యేలా చూడటంపై రిజర్వ్ బ్యాంక్ ప్రధానంగా దృష్టి పెట్టడం తెలిసిందే.
ఎస్‌బీఐ, ఎడెల్వీస్ అంచనాలివి..
ప్రస్తుత పరిస్థితుల్లో వడ్డీ రేట్లను పెంచడం కన్నా యథాతథ స్థితి కొనసాగించడమే శ్రేయస్కరం కాగలదని భావిస్తున్నట్లు ఎస్‌బీఐ అధ్యయన నివేదికలో పేర్కొంది. ద్రవ్యోల్బణ రిస్కులు పెరగడం, తగ్గడానికి సమాన అవకాశాలు కనిపిస్తున్నాయని వివరించింది. మరీ తప్పకపోతే రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచిందంటే .. రూపాయి పతనానికి అడ్డుకట్ట వేసేలా మార్కెట్ వర్గాల అంచనాలను అందుకోవాలన్న అభిప్రాయం ఒక్కటే కారణం కాగలదని ఎస్‌బీఐ పేర్కొంది. మరోవైపు, రాబోయే పాలసీ సమీక్షలో ఆర్‌బీఐ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయకుండా తటస్థ వైఖరి అవలంబించే అవకాశం ఉందని ఎడెల్వీస్ సెక్యూరిటీస్ మరో నివేదికలో అభిప్రాయపడింది. అటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కూడా ఆర్‌బీఐ యథాతథ స్థితే కొనసాగించవచ్చని తెలిపింది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ మరిన్ని దఫాలు వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు గణనీయంగా ఉన్నాయని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం డీబీఎస్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment