Calcutta
-
పైసా నుంచి పసిడి దాకా.. అదిరిపోయే ఆర్బీఐ మ్యూజియం చూశారా? (ఫొటోలు)
-
కలకత్తా ట్రైనీ డాక్టర్ కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
కలకత్తా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కలకత్తా మహిళా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడు సంజయ్‌రాయ్‌కు కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. సీబీఐ కస్టడీ ముగియడంతో నిందితునికి కట్టుదిట్టమైన భద్రత నడుమ కలకత్తాలోని సెల్డా క్రిమినల్ కోర్టు జడ్జి ముందు శుక్రవారం(ఆగస్టు23) హాజరుపరిచారు.దీంతో కోర్టు నిందితునికి 14 రోజుల కస్టడీ విధించింది. కోర్టు ఆదేశాల అనంతరం పోలీసులు నిందితుడిని జైలుకు తరలించారు. ఇటీవల కలకత్తాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో 31 ఏళ్ల మహిళా ట్రైనీ డాక్టర్‌పై అత్యంత దారుణంగా లైంగికదాడి జరిపి హత్య చేశారు. దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైన ఈ కేసులో ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోంది. -
ఖైదీల రూటు జ్యూట్ వైపు
కలకత్తా వాసి చైతాలి దాస్ వయసు 50 ఏళ్లు. గోల్డెన్ ఫైబర్‌గా పిలిచే జ్యూట్ పరిశ్రమను స్థాపించడంలోనే కాదు అందుకు తగిన కృషి చేసి గోల్డెన్ ఉమన్‌గా పేరొందింది చైతాలి. ముఖ్యంగా ఖైదీలతో కలిసి జనపనార ఉత్పత్తులను తయారు చేస్తూ, వ్యాపారిగా ఎదిగి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. ‘జనపనారను పర్యావరణ అనుకూలమైన, విస్తృతంగా అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. ఇది మన సాంస్కృతిక గొప్పతనాన్నీ పెంచుతుంది. నా ఫౌండేషన్ ద్వారా ఖైదీలను ఆదుకోవాలనే లక్ష్యంగా పెట్టుకున్నాను’ అని వివరించే చైతాలి ఆలోచనలు మన దృష్టి కోణాన్ని కూడా మార్చుతుంది. చైతాలి మొదలు పెట్టిన ప్రయాణం ఆమె మాటల్లోనే... ‘‘నేను పుట్టి పెరిగింది పశ్చిమ బెంగాల్‌లోని అలీపూర్. మా ఇల్లు సెంట్రల్ జైలు, ప్రెసిడెన్స్ కరెక్షనల్ హోమ్ మధ్య ఉండేది. ఎందుకో తెలియదు కానీ ఆ జైలు జీవితం గడుపుతున్నవారి గురించి తెగ ఆలోచించేదాన్ని. మా నాన్న లాయర్ కావడం కూడా అందుకు మరో కారణం. నాన్నతో కలిసి ఆయన ఆఫీసుకు, పోలీస్ స్టేష¯Œ కు, సెంట్రల్ జైలుకు వెళ్లడం వల్ల నాలో అక్కడి వాతావరణం ఒక ఉత్సుకతను రేకెత్తించేది. జైలు గోడల లోపలి జీవితం ఆశ్చర్యపోయేలా చేసేది. కటకటాల వెనుక ఉన్న జీవితాలను, అక్కడ వాళ్లు ఎలా ఉంటారో చూపించే సినిమాలను చూడటం స్టార్ట్ చేశాను. రాత్రిళ్లు నిద్రపోయాక మా ఇంటికి సమీపంలో ఉన్న జూ నుంచి పులుల గర్జనలు వినిపించేవి. అర్ధరాత్రి సమయాల్లో పోలీసుల విచారణ, ప్రజల అరుపులు, కేకలు వినిపిస్తుండేవి. ఆ శబ్దాలు నాలో భయాన్ని కాకుండా దృష్టికోణాన్ని మార్చాయి. శాశ్వత ముద్ర నా చిన్నతంలో కొన్నిసార్లు మా నాన్నగారు కోర్టుకు తీసుకెళ్లారు. మొదటిసారి వెళ్లినప్పుడు నిందితులను కోర్టు హాలుకు తీసుకురావడం, పోలీసు వ్యాన్‌లో నుంచి వ్యక్తులు దిగడం గమనించాను. నా ఉత్సుకత తారస్థాయికి చేరుకుంది. మా నాన్న సహోద్యోగులలో ఒకరిని ‘ఎవరు వాళ్లు’ అని అడిగాను. తప్పు చేసినవారిగా ముద్రపడి, పర్యవసనాలను ఎదుర్కొనేవారు అని చెప్పారు. నేను అక్కడే నిలబడి గమనిస్తూ ఉన్నాను. వారి కుటుంబ సభ్యులు వారి వైపు పరిగెత్తుకుంటూ రావడం, ఆ వెంటనే వారి మధ్య ఉద్వేగభరితమైన సంభాషణలు విన్నాను. వారి బాధలు చూస్తుంటే ఏదైనా సాయం చేయాలనిపించేది. స్వచ్ఛంద సంస్థలతో కలిసి.. కాలక్రమంలో చదువుతోపాటు ఇతరులకు సాయం చేసే మార్గం కోసం చాలా అన్వేషించాను. అందులో భాగంగా వివిధ ఎన్జీవోలతో కలిసి పనిచేశాను. 2015లో చైతాలి రక్షక్ ఫౌండేషన్‌కు పునాది పడింది. ఈ ఫౌండేషన్ మగ, ఆడ ఖైదీలు, ఇతర నిరుపేద మహిళలకు సాధికారత కల్పించడంపై దృష్టి పెడుతుంది. మొదటిసారి కరెక్షనల్ హోమ్‌లో నా పనిని ప్రారంభించాను. మొదట్లో స్పోకెన్ ఇంగ్లిషుపై దృష్టి పెట్టాను. మహిళలు, ఖైదీలతో కుకీలను తయారు చేయించడం, యోగాను పరిచయం చేయడం, చెక్కపనిలో పాల్గొనడం, పెయింటింగ్ సెషన్లు నిర్వహించడం వంటి అనేక ప్రాజెక్ట్‌లు చేపట్టాను. ఆ ప్రాజెక్ట్‌లు విభిన్న కార్యక్రమాలను ప్రతిబింబించేవి. అంతర్జాతీయంగా... బెంగాల్ జనపనార పరిశ్రమలో సుమారు 40 లక్షల మంది ఉన్నారు. నేను, ఖైదీలతో జనపనార ఉత్పత్తులను రూపొందించడంలో నిమగ్నమై ఉన్నాను. వివిధ ప్రదేశాలలో వారి సృజనాత్మక ఉత్పత్తులను ప్రదర్శనకు పెడుతుండేదాన్ని. ఆ తర్వాత వివిధ ఈ–ప్లాట్ఫార్మ్స్, జాతీయ– అంతర్జాతీయ వేదికలపైకి కూడా వారి జనపనార ఉత్పత్తులను తీసుకెళ్లాను. ౖఖైదీలకు శిక్షణ ఇవ్వడానికి నేషనల్ జ్యూట్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఎన్జెబి)తో కనెక్ట్ అయ్యాను. శిక్షణ ద్వారా ఉత్పత్తులు కూడా పెరిగాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా జ్యూట్ ఉత్పత్తుల తయారీలో దాదాపు మూడు వేల మంది ఖైదీలకు శిక్షణ ఇచ్చాం. దీంతో ఈ ప్రాజెక్ట్ ‘రూట్ టు జ్యూట్’గా రూపుదిద్దుకుంది. ముఖ్యంగా దీనిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇంక్యుబేట్ చేసింది. మా స్టార్టప్ హస్తకళలు, రగ్గులు, హ్యాండ్‌బ్యాగులు వంటి జనపనార ఉత్పత్తులను తయారు చేస్తుంది. 2021 జనవరి 7న రూపొందించిన అతిపెద్ద జ్యూట్ బ్యాగ్ గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. యువత కోసం.. ప్రత్యేకంగా విభిన్నరకాల ఉత్పత్తులను అందిస్తున్నాం. ఫ్యాషన్‌లో భాగంగా యువతకు చూపుతున్నాం. యూనివర్శిటీ లేదా కాలేజ్ నుండి బయటికి వచ్చే విద్యార్థులు జ్యూట్ బ్యాగ్‌లను ధరించి వెళుతుండగా చిత్రీకరించి ప్రదర్శిస్తుంటాం. ఇది వారిలో ఆసక్తిని పెంచుతుంది. తప్పు చేసిన వారిని ప్రజలు నేరస్తులుగా చూస్తారు. అయినప్పటికీ ఈ వ్యక్తులు ఉత్పత్తులను రూపొందించడంలో నిమగ్నమైనప్పుడు వారి అవగాహనలో మార్పు కలుగుతుంది. జనం కూడా వారిని అభినందించడం ప్రారంభిస్తారు. ఇలా క్రమంగా అందరిలోనూ అంగీకారం పెరుగుతుంది. తప్పు చేసినవారు లేదా దోషులుగా ముద్రపడిన వ్యక్తులు కూడా మార్పు చెందగలరు’ అని తన కృషి ద్వారా చూపుతోంది చైతాలి. -
ఫ్రాన్స్ టు కోల్‌కతా సైకిల్ యాత్ర
ఫ్రాన్స్ దేశానికి చెందిన మేరీ వయస్సు 50 ఏళ్లు, ఇరిక్ వయస్సు 60 ఏళ్లు. వీరిద్దరూ కోల్‌కతాకు సైకిల్‌పై వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 16 వేల కిలోమీటర్ల ప్రయాణాన్ని ఎలక్ట్రిక్ సైకిల్‌పై ప్రారంభించారు. ఫ్రాన్స్ నుంచి ముంబై మీదుగా కోల్‌కతాకు జీపీఎస్ ఆధారంగా వెళుతూ వాకాడులో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఏడు నెలల సమయం పట్టే ఈ ప్రయాణం సంతోషంగా సాగుతుందని పేర్కొన్నారు. – వాకాడు -
‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’.. వధువు వరస మారుతోంది!
పెళ్లికూతుళ్లు సంప్రదాయాలను తిరగ రాస్తున్నారు. పెళ్లిపీటల మీద తల దించుకుని ఉండటం.. కాబోయే భర్త ఎదుట సిగ్గుల మొగ్గ కావడం.. అత్తారింటికి వెళ్లేప్పుడు కన్నీరు మున్నీరుగా ఏడ్వడం.. ఈ ‘సంప్రదాయ ధోరణి’ కాదని పెళ్లి రోజున పూర్తి ఉత్సాహంగా ఉంటున్నారు. జీవితంలో ముఖ్యమైన రోజును అణువణువు ఆనందమయం చేసుకోజూస్తున్నారు. ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’ అని పాడుతూ డాన్స్ చేస్తున్నారు. అంతేనా? అత్తారింటికి పక్కన భర్తను కూచోబెట్టుకుని డ్రైవ్ చేస్తున్నారు. నిజంగా వీరు కొత్త పెళ్లికూతుళ్లే. నాలుగు రోజుల క్రితం, ఆగస్టు 22న ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఒక పెళ్లి జరిగింది. వధువు సనా షబ్నమ్, వరుడు షేక్ ఆమిర్. ఇప్పుడు వధువు అత్తారింటికి వెళ్లాలి. సాధారణంగా ఆ సమయంలో పెళ్లిమంటపం గంభీరంగా ఉంటుంది. పెళ్లికూతురి తల్లిదండ్రులు భావోద్వేగాలకు లోనవుతారు. ఇన్నాళ్లు పెంచి పోషించిన బంగారు తల్లి ఇప్పుడు తమ నుంచి వేరుపడి కొత్త జీవితంలోకి అడుగు పెడుతోంది కనుక ఆమె వైవాహిక జీవితం బాగుండాలని ఒక ఆకాంక్ష, ఆమె అక్కడ ఎలా ఉండ బోతోందోననే ఆందోళన... ఇవన్నీ వాతావరణాన్ని బరువెక్కిస్తాయి. పెళ్లికూతురు బొరోమని తన వాళ్లను పట్టుకుని ఏడుస్తుంది. పెళ్లికొడుకు సర్ది చెప్పి బండి ఎక్కిస్తాడు... సాధారణంగా జరిగే ఈ రివాజు మొత్తం ఆ రోజు ఆ పెళ్లిలో ఏమీ జరగలేదు. పెళ్లి ఇంటి దగ్గర బయట ఉన్న మహీంద్రా ఎస్.యు.వి వరకూ పెళ్లి కూతురు హుషారుగా నడిచి వచ్చింది. డ్రైవింగ్ సీట్లో కూచుంది. భర్త ఆమిర్‌ను పాసింజర్ సీట్లో కూచోబెట్టుకుంది. ‘వెళదామా... అత్తారింటికి’ అని బండి స్టార్ట్ చేసింది. బంధుమిత్రులందరూ ఒక్క క్షణం ఆశ్చర్యపోయారు. ఆ వెంటనే పెళ్లికూతురి ఉత్సాహాన్ని ప్రోత్సహించారు. కశ్మీర్ లోయలో ఇలాంటి ‘విదాయి’ (అంపకాలు) ఎవరూ చూడలేదు. కాని పెళ్లికూతురు సనా షబ్నమ్ గతంలోని స్టీరియోటైప్‌ను బ్రేక్ చేసింది. ‘నేను కశ్మీర్ పెళ్లిళ్ల మూస పద్ధతిని మార్చాలనుకున్నాను. సనా నన్ను కూచోబెట్టుకుని డ్రైవ్ చేయడం తన జీవితంలోని ముఖ్యరోజున విశేషం అవుతుందని భావించాను. ఆమె నన్ను కూచోబెట్టుకుని నడపడాన్ని ప్రోత్సహించాను. కొంతమందికి ఇది నచ్చకపోవచ్చుగాని చాలామంది మెచ్చుకున్నారు’ అని సనా భర్త ఆమిర్ అన్నాడు. అతడు వృత్తిరీత్యా అడ్వకేట్. బారాముల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా. కశ్మీర్ ముస్లింలలో సంప్రదాయాల పట్ల కట్టుబాటు ఉన్నా అక్కడ స్త్రీలు ఆధునికంగా ఆలోచించడాన్ని ఆహ్వానిస్తున్నారని ఈ ఉదంతం వెల్లడి చేస్తోంది. అయితే నెల క్రితం కలకత్తాలో జరిగిన ఇలాంటి సంఘటనే ‘జండర్ మూస’ను బద్దలు కొట్టినట్టయ్యింది. సాధారణంగా భార్య జీవితానికి మార్గం చూపేవాడు భర్తే అవుతాడు సగటు పురుషస్వామ్య భావజాలంలో. భర్త ప్రతిదాన్ని లీడ్ చేస్తే భార్య అనుసరించాలి. ఇది పెళ్లయిన నాటి నుంచి సమాజం మొదలెడుతుంది. అంపకాల్లో పెళ్లికూతురి తండ్రి తన కుమార్తె చేతిని అల్లుడి చేతిలో పెట్టి ‘జాగ్రత్త నాయనా... ఎలా చూసుకుంటావో’నని ఎమోషనల్ అవుతాడు. సమాజం ఇంత ముందుకు వెళ్లినా స్త్రీలు తమ సామర్థ్యాలను నిరూపిస్తున్నా భార్యను భర్త మీద ఆధారపడే వ్యక్తిగా సంకేతం ఇచ్చే ‘అంపకాలను’ ఎందుకు తిరస్కరించకూడదు అని కోల్‌కతాకు చెందిన వధువు స్నేహా సింగ్ అనుకుంది. పెళ్లి అయ్యాక భారీ పెళ్లి లహెంగాలో భర్త సౌగత్ ఉపాధ్యాయను బండిలో కూచోబెట్టుకుని అత్తారింటికి బయలుదేరింది. ఇది దేశంలో చాలా వైరల్ వీడియో అయ్యింది. ‘ఇలా చేయాలని నెల క్రితమే నేను అనుకుని సౌగత్‌ను అడిగాను. అతడు సంతోషంగా అంగీకరించాడు. అయితే ఆ తర్వాత ఆ సంగతి పెళ్లి కంగారులో మర్చిపోయి నేను పాసింజర్ సీట్లో కూచుంటే నువ్వు నడుపుతానన్నావుగా అని అతడే గుర్తు చేశాడు. నిజానికి సౌగత్‌ను కూచోబెట్టుకుని బండిలో తిప్పడం పెళ్లికి ముందు నుంచే నాకు అలవాటు. ఆ పనే ఇప్పుడూ చేశాను. అతని డ్రైవింగ్ నాకు భయం కూడా అనుకోండి’ అని నవ్వింది స్నేహా. ఇరవై ముప్పై ఏళ్ల క్రితం కమ్యూనికేషన్ వ్యవస్థ, ట్రాన్స్‌పోర్టేషన్ సరిగా ఉండేవి కాదు. అత్తారిల్లు పక్క ఊళ్లోనే అయినా దూరం అయినా రాకపోకలు మాటా మంతి అంతగా సాగేవి కావు. ఉత్తరాలనే నమ్ముకోవాల్సి వచ్చేది. పైగా ఆనాటి ఆడపిల్లలు సరైన చదువుకు, ఉపాధికి నోచుకోక భవిష్యత్తంతా అత్తారింటి మంచి చెడ్డల మీద ఆధారపడి ఉండేవారు. అందువల్ల పెళ్లి సమయాలలో పెళ్లికూతుళ్లు ఆందోళనగా, ఉద్వేగంగా, సమాజ పోబడికి తగ్గట్టు బిడియంగా ఉండేవారు. కాని ఇప్పుడు ఎంత దూరం వెళ్లినా, అమెరికాలో ఉన్నా అనుక్షణం తన వాళ్లకు కనపడుతూ వినపడుతూ ఉండే వీలు ఉంది. ఒక్కరోజు తేడాలో ఎంత దూరం అయినా ప్రయాణించవచ్చు. అబ్బాయి అమ్మాయిల మధ్య పెళ్లికి ముందు కొద్దో గొప్పో మాటలు నడిచి పెళ్లి నాటికి స్నేహం కూడా ఏర్పడుతోంది. అందుకే ఇప్పుడు పెళ్లిళ్లలో పూర్తిగా కొత్త ఆలోచనల పెళ్లికూతుళ్లు కనిపిస్తున్నారు. ఇటీవల తెలంగాణలోని జగిత్యాల ప్రాంతానికి చెందిన వధువు సాయి శ్రీయ వరుడు అశోక్‌తో అంపకాల సమయంలో అత్తారింటికి సంతోషంగా వెళుతూ ప్రైవేటు గీతం ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’ పాటకు చేసిన నృత్యం దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారిని విశేషంగా ఆకట్టుకుంది. ఆ వీడియోలో సాయి శ్రీయ తన భర్తను చూస్తూ సంతోషంగా డాన్స్ చేస్తుంటే భర్త కూడా ఎంతో ముచ్చట పడుతూ చూడటాన్ని జనం మెచ్చుకున్నారు. ఆ జంటను ఆశీర్వదించారు. నిన్న మొన్నటి వరకు అబ్బాయికి విందులో ఏది ఇష్టం, మంటపం ఏది బుక్ చేయమంటాడు, పెళ్లి ఎలా జరగాలంటాడు వంటి ప్రిఫరెన్సు దక్కేది. ఇప్పుడు అమ్మాయికి ఏది ఇష్టం, ఏం కావాలంటోంది, ఏది ముచ్చపడుతోంది అని అడిగి అంగీకరించే పరిస్థితికి నేటి ఆడపిల్లలు వీలు కల్పిస్తున్నారు. సంతోషాల ఎంపికలో ఆమెకూ సమాన భాగం దొరికితే ఆ వివాహం మరెంతో సుందరం కదా. -
ట్రాన్స్ఫర్ చేశారని విషం తాగిన గవర్న్మెంట్ టీచర్లు
కలకత్తా: తమను అకారణంగా దూర ప్రాంతాలకు బదిలీ చేశారని ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. ఆందోళనను తీవ్ర రూపం చేసేందుకు వారు విషం సేవించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా పశ్చిమ బెంగాల్లో కలకలం రేపింది. విషం తాగిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ సంఘటనతో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. (చదవండి: శ్రీలంక యువతి కేసులో కీలక మలుపు: హీరో ఆర్యకు బిగ్ రిలీఫ్) మాధ్యమిక శిక్ష కేంద్ర (ఎంఎస్కే), శిశు శిక్ష కేంద్ర (ఎస్ఎస్కే)లో కాంట్రాక్ట్ టీచర్లు పని చేస్తున్న వారిని సుదూర ప్రాంతాలకు ప్రభుత్వం బదిలీ చేసింది. ఆ రాష్ట్ర రాజధాని కలకత్తాలోని పాఠశాల విద్యా శాఖ కార్యాలయం (బికాశ్ భవన్)ను మంగళవారం బదిలీ జరిగిన కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు ముట్టడించారు. ఈ నిర్ణయంపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన బాట పట్టారు. పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. మంత్రికి నిరసనగా నినాదాలు చేశారు. ఈ సమయంలో టీచర్లు కార్యాలయంలో ఉన్న మంత్రిని కలిసేందుకు ప్రయత్నించారు. గేటు దూకి లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొందరు టీచర్లు విషం సేవించారు. విష ద్రావణం సేవించడంతో టీచర్లు అపస్మారక స్థితికి చేరుకున్నారు. వారిని ఆస్పత్రికి తరలించారు. వారిలో ఐదుగురు టీచర్లు షికాస్ దాస్, జ్యోత్స్న తుడు, పుతుల్ జనా, చబీదాస్, అనిమానాథ్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వారిని వైద్యులు ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనతో ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆ టీచర్లు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: ఎంతటి దుస్థితి! అఫ్గాన్ మంత్రి నేడు డెలివరీ బాయ్‌గా -
సోషల్ మీడియా పోస్ట్.. రంగంలోకి దిగిన సిట్ అధికారులు.. ట్విస్ట్ ఏంటంటే
కోల్‌కతా: ఒక వ్యక్తి తాను.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్ అధికారినంటూ చెప్పుకుంటూ సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టుకున్నాడు. అది కాస్త వైరల్ గా మారింది. దీంతో అతడిని కలకత్తా పోలీసులు అరెస్టు చేశారు.వివరాలు, సనాతన్ రే అనే వ్యక్తి కోల్కత్తా హైకోర్ట్‌లో న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. ఆయన గతకొంత కాలంగా తన ఫేస్బుక్లో.. తాను సిబీఐ అధికారినంటూ నకిలీ ప్రోఫైల్ తయారు చేశాడు. అంతటితో ఆగకుండా, సిబీఐ అధికారులకు మాత్రమే ఉండే నీలిరంగు టాగ్‌ను తన వాహనానికి పెట్టుకున్నాడు. ప్రస్తుతం, పశ్చిమ బెంగాల్ స్టాండింగ్ కమిటీ కౌన్సిల్ లో పనిచేస్తున్నట్లు పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌లు కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో, కోల్కత్తా స్పెషల్ ఇన్వేస్టిగేషన్ టీమ్(సిట్) సనాతన్రేను అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే, సనాతన్ రే హైకోర్ట్‌లో న్యాయవాదిగా పనిచేస్తున్నట్లు బయట పడింది. దీంతో, సిబీఐ అధికారినంటూ మోసంచేశాడని సిట్ విచారణలో తెలింది. కాగా, సిట్ అధికారులు, సనాతన్రే పై.. ప్రభుత్వాధికారినంటూ మోసం చేయడం, ఫోర్జరీ, నేర పూరిత చర్య వంటి పలు అభియోగాల కింద కేసులను నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
సెట్.. రీసెట్!
నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లు. కోల్కత్తా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల పాటు కోల్‌కత్తాలో జరిగింది. అక్కడ ఎన్నికల నేపథ్యంలో షూటింగ్‌కు అంతరాయం కలగడంతో హైదరాబాద్ వచ్చేసింది యూనిట్. పైగా లాక్‌డౌన్‌తో కోల్కత్తా వెళ్లి షూటింగ్ చేసే పరిస్థితులు లేవు. దీంతో ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా ప్రత్యేకంగా ఆరున్నర కోట్లతో కోల్‌కత్తాలోని కాళీ మాత గుడితో సహా కొన్ని వీధులతో సెట్ నిర్మించారు. లాక్డౌన్ ముందు వరకూ ఈ సెట్లో కొద్ది రోజులు షూటింగ్ కూడా జరిగింది. అయితే హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఈ సెట్ దెబ్బతింది. ఇప్పుడు సెట్‌ని పునర్నిర్మించాలంటే దాదాపు రెండు కోట్ల ఖర్చు అవుతుందట. ఇంకొన్ని రోజుల పాటు ఈ సెట్లో చిత్రీకరణ జరగాల్సిన నేపథ్యంలో వేరే దారిలేక సెట్‌ని రీసెట్ చేయాలనుకుంటున్నారు. -
ఉండనివ్వరేల ఘనాఘనులు
అరవై ఏళ్ల చరిత్ర కలిగిన కలకత్తా ఐ.ఐ.ఎం. (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్) కు సుమారు రెండున్నరేళ్ల క్రితం అంజు సేథ్ డైరెక్టర్‌గా వచ్చినప్పుడు కలకత్తా ఐ.ఐ.ఎం.కు తొలి మహిళా డైరెక్టరుగా ఆమె గుర్తింపు పొందారు. అయితే డైరెక్టరుగా మాత్రం ఆమె నిర్ణయాలకు, నిర్దేశాలకు, చివరికి ఆదేశాలకు కూడా గుర్తింపు గౌరవం లభించలేదన్న విషయం సోమవారం ఆమె రాజీనామా చేసి బయటికి వస్తున్నప్పుడు మాత్రమే ఆమెతో పాటు బయటపడింది! పురుషుడు స్త్రీని అధికారంలోకి రానివ్వడా! రానివ్వక తప్పనప్పుడు ఉండనివ్వడా!. ఉండనివ్వక తప్పనప్పుడు బాధ్యతలన్నీ సగౌరవగా ఆమెపై కుమ్మరించి అధికారాలన్నీ తన దగ్గరే ఉంచేసుకుంటాడా! అధికారం లేకుండా బాధ్యతలు ఎలా నెరవేర్చడం?! స్త్రీ సాధికారత అని మాటలు చెబుతుండే.. చదువు, వివేకం గల పెద్దపెద్ద సంస్థలలో కూడా ఇంతేనా! స్త్రీ.. పేరుకేనా ‘పదవి’లో ఉండటం. అంజూ సేథ్ విషయంలోనూ ఇదే జరిగింది. పురుషాధిక్య ‘పోరు’ పడలేక ఆమె తన డైరెక్టర్ పదవికి రాజీనామా చేసి ఐఐఎం (కలకత్తా) మెట్లు దిగి వెళ్లిపోయారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆ ఐఐఎం కి తొలి మహిళా డైరెక్టర్ ఆమె. అంజూ సేథ్ వెళ్లిపోతుంటే చైర్మన్ ముఖం చాటేశారు. బోర్డ్ చూస్తూ నిలబడింది. ఫ్యాకల్టీ మౌనంగా ఉండి పోయింది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నేడూ రేపట్లో ఏమైనా మాట్లాడుతుందేమో చూడాలి. మేనేజ్మెంట్ రంగంలో అంజూ సేథ్ అత్యంత సమర్థురాలని పేరు. ఐఐఎమ్‌కి 2018లో డైరెక్టర్‌గా వచ్చే ముందువరకు యూఎస్‌లో ఆమె పెద్ద పొజిషన్లో ఉన్నారు. ఐఐఎమ్‌లో చేరినప్పటి నుంచీ డైరెక్టర్ హోదాలో ఆమె నిర్ణయాలను చైర్మన్ రెస్పెక్ట్ చేయడం లేదని ప్రధాన ఆరోపణ. ఆమెతో అతడి సమస్య ఏంటి? ఒక నిస్సహాయురాలిలా ఈ ఉన్నత విద్యావంతురాలు ఎందుకు వెళ్లిపోవలసి వచ్చింది? గ్లాస్ సీలింగ్ ని బ్రేక్ చేసిన మహిళను అసలే నిలవనివ్వరా ఈ ఘనాఘనులు?! అరవై ఏళ్ల చరిత్ర కలిగిన కలకత్తా ఐ.ఐ.ఎం. కు సుమారు రెండున్నరేళ్ల క్రితం అంజు సేథ్ డైరెక్టర్‌గా వచ్చినప్పుడు కలకత్తా ఐ.ఐ.ఎం.కు తొలి మహిళా డైరెక్టరుగా ఆమె గుర్తింపు పొందారు. అయితే డైరెక్టరుగా మాత్రం ఆమెకు గుర్తింపు గౌరవం లభించలేదన్న విషయం ఆమె రాజీనామా చేసి బయటికి వస్తున్నప్పుడు మాత్రమే ఆమెతో పాటు బయటపడింది! వర్జీనియాలోని ‘పంప్లిన్ కాలేజ్ ఆఫ్ బిజినెస్’లో ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ ఇండియా వచ్చి 2018 నవంబరులో కలకత్తా ఐ.ఐ.ఎం.లో డైరెక్టర్‌గా పదవీబాధ్యతలు స్వీకరించారు అంజు సేథ్. అయితే తనను ఏనాడూ ఇక్కడివాళ్లు ‘లోపలి మనిషి’ చూడలేదని, ఐ.ఐ.ఎం.–సి ఛైర్మన్ శ్రీకృష్ణ కులకర్ణిని ఉద్దేశించి ఆమె ఎప్పటి నుంచో అంటూనే ఉన్నారు. సిబ్బంది చెబుతున్న దానిని బట్టి కూడా డైరెక్టర్ పరిధిని అతిక్రమించి వచ్చి మరీ ఛైర్మన్ ఆమె విధులకు ఆటంకాలు కలిగించారు. అనేక కమిటీల నుంచి ఆమెను ఉద్దేశపూర్వకంగా తొలగించారు! నిధుల సమీకరణ కమిటీ నుంచి తప్పించారు. ఆమెకున్న నియామక అధికారాలను నామమాత్రం చేశారు. ఆమెపై క్రమశిక్షణ చర్యలకు బోర్డు సభ్యులను ప్రేరేపించారు. పైపెచ్చు తిరిగి ఆమె మీదే గత డిసెంబరులో విద్యామంత్రిత్వశాఖ కార్యదర్శి అమిత్‌ఖేర్‌కు ఆమె పనితీరు సవ్యంగా ఉండటం లేదని, వివక్షతో కూడిన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫ్యాకల్టీ చేత లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయించారు. ఇవన్నీ కూడా అంజు సేథ్ తనకై తను బయటపెట్టినవి కాదు. బోర్డు సభ్యులలో, ఫ్యాకల్టీ విభాగంలో నిజానిజాలు తెలిసినవారు మీడియాకు వెల్లడించినవి. అంజు సేథ్ కూడా కలకత్తా ఐ.ఐ.ఎం.లోనే (1978) చదివారు. 1988లో మిషిగాన్ యూనివర్సిటీలో డాక్టరేట్ చేశారు. 2008లో వర్జీనియా టెక్ (పంప్లిన్ కాలేజ్ ఆఫ్ బిజినెస్) లో ప్రొఫెసర్‌గా చేరారు. తిరిగి పదేళ్ల తర్వాత ఇండియా వచ్చారు. తనొక మహిళ కాబట్టి వివక్షకు గురయ్యానని ఆమె బలంగా నమ్ముతున్నారు. -
ప్రతి దృశ్యం అంతులేని కవిత్వం!
ఫ్యాషన్ ఫొటోగ్రఫీలో తాజా కెరటం లౌకిక్దాస్. కోల్‌కతాకు చెందిన దాస్ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో డిప్లొమా చేశాడు. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ 2020లో ఇతడికి ఎనిమిది షోలు కవర్ చేసే ఛాన్స్ దొరికింది. ప్రస్తుతం కోల్‌కతా కేంద్రంగా తన పాషన్ కొనసాగిస్తున్న లౌకిక్దాస్ మాటలు కొన్ని... ∙నేను ఎప్పుడూ ఫాలో అయ్యే ఏకైక రూల్... ఏ రూల్ ఫాలో కావద్దని! ఎందుకంటే ఫొటోగ్రఫీ అనేది సృజనాత్మకమైనది. దానికి హద్దులు, పరిమితులు లేవు ∙ఫొటోగ్రఫీలోని రకరకాల జానర్స్‌లో ఎన్నో గొప్ప అవకాశాలు ప్రపంచవ్యాప్తంగా మన కోసం ఎదురుచూస్తున్నాయి ∙ఏ పుస్తకమో ఎందుకు? ‘ప్రకృతి’ అనే అందమైన పుస్తకాన్ని చదివితే ఎంతో జ్ఞానం మన సొంతమవుతుంది. అది మన వృత్తికి ఇరుసుగా పనిచేస్తుంది ∙‘ఈ దృశ్యంలో ఏదో మ్యాజిక్ ఉంది’ అని పసిగట్టే నైపుణ్యాన్ని మన కంటికి నేర్పాలి. -
పార్టీ మారిన భార్యకు విడాకులన్న ఎంపీ
సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌కు చెందిన భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు సౌమిత్రా ఖాన్ భార్య సుజాతా మండల్ ఖాన్ సోమవారం నాడు తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. బెంగాళ్‌లోని బిష్ణూపూర్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు ఎన్నికైన సౌమిత్రా ఖాన్ భారతీయ జనతా యువ మోర్చా అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు. కోల్‌కతాలో టీఎంసీ నాయకులు సౌగతా రాయ్, పార్టీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ సమక్షంలో సుజాతా ఖాన్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. (యడియూరప్పకు పదవీ గండం తప్పదా?) 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భర్తను గెలిపించుకునేందుకు ఎంతో కష్టపడినప్పటికీ బీజేపీలో తనకు తగిన గుర్తింపు రాకపోవడంతో తాను పార్టీ మారాల్సి వచ్చిందని సుజాతా మండల్ ఖాన్ ఆరోపించారు. ఎప్పటి నుంచో పార్టీకి విధేయంగా పని చేస్తున్న తమ లాంటి వారికి కాకుండా ఇటీవల పార్టీలో చేరిన అవినీతి పరులకు గుర్తింపు ఇస్తుండడంతో విధిలేని పరిస్థితుల్లో తాను పార్టీ మారానని ఆమె వివరించారు. ఇప్పటికీ బీజేపీలో కొనసాగుతోన్న ఆమె భర్త గురించి ప్రశ్నించగా, అది ఆయన ఇష్టమని, ఏదోరోజున వాస్తవాలను గుర్తించి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరినా చేరిపోవచ్చని ఆమె చెప్పారు. ఇదే విషయమై సౌమిత్రా ఖాన్‌ను ప్రశ్నించగా, సుజాతా ఖాన్ పార్టీ మారినందున తమ పదేళ్ల వివాహిక బంధాన్ని తెంపేసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, త్వరలోనే విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంటానని చెప్పారు. ఇక ముందు తన భార్య తన సర్ నేమ్‌ను వాడుకోరాదని ఆయన చెప్పారు. (బెంగాల్లో బీజేపీకి అంత సీన్ లేదు: పీకే) -
కోల్‌కతాలో యుద్ధ వాతావరణం
కోల్‌కతా/హౌరా: బీజేపీ చేపట్టిన ‘చలో సెక్రటేరియట్’ కార్యక్రమం సందర్భంగా గురువారం కోల్‌కతా, హౌరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ కార్యకర్తల హత్యలకు నిరసనగా భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) చేపట్టిన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు పోలీసులతో ఘర్షణలకు దిగారు. పోలీసులు పెట్టిన బారికేడ్లను ధ్వంసం చేశారు. పోలీసులపై రాళ్లు విసిరారు. దాంతో, పోలీసులు వారిపై వాటర్ కెనాన్లను, టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. లాఠీచార్జ్ చేశారు. ఘర్షణల్లో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు గాయపడ్డారు. ఘర్షణల నేపథ్యంలో కోల్‌కతా, హౌరాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. రోడ్లపై ఎక్కడ చూసినా.. కాల్చిన టైర్లు, రువ్విన రాళ్లు కనిపించాయి. కరోనా నిబంధనలను పట్టించుకోకుండా, వేలాది కార్యకర్తలు మధ్నాహ్నం 12.30 గంటల ప్రాంతంలో సచివాలయం వైపునకు వెళ్లడం ప్రారంభించారు. హౌరా మైదాన్ నుంచి బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య, రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షుడు సౌమిత్ర ఖాన్ మార్చ్ ప్రారంభించారు. వారిని మాలిక్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ చోటు చేసుకుంది. ఒక కార్యకర్త నుంచి బుల్లెట్లతో ఉన్న పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. బీజేపీ కార్యకర్తలు తమపై నాటు బాంబులు వేశారని పోలీసులు ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయంతన్ బసు నేతృత్వంలో సాగిన మార్చ్‌ను సాంత్రాగచి వద్ద పోలీసులు అడ్డుకోవడంతో, అక్కడా ఘర్షణ జరిగింది. పోలీసులతో ఘర్షణల్లో బీజేపీ నేత రాజు బెనర్జీ, ఎంపీ జ్యోతిర్మయి సింగ్ మహతో గాయపడ్డారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ్‌వర్ఘీయ, జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్‌ల నేతృత్వంలో సాగిన చలో సెక్రటేరియట్ మార్చ్‌ను కోల్‌కతాలోని హాస్టింగ్స్–ఖిద్దర్‌పోర్ క్రాస్ రోడ్స్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, టీఎంసీ గూండాలు తమపై దాడి చేశారని విజయ్‌వర్ఘీయ ఆరోపించారు. దాదాపు వంద మందికి పైగా బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేవైఎం తలపెట్టిన మార్చ్‌కు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. పశ్చిమ బెంగాల్లో ప్రజాస్వామ్యం లేదు పశ్చిమ బెంగాల్లో కొనసాగుతున్న తృణమూల్ కాంగ్రెస్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడుతామని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదన్నారు. మమత సర్కారును సాగనంపాలని రాష్ట్ర ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారన్నారు. మమత బెనర్జీ అవినీతిమయ, హింసాత్మక, నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు పోరాటం కొనసాగిస్తారన్నారు. మమత పాలనకు బీజేపీ అంతం పలకడం ఖాయమన్నారు. ‘మమత తన సచివాలయాన్ని మూసివేసుకునేలా ధీరులైన మా బీజేవైఎం కార్యకర్తలు పోరాడారు. ఆమె ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారనేందుకు ఇదే ఉదాహరణ’ అని నడ్డా ట్వీట్ చేశారు. రాజకీయ ప్రత్యర్థులను అణచివేసే విషయంలో మాత్రం గత వామపక్ష ప్రభుత్వం కన్నా మమత సర్కారు మెరుగ్గా ఉందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. లాఠీచార్జీలో గాయపడి, రోడ్డుపైనే పడిపోయిన ఓ కార్యకర్త -
ఈ రూట్లలో నో వెయిటింగ్ లిస్టు
న్యూఢిల్లీ: రాబోయే ఐదేళ్లలో ఢిల్లీ–ముంబై, ఢిల్లీ–కోల్‌కతా మార్గాల్లో ప్రయాణించే రైళ్లలో వెయిటింగ్ లిస్టు ఉండదని రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ యాదవ్ చెప్పారు. ఈ మార్గాల్లో ప్రత్యేక సరుకు రావాణా కారిడార్లు (డీఎఫ్సీ) 2021 కల్లా పూర్తి కానున్న నేపథ్యంలో రైళ్ల రద్దీ తగ్గుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. రూ.2.6 లక్షల కోట్లతో నిర్మించనున్న డీఎఫ్‌సీల నిర్మాణం పూర్తయితే సరుకు రవాణా రైళ్లు ఈ మార్గాల్లో వెళ్తాయి. దీంతో రైళ్ల వేగం పెంచడంతోపాటు ప్రయాణికుల రద్దీకి తగ్గట్లు రైళ్లను నడపవచ్చాన్నారు. ఫలితంగా ప్రయాణికులకు వెయిటింగ్ లిస్టు ఉండదని పేర్కొన్నారు. రైళ్లలో నేరాలను తగ్గించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు వినోద్ తెలిపారు. వచ్చే ఏడాది నుంచి దీనిని అమలు చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. 2022 మార్చి నాటికల్లా అన్ని రైల్వే స్టేషన్లు, బోగీల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ఆందోళనల్లో రైల్వేకు వాటిల్లిన రూ.80 కోట్ల ఆస్తి నష్టాన్ని బాధ్యులైన వారి నుంచే వసూలు చేస్తామని వినోద్ యాదవ్ సోమవారం ప్రకటించారు. ఇందులో తూర్పు రైల్వేకు రూ.70 కోట్లు, ఈశాన్య రైల్వేకు రూ.10 కోట్ల నష్టం జరిగింది. -
ఓ మల్లెపువ్వు రక్త చరిత్ర
‘దారోగర్ దప్తార్’. 1880లలో కలకత్తాలో జరిగిన వరుస హత్యలు ఈ పేరుతో ఏళ్ల క్రితం పుస్తకంగా వచ్చాయి. ఇప్పుడు అదే పుస్తకం రెండు వాల్యూములుగా పునర్ముద్రణ అయింది. కొన్ని నేరాలను పరిశోధించిన ప్రియానాథ్ ముఖోపాధ్యాయ్ పుస్తకంలోని కథలను ఉత్కఠతో చదివించేలా రచించారు. మొదటి వాల్యూమ్‌లోని 78 వ కథలో పేరుమోసిన నేరస్తురాలు త్రైలోక్య నేర చరిత్రను చదివితే ఆమె జీవితం ఈ పుస్తకంలో ఉండాల్సిన కథ కాదు అనిపిస్తుంది. కానీ నేరం నేరమే. బెంగాల్‌లోని చిన్న గ్రామంలో త్రైలోక్య కథ ప్రారంభమవుతుంది. త్రైలోక్య బ్రాహ్మల అమ్మాయి. పెళ్లి అయ్యేనాటికి చిన్న పిల్ల. పెళ్లికొడుకు పెద్ద వయసువాడు. త్రైలోక్య రజస్వల అయ్యేవరకు పుట్టింట్లోనే ఉంది. భర్త మరణించే లోపు ఒక్కసారి మాత్రమే అతడిని చూసింది. ఆ తరవాత త్రైలోక్యను ఒక వైష్ణవ మహిళ చేరదీసింది. అక్కడే ఆమె జీవితం మలుపు తిరిగింది. కలకత్తా వేశ్యా గృహాలకు అమ్మాయిలను సరఫరా చేసే ఆ మహిళ.. త్రైలోక్యను ఒక యువకుడికి అప్పచెప్పింది. అతడు త్రైలోక్యను మోసం చేసి, కలకత్తా సోనాగచ్చిలో ఉండే రెడ్ లైట్ ఏరియాలోని వేశ్యాగృహానికి అమ్మేశాడు. ఇది 1880లో జరిగింది. ఒక సాధారణ పల్లెటూరి పిల్లలా మొదలైన ఆమె జీవితం, ఇక్కడ నుంచే కలకత్తా నేర ప్రపంచంలోకి అడుగు పెట్టేలా చేసింది. వ్యభిచారం నుంచి మోసగత్తెగా.. యవ్వనంతో అందంగా ఉన్న త్రైలోక్యకు డబ్బు కోసం వెతక్కోవలసిన అవసరం కలగలేదు. చేతికి వస్తున్న ఆదాయంతో విలాసవంతమైన జీవితానికి అలవాటుపడింది. అందం ఎంతోకాలం నిలబడదుగా, క్రమేపీ ఆదాయం కూడా తగ్గసాగడంతో, భవిష్యత్తు గురించి భయం మొదలైంది. ఈ సమయంలోనే కాళి బాబు అనే ఒక వివాహితుడిని ప్రేమించింది. అతడి భార్య మరణించగానే, హరి అనే పేరు గల వారి కొడుకుని దత్తత తీసుకుంది. కాళిబాబు నిత్యం అక్కడే ఉండటం వల్ల, త్రైలోక్య దగ్గరకు వచ్చే విటుల సంఖ్య తగ్గిపోయింది. దానికి తోడు హరి చదువు ఖర్చు కూడా పెరగటంతో, త్రైలోక్య పరిస్థితి దీనంగా మారిపోయింది. వ్యభిచార వృత్తి నుంచి నేర ప్రవృత్తిలోకి మారవలసి వచ్చింది. కలకత్తాకు చెందిన ఇద్దరు సంపన్నులు త్రైలోక్య ఇంట్లో ఉంటూ, అక్కడకు వచ్చే విటులకు అమ్మాయిలను సరఫరా చేయడంతో పాటు, వారు మత్తులో ఉన్నప్పుడు వారిని లూటీ చేసి, వీధిలోకి తోసేయడం త్రైలోక్య లక్ష్యం. రోడ్డు మీద పడిపోయిన వ్యక్తిని చూసి వాడు తాగి పడిపోయాడనుకునే పోలీసులు ఆ రాత్రికి వారిని లాకప్‌లో ఉంచుతారు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచేదాకా వారికి ప్రతిఘటించే శక్తి ఉండదు. ఫిర్యాదు చేయడం వలన అక్కర్లేని ప్రచారం జరుగుతుంది కాబట్టి, వారు మౌనంగా వెళ్లిపోతారు. ఇదీ త్రైలోక్య కుటిల ఆలోచన. ఆనోటా ఈనోటా త్రైలోక్య విషయం నలుగురికీ తెలిసిపోవడంతో మరో కొత్త నేరానికి దారి వెతుక్కుంది. వరుల కోసం వల బెంగాల్‌లోని శోత్రియ బ్రాహ్మణ కుటుంబాలలో వరకట్నం కాకుండా, కన్యాశుల్కం ఆచారంగా ఉండేది. అందువల్ల ఆడపిల్లల తండ్రులు ఎవరు ఎక్కువ కన్యాశుల్కం ఇస్తే వారితోనే సంబంధం కలుపుకునేవారు. ఇది అదనుగా చేసుకుంది త్రైలోక్య. అబ్బాయికి పెళ్లి చేయడం కష్టంగా ఉన్న వారి గురించి సన్నిహితుల ద్వారా కాళిబాబు తెలుసుకున్నాక కలకత్తా నగరంలోని రెడ్ లైట్ ఏరియాకి దూరంగా త్రైలోక్యం, కాళిబాబు ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నారు. అబద్ధపు చుట్టాలను తెచ్చుకున్నారు. ఒక సుముహూర్తాన అబ్బాయి కుటుంబానికి కబురు చేశారు. అందంగా ఉండే ఒక వ్యభిచారిని పెళ్లికూతురుగా పరిచయం చేశారు. అమ్మాయిని చూడగానే అబ్బాయి తన అంగీకారం తెలిపాడు. అడిగినంత కన్యాశుల్కం, పెళ్లి ఖర్చులు ఇచ్చారు. నెల తిరిగేలోపు వివాహం అయిపోయింది. అమ్మాయి అత్తవారింటికి వెళ్లింది. ఒంటి నిండా నగలతో దర్జాగా ఉంది. తన కన్నతల్లి పరిచారిక వేషంలో వచ్చింది. మరొక వ్యక్తి మేనమామలా నటించాడు. వివాహం జరిగిన నెల రోజులకు, పెళ్లికూతురు తన తల్లిదండ్రులను చూసి వస్తానని అత్తగారి అనుమతి తీసుకుని భర్తతో కలిసి బయలుదేరింది. ఒంటి నిండా నగలతో, పరిచారికలుగా వచ్చిన ఇద్దరు వ్యక్తులతో కలిసి మొత్తం నలుగురు కలకత్తా ౖరైలు ఎక్కారు. అర్ధరాత్రి నిద్రలో ఉండగా, భర్తను వదిలి ముగ్గురూ త్రైలోక్య దగ్గరకు పారిపోయారు. నగలన్నీ అమ్మేశారు. వారు ముగ్గురికీ త్రైలోక్య కొద్ది మొత్తం మాత్రమే ఇచ్చింది. మిగిలినదంతా తాను తీసేసుకుంది. ఇదే మోసాన్ని పదేపదే చేసి డబ్బు సంపాదించింది త్రైలోక్య. కొంతకాలం తరవాతఅమ్మాయిలను కిడ్నాప్ చేసి, అమ్మేయడం మొదలుపెట్టింది త్రైలోక్య. మాయమైన అమ్మాయిలు కనిపించకపోవడంతో, ఆ వార్త సంచలనమైంది. విషయం గ్రహించిన పోలీసులు, త్రైలోక్య, కాళిబాబులకు.. ఇటువంటి పనులు మానుకోమని హెచ్చరించారు. అక్కడ నుంచి మరో దారిలోకి వెళ్లింది త్రైలోక్య. హత్యలు మొదలు ఉత్తరప్రదేశ్‌లో ఒక రాజుగారికి మధ్యవర్తినని చెప్పుకునేవాడు కాళిబాబు. బారాబజార్ నుంచి నగలను తక్కువ ధరకు తీసుకువస్తానని చెప్పి, షాపు వారికి కబురు చేసి, వారి దుకాణంలో పనిచేసే వ్యక్తి ద్వారా నగలను తెప్పించి, నగలు తీసుకు వచ్చిన వ్యక్తిని చంపేసి, నగలన్నీ తీసుకుని, ఆ వ్యక్తిని వారు అద్దెకు ఉన్న ఇంటి గదిలో పాతేసేవారు. కాళిబాబు ఆ నగలను స్వయంగా రాజావారి దగ్గరకు తీసుకువెళ్లి, డబ్బులు తీసుకుని, తన జేబులో వేసుకునేవాడని అంటారు. ఈ కేసును పరిశీలించమని నేర పరిశోధకుడైన ముఖోపాధ్యాయకు అప్పచెప్పారు అధికారులు. అద్దెకు ఉన్న ఇంటిని గుర్తించి, శవాన్ని బయటకు తీశాడు ముఖోపాధ్యాయ. కాళిబాబును ఉరి తీశారు. కోర్టులో త్రైలోక్య నేరం నిరూపణ కాలేదు. ఆమె స్వేచ్ఛగా బయటకు వెళ్లిపోయింది. నిస్పృహలో ఉన్న త్రైలోక్య తన ఇంటిని, నగలను బలవంతంగా అమ్మవలసి వచ్చింది. సోనాగచ్చిలో గతంలో తనతో ఉన్న వారిని కలిసింది. వారంతా ఈసడించుకున్నారు. కాని, ఆమెలాగే, చాలామంది వయసు మీద పడటంతో భవిష్యత్తు గురించి భయపడసాగారు. వారందరి అభద్రతతో సైతం చెలగాటమాడింది త్రైలోక్య. ఒక మహానుభావుడు వారందరి కష్టాలను గట్టెక్కిస్తాడని వారిని నమ్మించింది. వారంతా ఒంటి నిండా నగలతో వస్తే, వారిని రెట్టింపుగా ఆశీర్వదిస్తాడని నమ్మపలికింది. మూడేళ్ల కాలంలో త్రైలోక్య అలా ఐదుగురు మహిళలను చేరదీసింది. వారిని కలకత్తాలో తన ఇంటి దగ్గరలో ఉన్న మాణిక్‌తాలా చెరువు దగ్గరకు ఒక్కొక్కరిగా తీసుకువెళ్లి, వారిని అందులో స్నానం చేయమంది. వారంతా వారి ఒంటి మీద నగలను తీసి, ఒడ్డున పెట్టారు. స్నానం చేస్తుండగా, తలను నీటిలో ముంచి వారు మునిగిపోయేవరకు అలానే పట్టుకునేది. ఇలా చేస్తుండగా ఒకసారి దూరం నుంచి ఎవరో గమనించారు. త్రైలోక్యను పోలీసు స్టేషనుకి ఈడ్చుకెళ్లారు. త్రైలోక్య తప్పించుకోవాలని చూసింది. ఆమెను ముఖోపాధ్యాయకు అప్పగించారు. అప్పటికే త్రైలోక్య మీద అనుమానాలున్న ముఖోపాధ్యాయ ఆమెను విచారణకు పంపారు. ఈసారీ అదృష్టం ఆమె వైపే ఉంది. ఆమె మరోసారి స్వేచ్ఛగా ప్రపంచంలోకి వచ్చింది. అప్పటికే అనుమానాలు అప్పటికే త్రైలోక్య గురించి దుష్ప్రచారం జరుగుతోంది. త్రైలోక్య ఈసారి చిత్పూర్లోని పంచు ధోబానీ లేన్‌లో ఇల్లు అద్దెకు తీసుకుంది. గతంలో చేసిన నేరాల తాలూకు ధనం ఖర్చు చేస్తోంది. ఇప్పుడు మరో కొత్త నేరం చేయడం కోసం ఎదురు చూస్తోంది. అదే ఇంట్లో నివసిస్తున్న రాజకుమారి అనే మరొక వ్యభిచారి దగ్గర ఉన్న బంగారాన్ని లాక్కోవాలనుకుంది. రెండుమూడు సార్లు గట్టిగానే ప్రయత్నించింది. విఫలం కావడంతో, కోపంతో ఊగిపోయి, ఆమెను చంపి మరీ నగలు తెచ్చుకుంది. ఈ హత్య జరిగిన కొంత కాలానికి ముఖోపాధ్యాయకు ఈ కేసును అప్పగించారు. త్రైలోక్య ఆ ఇంట్లో ఉంటోందని తెలిసిన మరుక్షణం, ఆమే ఈ హత్య చేసిందని అర్థం చేసుకున్నాడు. పుస్తకంలోని శేష్ లీలా (ద లాస్ట్ యాక్ట్)లో ముఖోపాధ్యాయ త్రైలోక్యను తాను ఏ విధంగా పట్టుకున్నాడో వివరించాడు. పెంపుడు కొడుకు హరిని హత్యానేరంలో ఇరికించినట్లు నటించాడు ముఖోపాధ్యాయ. సంకెళ్లతో ఉన్న హరిని చూసిన త్రైలోక్య మనసు కరిగింది. తాను దాచి ఉంచుకున్న బంగారమంతా పోలీసుల స్వాధీనం చేసింది. ఆ తరవాత తనను మోసం చేశారని తెలియగానే, మళ్లీ తన గత జీవితానికి వెళ్లిపోవాలనుకుంది. ఈలోగా కేసు హైకోర్టుకి వెళ్లింది. బెంగాల్ గవర్నర్ అయిన సర్ అగస్టస్ రివర్స్ థాంప్సన్‌కి క్షమాభిక్ష అప్పీలు చేసింది. ఆమె అదృష్టం శరవేగంతో దూరానికి పరుగులు తీసింది. ఆమెకు ఉరిశిక్ష వేశారు. ఆ రోజు ముఖోపాధ్యాయ ఆమెను జైలు గదిలో చూశాడు. ఒకపక్కన భయంకరమైన హత్యలు చేసింది, మరోపక్క, ఒక మహిళ మరణానికి కారణం అయ్యింది. త్రైలోక్యతో చేసిన సుదీర్ఘ ఇంటర్వ్యూలో ఆమె తాను చేసిన నేరాలన్నీ ఒకటొక్కటిగా స్వయంగా బయటపెట్టింది. ముఖోపాధ్యాయతో ఆమె పలికిన చివరి మాటలు, ‘హరి బాధ్యతను మీకు అప్పచెబుతున్నాను. అతడిని జాగ్రత్తగా చూడండి. లేదంటే అతడు కష్టాలపాలవుతాడు’ అని. 1884లో త్రైలోక్యను ఉరి తీశారు. – జయంతి -
కోట్లు కుమ్మరించినా ఆ పని మానలేను
మదర్ థెరీసా యుగోస్లేవియాలో పుట్టింది. భారతదేశం వచ్చింది. తోటివారిలాగే పాఠాలు చెప్పేది. ఓ రోజు రాత్రి కలకత్తాలో వీథిలో వెడుతుండగా ఓ అనాథ స్త్రీ విపరీతమైన అనారోగ్యంతో వచ్చి ఆమె చేతుల్లో పడింది. ‘ప్రాణం పోతోంది, చాలా బాధగా ఉంది. నన్ను డాక్టర్‌కు చూపించు’ అంది. ఎవరని అడిగితే ఎవరూ లేరు, అనాథనంది. ఆ క్షణంలో ఆమెకు గివింగ్ ఈజ్ లివింగ్(ఇచ్చుకోవడమే జీవిత పరమార్థం) అనిపించింది. ఆమెను కనీసం 10 వైద్యశాలలకు తీసుకెళ్ళింది. ‘తగ్గించడానికి చాలా ఖర్చవుతుంది, చికిత్స కుదరదు’ అన్నారు అంతటా. ఈ తిప్పటలో ఆ అనాథ ప్రాణాలు విడిచేసింది.‘ఇలా చచ్చిపోవడానికి వీల్లేదు’ అని థెరీసాకు అనిపించింది. ‘పక్కవాడు చచ్చిపోయినా ఫరవాలేదు–అని బతకడానికి కాదు మనుష్యజన్మ’ అని...‘‘ఇక నా జీవితం పదిమంది సంతోషం కోసమే’ అని సంకల్పించి నేరుగా తన గదికి బయల్దేరింది. ఒక పాత బకెట్, రెండు తెల్లచీరలు, రు.5లు పట్టుకుని ఆమె బయటికి నడుస్తుంటే... ఎక్కడికని స్నేహితులడిగారు. ‘ఇకపైన కష్టాలున్న వాళ్లెవరున్నారో వాళ్ళందరికీ తల్లినవుతాను’’ అని చెప్పి బయల్దేరబోతుంటే... ‘వీటితో...అది సాధ్యమా’ అని అడిగారు. ‘‘నేను తల్లి పాత్ర పోషించబోయేది, గుండెలు నిండిన ప్రేమతో, ఆదుకోవాలన్న తాపత్రయంతో’’ అని చెప్పి గడప దాటింది. అదీ సంకల్పబలం అంటే. తరువాత కాలంలో ఆమె ఎంతగా కష్టపడ్డారంటే...దాని ఫలితాలు మిషనరీస్ ఆఫ్ ఛారిటీస్, నిర్మల్ హృదయ్, శిశుభవన్... వంటి సంస్థలుగా దర్శనమిచ్చాయి. లక్షలమందిచేత మదర్ అని– అంటే అమ్మా అని పిలిపించుకున్నది. తర్వాతి కాలంలో ఆమెకు నోబెల్ బహుమతి వచ్చినప్పడు విలేకరులు ‘‘కీర్తి ప్రతిష్ఠలు వచ్చాయి. ప్రైజ్ మనీ(రు.18లక్షలు) కూడా వచ్చింది. సంతోషిస్తున్నారా..?’ అని అడిగితే... నేను సంతోషించిన సంఘటన ఇదికాదు, మరొకటి ఉందని చెప్పింది.‘‘ఒకనాడు ఒక యాచకుడొచ్చాడు. నన్ను చూడాలని ఉందంటే తీసుకొచ్చారు. తన కష్టాలు ఏకరువు పెడతాడనుకుంటే... జేబులోంచి ఒక కాసు తీసి ‘అమ్మా, ఇంతమందిని ఆదుకుంటున్నావు, నా వంతు ఈ డబ్బు ఉంచమ్మా’ అని ఓ పావలా కాసు ఇచ్చి వెళ్ళాడు. అది పావలాయే అయి ఉండవచ్చు. నా మీద పెంచుకున్న నమ్మకం అది.ప్రేమతో ఇచ్చిన ఆ నాణెంతో నోబెల్ బహుమతి సమానం కాదు’’ అని థెరీసా చెప్పారు. ఒకరికి ఇవ్వడంలోఎంతో ఆనందం ఉంటుంది. అది ఎంతన్నది కాదు ప్రధానం. ఇక ఆ తరువాత నుంచి అందరినీ ‘నాకేమయినా ఇస్తారా’ అని అడుగుతున్నా. చివరికి ఐదు, పది పైసలయినా సరే, చినిగిన బనీనయినా, కాల్చిపారేసే అగ్గి పుల్లయినా ఏదయినా ప్రేమతో ఇచ్చినప్పుడు తీసుకుంటా. ఇవ్వడంలో వారు అనుభవించే ఆనందం నాకు ముఖ్యం’’అని ఆమె చెప్పేవారు. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టిన నాడు, బాధలో ఉన్నవాడిని ఆదుకున్ననాడు, వాడు సంతోషించడానికి కారణమయిన జన్మే మనుష్య జన్మ. కుష్ఠురోగులకు చీము, నెత్తురు తుడిచి సేవ చేస్తుంటే చూసిన ఒక విలేకరి ‘‘ఎన్ని కోట్లు ఇచ్చినా ఈ పని చేయను నేను. మీరెలా చేస్తున్నారు?’’ అని అడిగితే...‘‘కొన్ని కోట్లు ఇచ్చినా ఈ పనిని నేను మానలేను. ఎందుకంటే నాకు వారిలో భగవంతుడు కనబడుతున్నాడు’’ అని జవాబిచ్చింది ఒక అతి సామాన్య సేవకురాలు, లక్షలు, కోట్లాదిమంది చేత అమ్మా అని నోరారా పిలిపించుకున్న మదర్ థెరీసా. -
ప్రాంతీయ భాషలోనే సైన్స్
కోల్‌కతా: శాస్త్ర సాంకేతికాంశాలను విస్తృతపరిచేందుకు వ్యవహారిక భాష వినియోగం పెరగాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని యువతలోనూ సైన్స్‌పై ఆసక్తి పెరుగుతుందన్నారు. భాష ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకునేందుకు అడ్డంకి కారాదన్నారు. ప్రతి శాస్త్రవేత్త, పరిశోధనకారుడు నవభారత నిర్మాణం దిశగా తన సృజనాత్మకతకు పదునుపెట్టాలన్నారు. ప్రముఖ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ సత్యేంద్రనాథ్ బోస్ 125వ జయంతి స్మారక ఉత్సవాల ప్రారంభం సందర్భంగా కోల్‌కతాలో ఏర్పాటుచేసిన కార్యక్రమం కోసం ఢిల్లీ నుంచి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. భారత శాస్త్రవేత్తలు, పరిశోధనకారులు తమ మేధస్సును దేశ ప్రజలకోసం, వారి సామాజిక–ఆర్థిక అవసరాల కోసం వినియోగించాలని పిలుపునిచ్చారు. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ‘మన యువతలో సైన్స్‌పై ఆసక్తిని, అభిరుచిని పెంచేందుకు సైన్స్ కమ్యూనికేషన్‌ను మరింత విస్తృతపరచాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం భాష అడ్డంకి కారాదు’ అని అన్నారు. ‘2018లో ప్రతి భారతీయుడు మన పూర్వీకులు కన్న నవభారత స్వప్నాన్ని నెరవేర్చేందుకు ప్రతినబూనాలి. 2018 సంవత్సరాన్ని వాటర్‌షెడ్ సంవత్సరంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించినందున శాస్త్రవేత్తలు ఈ దిశగా సృజనాత్మక అంశాలపై దృష్టిపెట్టాలి. విద్యాసంస్థలు, పరిశోధన–అభివృద్ధి సంస్థలు ఒకే వేదికపైకి రావటం ద్వారా పరిశోధన మరింత విజయవంతమయ్యేందుకు అవకాశం ఉంటుందన్నారు. భారత శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు దేశానికి గర్వకారణమన్న ప్రధాని.. ఇస్రో 100 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపినప్పుడు ప్రపంచమంతా ఆసక్తిగా గమనించిందన్నారు. నీరు, విద్యుత్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లో కొత్త ఆవిష్కరణలకోసం ఎదురుచూస్తున్నామన్నారు. బెంగాల్ పవిత్రమైన గడ్డపై వివిధ రంగాల ప్రముఖులు పుట్టారని మోదీ ప్రశంసించారు. ఆచార్య జేసీ బోస్, మేఘనాథ్ సాహా, ఎస్ఎన్ బోస్ వంటి మహామహులు జన్మించారని.. ఇప్పటికీ వీరి ప్రయోగాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. 1894, జనవరి 1న జన్మించిన భౌతిక శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్ 1920ల్లో క్వాంటమ్ మెకానిక్స్‌లో విశేషమైన ప్రయోగాలు చేశారు. రెండు ఉప కణాలను నిర్వచించే విషయంలో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌తో కలిసి విస్తృత పరిశోధనలు చేశారు. ఈ ప్రయోగంలో కనుగొన్న కణాలకు బోస్ పేరుతో ‘బోసాన్స్’గా పిలుస్తున్నారు. మన సైంటిస్టులే బెస్ట్: హర్షవర్ధన్ భారత శాస్త్రపరిశోధన సంస్థలు అందులో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు, పరిశోధకులు ప్రపంచంలోని ఉత్తమ జాబితాలో ఉన్నారని.. కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. సత్యేంద్రనాథ్ బోస్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి.. ప్రపంచ నానో టెక్నాలజీలో భారత్ మూడో స్థానంలో ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. -
దుమ్మురేపిన కోలకతా ఐఐఎం
కోల్‌కతా : దేశంలోని అతిపెద్ద కోలకతా ఐఐఎం విద్యార్థులు అత్యధిక అంతర్జాతీయ ప్యాకేజీలతో మరోసారి దుమ్ము రేపారు. మూడు రోజుల రిక్రూట్ మెంట్ ప్రక్రియలో మొత్తం 100 శాతం ప్లేస్‌మెంట్స్‌తో బీ స్కూల్ రికార్డు సృష్టించినట్టు యాజమాన్యం ప్రకటించింది. ఫిబ్రవరి రెండవ వారంలో మొత్తం 474 టాప్ జాబ్ లను సాధించినట్టు ఐఐఎం కలకత్తా ఒక ప్రకటనలో తెలిపింది . అలాగే 2017 పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ విద్యార్థులు ఈ ఏడాదికి అత్యధిక అంతర్జాతీయ ప్యాకేజీని అందుకున్నామన్నారు. రూ. 63 లక్షలు (90,000యూరోల) భారీ వేతన ఆఫర్ తమ విద్యార్థి సాధించినట్టు చెప్పారు. అలాగే దేశీయంగా అత్యధిక ప్యాకేజీ రూ.70లక్షల(సంవత్సరానికి)ని తెలిపారు. ఫైనాన్షియల్ సెక్టార్స్‌లో అత్యధికంగా 29 శాతం ఆఫర్లు వచ్చాయి. అవెందూస్, ఎడెల్వీస్, గోల్డ్‌మ్యాన్ సాచీ, హెఎస్ బీసీ టాప్ రిక్రూటర్లుగా నిలిచాయి. కన్సల్టింగ్ సెక్టార్ లో 22 శాతంతో రెండవస్థానంలో నిలచింది. ఈ రంగం లో యాక్సెంచర్, ఏటీ కీర్నే, బైన్, బీసీజీ అండ్ మెకిన్సే ఉన్నాయి. బీజీ, సికె బిర్లా, టీఏఎస్ లాంటి టాప్ జనరల్ మేనేజ్మెంట్ సంస్థలు 15శాతం నియమించుకున్నాయి. సేల్స్ అండ్ మార్కెటింగ్ 12శాతం హెచ్ యూఎల్, ఐటిసి, ప్రోక్టర్ అండ్గ్యాంబుల్, రెక్కిట్ బెంకైజెర్ వంటి సంస్థల ఉన్నాయి. వీటితోపాటుగా, అమెజాన్, విప్రో లాంటి ఇతర కామర్స్, ఐటి సంస్థలు కూడా 14శాతం విద్యార్థులను ఎంపిక చేసుకున్నట్టు బీ స్కూల్ వెల్లడించింది. -
గల్లీ క్రికెట్లో గాయపడిన గంగూలీ!
-
మళ్లీ బ్యాటు పట్టిన గంగూలీ!
కోల్‌కతా: క్రికెట్ నుంచి రిటైరయి.. ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మరీ తీరిక దొరికినప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు గంగూలీ ఏం చేస్తాడో తెలుసా? తన చిన్ననాటి జ్ఞాపకాల్లోకి దూరిపోతాడు. సరదాగా బ్యాటు పట్టుకొని గల్లీ క్రికెట్ ఆడుతాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి దాదా రిటైరయిపోయి అప్పుడే ఎనిమిదేళ్లు అవుతోంది. అయినా గంగూలీకి క్రికెట్ అంటే మక్కువ తగ్గలేదు. అందుకే ఈడెన్ గార్డెన్స్‌లోనే కాదు తీరిక దొరికితే ఉత్తర కోల్‌కతాలోని ఇరుకు సందుల్లోనూ దాదా క్రికెట్ ఆడుతూ కనిపిస్తాడు. తాజాగా ఇలాగే గల్లీ క్రికెట్ ఆడుతూ గంగూలీ కనిపించాడు. పిల్లలతో కలిసి దాదా ఆడిన ఈ గల్లీ క్రికెట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. గల్లీ క్రికెట్లోనూ గంగూలీ తన ట్రేడ్‌మార్క్ షాట్లు కొట్టాడు. ఇంతలో ఓ బాల్ దూసుకొచ్చి ఆయన భుజానికి గట్టిగా తాకింది. మామూలు టెన్నిస్ బంతి కావడంతో పెద్దగా గాయమేమీ కాలేదు. కాసేపు చేయి రాసుకొని మళ్లీ గంగూలీ క్రికెట్ కొనసాగించాడు. -
ఆ హైకోర్టులను ఇలా పిలవాలి..
న్యూఢిల్లీ: వలసవాద వాసనలను పూర్తిగా వదిలించుకునే క్రమంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బాంబే, కలకత్తా, మద్రాస్ హైకోర్టుల పేర్లను.. ముంబై, కోల్ కతా, చెన్నై హైకోర్టులుగా మార్చుతున్నట్లు తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో హైకోర్టుల పేర్ల మార్పులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాకు చెప్పారు. బ్రిటిష్ పాలనలో ఈ మూడు మహానగరాలకు స్థిరపడ్డ పేర్లను మార్చేసి బాంబేను ముంబై, కలకత్తాను కోల్ కతా, మద్రాస్ ను చెన్నైగా మార్చుతూ గత ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే నగరాలు పేర్లు మారినప్పటికీ హైకోర్టులకు మాత్రం పాత పేర్లే కొనసాగాయి. కోర్టుల పేర్లు కూడా మార్చాలని గతంలో పెద్ద ఎత్తున డిమాండ్ వెల్లువెత్తింది. దీనిపై సమగ్ర అధ్యయం అనంతరం రూపొందిన బిల్లు.. ఇటీవలే న్యాయశాఖ ఆమోదం పొందిందని, ఇప్పుడు కేబినెట్ కూడా ఓకే చెప్పిందని మంత్రి రవిశంకర్ తెలిపారు. భారతీయ హైకోర్టుల చట్టం (1861) ఆధారంగా కొత్త పేర్లు నిర్ధారించినట్లు పేర్కొన్నారు. -
ఆ నేడు 7 అక్టోబర్, 1950
వెలుగు దీపం ‘ఆహారం రుచిగా లేదని ఫిర్యాదు చేసేముందు- తినడానికి ఏమీ లేని పేదల గురించి ఆలోచించు’. తనకు అసౌకర్యంగా, బాధగా అనిపించినప్పుడు తన గురించి కాకుండా కోట్లాది మంది దీనుల గురించి ఆలోచించారు మదర్ థెరిసా. ఆ ఆలోచనే కలకత్తాలో ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ’గా రూపుదిద్దుకుంది. వేల కిలోమీటర్ల దూరమైనా...ఒక్క అడుగుతో మొదలైనట్లు 13 మంది సభ్యులతో ప్రారంభమైన ఈ సంస్థ ప్రపంచవ్యాప్తమైంది. ఆకలితో అలమటించేవాళ్లు, వ్యాధిగ్రస్తులు, పేదవాళ్లు, నిరాశ్రయులకు ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ’ వెలుగు దీపం అయింది. కలకు, ఆ కలను నిజం చేసుకునే వాస్తవానికి మధ్య దూరం ఉండొచ్చు. అది కొందరికి అగాధంలా కనబడవచ్చు. సంకల్పబలం ఉన్నవాళ్లకు అది సులభం కావచ్చు. ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ’ రాత్రికి రాత్రే పుట్టింది కాదు. ఆలోచన నుంచి ఆచరణ నుంచి, కష్టాల దారిలో నుంచి అంచెలంచెలుగా ఎదిగిన నిర్మాణాత్మక సేవాదృక్పథం. -
పసర్ షమీకి కూతురు
కోల్‌కతా: గాయం నుంచి కోలుకుంటున్న భారత క్రికెట్ జట్టు పేస్ బౌలర్ మొహమ్మద్ షమీకి రంజాన్ మాసం మరో శుభవార్తను తీసుకొచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం అతడి భార్య హసీన్ జహాన్... కూతురికి జన్మనిచ్చింది. ఇది వారికి తొలి సంతానం. తల్లీ కూతురు క్షేమంగా ఉన్నారని షమీ తెలిపాడు. గతేడాది జూన్‌లో షమీ వివాహం జరిగింది. ఇటీవల తన ఎడమ మోకాలికి శస్త్ర చికిత్స కావడంతో మూడు నెలలుగా షమీ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. -
నిలడకగా రాహుల్ ఘోష్ ఆరోగ్యం
కోల్‌కతా: స్థానిక లీగ్ మ్యాచ్‌లో తీవ్రంగా గాయపడిన కోల్‌కతా ఆటగాడు రాహుల్ ఘోష్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది. మంగళవారం జరిగిన బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) రెండో డివిజన్ లీగ్ మ్యాచ్‌లో తను గాయపడ్డాడు. పోలీస్ ఏసీ తరఫున ఆడిన తనకు చెవి కింది భాగంలో బంతి వేగంగా వచ్చి తగిలింది. అయితే అతను బాగానే కోలుకుంటున్నా పరిశీలన నిమిత్తం ఇంకా ఐసీయూలోనే ఉంచినట్టు డాక్టర్లు తెలిపారు. మరోసారి తీసిన సిటీ స్కాన్, ఎంఆర్ఐలో కూడా ఆందోళనకరంగా ఏమీ లేదని మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సవ్యసాచి సేన్ తెలిపారు. ఇప్పటికిప్పుడు డిశ్చార్జి మాత్రం చేయబోమని స్పష్టం చేశారు. -
కోల్ కతా కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కోల్ కతాలో నిర్మిస్తున్న కొత్త సచివాలయంలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సచివాలయంలో ఆకస్మికంగా మంటలు చెలరేగి భారీ ప్రమాదానికి దారి తీసింది. దీంతో 20 ఫైరింజన్లు సాయంతో అక్కడికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనకు షార్ట్ సర్క్యూటే ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తోట వైకుంఠంపై డాక్యుమెంటరీ
బోయినపల్లి : అంతర్జాతీయంగా పేరొందిన చిత్రకారుడు కరీంనగర్ జిల్లా బోరుునపల్లి మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన తోట వైకుంఠంపై కోల్‌కతాకు చెందిన ప్రముఖ చిత్రకారుడు పార్థూరాయ్ డాక్యుమెంటరీని రూపొందిస్తున్నారు. వైకుంఠంతో కలిసి ఆయన స్వగ్రామమైన బూరుగుపల్లి వచ్చిన పార్థూరాయ్ శుక్రవారం వరకు పలు సన్నివేశాలను చిత్రీకరించారు. వైకుంఠం చిత్రకారుడిగా రాణించడం వెనుక గ్రామీణ నేపథ్యం, కులవృత్తుల వారితో అనుబంధమే కీలకమైందని ఆయన చెబుతుంటారు. తన చిన్నతనంలో కమ్మరి కొలిమి, కుమ్మరి సార, నేతన్నల మగ్గం, గీతవృత్తి వంటి వాటితో స్ఫూర్తి పొంది పల్లె ప్రజల శ్రమైక జీవనమే నేపథ్యంగా ఎన్నో చిత్రాలు గీశారు. అలాగే చిన్నప్పుడు వైకుంఠం చిందుయక్షగానాన్ని అమితంగా ఇష్టపడేవారు. దీంతో గ్రామంలో చిందుకళాకారులు విరాటపర్వం నాటకాన్ని ప్రదర్శించారు. వీటన్నింటిని డాక్యుమెంటరీ రూపకల్పనలో భాగంగా చిత్రీకరించారు. ఈ డాక్యుమెంటరీని నాలుగు షెడ్యూళ్లలో పూర్తి చేయనున్నట్టు పార్థూరాయ్ తెలిపారు. మొదటి షెడ్యూల్ వైకుంఠం ప్రస్తుతం నివాసముంటున్న హైదరాబాద్‌లో చిత్రీకరించినట్లు చెప్పారు. రెండవ షెడ్యూల్‌ను బూరుగుపల్లిలో చిత్రీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. మూడవ షెడ్యూల్‌ను వైకుంఠం చిత్రకళ నేర్చుకున్న మహారాజ సయాజీరావు, యూనివర్సిటీ ఆఫ్ బరోడాలో తీయనున్నట్లు చెప్పారు. నాలుగవ షెడ్యూల్‌ను కోల్‌కతాలో మాభూమి చిత్ర దర్శకుడు గౌతంఘోష్తో వైకుంఠంకు ఉన్న అనుబంధంపై చిత్రీకరించనున్నట్లు ఆయన వివరించారు. మాభూమి చిత్రానికి ఆర్ట్ డెరైక్టర్‌గా పనిచేసిన వైకుంఠంకు జాతీయ ఉత్తమ ఆర్ట్ డెరైక్టర్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. 1942లో జన్మించిన వైకుంఠం 1960లో హైదరాబాద్ వెళ్లి స్థిరపడ్డారు. తాజాగా స్వగ్రామానికి వచ్చిన ఆయనకు స్థానికులు డప్పుచప్పుళ్లు, మేళతాళాలతో స్వాగతం పలికి ఊరేగింపు నిర్వహించారు. హోలీ సందర్భంగా రంగులు చల్లి తమ అభిమానాన్ని చాటుకున్నారు. -
సోమ్‌దేవ్ జంటకు డబుల్స్ టైటిల్
ఏటీపీ చాలెంజర్ టోర్నీ కోల్‌కతా: సింగిల్స్‌లో విఫలమైనప్పటికీ... డబుల్స్‌లో రాణించిన భారత టెన్నిస్ స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ కోల్‌కతా ఓపెన్‌లో టైటిల్ సాధించాడు. భారత్‌కే చెందిన తన భాగస్వామి జీవన్ నెదున్చెజియాన్తో జతకట్టిన సోమ్‌దేవ్‌కు ఫైనల్లో ఆడాల్సిన అవసరం రాలేదు. భారత జోడీతో తలపడాల్సిన జేమ్స్ డక్‌వర్త్-ల్యూక్ సావిల్లె (ఆస్ట్రేలియా) ద్వయం గాయం కారణంగా ‘వాకోవర్’ ఇచ్చింది. విజేతగా నిలిచిన సోమ్‌దేవ్ జంటకు 3,100 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. లక్షా 91 వేలు) లభించింది. అంతకుముందు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో రాడూ అల్బోట్ (మాల్దొవా) 7-6 (7/0), 6-1తో జేమ్స్ డక్‌వర్త్ (ఆస్ట్రేలియా)పై గెలిచి టైటిల్ దక్కించుకున్నాడు. -
ఈ క్రేజ్‌కు విలువెంత?
ఐఎస్ఎల్ సూపర్ సక్సెస్ జోష్‌లో ఉన్న భారత ఫుట్‌బాల్ నిరాటంకంగా కొనసాగేనా? ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)... క్రికెట్‌ను శ్వాసగా పీలుస్తున్న భారత్‌లో ఇప్పుడు ఓ సరికొత్త సంచలనం. ఐపీఎల్ సక్సెస్‌తో ఫుట్‌బాల్‌లోనూ ఓ లీగ్ ప్రారంభిస్తున్నారనగానే అంతటా ఆశ్చర్యం.. అసలు ఇది అయ్యే పనేనా..? ఇక్కడ ఫుట్‌బాల్‌ను ఎవరు చూస్తారు..? అనే వ్యాఖ్యలు వినిపించాయి. అయితే ఎవరూ ఊహించని రీతిలో ఐఎస్ఎల్ విజయఢంకా మోగించింది. భారత క్రీడాభిమానులకు మరో కోణాన్ని చూపించింది. ఈ దేశంలో ఫుట్‌బాల్‌కు ఉన్న ఆదరణ ఏమిటో లోకానికి చాటి చెప్పింది. ఎక్కడ మ్యాచ్ జరిగినా దాదాపుగా స్టేడియాలు పూర్తి స్థాయిలో నిండాయి. అంతేకాకుండా రెండు నెలలకు పైగా సాగినప్పటికీ చివరిదాకా ఏమాత్రం ఆదరణ కోల్పోకుండా సత్తా చూపించింది. అయితే ఇదే ఊపు భవిష్యత్‌లోనూ కొనసాగుతుందా? ఐపీఎల్ తరహాలోనే ఐఎస్ఎల్ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగుతుందా? ఈ సమాధానాలకు వేచి చూడాలి. న్యూఢిల్లీ: ఇప్పటిదాకా ఫుట్‌బాల్ అంటే కోల్‌కతా, గోవా, కొచ్చిలలో మాత్రమే ఆదరణ ఉంటుందని చాలామంది భావించారు. అయితే అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ ఈ క్రీడకు దేశ వ్యాప్తంగా ఆదరణ ఉందని ఇండియన్ సూపర్‌లీగ్ (ఐఎస్ఎల్) నిరూపించింది. ఓరకంగా దేశ క్రీడా సంస్కృతిని ఐఎస్ఎల్ మార్చిందనే చెప్పవచ్చు. ఠ అక్టోబర్ 12న ప్రారంభమైన ఈ లీగ్ డిసెంబర్ 20 వరకు కొనసాగింది. అసలు మనదేశంలో ఈ క్రీడకు ‘సోఫా స్పోర్ట్’ అని పేరు. ఎందుకంటే ఫుట్‌బాల్ అభిమానులు భారత్‌లో ఆడే మ్యాచ్‌లను స్టేడియానికి వెళ్లి చూసే బదులు ఇంట్లో టీవీల ముందు కూర్చుని యూరోపియన్ లీగ్‌ల గురించి మాట్లాడుకోవడం పరిపాటి. ఠ కానీ రెండు నెలలపాటు సాగిన ఐఎస్‌ఎల్‌ను స్టేడియాల్లో చూసిన సగటు అభిమానుల సంఖ్య 24,357. ఇది ఆసియాలో అత్యధికం. అంతేకాదు.. ఓవరాల్‌గా ప్రత్యక్ష ప్రేక్షకాదరణలో జర ్మనీకి చెందిన బుండెస్లిగా, ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్), లా లిగా (స్పెయిన్) తర్వాత స్థానంలో నిలిచి సత్తా చూపించింది. అసలు ప్రారంభ మ్యాచే 65 వేల మంది ప్రేక్షకుల మధ్య జరిగింది. చెన్నైయిన్, కేరళ సెమీస్ అయితే ఆన్లైన్లో 11 లక్షల మంది వీక్షించారు. బాలీవుడ్ నటులతోపాటు క్రికెటర్ల భాగస్వామ్యం కూడా ఈ లీగ్ సక్సెస్‌కు కారణమైందని చెప్పుకోవచ్చు. జాన్ అబ్రహం, అభిషేక్ బచ్చన్, హృతిక్ రోషన్‌లాంటి బాలీవుడ్ ప్రముఖ నటులు యజమానులుగా వ్యవహరించడం... సౌరవ్ గంగూలీ, ధోని, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లిలాంటి ఆటగాళ్లు భాగస్వామ్యాన్ని కలిగి ఉండడం దేశంలో ఈ లీగ్‌కు ఎనలేని ప్రాచుర్యం లభించింది. మనుగడ ఇలాగే సాగేనా..? అయితే ఇప్పటిదాకా అంతా బాగానే ఉంది కానీ భవిష్యత్‌లో ఐఎస్ఎల్ ప్రస్థానం ఎలా సాగుతుందనేది కూడా గమనించాల్సి ఉంది. ఎందుకంటే ఐపీఎల్ తరహాలోనే భారత్‌లో గతేడాది ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) ప్రారంభమైంది. అయితే ఈ ఏడాది ఆ లీగ్ జాడలేదు. వచ్చే ఏడాది జరిగేదీ? లేనిదీ? ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఇక హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) తొలి సీజన్‌కు వచ్చే ఏడాది జరుగబోయే మూడో సీజన్‌కు జట్లలో మార్పు వచ్చింది. కొన్ని ఫ్రాంచైజీలు లీగ్ నుంచి తప్పుకోగా మరికొన్ని కొత్తగా జత చేరాయి. ప్రొకబడ్డీ ఈ ఏడాదే ప్రారంభమై కాస్త ఆదరణ దక్కించుకుంది. చాంపియన్స్ టెన్నిస్ లీగ్, అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ కూడా ప్రస్తుతానికి ఫర్వాలేదనిపించాయి. అయితే ఐఎస్ఎల్ తొలి సీజన్ సూపర్ సక్సెస్ నిర్వాహకుల్లో అంతులేని ఆత్మవిశ్వాసాన్ని కలిగించిందనడంలో సందేహం లేదు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు స్థానం 170. ఇప్పుడు ఈ ఆదరణను సరిగ్గా వినియోగించుకుని మరింతమందిని ఈ క్రీడ వైపు ఆకర్షితులను చేస్తే కచ్చితంగా మన దేశానికి కూడా ఫుట్‌బాల్‌లో సముచిత స్థానం దక్కుతుంది. అలాగే ఈ విజయంతో ప్రపంచ క్రీడా మీడియా దృష్టి కూడా ఒక్కసారిగా భారత్‌పై పడింది. ఇక్కడ జరుగుతున్న ఫుట్‌బాల్ కార్యకలాపాలపై ఫోకస్ పెట్టనారంభించారు. ఇక ఐఎస్ఎల్ విజయంతో చిన్నారులు ఈ ఆట వైపునకు మొగ్గు చూపితే అది భారత క్రీడలకు బంగారు బాట వేసినట్టే అనుకోవాలి. ఢిల్లీ జట్టుకు ఫెయిర్ ప్లే అవార్డు న్యూఢిల్లీ: సెమీస్‌లో చోటు దక్కించుకోలేకపోయిన ఢిల్లీ డైనమోస్ ఎఫ్‌సీ జట్టు తమ ఆటతీరుకు మాత్రం ఐఎస్ఎల్ ఫెయిర్ ప్లే అవార్డు దక్కించుకుంది. ఢిల్లీ 77.6 పాయిం ట్లతో అందరికన్నా ముందు నిలిచింది. -
వరి దిగుబడిలో రెండో స్థానంలో తెలంగాణ
కోల్‌కతా సదస్సులో మంత్రి పోచారం సాక్షి, హైదరాబాద్: గత రెండేళ్లలో తెలంగాణ ప్రాంతం వరి దిగుబడిలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి గురువారం కోల్‌కతాలో ప్రారంభమైన వ్యవసాయు సదస్సులో పేర్కొన్నారు. ఇక్కడి రైతులు 2012-13లో హెక్టారుకు 3277 కిలోలు, 2013-14లో హెక్టారుకు 3302 కిలోల వరి దిగుబడి సాధించారని ఆయన వెల్లడించారు. ఇండియా ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్ ఆధ్వర్యంలో..‘వరి సాగు బలోపేతం, ఆహార భద్రత చర్యలు’ అంశంపై కోల్‌కతాలో ప్రారంభమైన రెండు రోజుల సదస్సుకు ప్రధాన భాగస్వామిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేశారు. కేంద్ర వ్యవసాయ మంత్రి రాధా మోహన్ సింగ్, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో పాటు పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ..వరి సాగుపై వాతావరణం కంటే రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలే ఎక్కువ ప్రభావం చూపుతాయన్నారు. రైతుగా తనకు ఈ విషయంపై అవగాహన ఉందన్నారు. తెలంగాణలో రైతు అనుకూల విధానాలను అమలు చేస్తున్నామన్నారు. -
గంగూలీ నామినేషన్ దాఖలు
కోల్‌కతా: భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇప్పుడు నేరుగా క్రికెట్ పరిపాలనా వ్యవహారాల్లో అడుగు పెట్టనున్నాడు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) ఎన్నికల్లో అతను సంయుక్త కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించి గంగూలీ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశాడు. బరీషా స్పోర్ట్స్ క్లబ్ కార్యదర్శిగా ప్రస్తుతం ‘క్యాబ్’లో సౌరవ్‌కు హోదా ఉంది. అసోసియేషన్లోకి దాదా ఆగమనాన్ని అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా స్వాగతించారు. అలాంటి వ్యక్తుల అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ నెల 27న క్యాబ్ ఎన్నికలు జరగనున్నాయి. -
మూడు పతకాలు గెలుస్తాం
సింగిల్స్‌లో ఎదురులేదు డబుల్స్‌లోనే పోటీ క్లిష్టం ‘కామన్వెల్త్’ బ్యాడ్మింటన్‌పై జ్వాల వ్యాఖ్య కోల్‌కతా: ‘కామన్వెల్త్ గేమ్స్’ బ్యాడ్మింటన్ ఈవెంట్లో భారత్ కనీసం మూడు పతకాలు గెలుస్తుందని డబుల్స్ స్టార్ గుత్తా జ్వాల ధీమా వ్యక్తం చేసింది. సింగిల్స్‌లో సైనా, సింధులకు ఎదురేలేదని... డబుల్స్‌లోనే పోటీ తీవ్రంగా ఉంటుందని డబుల్స్ డిఫెండింగ్ చాంపియన్ అయిన ఆమె వ్యాఖ్యానించింది. ఉబెర్ కప్‌లో రాణించిన అనుభవంతో గ్లాస్గోలోనూ ముందంజ వేస్తామని చెప్పింది. ఈసారి మిక్స్డ్ విభాగంలో ఆడటం లేదని తెలిపింది. స్కాట్లాండ్లోని గ్లాస్గో ఆతిథ్యమిచ్చే ఈ మెగా ఈవెంట్ కోసం భారత బ్యాడ్మింటన్ బృందం 19న అక్కడికి వెళ్లనుంది. 24 నుంచి పోటీలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఆమె మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించింది. సత్తాచాటుతాం గత ‘కామన్వెల్త్’లో నాలుగు పతకాలు గెలిచిన మేం... ఈసారి మూడు పతకాలు సాధిస్తాం. సింగిల్స్‌లో భారత క్రీడాకారిణిలకు ఎదురులేదు. సైనా, సింధులే ఫైనల్‌కు చేరుతారు. ఆటతీరు చూసినా ర్యాంకింగ్స్ పరంగా చూసినా వీరిద్దరిని ఓడించే సత్తా ఎవరికీ లేదు. కానీ డబుల్స్‌లోనే తీవ్రమైన పోటీ నెలకొంది. మలేసియా, ఇంగ్లిష్, సింగపూర్ క్రీడాకారులతో క్లిష్టమైన పోరు ఉంటుంది. అశ్విని బెస్ట్ ప్లేయర్ మహిళల డబుల్స్‌లో అశ్విని మేటి క్రీడాకారిణి. ప్రపంచ బెస్ట్ ప్లేయర్లలో ఆమె ఒకరు. స్మాష్‌లలో దిట్ట. తనదైన శైలిలో రాణిస్తుంది. ఆమెతో కలిసి ఆడటం అదృష్టం. మేమిద్దం మహిళల డబుల్స్ టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు పోరాడతాం. ఢిల్లీ అయినా, గ్లాస్గో అయినా పోటీలో మార్పేమీ ఉండదు. విదేశాల్లో గతంలోనూ గెలిచిన రికార్డు మాకుంది. సచిన్ తెలీదంటే వివాదమా రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవా తనకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తెలీదన్నంత మాత్రాన వివాదాస్పదం చేయడం తగదు. క్రికెట్ 12 దేశాలే ఆడతాయి. అదే టెన్నిస్ అయితే 200, బ్యాడ్మింటన్‌ను 150 దేశాలు ఆడతాయి. ఒక ఆట దిగ్గజం గురించి మరొకరి తెలియకపోతే ఏంటి? ఈ మాత్రానికే రాద్దాంతం చేయడం తగదు. -
పచ్చదనం వైపు మహిళల పయనం
పర్యావరణం ఇక్కడ సైకిళ్లతో కనిపిస్తున్న అమ్మాయిలను ‘గో గ్రీన్ గర్ల్స్’(జి.జి.జి) అని పిలుస్తున్నారు. గత రెండేళ్లలో 2,500 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణం చేసి పర్యావరణాన్ని రక్షించండంటూ పిలుపునిచ్చారు. కలకత్తా నుంచి కన్యాకుమారి వరకూ తమ పయనాన్ని కొనసాగించాలంటూ మొదలుపెట్టిన ఈ మహత్కార్యం ఇప్పటివరకూ ఎలాంటి ఆటంకాలూ లేకుండా విజయవంతంగా కొనసాగుతోంది. ‘ఉమెన్ ఎడ్వంచర్ నెట్వర్కింగ్ ఇన్ ఇండియా’ ఆధ్వర్యంలో సాగే ఈ సైకిల్ ప్రయాణంలో ఇరవై నుంచి యాభై ఏళ్ల వయసున్న మహిళలు పాల్గొంటున్నారు. ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులు, ఏదో రకంగా పచ్చదనాన్ని కాపాడుకోవాలనే తపన ఉన్నవారు ఇందులో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ‘‘మన కోసం మనం చేసే పనుల కన్నా ప్రకృతిని కాపాడుకోవడం కోసం చేసే పనుల్లో తృప్తి ఉంటుంది. ‘ఉమెన్ ఎడ్వంచర్ నెట్వర్కింగ్ ఇన్ ఇండియా’వారు ఎప్పుడైతే జిజిజి గురించి చెప్పారో వెంటనే సభ్యురాలిగా చేరిపోయాను. ఇప్పటివరకూ మా ప్రయాణంలో బోలెడన్ని అనుభవాలు ఎదురయ్యాయి. అందమైన పల్లెటూళ్లు, ఇరుకిరుకు పట్టణాలు, చెట్లూ చేమలు, చెత్తా చెదారం...అన్నింటిని దాటుకుంటూ మా సైకిల్ చక్రాలు పచ్చదనంపై ప్రచారం చేసుకుంటూ ముందుకుసాగాయి’’ అంటూ చెప్పుకొచ్చారు కలకత్తాకు చెందిన బంగీ జంప్ ప్లేయర్ రూప. ఆమెలాంటి చాలామంది జి.జి.జిలో ఉన్నారు. మహారాష్ట్రకు సంబంధించి ఎవరెస్ట్ ఎక్కిన మొదటి మహిళగా పేరుగాంచిన రైనా కూడా జిజిజిలో సభ్యురాలయ్యారు. చేరినప్పుడు చాలామంది ఆమెను ఆదర్శంగా తీసుకున్నారు. ‘‘ఈ ప్రయాణం ఇక్కడితో ఆగదు. ప్రస్తుతం 2,500కి.మీల దగ్గర మా సైకిల్ చక్రాలు తమ పయనాన్ని కొనసాగిస్తున్నాయి. కుటుంబాన్ని కాపాడుకోవడంతో మహిళ పాత్ర ఎంత ఉంటుందో...ఈ భూమిని కాపాడుకోవడంలో కూడా తన పాత్ర పెద్దదే అన్న విషయాన్ని ప్రతి ఒక్క మహిళా గ్రహించాలి. అందుకే కేవలం మహిళలు మాత్రమే ఇందులో పాల్గొనాలనే నిబంధన పెట్టాం’’ అని చెప్పారు రైనా. కేవలం సాహసాలు చేసే మహిళలే కాకుండా జిజిజిలో సాధారణ మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడానికి ముందుకు రావడం వెనక ఉమెన్ అడ్వెంచర్ నెట్వర్కింగ్ ఇన్ ఇండియా వారి కష్టం చాలా ఉంది. తోటి మహిళలకు ఆదర్శంగా ఉంటూ వారిని కూడా తమ బృందంలో చేర్చుకోడానికి ప్రత్యేక కౌన్సెలింగ్‌ల కార్యక్రమం కూడా చేపట్టారు. లేదంటే చదువులు మాని, ఉద్యోగాలకు సెలవులు పెట్టి ఈ సైక్లింగ్‌లో పాల్గొనడానికి అంత సులువుగా ముందుకు రారు కదా! ‘‘నాకు సైకిల్ తొక్కడం అంటే చాలా భయం. గో గ్రీన్ గర్ల్స్ గురించి తెలియగానే సైకిల్ నేర్చుకున్నాను’’ అని చెప్పారు 30 ఏళ్ల రిష్నా ఠాకూర్. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ప్రయాణించిన జిజిజి బృందానికి ప్రత్యేకంగా ఇన్ని కిలోమీటర్లని లక్ష్యమంటూ ఏమీ లేదు. కలకత్తా, తమిళనాడు, గుజరాత్, కేరళ, మహారాష్ట్రలలో ప్రయాణించిన గో గ్రీన్ గర్ల్స్ తమకెదురైన అనుభవాలను తోటివారితో సంతోషంగా పంచుకుంటున్నారు. పచ్చదనం గురించి వీలైనంత ప్రచారం చేస్తున్నారు. -
మండు వేసవిలో నిండు వినోదం
-
మండు వేసవిలో నిండు వినోదం
రాత్రి గం. 8 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం నేడు ముంబై x కోల్‌కతా ఓవైపు భానుడి భగభగలు... మరోవైపు ఎన్నికల వేడి... ఈ రెండింటితో పగలంతా ‘మండిపోయే’ సగటు భారతీయుడికి... పసందైన వినోదాన్ని అందించేందుకు రంగం సిద్ధమైంది. చుక్కలు చూపే ఎండలో క్రికెటర్ల పోరాటానికి తెరలేవనుంది. బుల్లెట్‌లాంటి బంతులు వేసే బౌలర్లు... వాయువేగంతో తిప్పికొట్టే బ్యాట్స్‌మెన్... గాలిలోనే గింగరాలు తిరుగుతూ అనితర సాధ్యం కాని క్యాచ్‌లు తీసుకునే ఫీల్డర్లు... ఓవరాల్‌గా తుపాను, సునామీలను మించిన బీభత్సం... ఇలా ఒక్కటేంటి... చెప్పడానికి, వినడానికి, చూడటానికి రెండు కళ్లు చాలవు. క్రికెట్‌ను ఎవరెస్టంత ఎత్తుకు తీసుకెళ్లిన ఐపీఎల్లో ఏడో ఎడిషన్‌కు నేడు తెరలేవనుంది. ధనాధన్ క్రికెట్లో రెప్పపాటు కాలంలో దూసుకుపోయే బౌండరీలు, సిక్సర్ల హోరు నేటి నుంచే... అబుదాబి: మలింగ యార్కర్ వేస్తే భారత అభిమాని ఆనందంతో ఎగిరిగంతేస్తాడు... డివిలియర్స్ కళ్లు చెదిరే సిక్సర్ కొడితే లంక ఆటగాళ్లు చప్పట్లు చరుస్తారు. కోహ్లి భారీ ఇన్నింగ్స్ ఆడితే గేల్ సంతోషంతో గంగ్నమ్ చేస్తాడు. ధోని వ్యూహాలకు ఆసీస్ ఆటగాళ్లు ఫిదా అయిపోతారు. అంతర్జాతీయ క్రికెట్లో రంకెలు వేసే మేటి క్రికెటర్లు కూడా ఈ లీగ్‌కు వచ్చేసరికి ఫ్రాంచైజీల కోసం అణువణువు ధార పోస్తారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్ ‘ఐపీఎల్’ మహిమ ఇది. అభిమానులను ఉర్రూతలూగించేందుకు ఐపీఎల్-7 సిద్ధమైంది. చిందులేసే ఛీర్ లీడర్స్... ఏడారి స్వర్గం అబుదాబిలో డిన్నర్లు... డిస్కోలు... పార్టీలు.. ఇలా ఆటను మించిన అందాలతో, ఆహ్లాదాన్ని మించిన పోరాటాలతో క్షణక్షణం అభిమానుల నరాలు తెగే ఉత్కంఠ... మరికొద్ది గంటల్లోనే... ఇక ఈ వేసవి సాయంత్రాలను ఆస్వాదించేందుకు సిద్ధంకండి..! మొదటి దశ యూఏఈలో... దేశవాళీ టోర్నీ అయిన ఐపీఎల్... షెడ్యూల్ ప్రకారం భారత్‌లోనే జరగాలి. కానీ దేశంలో నెలకొన్న ఎన్నికల హడావుడితో లీగ్‌కు తగినంత భద్రత ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో మొదటి దశ మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహిస్తున్నారు. నేటి నుంచి ఈనెల 30 వరకు అబుదాబి, షార్జా, దుబాయ్‌ల్లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. మే 2న మళ్లీ భారత్‌లో లీగ్ మొదలవుతుంది. అయితే ఇప్పటికే స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వివాదాలల్లో కూరుకుపోయిన ఐపీఎల్‌ను బుకీల అడ్డా యూఏ ఈలో నిర్వహించడం లీగ్ పాలక మండలికి కత్తిమీద సామే. ఎవరూ ఫేవరెట్స్ కారు..! టి20ల్లో ఒకే ఒక్క ఓవర్‌తో మ్యాచ్ తారుమారవుతుంది. గత ఆరు సీజన్లలో చాలా వరకు ఇలాగే జరిగింది. కొన్ని జట్లు ఫేవరెట్‌గా దిగినా లీగ్ దశలోనే వెనుదిరిగాయి. మరికొన్ని అండర్‌డాగ్స్‌గా దిగి సంచలనాలు సృష్టించాయి. అంచనాలు లేని ఆటగాళ్లు ఎంతో మంది ఈ లీగ్‌లో చరిత్ర సృష్టించారు. ఈసారి వేలంలో అన్ని ఫ్రాంచైజీలు ఆచితూచి ఆటగాళ్లను ఎంచుకున్నాయి. అన్ని అంశాల్లో సమతూకంగా ఉండేలా జట్టును ఎంపిక చేసుకున్నాయి. దీంతో ఎవర్నీ ఫేవరెట్‌గా చెప్పలేని పరిస్థితి. అయితే ఊహించని రీతిలో అమ్ముడుపోయిన యువరాజ్, పీటర్సన్, దినేశ్ కార్తీక్‌తో పాటు డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, గంభీర్ ఆటపై ఎక్కువ మంది దృష్టిసారించారు. టోర్నీకి ఊపు తెచ్చేలా తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్... పటిష్టమైన కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. రోహిత్ శర్మ నాయకత్వం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ పర్యవేక్షణలో ముంబై రెండోసారి టైటిల్‌పై గురిపెట్టింది. ఎక్కువ మంది పాత ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న ముంబై... మైక్ హస్సీ రాకతో మరింత బలోపేతమైంది. మరోవైపు గంభీర్, మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్‌లను కొనసాగించిన కోల్‌కతా కూడా మంచి సమతుల్యంతో ఉంది. అయితే గంభీర్, కలిస్, యూసుఫ్ పఠాన్‌లపై ఆ జట్టు బ్యాటింగ్ భారం ఆధారపడి ఉంది. ఏదేమైనా తమదైన రోజున ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించే సత్తా ఉన్న ఆటగాళ్లకు రెండు జట్లలో కొదువలేదు. కాబట్టి పోరు రసవత్తరం కానుంది. 47 ఏప్రిల్16 నుంచి జూన్ 1 వరకు 47 రోజుల పాటు టోర్నీ జరుగుతుంది 8 ఈ సీజన్లో పాల్గొంటున్న జట్లు రూ. 468 కోట్ల 10 లక్షలు ఈ ఒక్క సీజన్ కోసం ఐపీఎల్ జట్లు ఆటగాళ్ల కోసం ఖర్చు చేస్తున్న మొత్తం 13 భారత్,యూఏఈలో కలిపి వేదికలు 60 మొత్తం మ్యాచ్‌లు 40 భారత్‌లో మ్యాచ్‌లు 178 పాల్గొంటున్న ఆటగాళ్ల సంఖ్య -
కర్ణాటక ‘హ్యాట్రిక్’
విజయ్ హజారే ట్రోఫీ కైవసం ఆదుకున్న కరుణ్ నాయర్ ఫైనల్లో ఓడిన రైల్వేస్ కోల్‌కతా: దేశవాళీ టోర్నీల్లో కర్ణాటక జట్టు ఎదురులేకుండా దూసుకుపోతోంది. అద్భుత ప్రదర్శనతో ఈ ఏడాది వరుసగా మూడో టైటిల్‌ను తమ ఖాతాలో జమచేసుకుంది. ఇప్పటికే రంజీ, ఇరానీ ట్రోఫీ చాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు తాజాగా విజయ్ హజారే ట్రోఫీని దక్కించుకుని ‘హ్యాట్రిక్’ టైటిల్స్‌తో అదరగొట్టింది. ఈడెన్ గార్డెన్స్‌లో ఆదివారం రైల్వేస్‌తో ఆసక్తికరంగా జరిగిన ఫైనల్లో కర్ణాటక నాలుగు వికెట్ల తేడాతో నెగ్గింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రైల్వేస్‌ను అభిమన్యు మిథున్ (4/19) వణికించాడు. దీంతో 47.4 ఓవర్లలో 157 పరుగులకే కుప్పకూలింది. రైల్వేస్ తొలి 10 ఓవర్లలో కేవలం 20 పరుగులు మాత్రమే చేయగలిగింది. జొనాథన్ (57 బంతుల్లో 46; 3 ఫోర్లు) అర్నిందమ్ (67 బంతుల్లో 33; 3 ఫోర్లు) రాణిం చారు. కాజీ, ఉతప్పలకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం బరిలోకి దిగిన కర్ణాటక 43 ఓవర్లలో ఆరు వికెట్లకు 158 పరుగులు చేసి నెగ్గింది. అయితే ఈ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కర్ణాటక దారుణంగా తడబడింది. 47 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో 22 ఏళ్ల కరుణ్ నాయర్ (86 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు) అద్భుతంగా ఆడాడు. లోకేష్ రాహుల్ (72 బంతుల్లో 38; 4 ఫోర్లు)తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 66 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రాహుల్ వికెట్ పడిన తర్వాత నాయర్ మరింత జాగ్రత్తగా ఆడాడు. కునాల్ కపూర్ (45 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు)తో కలిసి మ్యాచ్‌ను ముగించాడు. కృష్ణకాంత్ ఉపాధ్యాయ్‌కు మూడు, అనురీత్ సింగ్‌కు రెండు వికెట్లు దక్కాయి. -
ఎవరికి వారు నిర్ణయించుకోవాలి
కోల్‌కతా: ప్రస్తుత భారత జట్టును మరింత మెరుగు పరిచేందుకు మాజీ ఆటగాళ్లు తమ వంతు పాత్ర నిర్వహించాలని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. అయితే వారికి అంత సమయం ఉందా అనేది ప్రశ్నార్థకమని అన్నాడు. ఫ్లెచర్ స్థానంలో రాహుల్ ద్రవిడ్‌ను కోచ్‌గా నియమించాలని ఇటీవల సునీల్ గవాస్కర్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ‘సచిన్, కుంబ్లే, ద్రవిడ్‌లాంటి ఆటగాళ్లు మనకున్నప్పుడు వారిని ఉపయోగించుకోవడంలో తప్పులేదు. అయితే ఈ కొత్త బాధ్యతను తీసుకోవడం వారికున్న సమయంపై ఆధారపడి ఉంటుంది. ఏడాదికి 11 నెలలు జట్టు కోసం కేటాయించే సమయం తన దగ్గర లేదని ద్రవిడ్ స్పష్టం చేసిన విషయాన్ని గమనించాలి. కోచ్ పదవి ఎంత కష్టమో వకార్‌ను అడిగితే తెలుస్తుంది’ అని దాదా తెలిపాడు. బెంగాల్ క్రికెట్ సంఘం చేపట్టిన విజన్-2020 ప్రణాళికలో భాగంగా వకార్ యూనిస్, మురళీధరన్ బెంగాల్ బౌలర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. -
టైటిల్ పోరుకు కర్ణాటక, రైల్వేస్
కోల్‌కతా: విజయ్ హజారే దేశవాళీ వన్డే టోర్నీలో కర్ణాటక, రైల్వేస్ జట్లు టైటిల్ పోరుకు చేరుకున్నాయి. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో కర్ణాటక 21 పరుగుల తేడాతో జార్ఖండ్‌పై... రైల్వేస్ 5 వికెట్ల తేడాతో బెంగాల్‌పై విజయం సాధించాయి. రాబిన్ ఉతప్ప (135 బంతుల్లో 133; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీతో చెలరేగడంతో తొలుత కర్ణాటక 50 ఓవర్లలో 6 వికెట్లకు 323 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన జార్ఖండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 302 పరుగులు చేసింది. ఇషాంక్ జగ్గీ (121 బంతుల్లో 141; 16 ఫోర్లు, 4 సిక్సర్లు), సౌరభ్ తివారీ (54 బంతుల్లో 47; 3 ఫోర్లు, 1 సిక్సర్) రాణించినా ప్రయోజనం లేకపోయింది. వినయ్ కుమార్ 4, మిథున్ 3 వికెట్లు తీశారు. ఉతప్పకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. రెండో సెమీస్‌లో మొదట బెంగాల్ 47.4 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటైంది. మనోజ్ తివారీ (61), గోస్వామి (38) మినహా మిగతా వారు విఫలమయ్యారు. తర్వాత రైల్వేస్ 38.2 ఓవర్లలో 5 వికెట్లకు 188 పరుగులు చేసింది. ఆదివారం జరిగే ఫైనల్లో కర్ణాటకతో రైల్వేస్ తలపడుతుంది. -
ప్రపంచకప్‌లో మన బౌలర్లు రాణిస్తారు!
యువరాజ్ సింగ్ ఆశాభావం కోల్‌కతా: ఇటీవల వన్డేల్లో భారత బౌలర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చకపోయినా... ప్రపంచకప్‌లో రాణిస్తారని సీనియర్ ఆటగాడు యువరాజ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. టి20 భిన్నమైన ఫార్మాట్ కాబట్టి వన్డే ప్రదర్శనతో పోల్చలేమని అన్నాడు. ‘వన్డేల్లో అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల కారణంగా మన బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేయలేకపోతున్నారు. అయితే టి20లు వేరు. కాబట్టి ప్రపంచకప్‌లో వారు ఆకట్టుకోగలరు’ అని యువీ చెప్పాడు. టి20 మ్యాచ్ ఆఖరి 5-10 ఓవర్లలో చెలరేగే ఆటగాళ్లు మన జట్టులో ఉన్నారని, తనతో పాటు ధోని, రైనా, రోహిత్, కోహ్లిలతో అద్భుతమైన బ్యాటింగ్ లైనప్ టీమిండియా సొంతమన్నాడు. యువరాజ్‌కు డోప్ పరీక్ష కోల్‌కతా: జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) బుధవారం క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు డోప్ పరీక్ష నిర్వహించింది. విజయ్ హజారే ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ అనంతరం యువీనుంచి ‘నాడా’ శాంపిల్ తీసుకుంది. ఈ పరీక్ష ఫలితాలను త్వరలో బీసీసీఐకి అందజేస్తారు. యువీతో పాటు రైల్వేస్ కెప్టెన్ మహేశ్ రావత్‌కు కూడా డోప్ పరీక్ష జరిపారు. -
షారుఖ్ X గంగూలీ
ఫుట్‌బాల్ జట్టు కోసం పోటీ కోల్‌కతా: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఫుట్‌బాల్ ఫ్రాంచైజీ కోసం పోటీపడుతున్నారు. కొత్తగా రాబోతున్న ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో కోల్‌కతా ఫ్రాంచైజీని దక్కించుకునేందుకు ఇద్దరూ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఈస్ట్ బెంగాల్, మోహన్ బగాన్ క్లబ్స్‌తో వీరు మాట్లాడినట్టు సమాచారం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సందర్భంగా వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు కెప్టెన్‌గా దాదా విఫలం కావడంతో ఆ స్థానం నుంచి తొలగించడమే కాకుండా వేలంలోనూ షారుఖ్ అతడిని కొనుగోలు చేయలేదు. ఆ తర్వాత గంగూలీ సహారా ఫుణే వారియర్స్ తరఫున ఆడాడు. ఇదే ఫ్రాంచైజీ కోసం ఐ-లీగ్ క్లబ్ మొహమ్మదన్ స్పోర్టింగ్ కూడా పోటీ పడుతోంది. వచ్చే వారం తమ పాలక మండలిలో ఈ విషయం చర్చిస్తామని క్లబ్ అధ్యక్షుడు సుల్తాన్ అహ్మద్ తెలిపారు. ఏప్రిల్ తొలి వారంలో బిడ్డింగ్ విజేతలను ప్రకటిస్తారు. -
సెమీస్‌లో సాకేత్, విష్ణు ద్వయాలు
కోల్‌కతా: ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు సాకేత్ మైనేని, విష్ణువర్ధన్‌లు తమ భాగస్వాములతో కలిసి సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో సాకేత్-సనమ్ సింగ్ (భారత్) జంట 6-3, 6-3తో లుకాస్ పౌలీ (ఫ్రాన్స్)-గో సొయెదా (జపాన్) జోడిని ఓడించగా... విష్ణువర్ధన్-దివిజ్ శరణ్ (భారత్) ద్వయం 6-3, 7-6 (7/4)తో సియెన్ యిన్ పెంగ్-సుంగ్ హువా యాంగ్ (చైనీస్ తైపీ) జోడిపై గెలిచింది. పురుషుల సింగిల్స్ విభాగంలో సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ (భారత్) క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టగా... యూకీ బాంబ్రీ (భారత్) ఓడిపోయాడు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో సోమ్‌దేవ్ 6-3, 6-3తో కుద్రయెత్సెవ్ (రష్యా)పై నెగ్గగా... యూకీ బాంబ్రీ 3-6, 4-6తో డాన్స్కాయ్ (రష్యా) చేతిలో ఓటమి పాలయ్యాడు. -
విజేత విష్ణువర్ధన్
కోల్‌కతా: జాతీయ గ్రాస్ కోర్టు టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో తమిళనాడుకు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ క్రీడాకారుడు విష్ణువర్ధన్ విజేతగా అవతరించాడు. శనివారం జరిగిన ఫైనల్లో రికార్డు స్థాయిలో 25 ఏస్‌లు సంధించిన విష్ణు 6-4, 7-6 (7/4) తేడాతో మోహిత్ మయూర్‌ను మట్టికరిపించాడు. 2009లో అషుతోష్ సింగ్ 11 ఏస్‌లతో ఈ టోర్నీ సాధించగా విష్ణు సరికొత్త రికార్డు సృష్టించాడు. మహిళల సింగిల్స్‌లో రష్మీ చక్రవర్తి (తమిళనాడు)ని ఓడించిన నటాషా (గోవా) కొత్త చాంపియన్‌గా నిలి చింది. పురుషుల డబుల్స్‌లో ఏపీ ఆటగాడు అశ్విన్ విజయరాఘవన్, రోనక్ మనూజా (మహారాష్ట్ర) 7-6(7/2), 6-4తో విజయ్ సుందర్ ప్రశాంత్, ఫరీజ్ (తమిళనాడు)పై గెలిచి టైటిల్ సాధించారు. మహిళల డబుల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి కాల్వ భువన తన భాగస్వామి రష్మీ చ క్రవర్తితో కలిసి టైటిల్ సాధించింది. ఫైనల్లో భువన-రష్మీ ద్వయం 6-2, 7-6 (7/4)తో నటాషా (గోవా)-నిధి చిలుముల (ఆంధ్రప్రదేశ్) జోడిని ఓడించింది. -
తుదిపోరుకు విష్ణువర్ధన్
కోల్‌కతా: జాతీయ గ్రాస్‌కోర్టు టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ టెన్నిస్ స్టార్ విష్ణువర్ధన్ టైటిల్ పోరుకు సిద్ధమయ్యాడు. మహిళల సింగిల్స్‌లో తెలుగమ్మాయిలు శ్రీవైష్ణవి పెద్దిరెడ్డి, కాల్వ భువనలకు సెమీఫైనల్లో చుక్కెదురైంది. ఈ టోర్నీలో తమిళనాడుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మూడో సీడ్ విష్ణు పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో 6-3, 6-2తో అశ్విన్ విజయరాఘవన్ (ఆంధ్రప్రదేశ్)పై గెలుపొందగా, రెండో సీడ్ మోహిత్ మయూర్ (తమిళనాడు) 6-4, 3-0 చంద్రిల్ సూద్ (ఉత్తరప్రదేశ్)పై నెగ్గాడు. రెండో సెట్లో 0-3తో వెనుకబడిన దశలో చంద్రిల్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఫైనల్లో మోహిత్‌తో విష్ణు తలపడతాడు. మహిళల సింగిల్స్ సెమీస్‌లో రష్మీ చక్రవర్తి (తమిళనాడు) 6-4, 4-6, 6-3తో శ్రీవైష్ణవిపై, రెండో సీడ్ నటాషా పల్హా (గోవా) 7-5, 5-7తో ఐదో సీడ్ భువనపై గెలుపొందారు. -
రంజీ సెమీస్‌లో బెంగాల్
కోల్‌కతా: రంజీ ట్రోఫీలో బెంగాల్ జట్టు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఇతర మూడు క్వార్టర్ ఫైనల్స్ ఫలితాలు నాలుగో రోజే ఖరారు కాగా... ఆఖరి క్వార్టర్ ఫైనల్ మాత్రం ఐదో రోజుకు సాగింది. 271 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆఖరి రోజు ఆదివారం రైల్వేస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 222 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా బెంగాల్ 48 పరుగుల తేడాతో నెగ్గింది. అరిందమ్ ఘోష్ (50) మినహా ఇతర ఆటగాళ్లు విఫలమయ్యారు. ఈ నెల 18 నుంచి 22 వరకు ఇండోర్‌లో జరిగే రెండో సెమీ ఫైనల్లో బెంగాల్, మహారాష్ట్రతో తలపడుతుంది. గెలిపించిన పేసర్లు... ఓవర్‌నైట్ స్కోరు 117/3తో ఉన్న రైల్వేస్... చేతిలో ఉన్న ఏడు వికెట్లతో చివరి రోజు విజయానికి మరో 154 పరుగులు చేయాల్సిన స్థితిలో బరిలోకి దిగింది. అయితే ఆరంభంలోనే భిల్లే (5)ను దిండా అవుట్ చేయడంతో జట్టు పతనం ప్రారంభమైంది. ఆ తర్వాత రావత్ (14)ను శుక్లా పెవిలియన్ పంపించాడు. మరో ఎండ్‌లో కొద్ది సేపు పోరాడిన ఘోష్ అర్ధ సెంచరీ పూర్తి కాగానే వెనుదిరగడంతో బెంగాల్ విజయం దాదాపు ఖాయమైంది. లంచ్ తర్వాత బెంగాల్ ఫీల్డర్లు ఏకంగా నాలుగు క్యాచ్‌లు వదిలేసినా అది గెలుపుపై ప్రభావం చూపలేదు. శుక్లాకు జరిమానా... స్లో ఓవర్ రేట్ కారణంగా బెంగాల్ కెప్టెన్ లక్ష్మీరతన్ శుక్లాపై రిఫరీ చర్య తీసుకున్నారు. అతని మ్యాచ్‌లో పూర్తిగా 100 శాతం, జట్టు సభ్యులకు 50 శాతం జరిమానాగా విధించారు. మహారాష్ట్రతో జరిగే సెమీస్ మ్యాచ్‌లో కూడా స్లో ఓవర్ రేట్ నమోదు చేస్తే శుక్లాపై తర్వాతి మ్యాచ్ ఆడకుండా నిషేధం పడుతుంది. -
బెంగాల్, రైల్వేస్ హోరాహోరీ
కోల్‌కతా: ఈడెన్ గార్డెన్స్‌లో బెంగాల్, రైల్వేస్ జట్ల మధ్య మరో క్వార్టర్స్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసేసరికి బెంగాల్ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 133 పరుగులు చేసింది. శుక్లా (63 బ్యాటింగ్), సాహా (30 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. ఓవరాల్‌గా బెంగాల్ ప్రస్తుతం 136 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 233/5 పరుగులతో ఆట ప్రారంభించిన రైల్వేస్ 314 పరుగులకు ఆలౌట్ కావడంతో బెంగాల్‌కు 3 పరుగుల ఆధిక్యం దక్కింది. అరిందమ్ ఘోష్ (97) సెంచరీ కో ల్పోగా...దిండా (6/105) రైల్వేస్‌ను నిలువరించాడు. కుప్పకూలిన ముంబై ముంబై: డిఫెండింగ్ చాంపియన్ ముంబై పేలవ ప్రదర్శన కనబర్చింది. మహారాష్ట్ర బౌలర్లు అనుపమ్ సంక్లేచా (4/57), శ్రీకాంత్ ముండే (3/26), సమద్ ఫలా (3/45) చెలరేగడంతో ముంబై రెండో ఇన్నింగ్స్‌లో 129 పరుగులకే కుప్పకూలింది. ఒక దశలో ఆ జట్టు 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. పవార్ (5), జాఫర్ (0), తారే (16), ఇందూల్కర్ (4), అభిషేక్ నాయర్ (0) విఫలమయ్యారు. అయితే సూర్యకుమార్ (33), షార్దుల్ ఠాకూర్ (33), ఇక్బాల్ అబ్దుల్లా (27) కొద్దిసేపు నిలబడటంతో ముంబై ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. తొలి ఇన్నింగ్స్‌లో 122 పరుగులు వెనుకబడిన మహారాష్ట్ర అనంతరం 252 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆట ముగిసేసరికి ఆ జట్టు వికెట్ కోల్పోయి 28 పరుగులు చేసింది. యూపీ లక్ష్యం 333 బెంగళూరు: మరో క్వార్టర్స్ మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ ముందు కర్ణాటక 333 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. దీనిని ఛేదించే క్రమంలో యూపీ ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ కోల్పోయి 55 పరుగులు చేసింది. అంతకుముందు కర్ణాటక రెండో ఇన్నింగ్స్‌లో 204 పరుగులకే ఆలౌటైంది. రాహుల్ (188 బంతుల్లో 92 నాటౌట్; 13 ఫోర్లు) రాణించాడు. ముర్తజా 6 వికెట్లు పడగొట్టాడు. జమ్మూకాశ్మీర్ విజయలక్ష్యం 324 వడోదర: రంజీ ట్రోఫీలో తొలిసారి సెమీ ఫైనల్‌కు చేరేందుకు జమ్మూ కాశ్మీర్ ముంగిట అరుదైన అవకాశం నిలిచింది. పంజాబ్‌తో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 324 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కాశ్మీర్ శుక్రవారం ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. ప్రస్తుతం హర్దీప్ (20 బ్యాటింగ్), ఇయాన్దేవ్ (17 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 15/2తో మూడో రోజు ఆట ప్రారంభించిన పంజాబ్ రెండో ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌటైంది. మన్దీప్ (151 బంతుల్లో 101; 14 ఫోర్లు), గుర్కీరత్ (77 బంతుల్లో 66; 9 ఫోర్లు, 1 సిక్స్) ఏడో వికెట్‌కు 113 పరుగులు జోడించారు. యువరాజ్ (58 బంతుల్లో 40; 6 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. పర్వేజ్ రసూల్ 58 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. బాల్ ట్యాంపరింగ్ వివాదంలో మురళీ కార్తీక్ మురళీ కార్తీక్‌పై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు వచ్చాయి. బెంగాల్ రెండో ఇన్నింగ్స్‌లో రైల్వేస్ కెప్టెన్ కార్తీక్ ట్యాంపరింగ్ చేశాడంటూ బ్యాట్స్‌మెన్ అంపైర్లకు ఫిర్యాదు చేశారు. దీంతో అంపైర్లు బంతిని పరిశీలించి కార్తీక్‌ను హెచ్చరించారు. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో బంతిని కూడా మార్చారు. లీగ్ దశలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌లో ‘మన్కడింగ్’తో వివాదానికి కారణమైన కార్తీక్‌పై బెంగాల్ అభిమానులు తమ అక్కసు చూపించారు. మెయిన్ గేట్ బయట ఉన్న ఫ్యాన్స్ కార్తీక్, పేసర్ అనురీత్ సింగ్‌లను చూస్తూ తిట్ల పురాణం లంకించుకున్నారు. గో బ్యాక్ కార్తీక్ అంటూ నినాదాలు చేశారు. స్టేడియంలో తగిన భద్రత కూడా లేకపోవడంతో ప్రేక్షకులకు అడ్డు లేకుండా పోయింది. ఒక దశలో అనురీత్ ఆగ్రహంతో ప్రేక్షకుల వైపు దూసుకొచ్చినా పోలీసులు నివారించి వారిని కారులో కూర్చోబెట్టారు. -
వివాదం పెరగొద్దనే రాజీనామా
కేంద్రం రాష్ట్రపతికి చేసిన సిఫార్సు అసమంజసం: గంగూలీ కోల్‌కతా: న్యాయ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీం కోర్టు మాజీ జడ్జి ఏకే గంగూలీ తాను పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల సంఘం(డబ్ల్యూబీహెచ్ఆర్సీ) చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు మంగళవారం ధ్రువీకరించారు. వివాదం మరింత పెరగకుండా నివారించేందుకే పదవి నుంచి తప్పుకున్నానన్నారు. గవర్నర్ ఎంకే నారాయణన్‌కు సోమవారం అందించిన తన రాజీనామా లేఖను ఆయన పీటీఐ వార్తాసంస్థకు ఫోన్లో చదివి వినిపించారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారామని పేర్కొన్నారు. తనను హెచ్ఆర్సీ చైర్మన్ పదవి నుంచి తప్పించాలని కేంద్రం రాష్ట్రపతికి చేసిన సిఫార్సు అనాలోచితం, అసమంజసం అని ఆరోపించారు. ‘నా కుటుంబ సభ్యుల సుఖశాంతుల కోసం, నేను నిర్వహించిన ఉన్నత పదవులపై గౌరవంతో రాజీనామా చేశాను. నన్ను విమర్శిస్తున్నవారిని ద్వేషించడం లేదు. వారి జీవితం బాగుండాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. గౌరవాభిమానాలతో పని చేసే పరిస్థితి లేనప్పుడు పదవిలో కొనసాగలేనని పేర్కొన్నారు. కాగా, గంగూలీ రాజీనామాను గవర్నర్ ఆమోదించి, రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారమిచ్చారని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. మరోవైపు, గంగూలీ రాజీనామా తనను బాధించిందని లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ పేర్కొన్నారు. ఆయన వాదనను సరిగ్గా వినలేదని, నేరం చేశారని రుజువు కాకుండానే ఆయన రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. -
సౌరవ్ గంగూలీ అకాడమీలపై నిషేధం
కోల్‌కతా: మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి చెందిన రెండు క్రికెట్ అకాడమీలపై బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) ఏడాది పాటు సస్పెన్షన్ విధించింది. తప్పుడు వయసు ధృవీకరణతో తమ అకాడమీకి చెందిన ఆటగాళ్లను వివిధ టోర్నీల్లో ఆడించడమే దీనికి కారణం. ఓవరాల్‌గా రాష్ట్రంలోని 13 అకాడమీలపై ఈ వేటు పడింది. ఇందులో బెంగాల్ జట్టు మాజీ కెప్టెన్ సంబరన్ బెనర్జీకి చెందిన రెండు అకాడమీలు కూడా ఉన్నాయి. 42 మంది ఆటగాళ్లపై రెండేళ్ల నిషేధం విధించింది. వయసు విభాగాల్లో జరిగే క్రికెట్ టోర్నీల్లో ఈ జాడ్యాన్ని అరికట్టేందుకు క్యాబ్ క్రికెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. మరోసారి ఇలాంటి తప్పులు చేస్తే చాలా కఠినంగా ఉంటామని, కోచింగ్ సెంటర్లపై జీవిత కాల నిషేధం, ఆటగాళ్లపై పదేళ్ల నిషేధం విధిస్తామని క్యాబ్ హెచ్చరించింది. -
రచయిత్రి తస్లీమా నస్రీన్ పై ఎఫ్ఐఆర్ నమోదు
లక్నో/కోల్‌కతా : బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. తమ మత విశ్వాసాలను కించపరిచేలా తస్లీమా ట్విట్టర్లో వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ మత గురువు హసన్ రజా ఖాన్ నూరి మియా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నవంబర్ 6వ తేదీన తస్లీమా ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలపై గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. మత గురువులపై ఆమె చేసిన వ్యాఖ్యలు ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని హసన్ రజా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తస్లీమా పాస్‌పోర్టును వెంటనే స్వాధీనం చేసుకుని, ఆమెను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా తనపై ఎఫ్ఐఆర్ నమోదయినట్టు తెలియడంతో దిగ్భ్రాంతికి గురయ్యానని తస్లీమా అన్నారు. తాను వాస్తవాలనే చెప్పానని ఆమె పేర్కొన్నారు. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేమిటో అర్థం కావడం లేదని, సత్యం మాట్లాడినందుకు మరోసారి తనకు ఇబ్బందులు తప్పడం లేదని ఢిల్లీలో మీడియాతో అన్నారు. భావప్రకటన స్వేచ్ఛ ఉన్న ప్రజాస్వామిక భారత దేశంలో ఇలాంటిది జరుగుతుందని అనుకోలేదని అన్నారు. గతంలో ఛాందసవాదులనుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆమెను అధికారులు కోల్‌కతానుంచి ఢిల్లీకి పంపించిన విషయం తెలిసిందే. -
ఆహా ఏమి రుచి!
కోల్‌కతా: మైదానంలో పరుగుల సునామీ సృష్టించే విండీస్ ఓపెనర్ క్రిస్ గేల్... భారతీయ వంటకాల రుచికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ‘చింగిడి మచర్ మలై కరీ (కొబ్బరి నీళ్లతో చేసిన రొయ్యల కూర)తో విందు ఆరగించిన అతను మిస్తీ డోయ్, రసగుల్లా తిని ఫిదా అయిపోయాడు. రెండో టెస్టు కోసం ముంబై బయలుదేరే ముందు సాల్ట్‌లేక్ రెస్టారెంట్‌కు భోజనానికి వచ్చిన గేల్‌కు ప్రఖ్యాత బెంగాలీ వంటకాలను రుచి చూపెట్టారు. ప్రత్యేకంగా తయారు చేసిన రొయ్యల కూరను ఫోర్క్, కత్తితో తినడానికి ప్రయత్నించి విఫలమైన ఈ ఆల్‌రౌండర్ తర్వాత చేత్తో సుష్టుగా ఆరగించాడు. ‘భారత్‌లో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇక్కడి ప్రజలు తింటున్నట్లు మనం కూడా ప్రయత్నించాలి’ అని సరదాగా వ్యాఖ్యానించాడు. బ్యాటింగ్ దిగ్గజం సచిన్‌కు కూడా చింగిడి మచర్ మలై కరీ అంటే చచ్చేంత ఇష్టం! -
రాణించిన గేల్, శామ్యూల్స్
కోల్‌కతా: ఉత్తరప్రదేశ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్ (48 బంతుల్లో 58; 11 ఫోర్లు), మార్లన్ శామ్యూల్స్ (47 బంతుల్లో 58; 9 ఫోర్లు; 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించగా చివరి రోజు శనివారం తమ రెండో ఇన్నింగ్స్‌లో 37 ఓవర్లలో ఐదు వికెట్లకు 199 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన గేల్ ఈసారి ఆకట్టుకున్నాడు. దినేశ్ రామ్‌దిన్ (53 బంతుల్లో 41; 5 ఫోర్లు; 1 సిక్స్) నిలకడగా ఆడాడు. పీయూష్ చావ్లాకు నాలుగు వికెట్లు దక్కాయి. అంతకుముందు 206/5 ఓవర్‌నైట్ స్కోరుతో తమ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన యూపీ 372/9 వద్ద డిక్లేర్డ్ చేసింది. పర్వీందర్ సింగ్ (112; 17 ఫోర్లు; 2 సిక్స్) శతకాన్ని సాధించాడు. ఆమిర్ ఖాన్ (128 బంతుల్లో 47; 7 ఫోర్లు), పీయూష్ చావ్లా (58 బంతుల్లో 46; 9 ఫోర్లు) చివర్లో రాణించారు. పెరుమాల్, కాట్రెల్ లకు మూడు, బెస్ట్‌కు రెండు వికెట్లు దక్కాయి. కాన్పూర్‌లో భారత్, విండీస్ మూడో వన్డే న్యూఢిల్లీ: భారత, వెస్టిండీస్ జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ కాన్పూర్‌లో జరుగనుంది. ‘ఈనెల 27న జరిగే వన్డే మ్యాచ్ వేదికను ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్‌కు కేటాయిస్తున్నట్టు బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ నాతో చెప్పారు’ అని బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా అన్నారు. -
కోల్‌కతాలో ‘సచిన్ కార్నివాల్’
కోల్‌కతా: సచిన్ టెండూల్కర్ చివరిసారిగా ఈడెన్ గార్డెన్స్‌లో ఆడనుండడంతో కోల్‌కతా అంతటా మాస్టర్ ఫీవర్ కొనసాగుతోంది. ఓరకంగా ఇక్కడ పండుగ వాతావరణం నెలకొంది. ఈనెల 6 నుంచి 10 వరకు వెస్టిండీస్‌తో తొలి టెస్టు జరుగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సచిన్‌ను ఏ రీతిన గౌరవించాలనే విషయంపై బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) ఓ జాబితాను రూపొందించింది. ఈ మ్యాచ్ కోసం భారత క్రికెటర్లు నగరానికి చేరుకున్నారు. ఆదివారం రాత్రి ముంబై నుంచి వచ్చిన మాస్టర్‌కు విమానాశ్రయంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. వారి మధ్య నుంచి సచిన్‌ను బయటకు తీసుకురావడానికి భద్రతా సిబ్బంది తంటాలుపడ్డారు. మ్యాచ్‌కు ముందు క్యాబ్ ఏర్పాటు చేద్దామనుకున్న విందును... ఆట మీద దృష్టి సారించేందుకు వీలుగా సచిన్ వద్దన్నాడు. కోల్‌కతాలో ఆదివారం కాళీ పూజ సందర్భంగా సచిన్ ఫొటోలతో అభిమానుల ప్రార్థన -
భారత్‌కు మరో మూడు పతకాలు
కోల్‌కతా: ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత ఆటగాళ్ల జోరు కొనసాగుతోంది. చైనీస్ తైపీలో జరుగుతున్న ఈ పోటీల్లో శుక్రవారం కాంపౌండ్ ఆర్చర్లు ఒక స్వర్ణం, రజతం, కాంస్యం సాధించారు. ఓవరాల్‌గా రెండు స్వర్ణాలు, రజతం, కాంస్యంతో భారత్ ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతోంది. మిక్స్డ్ డబుల్స్ టీమ్‌లో అభిషేక్ వర్మ, లిల్లీ చాను పౌనమ్ ఒక్క పాయింట్ తేడాతో ఇరాన్ జోడీని ఓడించి స్వర్ణాన్ని దక్కించుకున్నారు. వ్యక్తిగత విభాగంలో వర్మ 141-144 తేడాతో హమ్జే నెకోయి (ఇరాన్) చేతిలో ఓడి రజతంతో సంతృప్తి పడ్డాడు. సెమీస్‌లో ఓడిన సందీప్ కుమార్ 146-141తో చాన్‌చాయ్ వోంగ్ (థాయ్‌లాండ్)ను ఓడించి కాంస్యం సాధించాడు. నేటి (శనివారం)తో ముగిసే ఈ క్రీడల్లో రికర్వ్ విభాగంలో భారత్ బోణీ చేసే అవకాశాలున్నాయి. -
వెస్టిండీస్ 333/4
కోల్‌కతా: భారత పర్యటనను వెస్టిండీస్ ఆత్మవిశ్వాసంతో ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్‌తో గురువారం ఇక్కడ ప్రారంభమైన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆ జట్టు నిలకడగా ఆడుతోంది. నలుగురు బ్యాట్స్‌మెన్ అర్ధ సెంచరీలు సాధించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ 79 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 333 పరుగులు చేసింది. వెటరన్ ఆటగాడు చందర్‌పాల్ (130 బంతుల్లో 91 బ్యాటింగ్; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో పాటు దేవ్ నారాయణ్ (105 బంతుల్లో 83 బ్యాటింగ్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) క్రీజ్‌లో ఉన్నాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు ఇప్పటికే అభేద్యంగా 170 పరుగులు జోడించారు. కీరన్ పావెల్ (121 బంతుల్లో 64; 12 ఫోర్లు), డారెన్ బ్రేవో (79 బంతుల్లో 61; 12 ఫోర్లు) కూడా అర్ధ సెంచరీలు చేశారు. అంతకు ముందు వర్షం కారణంగా ఈ మ్యాచ్ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ (25 బంతుల్లో 18; 3 ఫోర్లు)తో పాటు శామ్యూల్స్ (12) విఫలమయ్యాడు. పేసర్ ఇంతియాజ్ అహ్మద్ ఈ ఇద్దరినీ అవుట్ చేయగా, ఆర్పీ సింగ్, ఆలమ్లకు ఒక్కో వికెట్ దక్కింది. -
విండీస్ ‘ఎక్స్ట్రా’ ప్రాక్టీస్
కోల్‌కతా: భారత్‌తో సిరీస్ నేపథ్యంలో వెస్టిండీస్ జట్టు ప్రాక్టీస్‌ను ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు నెట్ సెషన్లకే పరిమితమైన ఆటగాళ్లందరూ బుధవారం పూర్తిస్థాయిలో కసరత్తులు చేశారు. ఉదయం జాదవ్‌పూర్ యూనివర్సిటీ మైదానం చిత్తడిగా ఉండటంతో అక్కడికి దగ్గర్లో ఉన్న గంగూలీ అకాడమీలో ప్రాక్టీస్ చేశారు. మధ్యాహ్నం మళ్లీ స్టేడియానికి వచ్చిన క్రికెటర్లు దాదాపు రెండున్నర గంటలపాటు చెమటోడ్చారు. బౌలర్లు పేస్ బౌలింగ్‌పై ఎక్కువగా దృష్టిపెట్టి నెట్స్‌లో తీవ్రంగా సాధన చేశారు. 150వ టెస్టు ఆడుతున్న సీనియర్ ఆటగాడు చందర్‌పాల్ ‘ఎక్స్ట్రా’ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. మైదానం వెలుపల ఉన్న నెట్స్‌లో చాలాసేపు బ్యాటింగ్ చేస్తూ గడిపాడు. నేటి నుంచి యూపీసీఏతో ప్రాక్టీస్ మ్యాచ్ భారత్‌తో సిరీస్‌కు ముందు విండీస్‌కు ఒకే ఒక్క సన్నాహాక మ్యాచ్‌ను కేటాయించారు. అందులో భాగంగా నేటి నుంచి ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (యూపీసీఏ) జట్టుతో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. -
సంతోషంతో వెళ్లాలి... విజయంతో కాదు: గేల్
కోల్‌కతా: వెస్టిండీస్‌తో రెండు టెస్టులు గెలిచి మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌కు ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని టీమిండియాతో పాటు యావత్ భారతదేశం భావిస్తుంటే... కరీబియన్ జట్టు దాన్ని అడ్డుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మాస్టర్ సంతోషంగా రిటైర్కావాలిగానీ, విజయంతో కాదని డాషింగ్ బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్ అన్నాడు. ‘సచిన్ 200వ టెస్టు ముంబైలో ఆడనుండటం అద్భుతం. అక్కడి వాతావరణం, అభిమానుల ఉత్సాహం అమోఘంగా ఉంటుంది. భారత అభిమానులు క్రికెట్‌తోపాటు సచిన్‌కూ చాలా మద్దతిస్తారు. ఇప్పుడు ఈ అభిమానం రెట్టింపుకానుంది. విండీస్ కూడా సిరీస్‌పై దృష్టిపెట్టింది కాబట్టి మాస్టర్ వీడ్కోలును కాస్త పాడు చేసే అవకాశం ఉంది’ అని గేల్ వెల్లడించాడు. టెస్టుల్లో విండీస్ ప్రదర్శన ఏమిటో భారత్‌తో సిరీస్‌లో భయటపడుతుందన్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తామన్నాడు. భారత్‌పై ఇంతవరకు తాను సెంచరీ కొట్టలేదని ఈసారి ఆ వ్యక్తిగత ఘనతపై దృష్టిపెట్టానన్నాడు. ధోనిసేనపై రాణించడం తన కెరీర్‌కు కూడా మలుపు అవుతుందని గేల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రతి పరుగుకు కష్టపడాలి: రిచర్డ్సన్ ఈ సిరీస్‌లో సచిన్ ప్రతి పరుగును కష్టపడి సంపాదించుకోవాలని విండీస్ టీమ్ మేనేజర్ రిచీ రిచర్డ్సన్ అన్నారు. ‘ఓ అరుదైన టెస్టు సిరీస్‌కు మమ్మల్ని ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. ఈ సిరీస్‌లో ఆడేందుకు మా జట్టు మొత్తం చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తోంది. సిరీస్ గెలవడం లక్ష్యంగా పెట్టుకున్నాం. మాస్టర్‌ను పరుగులు చేయకుండా అడ్డుకుంటాం. ప్రతి పరుగును కష్టపడి సాధించుకోవాలి’ అని రిచర్డ్సన్ వ్యాఖ్యానించారు. -
టెండూల్కర్ ‘ఫేర్వెల్’
199 కిలోల ‘పూల వర్షం’ కోల్‌కతా: ఆకాశం నుంచి పూల వర్షం... ఎటు చూసినా సచిన్ కటౌట్లు.. స్టేడియంలో ఉన్న 70 వేల మందికి మాస్టర్ మాస్క్‌లు... ఇలా సచిన్ 199వ టెస్టు కోసం బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈడెన్‌లో మ్యాచ్‌ను చిరస్మరణీయంగా మలిచే ప్రణాళికలను వెల్లడించింది. సచిన్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆకాశం నుంచి 199 కేజీల గులాబీ పూల వర్షాన్ని కురిపించనున్నారు. అంతేకాదు టిక్కెట్‌తో పాటు 45 పేజీల ప్రత్యేక బుక్‌లెట్‌ను కూడా అందించనుంది. ఐదు రోజుల పాటు వందలాది సచిన్ కటౌట్లను స్టేడియంలో, ఫ్లడ్ లైట్స్ టవర్స్‌పైనా పెట్టనుంది. వచ్చే నెల 6 నుంచి 10 వరకు ఈ మ్యాచ్ జరుగుతుంది. అయితే 3 నుంచే కోల్‌కతా వీధుల్లో సచిన్ ప్రత్యేక విగ్రహాన్ని ఊరేగించనున్నారు. మాస్టర్ గౌరవార్థం ప్రత్యేక విందు ఇస్తున్నారు. దీనికి విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్, ఆసీస్ స్పిన్ గ్రేట్ షేన్ వార్న్‌లను ఆహ్వానించారు. మ్యాచ్ ముగిశాక బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తమ ప్రభుత్వం తరఫున మాస్టర్‌ను సన్మానించనుంది. -
సచిన్ ఫొటోతో టికెట్లు!
కోల్‌కతా: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఈడెన్ గార్డెన్స్‌లో ఆడనున్న 199వ టెస్టును మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు బెంగాల్ క్రికెట్ సంఘం ప్రయత్నాలు చేస్తోంది. దీంట్లో భాగంగా ఈ టెస్టు కోసం అమ్మే టిక్కెట్లపై సచిన్ ఫొటోను ముద్రించేందుకు అనుమతివ్వాల్సిందిగా బీసీసీఐని కోరనుంది. నవంబర్ 6 నుంచి 10 వరకు ఈ మ్యాచ్ జరుగుతుంది. ‘మామూలుగా అయితే టిక్కెట్లపై ఎవరి ఫొటోలను ముద్రించం. అయితే ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత ఉంది కాబట్టి ఈడెన్‌లో అతడాడిన ఇన్నింగ్స్ ఫొటోను ముద్రించేందుకు బోర్డును అనుమతి కోరనున్నాం. అనుమతి లభించాక ప్రింట్కు ఆర్డర్ ఇస్తాం. ఇది అభిమానులకు చిరకాలం జ్ఞాపకంగా ఉంటుంది’ అని క్యాబ్ కోశాధికారి విశ్వరూప్ డే అన్నారు. ‘క్రీడా శాఖతో కలిసి మాస్టర్ పనిచేయాలి’ న్యూఢిల్లీ: భారత దేశంలో క్రీడలు మరింత అభివృద్ధి సాధించేందుకు భవిష్యత్‌లో సచిన్ టెండూల్కర్ తమ శాఖతో కలిసి పనిచేస్తే బాగుంటుందని క్రీడల మంత్రి జితేంద్ర సింగ్ అభిప్రాయపడ్డారు. అతడి గౌరవార్థం త్వరలో సన్మాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసే ఆలోచన ఉందన్నారు. ‘మా శాఖ తరఫున మాస్టర్‌కు అవార్డు ఇవ్వనున్నాం. అభిమానిగా అతని చివరి టెస్టును ప్రత్యక్షంగా చూసేందుకు ప్రయత్నిస్తాను’ అని జితేంద్ర సింగ్ అన్నారు. -
మరికొన్నేళ్లు ఆడతా: యువరాజ్
కోల్‌కతా: సమస్యలతో పోరాడే తత్వం కలిగిన తాను మరి కొన్నేళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడగలననే ఆశాభావాన్ని డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ వ్యక్తపరిచాడు. తిరిగి జట్టులోకి రావడానికి చాలా కష్టపడ్డానని గుర్తుచేశాడు. ‘దేశం కోసం మరికొంత కాలం క్రికెట్‌ను ఆడగలననే అనుకుంటున్నాను. ఈ ఆటపై నాకున్న అమితమైన ప్రేమ వల్లే మళ్లీ జట్టులోకి రాగలిగాను. విండీస్ ‘ఎ’, చాలెంజర్స్ టోర్నీలో రాణించడంతో పాటు 200శాతం ఫిట్నెస్ కలిగి ఉండడం కూడా కలిసొచ్చింది. నేనెప్పుడూ ఓ పోరాట యోధుడినే. క్రికెట్ ద్వారా వచ్చిన ఈ గుణం కారణంగా క్యాన్సర్‌తో పోరాడగలిగాను. ఈ వ్యాధి నుంచి కోలుకోవడం జీవితాన్ని మార్చింది. ఇలా జరగాలంటే మనోశక్తితో పాటు గుండెధైర్యం ఉండాలి. మనతో మనమే పోరాడడం అంత సులువు కాదు’ అని స్థానికంగా జరిగిన క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న యువరాజ్ చెప్పాడు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా కూడా పాల్గొంది. -
పేస్, గంగూలీలకు జీవిత సాఫల్య పురస్కారం
కోల్‌కతా: టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్, మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీలకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందజేసింది. వీరితో పాటు వివిధ క్రీడాంశాల్లో రాణించిన బెంగాల్ క్రీడాకారులను ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఘనంగా సన్మానించారు. జీవితకాల సాఫల్య పురస్కార గ్రహీతలకు రూ. 5 లక్షల నగదు పారితోషికం ఇచ్చారు. పేస్ తరఫున అతని తండ్రి వేస్ పేస్ ఈ అవార్డు అందుకున్నారు. పేస్ ప్రస్తుతం థాయ్‌లాండ్ ఓపెన్‌లో ఆడుతున్నాడు. ప్రోత్సాహక బహుమతి పొందిన వారిలో యువ క్రికెటర్ మనోజ్ తివారీ ఉన్నాడు. ఇతనికి ‘ఖేల్ సమ్మాన్’ పురస్కారం లభించింది.