ఫ్రాన్సిస్ ఆర్నాల్డ్, జార్జ్ స్మిత్ , గ్రెగరీ వింటర్
స్టాక్‌హోం: జీవ పరిణామ సిద్ధాంతం ఆధారంగా పరిశోధనలు సాగించిన ముగ్గురికి ఈ ఏడాది రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి దక్కింది. ఫ్రాన్సిస్ ఆర్నాల్డ్(అమెరికా), జార్జ్ స్మిత్(అమెరికా), గ్రెగరీ వింటర్(బ్రిటన్)లు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. జీవ ఇంధనాల నుంచి ఔషధాల వరకు మానవాళికి ఉపయోగపడే పదార్థాల తయారీకి దోహదపడే ఎంజైమ్‌లను వీరు జీవ పరిణామ సిద్ధాంతం ప్రాతిపదికగా సృష్టించారు. రసాయన శాస్త్రంలో నోబెల్ పొందిన 5వ మహిళగా ఫ్రాన్సిస్ ఆర్నాల్డ్ గుర్తింపు పొందారు.
సుమారు రూ.7.40 కోట్ల ప్రైజ్‌మనీని ఆర్నాల్డ్ సగం..స్మిత్, వింటర్‌లు మిగతా సగాన్ని పంచుకోనున్నారు. ‘నోబెల్ గ్రహీతలు డార్విన్ సిద్ధాంతాన్ని మానవాళికి గొప్ప మేలుచేసే కార్యసాధనకు ఉపయోగించారు’ అని స్వీడిష్ రాయల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కొనియాడింది. ‘వారు డార్విన్ సూత్రాలను ప్రయోగశాలలో అమలుపరిచారు. వేయి రెట్ల వేగంతో జీవ పరిణామ క్రమాన్ని ప్రదర్శించి కొత్త ప్రొటీన్లను సృష్టించారు’ అని నోబెల్ కెమిస్ట్రీ కమిటీ చీఫ్ క్లాయిస్ గుస్తాఫసన్ వ్యాఖ్యానించారు.
పరిణామవాదం.. శక్తిమంత ఇంజనీరింగ్
జీవ పరిణామ క్రమాన్ని అనుకరిస్తూ ఆర్నాల్డ్ డీఎన్‌ఏ విన్యాసంలో మార్పులు చేశారు. దీని వల్ల విషపూరిత శిలాజ ఇంధనాలకు మెరుగైన, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలు కనుగొనేందుకు వీలు కలిగింది. ఫలితంగా, చెరకు నుంచి జీవ ఇంధనాలను ఉత్పత్తిచేస్తు న్నారు. శీతల వాతావరణంలోనూ మెరుగ్గా పనిచేసే డిటర్జెంట్ల తయారీకి కూడా ఆమె పరిశోధన దోహదపడింది. ‘ఈ భూమ్మీద అత్యంత క్లిష్టమైన, అద్భుతమైన వస్తువులను పరిణామ సిద్ధాంతం సృష్టించింది. ఎలా తయారుచేయాలో ఎవరికీ తెలియని విషయా లను కూడా దీని ద్వారా నిజం చేయొచ్చు.
ఈ ప్రపంచంలో పరిణామ క్రమం అనేది అత్యంత శక్తిమంతమైన ఇంజినీరింగ్ పద్ధతి. గ్యాసోలిన్ ఉత్పత్తికి భూమి నుంచి ఇంధనాన్ని తోడాల్సిన పనిలేదు. మొక్కల్లో నిల్వ ఉండే సూర్యరశ్మి చాలు’ అని ఆర్నాల్డ్ ఓ సందర్భంలో చెప్పారు. కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆర్నాల్డ్ (67) కేన్సర్ వ్యాధితో పోరాడి బయటపడ్డారు. బ్యాక్టీరియాపై దాడిచేసే వైరస్‌తో కొత్త ప్రొటీన్లు తయారుచేయొచ్చని స్మిత్, వింటర్ రుజువుచేశారు. వీరి ప్రయోగాల ఫలితంగా కీళ్ల నొప్పులు, సోరియాసిస్, పేగు వాతం తదితర వ్యాధులకు ఔషధాలు కనుగొన్నారు. స్మిత్ ఎంఆర్‌సీ మాలిక్యులర్ బయోలజీ లేబొరేటరీలో పరిశోధకులుగా పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment