రిటైల్ ద్రవ్యోల్బణం నిర్దేశిత 4 శాతానికి చేరువైన నేపథ్యం
ఆర్‌బీఐ ఎంపీసీ సభ్యుడు జయంత్ ఆర్ వర్మ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) లక్ష్యం 4 శాతానికి చేరుకోవడంతో ఇక సెంట్రల్ బ్యాంక్ ద్రవ్య విధానం.. వృద్ధిని ప్రోత్సహించడంపై దృష్టి సారించాలని ద్రవ్య పరపతి విధాన (ఎంపీసీ) సభ్యుడు జయంత్ ఆర్ వర్మ స్పష్టం చేశారు.
2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యానికన్నా (4 శాతం) అరశాతమే ఎక్కువగా ఉంటుందన్న అంచనాలను ఆర్‌బీఐ ఎంపీసీ వెలువరిస్తున్న నేపథ్యంలో దీనిపై ఇక పెద్దగా ఆందోళన చెందాల్సింది ఏదీ లేదన్నారు.
‘‘తట్టుకోలేని అధిక ద్రవ్యోల్బణం సమస్య ముగుస్తోంది. రాబోయే కొద్ది త్రైమాసికాలలో మనం ద్రవ్యోల్బణం మరింత తగ్గుదలను చూస్తాము. ద్రవ్యోల్బణం స్థిరమైన ప్రాతిపదికన 4 శాతం లక్ష్యాన్ని చేరుకుంటుంది’’ అని ఆయన అన్నారు. దీర్ఘకాలం వడ్డీరేటు అధికస్థాయిలో ఉండడం ఆర్ధికవృద్ధికి మంచిది కాదని ఆయన స్పష్టం చేశారు.
పాలసీ సమీక్షలోనూ ఇదే మాట...
ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షకు సంబంధించి ఈ నెల 5 నుంచి 7వ తేదీ మధ్య మూడు రోజుల పాటు సమావేశమైన ఆరుగురు సభ్యుల ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)లో మెజారిటీ 4 శాతం దిగువకు రిటైల్ ద్రవ్యోల్బణం కట్టడే తన ప్రధాన లక్ష్యంగా పేర్కొంటూ వరుసగా ఎనిమిదవసారి కీలక రేటు– రెపోను (6.5 శాతం) యథాతథంగా ఉంచింది.
కాగా, వడ్డీ రేటును తగ్గించాలని గత సమీక్షలో అభిప్రాయపడిన వారు ఒకరే ఉండగా ఈసారి అది ఇద్దరికి పెరిగింది. ఎక్స్‌టర్నల్ సభ్యులు ఆషిమా గోయల్‌తో పాటు జయంత్ వర్మ కూడా వీరిలో ఉండడం గమనార్హం. రెపో రేటును తగ్గించి వృద్ధి ఊతానికి తగిన నిర్ణయం తీసుకోవాలని జయంత్ వర్మ పాలసీ సమీక్షాలో ఓటువేశారు. బ్యాంకులకు ఆర్‌బీఐ తానిచ్చే నిధులపై వసూలు చేసే వడ్డీ రేటును రెపో రేటుగా వ్యవహరిస్తారు.
బ్యాంకింగ్ వ్యవస్థలో వడ్డీ రేట్లు ప్రధానంగా దీనిపై ఆధారపడి ఉంటాయి. 2023 ఫిబ్రవరి నుంచి ఆర్‌బీఐ దీన్ని యథాతథంగా కొనసాగిస్తోంది. కాగా, వృద్ధికి విఘాతం కలగకుండా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయగలిగిన విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, ఆహార ధరలపరంగా ద్రవ్యోల్బణం మళ్లీ ఎగిసే రిస్కులను ఎంపీసీ నిశితంగా పరిశీలిస్తోందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పాలసీ సమీక్ష సందర్భంగా చెప్పారు.
ధరలు నిలకడగా ఉండే విధంగా స్థిరత్వాన్ని సాధించగలిగితేనే అధిక వృద్ధి సాధనకు పటిష్టమైన పునాదులు వేయడానికి సాధ్యపడగలదని ఆయన పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం భయాలు ఇంకా పొంచే ఉన్నాయని ఎంపీసీలోని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఎంపీసీ సభ్యులు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం, అహ్మదాబాద్) ప్రొఫెసర్ జయంత్ ఆర్ వర్మ ఒక ఇచి్చన ఒక ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే..
→ 2023–24లో భారత్ వృద్ధి 8.2 శాతం. 2024–25లో అంతకన్నా 0.75 శాతం నుంచి 1 శాతం వరకూ వృద్ధి స్పీడ్ తగ్గవచ్చు. భారత్‌కు 8 శాతం వృద్ధి సాధన సామర్థ్యం ఉంది. అధిక వడ్డీరేటు వ్యవస్థ వృద్ధి స్పీడ్‌కు అడ్డంకు కాకూడదు.
→ ఆర్థిక వృద్ధి రేటును 8 శాతానికి పెంచేందుకు గత కొన్నేళ్లుగా ప్రభుత్వం డిజిటలైజేషన్, పన్ను సంస్కరణలు, అధిక మౌలిక సదుపాయాల పెట్టుబడులతో సహా అనేక విధానపరమైన చర్యలను చేపట్టింది.
ద్రవ్యోల్బణ లక్ష్యం ఇదీ..
ఆర్‌బీఐ పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2024–25లో 4.5 శాతం ఉంటుందన్నది ఆర్‌బీఐ పాలసీ అంచనా. క్యూ1 (ఏప్రిల్–జూన్) 4.9 శాతం, క్యూ2లో 3.8 శాతం, క్యూ3లో 4.6 శాతం, క్యూ4లో 4.5 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం ఉంటుందని ఆర్‌బీఐ భావిస్తోంది. కేంద్రం ఆర్‌బీఐకి నిర్దేశిస్తున్నదాని ప్రకారం ప్లస్2 లేదా మైనస్2తో 4 శాతం వద్ద రిటైల్ ద్రవ్యోల్బణం ఉండవచ్చు.
అంటే ఎగువముఖంగా 6 శాతంగా ఉండవచ్చన్నమాట. అయితే 4 శాతమే లక్ష్యమని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ పలు సందర్భాల్లో స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఆహార ధరల తీవ్రతవల్లే రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతం దిగువకు రావడం లేదని ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష పేర్కొంది. మేలో ఏడాది కనిష్ట స్థాయిలో 4.75 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం నమోదయినప్పటికీ, ఆర్‌బీఐ లక్ష్యం కన్నా 75 బేసిస్ పాయింట్లు అధికం. కాగా, రిటైల్ ద్రవ్యోల్బణంలో కీలక విభాగం– ఆహార ద్రవ్యోల్బణం మాత్రం తీవ్ర స్థాయిలో కొనసాగడం ఆందోళన కలిగిస్తోంది.
మేలో తీవ్ర స్థాయిలో 8.69 శాతంగా నమోదైంది. ఏప్రిల్‌లో సైతం ఈ రేటు 8.70 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం తీవ్రత అటు సామాన్యులకు, ఇటు వృద్ధి పురోగతికి అడ్డంకి కలిగించే అంశం. సమీక్షా నెల మేలో పట్టణ ప్రాంతాల్లో 4.15 శాతం ద్రవ్యోల్బణం ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఇది సగటు 4.75 శాతంకన్నా అధికంగా 5.28 శాతంగా నమోదయ్యింది. సగటుకన్నా ఎక్కువ ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతోపాటు అస్సోం, బీహార్, చత్తీస్‌గఢ్, హర్యానా, కర్ణాటక, కేరళ, ఒడిస్సా, రాజస్తాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment