మార్కెట్లకు ‘ఫెడ్’ బూస్ట్...సెన్సెక్స్ 416 ప్లస్
మళ్లీ 27,000 దాటిన ఇండెక్స్...
⇒ అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ ఎఫెక్ట్
⇒ చమురు, కరెన్సీ, ఈక్విటీల జోష్
⇒ మిడ్, స్మాల్ క్యాప్ షేర్ల హైజంప్
⇒ ఐదు రోజుల వరుస నష్టాలకు చెక్
వడ్డీరేట్ల పెంపు విషయంలో ఓపికతో వ్యవహరిస్తామని అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ .. బుధవారం రాత్రి ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి. దీనికిఅనుగుణంగానే సెన్సెక్స్ నేలక్కొట్టిన బంతిలా రివ్వున పెకైగసింది. దీనికి షార్ట్ కవరింగ్ కూడా జతకలవడంతో 416 పాయింట్లు దూసుకెళ్లింది. గత ఆరు వారాల్లో ఇది అత్యధిక లాభంకాగా, 5 రోజుల వరుస నష్టాలకు చెక్ పెడుతూ మళ్లీ 27,000 పాయింట్లను దాటేసింది. 27,127 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 130 పాయింట్ల హైజంప్ చేసి 8,159 వద్ద నిలిచింది. గత ఐదు రోజుల్లో సెన్సెక్స్ 1,121 పాయింట్లు కోల్పోయిన సంగతి తె లిసిందే.
అన్నింటా అదే జోరు...: వచ్చే ఏడాది ద్వితీయార్థంలో(2015 జూన్) మాత్రమే వడ్డీ రేట్ల పెంపు ఉండవచ్చునన్న ఫెడరల్ రిజర్వ్ సంకేతాలు ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయి. వెరసి ఐదున్నరేళ్ల కనిష్టం నుంచి చమురు, 13 నెలల కనిష్టం నుంచి రూపాయి కోలుకున్నాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు కూడా భారీగా పుంజుకున్నాయి. అమెరికా మార్కెట్లు బుధ, గురువారాల్లో భారీ ర్యాలీ జరిపాయి. దేశీయంగానూ వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) బిల్లుకు కేబినెట్ ఆమోదం లభించడంతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం రెట్టింపయ్యింది. బీఎస్‌ఈలో అన్ని రంగాలూ 1-5% మధ్య ఎగశాయి.
మరిన్ని విశేషాలివీ..
⇒వినియోగవస్తువుల సూచీ 5% జంప్‌చేయగా, విద్యుత్, యంత్రపరికరాలు, బ్యాంకింగ్, రియల్టీ, ఆటో, మెటల్ 3-2% మధ్య పురోగమించాయి. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 2.7%, 3.5% చొప్పున పుంజుకున్నాయి.
⇒బ్లూచిప్స్‌లో భెల్, హిందాల్కో, గెయిల్, మారుతీ, ఎన్‌టీపీసీ, ఐసీఐసీఐ, టాటా పవర్, సిప్లా, యాక్సిస్, ఎల్‌అండ్‌టీ, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఎస్‌బీఐ, భారతీ, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఆర్‌ఐఎల్ 5-1% మధ్య లాభపడ్డాయి.
⇒మిడ్ క్యాప్స్‌లో జేకే టైర్, పీసీ జ్యువెలర్, ఐవీఆర్‌సీఎల్, టొరంట్ పవర్, డీసీబీ, హెచ్‌డీఐఎల్, రెడింగ్టన్, అరవింద్, ఎస్సార్ ఆయిల్, పీఎఫ్‌సీ, పేజ్, గుజరాత్ గ్యాస్ 18-8% మధ్య దూసుకెళ్లాయి.
రూపాయి రికవరీ.. 50 పైసలు అప్
ముంబై: వివిధ అంతర్జాతీయ పరిణామాల కారణంగా దేశీ స్టాక్స్ గణనీయంగా పెరగడంతో గురువారం రూపాయి కూడా భారీగా లాభపడింది. డాలర్‌తో పోలిస్తే దేశీ కరెన్సీ మారకం విలువ ఏకంగా యాభై పైసల మేర బలపడి 63.11 వద్ద ముగిసింది. ఒక్క రోజులోనే ఇంత పెరుగుదల నమోదు కావడం ఏడు నెలల్లో ఇదే ప్రథమం. వడ్డీ రేట్లు పెంచాలన్న ప్రతిపాదన ఉన్నప్పటికీ.. మరికొన్నాళ్ల దాకా అమల్లోకి తేకపోవచ్చంటూ అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రకటించడం ప్రపంచ మార్కెట్లకు కాస్త ఊతమిచ్చినట్లు వెరాసిటీ గ్రూప్ సీఈవో ప్రమీత్ బ్రహ్మభట్ తెలిపారు.
గడచిన మూడు రోజుల్లో రూపాయి మారకం విలువ 132 పైసల మేర (2.12 శాతం) క్షీణించిన సంగతి తెలిసిందే. తాజాగా గురువారం ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 63.61తో పోలిస్తే మెరుగ్గా 63.35 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. చివరికి 0.79 శాతం లాభంతో 63.11 వద్ద ముగిసింది. ఎగుమతి సంస్థలు, కొన్ని బ్యాంకులు.. డాలర్లను విక్రయించడం కూడా రూపాయి పెరుగుదలకు తోడ్పడినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.