టెండూల్కర్ ‘ఫేర్‌వెల్’
199 కిలోల ‘పూల వర్షం’
కోల్‌కతా: ఆకాశం నుంచి పూల వర్షం... ఎటు చూసినా సచిన్ కటౌట్లు.. స్టేడియంలో ఉన్న 70 వేల మందికి మాస్టర్ మాస్క్‌లు... ఇలా సచిన్ 199వ టెస్టు కోసం బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈడెన్‌లో మ్యాచ్‌ను చిరస్మరణీయంగా మలిచే ప్రణాళికలను వెల్లడించింది. సచిన్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆకాశం నుంచి 199 కేజీల గులాబీ పూల వర్షాన్ని కురిపించనున్నారు.
అంతేకాదు టిక్కెట్‌తో పాటు 45 పేజీల ప్రత్యేక బుక్‌లెట్‌ను కూడా అందించనుంది. ఐదు రోజుల పాటు వందలాది సచిన్ కటౌట్‌లను స్టేడియంలో, ఫ్లడ్ లైట్స్ టవర్స్‌పైనా పెట్టనుంది. వచ్చే నెల 6 నుంచి 10 వరకు ఈ మ్యాచ్ జరుగుతుంది. అయితే 3 నుంచే కోల్‌కతా వీధుల్లో సచిన్ ప్రత్యేక విగ్రహాన్ని ఊరేగించనున్నారు. మాస్టర్ గౌరవార్థం ప్రత్యేక విందు ఇస్తున్నారు. దీనికి విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్, ఆసీస్ స్పిన్ గ్రేట్ షేన్ వార్న్‌లను ఆహ్వానించారు. మ్యాచ్ ముగిశాక బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తమ ప్రభుత్వం తరఫున మాస్టర్‌ను సన్మానించనుంది.