
ముంబై: రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) రెండు రోజుల ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశం బుధవారం ప్రారంభమైంది. గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ గురువారం ప్రధాన పాలసీ విధానాన్ని ప్రకటించనుంది. 2018–19లో ఆర్‌బీఐ మొట్టమొదటి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష ఇది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలుచేసే వడ్డీరేటు– రెపోను (ప్రస్తుతం 6 శాతం) ఆర్‌బీఐ యథాతథంగా కొనసాగించే అవకాశాలున్నాయన్నది విశ్లేషకుల అభిప్రాయం.
అంతర్జాతీయంగా క్రూడ్ ధరల తీవ్రత, దేశంలో పెట్రో ధరల పెంపు, వర్షపాతం, పంట దిగుబడులపై అనిశ్చితి, ద్రవ్యోల్బణం భయాలను ఇందుకు వారు కారణంగా చూపుతున్నారు. ఆగస్టు తర్వాత ఇప్పటివరకూ రెపోను ఆర్‌బీఐ తగ్గించలేదు.