
నోబెల్ విశేషాలు వివాదాలు
డిసెంబరు 10 న నోబెల్ వర్ధంతి. 9న అస్లో సిటీలోని ‘నార్వీజియన్ నోబెల్ ఇన్‌స్టిట్యూట్’లో నోబెల్ పురస్కార కార్యక్రమం జరుగుతుంది. 10న వారందరితో ఒక ఫోటోసెషన్ వుంటుంది. అమెరికా, జపాను, జర్మనీ, ఫ్రాన్సు, నార్వే, ఇండియా, పాకిస్తాన్ దేశాల నుంచి ఈ ఏడాది 13 మంది ఈ పురస్కారాన్ని అందుకోబోతున్నారు!
ప్రపంచంలో చాలా దేశాలలో అవార్డుల ప్రదాన సంప్రదాయం వుంది. అయినప్పటికీ నోబెల్ అవార్డుకు వున్న ప్రఖ్యాతి వేరు. దాని ద్వారా వచ్చే కీర్తీ ఎక్కువే. రివార్డూ ఎక్కువే. నోబెల్ ప్రారంభ సంవత్సరాలతో పోల్చుకుంటే ఇప్పుడు వచ్చే పారితోషికం కూడా చాలానే పెరిగింది. 2013లో అన్ని రంగాలకు కలిపి 343 కోట్ల 70 లక్షల రూపాయలు ఇచ్చారు. డబ్బు అని కాదు. ప్రచారం కూడా అంతే. అదొక అంతర్జాతీయ ఖ్యాతి. అందుకే ఈ అవార్డులో నామినేషన్ల నుంచి ఎంపిక దాకా ప్రలోభాలు వుంటాయి. ప్రభావాలూ వుంటాయి. విశేషాలు, వివాదాలు ఉంటాయి. ఆ వివరాలే ఈవారం మన ‘వివరం’.
ఆల్ఫ్రెడ్ నోబెల్ పుట్టింది స్వీడన్‌లో. పెరిగింది నార్వేలో. చనిపోయింది ఇటలీలో. నోబెల్ పుట్టే సమయానికి అంటే 1833 నాటికి నార్వే స్వీడన్ ఆక్రమణలో వుంది. అంతకు మునుపు అంటే 1380 నుంచి 1814 దాకా డెన్మార్కు ఆక్రమణలో వుంది. నార్వే కూడా తక్కువేమీ కాదు 13వ శతాబ్దం వరకూ తనదీ ఆక్రమణల చరిత్రే. ఐస్‌లాండ్, గ్రీన్‌లాండ్, షట్‌లాండ్‌లను తానూ ఆక్రమించుకుని పెత్తనం చేసింది. ప్రపంచ యుద్ధకాలంలో జర్మనీ చేతిలోకి వెళ్లిపోయింది. నార్వేకి ఉన్నది చాలా చిన్న చరిత్ర. ఉన్న ఆ చరిత్ర కూడా ఆక్రమణల చరిత్రే.
చేపలకోసం, జంతువులకోసం వేటాడుతూ ఇక్కడకొచ్చి స్థిరపడి ఇనుము, ఇత్తడి యుగాల్లో వ్యవసాయం చేసుకుంటూ గేదెలమీదా, పాలమీదా ఆధారపడి బ్రతికిన పదివేల ఏళ్లనాటి చరిత్రను పక్కన పెడితే క్రీ.శ.1030లో ‘క్రిష్టియానిటి రాజ్యం’ కింద బ్రతకడం మొదలు పెట్టిన దగ్గర్నుంచీ, నార్వేదంతా ఆక్రమణల చరిత్రే. అయితే 1350లో ప్లేగు వ్యాధి వ్యాపించి దేశంలో సగం మంది చనిపోయారు. ఇక అక్కడి (ఇతరులను ఆక్రమించే స్థితి నించి) ఇతరుల ఆక్రమణలోకి నార్వే వెళ్లిపోయింది.
నోబెల్ విల్
1905లో నార్వే స్వతంత్రతను ప్రకటించుకోవడానికి సరిగ్గా అయిదేళ్లకు ముందు అంటే 1900ల్లో ‘నోబెల్ ఫౌండేషన్’ ఏర్పడింది. దీనికి అయిదేళ్లకు ముందు 1895 నవంబరు 25న నోబెల్ తన వీలునామా రాశాడు. దాని పేరు ‘ఆఖరి వీలునామా’. దీన్ని పారిస్‌లోని ‘స్వీడిష్ నార్వీజియన్ క్లబ్’లో భద్రపరచి, తన తదనంతరం అమలు పరచమన్నాడు. మానవాళికి ప్రయోజనం కలిగించే పరిశోధనలకు తన పేరుతోవున్న అవార్డులను ఇవ్వమని, ఆ అవార్డులకయ్యే ఖర్చునంతటినీ తన సంపద ద్వారా వచ్చే వార్షిక ఆదాయం నించి వాడమని చెప్పాడు.
సహజంగానే ఆస్తివున్న చోట వారసత్వం వుంటుంది. ఆ వారసత్వం దీనికి ఒప్పుకోలేదు. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా వీలునామా తన పని తాను చేసుకుపోతుంది. వారసులకు కోపమొచ్చింది. అపారమైన సంపద పరులపరం కావడం సహించలేక నోబెల్ మీద కోపంతో ఆ అవార్డుకు నోబెల్ పేరును తొలగించాలని చూశారు. సాధ్యపడలేదు. వీలునామా దానికి సహకరించలేదు.
నోబెల్ గురించి కొంచెం
నోబెల్ బాలమేధావి. పరిశోధనా పిపాసి. పదిహేడేళ్లకే రష్యా, ఫ్రెంచి, జర్మనీ, ఇంగ్లిషు భాషలు నేర్చుకున్నాడు. కెమికల్ ఇంజనీరు. అనేక రంగాల మీద అనేక పరిశోధనలు చేశాడు. అనేక పుస్తకాలు రాశాడు. తన పరిశోధనల మీద పేటెంట్ రైట్స్ కూడా తీసుకున్నాడు. అదీ ఇదీ అని లేకుండా అన్ని వ్యాపారాలూ చేశాడు. దీంట్లో తండ్రి ఇమ్మానియేలు అతనికి ఆదర్శం. ఆయన తిరగని దేశం లేదు. చేయని వ్యాపారమూ లేదు. సంతానం అంతా ఇదే పని. వీరికి ఇరవై దేశాలలో తొంభై వ్యాపారాలు వున్నాయి. నోబెల్ పేదల కోసం చేసింది ఏమీ లేదు. పేదరికం మీద ఆలోచించింది అంతకన్నా లేదు. అతనికి సైన్సు పట్ల, సాహిత్యం పట్ల, పరిశోధనల పట్ల ఆసక్తి వుంది. ఆ ఆసక్తి నుంచి వచ్చిన ఆశయమే ‘నోబెల్ అవార్డు’.
1895 నాటికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్ (ఫిజియాలజీ కూడా), సాహిత్యం, శాంతి, ఇవి మాత్రమే నోబెల్ అవార్డు పరిధిలో వుండేవి. 1968లో ఎకనామిక్స్‌ను చేర్చారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్‌లను ఎంపిక చేసే పనిని ‘రాయల్ ఎకాడమి ఆఫ్ సైన్సు’ చూస్తుంది. మెడిసిన్ ఫిజియాలజిని ‘నోబెల్ అసెంబ్లీ ఎట్ కరోలిన్‌స్కా’ చూస్తుంటుంది. అలాగే సాహిత్యాన్ని ‘స్వీడిష్ అకాడమీ’, శాంతి అవార్డును ‘నార్వీజియన్ నోబెల్ ఇన్‌స్టిట్యూట్’ సహకారంతో ‘నార్వే పార్లమెంటు’ చూస్తుంది. దీంట్లో నార్వే ప్రధాని, విదేశాంగ మంత్రి, ఇద్దరు పార్లమెంటు సభ్యులతో పాటుగా న్యాయశాస్త్ర ఆచార్యుడొకరు వుంటారు.
మలాలాకు ఎలా ఇస్తారు?
నోబెల్ పేరుతో ఇచ్చే అవార్డుల్లో మిగతావన్నీ ఒక ఎత్తు కాగా, ‘శాంతి’ పేరుతో ఇచ్చే ఈ అవార్డు ఒక్కటీ ఒక ఎత్తు. నోబెల్ ఏ స్ఫూర్తితో ఈ అవార్డును నెలకొల్పాడో దానికి పూర్తి విరుద్ధంగా అనేకమార్లు ఈ అవార్డు దుర్వినియోగం అయ్యింది. అవుతూనే వుంది. మలాలా, సత్యార్థుల విషయంలో అది మరొకసారి రుజువయ్యింది. ఈ ఇద్దరూ బాల బాలికల కోసం కృషి చేసి వుండవచ్చు. వారి కోసం తమ జీవితాల్ని అంకితం చేసి వుండవచ్చు. కాని అలాంటి కృషికి తన ‘శాంతి అవార్డు’ను ఇవ్వమని నోబెల్ ఎక్కడా చెప్పలేదు. ఇస్లామిక్ తీవ్రవాదుల్ని రెచ్చగొట్టటానికీ, అమెరికాను సంతృప్తి పరచడానికీ ఐక్యరాజ్య సమితి సలహా మేరకు ‘మలాలా’లకు ఈ అవార్డును ఇచ్చారు. మలాలాకు ఇవ్వాలి కాబట్టి సత్యార్థికీ ఇచ్చారు.
ఒబామా శాంతి దూతా?
ఇలాంటి దుర్వినియోగమే అమెరికా కోసం 2009లో ఒకసారి జరిగింది. ఒబామా అమెరికాకు ప్రెసిడెంటు అయిన 9 నెలలకే ‘ప్రపంచ ప్రజల మధ్య అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరచడానికి చేసిన కృషికి గాను ఆయనను ఆ ఏడాది శాంతి పురస్కారంతో సత్కరించారు. తాలిబన్ల చేతిలో కూలిపోయిన ‘వరల్డ్ ట్రేడ్ సెంటర్’ శకలాలను తొలగించడానికే అమెరికాకు ఆరు నెలలు పట్టింది.
అలాంటిది తొమ్మిది నెలల్లో అంతర్జాతీయ సంబంధాలను ఒబామా మెరుగుపరచగలడా? ఇదే ప్రశ్నను అప్పట్లో ‘నోబెల్ కమిటీ’ని మీడియా అడిగింది. ‘‘ఇస్లామిక్ దేశాలలో ఉద్రిక్తతల్ని తగ్గించడానికీ, ఆయా దేశాలలో మోహరించిన సైన్యాన్ని కుదించడానికీ, అణ్వాయుధాల తయారీని తగ్గించడానికీ ఒబామా కృషి చేశారు. పదవిలోకి వచ్చిన మూడు మాసాలకే ఈ విషయం మీద రష్యాతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ‘అందుకే ఆయన్ని ఈ ఏడాది శాంతి దూతగా గుర్తించామని’’ కమిటీ వైస్ ఛైర్మన్ తర్బోజన్ జంగ్లాండ్ జవాబిచ్చారు. నిజానికి ఈ జవాబుకి అమెరికా ప్రెస్సే నవ్వింది. ఛలోక్తులు విసిరింది.
ఒబామా వచ్చిన తర్వాత అరబ్బు నేలపై ఉద్రిక్తతలు పెరిగాయి. సైన్యాన్ని పెంచారు. విస్తరించారు. ‘న్యూక్లియర్ వెపన్’ విషయంలో అమెరికాది ఎప్పుడూ గురివింద గింజ సామెతే. సరే. ఒబామా విషయంలో కమిటి చెప్పిందే నిజమనుకుందాం. కొద్దిసేపు ఆయన్ను శాంతి కపోతమనే అనుకుందాం. అయితే అధికారానికి వచ్చిన 12వ రోజుకే ఆ కపోతం శాంతికై పైకి ఎగిరిందా? ఈ అసలు రహస్యాన్ని ఎవ్వరూ పట్టుకోలేదు గానీ ఒబామా ప్రెసిడెంటు పదవిలోకి వచ్చిన 12వ రోజునే నామినేషను పత్రాలు ‘నార్వీజియన్ నోబెల్ ఇన్‌స్టిట్యూట్’కి చేరాయి. అప్పుడే ఆ ఎంపిక జరిగిపోయింది. ఈ ప్రశ్న తర్బోజన్‌ని మీడియా అడిగి ఉంటే అప్పుడాయన ఏం చెప్పి వుండేవారో?
చైనా దుష్టత్వం - అమెరికా కపటత్వం!
2010లో ఇలాంటిదే కాకపోయినా ఇంచుమించు ఇలాంటి దుర్వినియోగమే ఇంకోటి జరిగింది. దాంట్లో కూడా అమెరికా హస్తముందని చెప్పుకున్నారు. ‘లియోబియోబో’ అని చైనా హక్కుల కార్యకర్త. ‘అహింసా మార్గంలో మానవ హక్కుల కోసం పోరాడిన వ్యక్తి’గా ఆ సంవత్సరానికి అతనికిచ్చారు. చైనా ప్రభుత్వం అతణ్ణి చాలా కాలంపాటు జైల్లోనే వుంచింది. ఈ అవార్డును అందుకోవడానికి వెళ్లనివ్వలేదు. చివరికి అతని తరపున అతని బంధువులని కూడా వెళ్లనివ్వకుండా చైనా ఆంక్షలు పెట్టింది.
ఆ రకంగా చైనా తన ‘సోషలిస్టు దుష్టత్వాన్ని’ ప్రదర్శించుకుంది. ఈ విషయాన్ని పక్కన పెడితే, ‘నేషనల్ ఎండోమెంట్ ఫర్ డెమొక్రసీ’ అని వాషింగ్‌టన్‌లో ఒక స్వచ్చంద సంస్థ వుంది. దానికి అమెరికా ప్రభుత్వంలోని హోమ్ శాఖ నుంచి నిధులు వస్తుంటాయి. అమెరికా తనకు ప్రత్యర్థిగా ఎదుగుతున్న దేశాల్లోని అంతర్గత విషయాల్లోకి ఈ సంస్థను ప్రయోగిస్తుంటుంది.
ఈ సంస్థ నుంచి ‘లియోబియాబో’కి ఫండ్సు వస్తుంటాయని, ఆ డబ్బుతోనే అతను చైనాలో పని చేస్తుంటాడనే విషయం బైటికొచ్చింది. అతనికి వచ్చిన ‘నోబెల్ అవార్డు’ వెనక అమెరికా వుందనే విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ప్రపంచ వ్యాపితంగా మానవ హక్కులను మంటగలుపుతున్న అమెరికా ‘చైనా మానవ హక్కుల కోసం’ ఆరాటపడడం, అందుకోసం అతనికి అవార్డు ఇప్పించడం, నార్వే ఇవ్వడం రెండూ విడ్డూరంగా జరిగిపోయాయి.
శాంతికి ఛాంపియనా?
2012లో శాంతి పురస్కారం ‘యూరోపియన్ యూనియన్’కి దక్కింది. ఈ యూనియన్‌లో మొత్తం 28 దేశాలుంటాయి. నోబెల్ అవార్డును వ్యక్తులకూ ఇవ్వవచ్చు. సంస్థలకూ ఇవ్వవచ్చు. అలా అని నోబెలే తన వీలునామాలో చెప్పాడు. ‘యూరప్‌లో మానవ హక్కుల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, శాంతిని నెలకొల్పడం కోసం ఆరు దశాబ్దాలుగా చేస్తున్న కృషికి గాను ఈసారి శాంతి అవార్డును యూనియన్‌కి ఇచ్చామని కమిటీ చెప్పుకుంది.
అరబ్బు నేలపై యుద్ధాన్ని చేసే ప్రతి సందర్భంలోనూ అమెరికా ఒక ‘సంకీర్ణ కూటమి’ని తయారు చేస్తుంది. ఆస్ట్రియా, ఫ్రాన్సు, జర్మనీ, ఇటలీ, బ్రిటను ఈ కూటమిలో వుంటాయి. ‘యూరప్ యూనియన్’లో ఈ దేశాలదే ప్రముఖ పాత్ర. ఆ కృతజ్ఞతతోనే అమెరికా ఆ అవార్డును ఇప్పించిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ‘శాంతికి యూరోపియన్ యూనియన్ ఏమైనా ఛాంపియనా?’ అనే హెడ్డింగులతో పత్రికలు విమర్శలు కూడా రాశాయి.
శాంతే కాదు; సైన్సూ అంతే!
శాంతి పురస్కారాలలోనే కాదు. శాస్త్ర, సాహిత్య పురస్కారాలలో కూడా ‘నోబెల్’ వివాదాల్లో కూరుకుపోయిన సందర్భాలు ఎన్నో వున్నాయి. ‘గ్రీన్ ఫ్లోరోసెంట్ ప్రొటీన్’ అనే సబ్జక్టు మీద రోజర్ వైసైన్, వసామూ షిమోమురా, మార్టిన్ చెలిఫ్ అనే ముగ్గురికి ‘కెమిస్ట్రీ అవార్డు’ను 2008లో ఇచ్చారు. నిజానికి ఈ ఫార్ములా వీరిది కాదు. డగ్లస్ ప్రెషర్ అనే అత నిది. అవార్డు వచ్చిన ముగ్గురిలో ఒకరైనా రోజర్ వైసైన్ ‘ప్రెషర్’కి స్నేహితుడూ, శిష్యుడు కూడా. ఇతను ప్రెషర్‌తో వుంటూనే, ‘నోబెల్ అవార్డు మీకు తప్పకుండా వస్తుంది.
అందుకు నా వంతు కృషి నేను చేస్తానని మాయమాటలు చెప్పి నమ్మించి, ఈ ఫార్ములా రూట్‌ని తెలుసుకుని, మిగతా ఇద్దరికీ చేరవేశాడు. వారు ముగ్గురూ దాన్ని తమదిగా బిల్డప్ చేసి ‘నోబెల్ కమిటి నామినేషన్’కు పంపారు. అవార్డు వారికి వచ్చింది. అప్పుడు తేరుకున్న ప్రెషర్ ‘ఈ ఫార్ములా నాది’ అని కమిటీకి తెలియజేసి కొన్ని ఋజువుల్ని పంపాడు. ఈ తప్పు సరిదిద్దవలసిన ‘రాయల్ స్వీడిష్ అకాడమి ఆఫ్ సెన్సైస్’ వారు ‘‘నువ్విప్పుడు శాస్త్ర వృత్తిలో లేవు.
డ్రైవింగ్ వృత్తిలో వున్నావు. కాబట్టి నీకీ అవార్డు రాదని’’ సమాధానం ఇచ్చారు. ఆ అవార్డు వచ్చే సమయానికి అతను బస్సు డ్రైవరుగా పనిచేస్తున్న మాట నిజమే. అతని ఆర్థిక పరిస్థితి అలాంటిది. అంత మాత్రాన అతను ఆ అవార్డుకు అర్హుడు కాకుండా పోతాడా? నిజానికి ప్రెషర్‌కి రోజర్ చేసిన ‘గురుద్రోహం’కన్నా, నోబెల్ కమిటి చేసిన ‘సాంకేతిక ద్రోహమే’ ఘోరమైనది.
కెమిస్ట్రీ అవార్డు మీదే ఇంకో వివాదం వుంది. ‘కేటలిస్టిక్ ఎఫెక్ట్ ఆన్ మెటల్ సర్ఫేసెస్’ (లోహ ఉపరితలంపై ఉత్ప్రేరకాల ప్రభావం) అనే ప్రతిపాదనకు గాను గెర్‌హార్ట్ ఇర్టిల్ అనే అతనికి 2007లో అవార్డు ఇచ్చారు.
