
ఆ నేడు 7 అక్టోబర్, 1950
వెలుగు దీపం
‘ఆహారం రుచిగా లేదని ఫిర్యాదు చేసేముందు- తినడానికి ఏమీ లేని పేదల గురించి ఆలోచించు’. తనకు అసౌకర్యంగా, బాధగా అనిపించినప్పుడు తన గురించి కాకుండా కోట్లాది మంది దీనుల గురించి ఆలోచించారు మదర్ థెరిసా. ఆ ఆలోచనే కలకత్తాలో ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ’గా రూపుదిద్దుకుంది. వేల కిలోమీటర్ల దూరమైనా...ఒక్క అడుగుతో మొదలైనట్లు 13 మంది సభ్యులతో ప్రారంభమైన ఈ సంస్థ ప్రపంచవ్యాప్తమైంది.
ఆకలితో అలమటించేవాళ్లు, వ్యాధిగ్రస్తులు, పేదవాళ్లు, నిరాశ్రయులకు ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ’ వెలుగు దీపం అయింది. కలకు, ఆ కలను నిజం చేసుకునే వాస్తవానికి మధ్య దూరం ఉండొచ్చు. అది కొందరికి అగాధంలా కనబడవచ్చు. సంకల్పబలం ఉన్నవాళ్లకు అది సులభం కావచ్చు. ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ’ రాత్రికి రాత్రే పుట్టింది కాదు. ఆలోచన నుంచి ఆచరణ నుంచి, కష్టాల దారిలో నుంచి అంచెలంచెలుగా ఎదిగిన నిర్మాణాత్మక సేవాదృక్పథం.