రుణాల సమీకరణకు ఆర్బీఐ గవర్నర్ సూచన
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పుల భారం పడకుండా ఉండాలంటే స్థానిక సంస్థల ద్వారా.. ప్రధానంగా పట్టణ స్థానిక సంస్థల ద్వారా రుణాల సమీకరణకు బాండ్ల జారీ వంటి చర్యలను చేపట్టవచ్చునని ఆర్‌బీఐ గవర్నర్ రఘురాం రాజన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. మున్సిపాలిటీల ద్వారా బాండ్లు జారీ చేయాల్సిందిగా స్వయంగా ఆర్‌బీఐ గవర్నరే సూచించడంతో అందుకు అనుగుణంగా చర్యలను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నూతన రాజధాని నిర్మాణం చేపట్టాల్సి ఉన్నందున రహదారులు, మంచినీటి వంటి ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు బాండ్ల జారీ ద్వారా నిధుల సమీకరణ చేపట్టే ఆలోచన చేస్తున్నట్లు వివరించింది. ఈ బాండ్ల జారీ పట్టణ స్థానిక సంస్థల ద్వారా చేపట్టనున్నారు. ఆ విధంగా చేయడం వల్ల ఆ అప్పులు (భారం) రాష్ట్ర ప్రభుత్వం పేరు మీద కాకుండా ఆ స్థానిక సంస్థ పేరిట ఉంటారుు. ఇతర మున్సిపల్ కార్పొరేషన్ల పేరిట కూడా స్థానికంగా అభివృద్ధికి బాండ్ల జారీ ద్వారా రుణాలను సమీకరించనున్నారు. వాటిద్వారా షాపింగ్ మాల్స్ వంటి నిర్మాణాలను చేపడితే పట్టణాల్లో ఆస్తి పన్నును కూడా పెంచవచ్చునని, ఆ విధంగా వచ్చిన ఆస్తి పన్నుతో రుణాలను తిరిగి చెల్లించవచ్చునని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. పట్టణ స్థానిక సంస్థలకున్న ఆస్తులు, ఆదాయ వనరుల ఆధారంగా బాండ్లు జారీ చేయనున్నారు.
వాటిని ప్రజలు గానీ, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. రఘురాం రాజన్ బుధవారం సచివాలయంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు అజేయ కల్లం, పి.వి.రమేశ్, ఎల్. ప్రేమచంద్రారెడ్డిలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజన్ పై సూచన చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత పరిస్థితిని, ఆర్థిక కార్యకలాపాలను అధికారులు ఆయనకు వివరించారు. ఆస్తులు తెలంగాణకు, అప్పులు ఏపీకి వచ్చాయని, రాజధాని నిర్మాణం చేసుకోవడానికి వనరుల అవసరం ఉందని చెప్పారు. రైతులను ఆదుకోవడానికి, వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు రైతు సాధికారత కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశామని, దానికి బ్యాంకుల ద్వారా నిధులను ఇప్పించాలని కోరారు.
స్థానిక సంస్థల ద్వారా బాండ్లు!
Published Thu, Oct 16 2014 12:56 AM | Last Updated on Sat, Sep 2 2017 2:54 PM
Advertisement
Advertisement