బ్యాంకులు వినూత్న మార్గాల్లో డిపాజిట్లను సేకరించకపోతే ప్రమాదంలో పడుతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ హెచ్చరించారు. చిన్న మొత్తాల్లో డిపాజిట్లను సేకరిస్తూ కొన్ని బ్యాంకులు పబ్బం గడుపుతున్నాయని చెప్పారు. దీని వల్ల బ్యాలెన్స్‌షీట్లలో అప్పులు-ఆస్తుల మధ్య తారతమ్యం(అసెట్ లయబిలిటీ డిఫరెన్స్) పెరుగుతుందన్నారు.
ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశంలో దాస్ మాట్లాడుతూ..‘బ్యాంకు కస్టమర్లు డిపాజిట్ల రూపంలో కాకుండా వివిధ మార్గాల్లో డబ్బు దాచుకుంటున్నారు. ఇతర పెట్టుబడి మార్గాలకు మళ్లిస్తున్నారు. బ్యాంకులు లోన్లు ఇవ్వాలన్నా, భారీగా కార్పొరేట్ రుణాలు జారీ చేయాలన్నా డిపాజిట్లు పెరగాలి. లేదంటే బ్యాలెన్స్ షీట్లలో అప్పులు-ఆస్తుల మధ్య తారతమ్యం ఎక్కువవుతుంది. అది బ్యాంకులకు నష్టం కలిగిస్తుంది. కాబట్టి వినూత్న మార్గాల్లో కస్టమర్ల నుంచి డిపాజిట్లు రాబట్టే ప్రయత్నం చేయాలి. క్రెడిట్ వృద్ధికి అనుగుణంగా డిపాజిట్లను సేకరించేందుకు బ్యాంకులు భారీ బ్రాంచ్ నెట్‌వర్క్‌ను కలిగి ఉండాలి. చిన్న మొత్తాల్లో డిపాజిట్లను సేకరిస్తూ కొన్ని బ్యాంకులు పబ్బం గడుపుతున్నాయి. ఇవి భవిష్యత్తులో ప్రమాదంలో పడుతాయి’ అన్నారు.
ఇదీ చదవండి: రేపు మూడు గంటలు యూపీఐ సర్వీసు నిలిపివేత!
ఇదిలాఉండగా, గురువారం జరిగిన ఆర్‌బీఐ మానిటరీ పాలసీ సమావేశంలో రెపో రేటును 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంచారు. ఇలా రెపో రేటును మార్చకపోవడం ఇది వరుసగా తొమ్మిదోసారి. మార్కెట్ వర్గాలు కూడా ఈసారి ఎలాంటి మార్పులుండవనే భావించాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు సెప్టెంబర్‌లో జరిగే మానిటరీ పాలసీ సమావేశంలో కీలక వడ్డీరేట్లను తగ్గిస్తే, అందుకు అనువుగా ఆర్‌బీఐ వడ్డీరేట్లలో మార్పు చేసే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment