స్వల్ప నష్టాలతో సరి...
అంచనాలను తలకి ందులు చేస్తూ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్... ద్రవ్యోల్బణంపై వడ్డీ బాణాన్ని ఎక్కుపెట్టారు. రెపో రేటును 0.25% పెంచడం ద్వారా మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి లోను చేశారు. దీంతో తొలుత లాభాలతో కదిలిన స్టాక్ మార్కెట్లు ఉన్నట్టుండి నష్టాలలోకి మళ్లాయి. వెరసి ఉదయం 11 ప్రాంతంలో 20,795 వద్ద ఉన్న సెన్సెక్స్ పాలసీ ప్రకటన వెలువడ్డ వెంటనే 20,554కు పతనమైంది.
అయితే చివరికి స్వల్ప నష్టాలతో బయటపడింది. మరోసారి వడ్డీ రేట్ల పెంపు ఉండకపోవచ్చన్న రఘురామ్ వ్యాఖ్యలు ఇందుకు దోహదం చే శాయి. ఫలితంగా ట్రేడింగ్ ముగిసేసరికి 24 పాయింట్ల నష్టంతో 20,683 వద్ద నిలిచింది. ఇక నిఫ్టీ కూడా 9 పాయింట్లు క్షీణించి 6,126 వద్ద స్థిరపడింది. మూడు రోజుల వరుస నష్టాలతో సెన్సెక్స్ 690 పాయింట్లు కోల్పోయింది.
జారి‘పడ్డ’ మారుతీ: సెన్సెక్స్ దిగ్గజాలలో క్యూ3 ఫలితాలు ప్రకటించిన మారుతీ అత్యధికంగా 8% దిగజారింది. ఈ బాటలో యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్ 3.3-1.5% మధ్య నష్టపోయాయి. మరోవైపు మెటల్ దిగ్గజాలు టాటా స్టీల్, హిందాల్కో, సెసాస్టెరిలైట్ 3.5-2.5% మధ్య లాభపడ్డాయి. వీటితోపాటు టాటా మోటార్స్, బజాజ్ ఆటో, భెల్, ఐసీఐసీఐ సైతం 2.5-1% మధ్య బలపడ్డాయి. కాగా, సోమవారం రూ. 1,334 కోట్ల విలువైన షేర్లను విక్రయించిన ఎఫ్‌ఐఐలు తాజాగా మరో రూ. 1,267 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. రూపాయి బలపడటానికితోడు, షార్ట్ కవరింగ్ జరగడంతో మార్కెట్లు భారీ నష్టాల నుంచి కోలుకున్నాయని నిపుణులు పేర్కొన్నారు.