
మదర్ థెరీసా యుగోస్లేవియాలో పుట్టింది. భారతదేశం వచ్చింది. తోటివారిలాగే పాఠాలు చెప్పేది. ఓ రోజు రాత్రి కలకత్తాలో వీథిలో వెడుతుండగా ఓ అనాథ స్త్రీ విపరీతమైన అనారోగ్యంతో వచ్చి ఆమె చేతుల్లో పడింది. ‘ప్రాణం పోతోంది, చాలా బాధగా ఉంది. నన్ను డాక్టర్‌కు చూపించు’ అంది. ఎవరని అడిగితే ఎవరూ లేరు, అనాథనంది. ఆ క్షణంలో ఆమెకు గివింగ్ ఈజ్ లివింగ్(ఇచ్చుకోవడమే జీవిత పరమార్థం) అనిపించింది. ఆమెను కనీసం 10 వైద్యశాలలకు తీసుకెళ్ళింది. ‘తగ్గించడానికి చాలా ఖర్చవుతుంది, చికిత్స కుదరదు’ అన్నారు అంతటా. ఈ తిప్పటలో ఆ అనాథ ప్రాణాలు విడిచేసింది.‘ఇలా చచ్చిపోవడానికి వీల్లేదు’ అని థెరీసాకు అనిపించింది. ‘పక్కవాడు చచ్చిపోయినా ఫరవాలేదు–అని బతకడానికి కాదు మనుష్యజన్మ’ అని...‘‘ఇక నా జీవితం పదిమంది సంతోషం కోసమే’ అని సంకల్పించి నేరుగా తన గదికి బయల్దేరింది. ఒక పాత బకెట్, రెండు తెల్లచీరలు, రు.5లు పట్టుకుని ఆమె బయటికి నడుస్తుంటే... ఎక్కడికని స్నేహితులడిగారు. ‘ఇకపైన కష్టాలున్న వాళ్లెవరున్నారో వాళ్ళందరికీ తల్లినవుతాను’’ అని చెప్పి బయల్దేరబోతుంటే... ‘వీటితో...అది సాధ్యమా’ అని అడిగారు. ‘‘నేను తల్లి పాత్ర పోషించబోయేది, గుండెలు నిండిన ప్రేమతో, ఆదుకోవాలన్న తాపత్రయంతో’’ అని చెప్పి గడప దాటింది. అదీ సంకల్పబలం అంటే.
తరువాత కాలంలో ఆమె ఎంతగా కష్టపడ్డారంటే...దాని ఫలితాలు మిషనరీస్ ఆఫ్ ఛారిటీస్, నిర్మల్ హృదయ్, శిశుభవన్... వంటి సంస్థలుగా దర్శనమిచ్చాయి. లక్షలమందిచేత మదర్ అని– అంటే అమ్మా అని పిలిపించుకున్నది. తర్వాతి కాలంలో ఆమెకు నోబెల్ బహుమతి వచ్చినప్పడు విలేకరులు ‘‘కీర్తి ప్రతిష్ఠలు వచ్చాయి. ప్రైజ్ మనీ(రు.18లక్షలు) కూడా వచ్చింది. సంతోషిస్తున్నారా..?’ అని అడిగితే... నేను సంతోషించిన సంఘటన ఇదికాదు, మరొకటి ఉందని చెప్పింది.‘‘ఒకనాడు ఒక యాచకుడొచ్చాడు. నన్ను చూడాలని ఉందంటే తీసుకొచ్చారు. తన కష్టాలు ఏకరువు పెడతాడనుకుంటే... జేబులోంచి ఒక కాసు తీసి ‘అమ్మా, ఇంతమందిని ఆదుకుంటున్నావు, నా వంతు ఈ డబ్బు ఉంచమ్మా’ అని ఓ పావలా కాసు ఇచ్చి వెళ్ళాడు. అది పావలాయే అయి ఉండవచ్చు. నా మీద పెంచుకున్న నమ్మకం అది.ప్రేమతో ఇచ్చిన ఆ నాణెంతో నోబెల్ బహుమతి సమానం కాదు’’ అని థెరీసా చెప్పారు. ఒకరికి ఇవ్వడంలోఎంతో ఆనందం ఉంటుంది. అది ఎంతన్నది కాదు ప్రధానం. ఇక ఆ తరువాత నుంచి అందరినీ ‘నాకేమయినా ఇస్తారా’ అని అడుగుతున్నా. చివరికి ఐదు, పది పైసలయినా సరే, చినిగిన బనీనయినా, కాల్చిపారేసే అగ్గి పుల్లయినా ఏదయినా ప్రేమతో ఇచ్చినప్పుడు తీసుకుంటా. ఇవ్వడంలో వారు అనుభవించే ఆనందం నాకు ముఖ్యం’’అని ఆమె చెప్పేవారు.
ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టిన నాడు, బాధలో ఉన్నవాడిని ఆదుకున్ననాడు, వాడు సంతోషించడానికి కారణమయిన జన్మే మనుష్య జన్మ. కుష్ఠురోగులకు చీము, నెత్తురు తుడిచి సేవ చేస్తుంటే చూసిన ఒక విలేకరి ‘‘ఎన్ని కోట్లు ఇచ్చినా ఈ పని చేయను నేను. మీరెలా చేస్తున్నారు?’’ అని అడిగితే...‘‘కొన్ని కోట్లు ఇచ్చినా ఈ పనిని నేను మానలేను. ఎందుకంటే నాకు వారిలో భగవంతుడు కనబడుతున్నాడు’’ అని జవాబిచ్చింది ఒక అతి సామాన్య సేవకురాలు, లక్షలు, కోట్లాదిమంది చేత అమ్మా అని నోరారా పిలిపించుకున్న మదర్ థెరీసా.
Comments
Please login to add a commentAdd a comment