ఎస్‌బీఐకి బకాయిల సెగ | SBI drops after weak Q3 results | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐకి బకాయిల సెగ

Published Sat, Feb 15 2014 1:04 AM | Last Updated on Sat, Sep 2 2017 3:42 AM

ఎస్‌బీఐకి బకాయిల సెగ

ఎస్‌బీఐకి బకాయిల సెగ

ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ ఈ ఏడాది అక్టోబర్-డిసెంబర్(క్యూ3)లో రూ. 2,234 కోట్ల నికర లాభాన్ని సంపాదించింది. గతేడాది(2012-13) ఇదే కాలంలో ఆర్జించిన రూ.3,396 కోట్లతో పోలిస్తే ఇది 34% క్షీణత. మొండిబకాయిలు పెరగడం, పెట్టుబడులపై నష్టాలు, పెన్షన్‌లకు కేటాయింపులు వంటి అంశాలు లాభాలను దెబ్బకొట్టాయి. మధ్య తరహా కార్పొరేట్, ఎస్‌ఎంఈ రంగాల నుంచి ప్రధానంగా మొండిబకాయిలు పెరిగినట్లు బ్యాంకు చైర్‌పర్శన్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు.

ఇకపై కూడా రుణాల వసూళ్లలో ఒత్తిడి కొనసాగుతుందని చెప్పారు. కనీసం రెండు క్వార్టర్లపాటు జీడీపీ పురోగమిస్తేతప్ప మొండి బకాయిల బెడద ఉపశమించదని వ్యాఖ్యానించారు. ఈ కాలంలో బ్యాంకు మొత్తం ఆదాయం మాత్రం రూ. 33,992 కోట్ల నుంచి రూ.39,061 కోట్లకు జంప్ చేసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన కూడా బ్యాంకు నికర లాభం 40% తగ్గి రూ. 2,838 కోట్లకు పరిమితమైంది. గతంలో రూ. 4,648 కోట్లుగా నమోదైంది.

 పెరిగిన కేటాయింపులు
  ప్రస్తుత సమీక్షా కాలంలో మొండిబకాయిలకు కేటాయింపులు రూ. 2,766 కోట్ల నుంచి రూ. 3,429 కోట్లకు ఎగశాయి.
 స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 5.3% నుంచి 5.7%కు, నికర ఎన్‌పీఏలు 2.59% నుంచి 3.24%కు పెరిగాయి.
  నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 13% ఎగసి రూ. 12,640 కోట్లకు చేరగా, వడ్డీయేతర ఆదాయం రూ. 3,627 కోట్ల నుంచి రూ. 4,190 కోట్లకు పెరిగింది.

  నికర వడ్డీ మార్జిన్లు(ఎన్‌ఐఎం) 3.72% నుంచి 3.49%కు నీరసించాయి. పెన్షన్లకు రూ. 600 కోట్లను కేటాయించింది.
  పెట్టుబడుల్లో తరుగుదల(ఎంటూఎం నష్టాలు)కింద రూ. 621 కోట్లను కేటాయించింది.  కొత్తగా రూ. 11,000 కోట్లమేర మొండిబకాయిలు(స్లిప్పేజెస్) నమోదుకాగా, ఎస్‌ఎంఈ, మధ్యస్థాయి కార్పొరేట్ విభాగాల నుంచి రూ. 9,500 కోట్లు నమోదయ్యాయి.
  రూ. 5,000 కోట్లమేర రుణాలను రద్దు(రైటాఫ్) చేసింది.

 రూ. 9,500 కోట్లమేర రుణాలను పున ర్వ్యవస్థీకరించనున్నట్లు అరుంధతి తెలిపారు.
  ఇకపై ఎస్‌ఎంఈ, మధ్యస్థాయి కార్పొరేట్ సంస్థలకు రుణాల మంజూరీలో కఠినంగా వ్యవహరించనున్నట్లు చెప్పారు.
  బ్యాంకు కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) డిసెంబర్ చివరికి 11.59%గా నమోదైనప్పటికీ, ఈ జనవరిలో చేపట్టిన క్విప్ ఇష్యూ తదితరాల కారణంగా 13.27%కు పుంజుకున్నట్లు వివరించారు.

  అక్టోబర్‌కల్లా బలహీన ఖాతాలపై ముందస్తు హెచ్చరికలను జారీ చేసే టెక్నాలజీ(ప్రిడిక్టివ్ సాఫ్ట్‌వేర్)ను అమలు చేయనున్నట్లు అరుంధతి తెలిపారు.
 
 ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో బ్యాంకు షేరు 1.6% నష్టంతో రూ. 1,475 వద్ద ముగిసింది. రోజులో గరిష్టంగా రూ. 1,514, కనిష్టంగా రూ.1,456ను తాకింది.
 
  మొండి బకాయిలపై యుద్ధం
 రుణాల రిక వరీపై దృష్టిపెడుతూ స్ట్రెస్ మేనేజ్‌మెంట్ గ్రూప్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు అరుంధతీ భట్టాచార్య తెలిపారు. ఇందుకు తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ జోన్లకు జనరల్ మేనేజర్లను నియమిస్తున్నట్లు వివరించారు. ఈ కమిటీ స్ట్రెస్ మేనేజ్‌మెంట్ గ్రూప్‌నకు జవాబుదారీగా ఉంటుందని తెలిపారు. దీంతోపాటు మొండిబకాయిల పర్యవేక్షణకు సంబంధించి రూపొందించిన కమిటీ వివరాలను కూడా ఆమె వెల్లడించారు.

దీనిలో భాగంగా రూ. 500 కోట్లకుపైన రుణ ఎగవేతలను అరుంధతి అధ్యక్షతన ఏర్పడే కమిటీ పరిశీలిస్తుంది. రూ. 100-500 కోట్ల స్థాయిలో మొండిబకాయిలను కార్పొరేట్ బ్యాంకింగ్ ఎండీ ప్రదీప్ కుమార్ పర్యవేక్షిస్తారు. ఇక రూ. 50-100 కోట్ల బకాయిల విభాగాన్ని స్ట్రెస్ అసెట్ మేనేజ్‌మెంట్ గ్రూప్ డిప్యూటీ ఎండీ సుందర కుమార్ చేపడతారు. మొండిబకాయిలను అరికట్టేందుకు వీలుగా ఈ కమిటీలు వారానికోసారి ఖాతాల వివరాలను సమీక్షిస్తాయి. తద్వారా అవసరమైన వెంటనే తగు చర్యలను చేపడతాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement