ద్రవ్యోల్బణం ఆధారంగానే నిర్ణయం
ఎస్‌బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి
న్యూఢిల్లీ: ఆహార ద్రవ్యోల్బణం విషయంలో అనిశ్చితి నెలకొన్నందున ఆర్‌బీఐ ఈ ఏడాది వడ్డీ రేట్ల కోతను చేపట్టకపోవచ్చని ఎస్‌బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి అభిప్రాయపడ్డారు. యూఎస్ ఫెడ్ నాలుగేళ్లలో మొదటిసారి వడ్డీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో.. ప్రపంచవ్యాప్తంగా ఇతర ఆర్థిక సెంట్రల్ బ్యాంక్‌లు సైతం ఇదే బాట పట్టొచ్చన్న అంచనాలు నెలకొండడం తెలిసిందే. ‘‘రేట్ల విషయంలో సెంట్రల్ బ్యాంక్‌లు స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటాయి.
ఫెడ్ రేట్ల కోత ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది. కానీ, ఆర్‌బీఐ మాత్రం ఈ విషయంలో ఆహార ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకునే ఓ నిర్ణయానికొస్తుంది. మా అభిప్రాయం ఇదే. ఈ కేలండర్ సంవత్సరంలో ఆర్‌బీఐ రేట్లను తగ్గించకపోవచ్చు. ఆహార ద్రవ్యోల్బణం పరంగా మంచి పురోగతి ఉంటే తప్ప ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (2025 జనవరి–మార్చి) వరకు వేచి చూడాల్సి రావచ్చు’’ అని శెట్టి పేర్కొన్నారు.
ఆహార ద్రవ్వోల్బణం కీలకం
ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అధ్యక్షతన గల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) తదుపరి వడ్డీ రేట్ల సమీక్షను అక్టోబర్ 7–9 మధ్య చేపట్టనుంది. రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్ట్ నెలకు 3.65 శాతానికి పెరగడం తెలిసిందే. జూలై నెలకు ఇది 3.54 శాతంగా ఉంది. ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణం ఆగస్ట్ నెలకు 5.66 శాతంగా నమోదైంది. అయినప్పటికీ ఆర్‌బీఐ దీర్ఘకాల కట్టడి లక్ష్యం 4 శాతంలోపే ద్రవ్యోల్బణం ఉండడం గమనార్హం. ఆగస్ట్ నాటి ఎంపీసీ సమీక్షలో ఆర్‌బీఐ కీలక రేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవడం తెలిసిందే. రెపో రేటును 6.5 శాతం వద్దే కొనసాగించింది. అంతేకాదు ఆర్‌బీఐ 2023 ఫిబ్రవరి నుంచి రేట్లను యథాతథంగా కొనసాగిస్తోంది. చివరి ఎంపీసీ భేటీలో నలుగురు సభ్యులు యథాతథ స్థితికి మొగ్గు చూపితే, ఇద్దరు సభ్యులు రేట్ల తగ్గింపునకు మద్దతు పలికారు.
ఎస్‌బీఐ నిధుల సమీకరణ
రూ. 7,500 కోట్ల బాండ్ల జారీ
ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్(ఎస్‌బీఐ) బాండ్ల జారీ ద్వారా రూ. 7,500 కోట్లు సమీకరించింది. బాసెల్–3 నిబంధనలకు అనుగుణమైన టైర్–2 బాండ్ల జారీని చేపట్టినట్లు ఎస్‌బీఐ పేర్కొంది. అర్హతగల సంస్థాగత బిడ్డర్లకు బాండ్లను ఆఫర్ చేయగా.. భారీ స్పందన లభించినట్లు వెల్లడించింది. ప్రాథమికం(బేస్)గా రూ. 4,000 కోట్ల సమీకరణకు బాండ్ల జారీని చేపట్టగా మూడు రెట్లు అధికంగా బిడ్స్ దాఖలైనట్లు తెలియజేసింది. దీంతో రూ. 7,500 కోట్లవరకూ బాండ్ల జారీకి నిర్ణయించినట్లు వివరించింది. ప్రావిడెంట్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, బ్యాంకులు తదితరాలు దరఖాస్తు చేసినట్లు పేర్కొంది.
విభిన్న సంస్థలు బిడ్డింగ్ చేయడం ద్వారా దేశీ దిగ్గజ బ్యాంక్‌పై నమ్మకముంచినట్లు ఎస్‌బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి వ్యాఖ్యానించారు. కాగా.. 7.33% కూపన్ రేటుతో 15ఏళ్ల కాలపరిమితిగల బాండ్లను జారీ చేసినట్లు ఎస్‌బీఐ తెలియజేసింది. వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25)లో బాసెల్–3 ప్రమాణాలకు అనుగుణమైన టైర్–2 బాండ్ల జారీకి తెరతీసినట్లు పేర్కొంది. 10ఏళ్ల తదుపరి ప్రతీ ఏడాది కాల్ ఆప్షన్‌కు వీలుంటుందని వెల్లడించింది. ప్రపంచ ఫైనాన్షియల్ వ్యవస్థకు నిలకడను తీసుకువచ్చే బాటలో రూపొందించినవే అంతర్జాతీయ బ్యాంకింగ్ నిబంధనలు(బాసెల్–3).
బీఎస్‌ఈలో ఎస్‌బీఐ షేరు 1.2% బలపడి రూ. 792 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment