చంద్రబాబు.. సోషల్ మీడియాలో వైరల్
అమరావతి : అర్థం పర్థం లేని ప్రకటనలు చేయడం, సాధ్యాసాధ్యాలను గమనించకుండా నోటికొచ్చినట్లు మాట్లాడడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కొత్తేమీ కాదు. ఒలింపిక్ క్రీడల్లో విజయం సాధిస్తే ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ బహుమతి ఇస్తానంటూ చంద్రబాబు బుధవారం చేసిన ప్రకటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గతంలో చంద్రబాబు చేసిన ప్రకటనలపై కూడా విపరీతమైన చర్చ జరిగింది. నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
గతంలో వైరల్ అయినవి ఇవీ..
►2018లో అమరావతిలో ఒలింపిక్ క్రీడలు నిర్వహిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ప్రకటించిన విషయం విదితమే. నాలుగేళ్లకోసారి జరిగే ఒలింపిక్స్‌ను ఎక్కడ నిర్వహించాలనే విషయాన్ని ఎనిమిదేళ్ల ముందే నిర్ణయిస్తారు. ఒలింపిక్స్ నిర్వహించాలంటే కేంద్ర ప్రభుత్వం బిడ్ దాఖలు చేయాలి తప్ప రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమాత్రం సంబంధం ఉండదు. ఒలింపిక్స్ నిర్వహించడం అంటే ఆషామాషీ కాదు. చంద్రబాబు నోటి వెంట ఒలింపిక్స్ నిర్వహణ మాట వచ్చినప్పుడు ప్రజలు ఆవాక్కయ్యారు. తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘చంద్రబాబు ఒలింపిక్స్’ మీద బోలెడు జోకులు, పోస్టింగ్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
►నోబెల్ బహుమతి తీసుకొస్తే రూ.100 కోట్లు ఇస్తానని తిరుపతి సైన్స్ కాంగ్రెస్‌లో సీఎం చంద్రబాబు ప్రకటించడం కూడా వైరల్ అయింది. విశ్వవిద్యాలయాల్లో కనీస వసతులు కల్పించడానికి పైసా విదిల్చకుండా.. పరిశోధనలకు కనీస నిధులు ఇవ్వకుండా నోబెల్ తెస్తే రూ.100 కోట్లు ఇస్తాననడం పట్ల సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తాయి.
► తాజాగా ఒలింపిక్ విజేతలకు నోబెల్ ప్రైజ్ ఇస్తానంటూ చంద్రబాబు ప్రకటించడంపై నెటిజన్లు వేగంగా స్పందించారు. బుధవారం సాయంత్రం కిదాంబి శ్రీకాంత్ సన్మాన సభలో ముఖ్యమంత్రి ‘నోబెల్ ప్రైజ్’ ప్రకటన చేసిన కాసేపటికే.. సోషల్ మీడియాలో ఈ అంశం చక్కర్లు కొట్టడం ప్రారంభించింది. నోబెల్ ప్రైజ్‌ను ప్రకటించడానికి అవకాశం ఉందా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తుంటే.. ‘‘క్రీడాకారులకు ప్రకటించడానికి అవకాశం ఉంటుంది.. ఉంటుంది.. ఎందుకు ఉండదు?’’ అంటూ సోషల్ మీడియాలో సమాధానాలతో కూడిన కామెంట్లు షికారు చేశాయి.