నిజానికి ‘మోడరన్ సర్ఫేస్ సైన్స్ అండ్ కెటాలిసిస్’ (ఆధునిక ఉపరితల శాస్త్రమూ, ఉత్ప్రేరకాలూ) అని ఇర్టిల్ కన్నా ముందే గేబర్ సముర్జాయ్ అనే అతను ఒక ప్రతిపాదనను చేసి వున్నాడు. అతను చేసిన ప్రతిపాదనలో ఇర్టిల్‌ది ఒక పార్టు మాత్రమే. ఒక రకంగా దీనికి పితామహుడు గేబర్ సముర్జాయే. కాని నోబెల్ కమిటీ మాత్రం (2007లో) గెర్‌హార్ట్ ఇర్టిల్‌కి మాత్రమే అవార్డు ఇచ్చింది. దీనిపై అనేకమంది శాస్త్రవేత్తలు విమర్శలు గుప్పించారు.
పొలిటికల్ నోబెల్!
నోబెల్‌ని ‘వివాదాల నోబెల్’గా అర్థం చేసుకున్నట్లుగానే ‘పొలిటికల్ నోబెల్’గా అర్థం చేసుకుంటే సముచితంగా వుంటుంది. చెప్పాలంటే ‘అమెరికా నోబెల్’గా అర్థం చేసుకోవడం ఇంకా అర్థవంతంగా వుంటుంది. ఇందులో అతిశయోక్తి ఏమీ వుండకపోవచ్చు. 1901 నించి 2012 వరకు 856 మందికి నోబెల్ అవార్డులు ఇస్తే ఒక్క అమెరికాకు చెందిన వారికే 353 మందికిచ్చారు. అంటే దానర్థం మేధస్సూ, పరిశోధనా, సాహిత్య తపనా, శాంతి అమెరికా సొత్తు అనా? కాదు. అయిల్ పైన, ఆయుధాలపైనా అమెరికాకు ఎంత గుత్తాధిపత్యం వుందో ‘నోబెల్’ పైనా అంతే గుత్తాధిపత్యం వుందని దానర్థం. ఇదీ నోబెల్ కథ. నోబెల్ వివాదాల కథ.
- నన్నూరి వేణుగోపాల్
హిట్లర్‌కి కోపమొచ్చింది!
1936లో కార్ట్ వన్ ఓసిటిజ్కి అనే అతనికి నోబెల్ అవార్డును వచ్చింది. ఇతను ప్రఖ్యాతిగాంచిన జర్మన్ రచయిత. నాజీ సిద్ధాంతాన్నీ, హిట్లర్‌నీ వ్యతిరేకిస్తూ సాహసోపేతమైన రచనల్ని రాశాడు. ఇతనికి అవార్డు రావడంతో హిట్లర్ సహించలేక పోయాడు. ‘జర్మన్ ప్రజలు ఎవ్వరూ కూడా ఇకపై నోబెల్ ప్రైజ్‌ని తీసుకోవద్దని ఒక హుకుం జారీ చేశాడు. దాంతో 1938లో కెమిస్ట్రీకీ, 1939లో మెడిసిన్, కెమిస్ట్రీలకూ నోబెల్ అవార్డులు వచ్చినప్పటికీ హిట్లర్‌కి భయపడి ఆ అవార్డులను వారు తీసుకోలేకపోయారు.
పురస్కార తిరస్కారం!
1964లో సాహిత్యానికిగాను జీన్‌పాల్ సర్ట్రి అనే అతనికి అవార్డు ఇస్తే అతను తిరస్కరించాడు. 1973లో ‘లిడ్యురాతో’ అనే అతనికి ‘ప్యారిస్‌లో శాంతిని నెలకొల్పాడు’ అంటూ అవార్డును ఇస్తే అతను ‘వియత్నాం ఒక ప్రక్కన అశాంతితో అల్లాడుతుండగా ఈ అవార్డును నేను తీసుకోను’ అని అవార్డును తిరస్కరించి తన నిరసనను ప్రకటించాడు. మొత్తం నోబెల్ అవార్డు ‘వందేళ్ల చరిత్ర’లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘శాంతి పురస్కారాన్ని’ సిద్ధాంతం కోసం తిరస్కరించిన ఏకైక వ్యక్తి ఇతనే కావచ్చు.
నోబెల్ ఆత్మహత్యలు!
ఇప్పటిదాకా మనం నోబెల్ అవార్డు దుర్వినియోగాన్ని చూశాం. వివాదాల్ని చూశాం. తిరస్కరణల్నీ చూశాం. దీంట్లో ఇంకో కోణం వుంది. అది ఆత్మహత్యల కోణం. అయితే ఈ అవార్డుకి ఈ మరణాలకి సంబంధం లేదుగానీ ఆ స్థాయి వాళ్లు ఆత్మహత్యలు చేసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
1968లో సాహిత్యానికిగాను ‘ఎసూనారి కవాబాట’కి అవార్డు ఇచ్చారు. అతను ‘జపాన్, ది బ్యూటిఫుల్ అండ్ మైసెల్ఫ్’ అని జపాను సంస్కృతి మీద ఒక థీసీస్ రాశాడు. ఈ అవార్డు అందుకున్న నాలుగేళ్లకు అంటే 1972లో బాత్‌రూమ్‌లో గ్యాస్ పైపు లీక్ అయ్యి చనిపోయాడు. దానంతట అది యాక్సిడెంటల్‌గా లీకు అయ్యికాదు; తానే లీక్ చేసుకుని చనిపోయాడు. కవాబాటకు ‘యుకియో మిషియా’ అనే ఒకామెతో వివాహేతర సంబంధం వుందని, ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని, ఆ షాక్ వలనే ఇతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడనే నిజం ఒకటి ఆ తర్వాత బైటకొచ్చింది.
1972లోనే ‘స్టాన్‌ఫోర్డ్‌మూరి’ అనే అతనికి కెమిస్ట్రీ క్రింద నోబెల్ అవార్డునిచ్చారు. అతను ‘ఎమియోట్రాపిక్ లేటరల్ సిరియోసిస్’ అనే కండరాల నరాల జబ్బు వలన ఆత్మహత్య చేసుకున్నాడు. కేన్సర్ మీద రీసెర్చి చేసినందుకు ‘క్రిష్టియన్ డి దువే’ అనే అతనికి 1974లో మెడిసిన్ విభాగంలో అవార్డునిచ్చారు. అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న అతను ఆ వ్యాధిని భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.
అయితే యూరప్‌లో అప్పటికే రైట్ టు డై అనే చట్టం వుంది. ఆ చట్టాన్ని ఉపయోగించుకుని ప్రభుత్వానికి అప్పీలు చేసుకుని ప్రభుత్వ అనుమతితో ఆత్మహత్య చేసుకుని మరణించాడు.ఈ మరణం మీద ఎటువంటి వివాదమూ లేదుగాని ‘అతని అప్పీలును ప్రభుత్వం శాస్త్ర బద్ధంగా పరిశీలించకుండానే అతనికి ఆ అవకాశం ఇచ్చిందనే విమర్శ మాత్రం వుంది.
గాంధీకి ఎందుకివ్వలేదు?
మొత్తం మీద ‘వివాదాల నోబెల్’ అనదగ్గ అవార్డు ఇది. బహుశా ప్రపంచంలో మరే ఇతర అవార్డుకీ లేనంత వివాదం ఈ అవార్డుకు వుంది. అన్నిటిలోకి పెద్ద వివాదాస్పదమైన విషయం ఏమిటంటే గాంధీకి ఈ అవార్డు ఇవ్వకపోవడం. ‘రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్ని తగ్గించి వాటి మధ్యన శాంతిని నెలకొల్పే విషయంలో విశేషంగా కృషి చేసిన వారికి మాత్రమే ఇవ్వాల్సిన శాంతి పురస్కారాన్ని ఏనాడో దారి తప్పించారు. అహింసా మార్గంలో కృషి చేసేవారికీ, అంతర్జాతీయంగా ప్రజల మధ్య సంబంధాలు పెంచేవారికీ కూడా ఇవ్వడం మొదలు పెట్టారు.
ఆ అర్థంలో గాంధీకి ఇవ్వాలి కదా? కాని ఇవ్వలేదు. ప్రపంచ వ్యాపితంగా ‘అహింసా వాది’గా పేరు పొందిన గాంధీకి ఈ అవార్డును ఇవ్వకపోవడం ఇప్పటికీ చాలా మందికి ఆశ్చర్యం కలిగించే విషయం. అంతకన్నా ఆశ్చర్యం ఏమిటంటే, ఒక మనిషి ఒక పరిశోధన చేసి ‘నా పరిశోధనను గుర్తించండి’ అంటూ అవార్డుకోసం అర్రులు చాచడంలో అర్థం వుంటుంది. శాంతి కోసమో, అహింస కోసమో నిలబడిన వారు ‘తమను గుర్తించండి’ అంటూ అప్లికేషన్‌లు పెట్టుకోవడమేమిటి? గాంధీ కోసం భారతదేశం నుంచి ఒకసారి కాదు; 1937 నించి 1948 వరకూ అయిదుసార్లు నామినేషన్ పత్రాలు నార్వేకి వెళ్ళాయి. వెళ్లిన ప్రతిసారీ వాటిని వారు తిప్పికొట్టారు. అయినా వీరు పంపిస్తూనే వున్నారు. చివరకు ‘ఆ పేరుతో వచ్చే నామినేషన్లు తీసుకోవద్దు’ అని తీర్మానం కూడా వారు చేశారు!
నోబెల్ అవార్డు రాజకీయాలకు తలొగ్గి వుంటుందనేదానికి గాంధీది ఒక చక్కటి వుదాహరణ. గాంధీకి అవార్డుకోసం ప్రయత్నించిన ఆ కాలమంతా నార్వే జర్మనీ ఆక్రమణలో వుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్‌కీ, జర్మనీకీ శతృత్వం వుంది. ఆ కాలమంతా మనది ఇండియా కాదు, బ్రిటీష్ ఇండియా. గాంధీ బ్రిటీష్ ఇండియాలో భాగం. బ్రిటీష్ వారిని వెళ్లగొట్టడానికి ‘సుభాష్ చంద్రబోసు’ జర్మనీతో చేతులు కలపడాన్ని గాంధీ తీవ్రంగా వ్యతిరేకించాడు. అలాంటి కారణాలు ఇంకా వున్నాయి.
గాంధీ సినిమాకి అమెరికా ‘ఆస్కార్’ ఇచ్చినంత ఈజీగా గాంధీకి నోబెల్ ఇవ్వడానికి జర్మనీ ఆనాడు సిద్ధంగా లేదు. జర్మనీని కాదని అడుగువేయడానికి నార్వేకి స్వేచ్ఛ లేదు. ఆ రకంగా ఆ అవార్డును అందుకోకుండానే గాంధీ చనిపోయారు. గాంధీకి అవార్డును ఇవ్వకపోవడం నోబెల్ చరిత్రలో మచ్చగా మిగిలిపోయింది. ఆ మచ్చనుండి బైట పడడానికి 1948లో ‘శాంతి అవార్డును అందుకోవడానికి ఈ ఏడాది ఎవ్వరూ లేర’ని కమిటీ ప్రకటించింది. ఎందుకంటే ఆ ఏడాదే గాంధీ మరణించాడు కాబట్టి. మరణించిన వారికి కూడా ‘భారత రత్న’ ఇచ్చే సంప్రదాయం మనకి వున్నట్లుగా మరణించిన వారికి ‘నోబెల్’ని ఇచ్చే సంప్రదాయం వారికి లేదు.