బెంగాల్, రైల్వేస్ హోరాహోరీ
కోల్‌కతా: ఈడెన్ గార్డెన్స్‌లో బెంగాల్, రైల్వేస్ జట్ల మధ్య మరో క్వార్టర్స్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసేసరికి బెంగాల్ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 133 పరుగులు చేసింది. శుక్లా (63 బ్యాటింగ్), సాహా (30 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. ఓవరాల్‌గా బెంగాల్ ప్రస్తుతం 136 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 233/5 పరుగులతో ఆట ప్రారంభించిన రైల్వేస్ 314 పరుగులకు ఆలౌట్ కావడంతో బెంగాల్‌కు 3 పరుగుల ఆధిక్యం దక్కింది. అరిందమ్ ఘోష్ (97) సెంచరీ కో ల్పోగా...దిండా (6/105) రైల్వేస్‌ను నిలువరించాడు.
కుప్పకూలిన ముంబై
ముంబై: డిఫెండింగ్ చాంపియన్ ముంబై పేలవ ప్రదర్శన కనబర్చింది. మహారాష్ట్ర బౌలర్లు అనుపమ్ సంక్లేచా (4/57), శ్రీకాంత్ ముండే (3/26), సమద్ ఫలా (3/45) చెలరేగడంతో ముంబై రెండో ఇన్నింగ్స్‌లో 129 పరుగులకే కుప్పకూలింది. ఒక దశలో ఆ జట్టు 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. పవార్ (5), జాఫర్ (0), తారే (16), ఇందూల్కర్ (4), అభిషేక్ నాయర్ (0) విఫలమయ్యారు. అయితే సూర్యకుమార్ (33), షార్దుల్ ఠాకూర్ (33), ఇక్బాల్ అబ్దుల్లా (27) కొద్దిసేపు నిలబడటంతో ముంబై ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. తొలి ఇన్నింగ్స్‌లో 122 పరుగులు వెనుకబడిన మహారాష్ట్ర అనంతరం 252 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆట ముగిసేసరికి ఆ జట్టు వికెట్ కోల్పోయి 28 పరుగులు చేసింది.
యూపీ లక్ష్యం 333
బెంగళూరు: మరో క్వార్టర్స్ మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ ముందు కర్ణాటక 333 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. దీనిని ఛేదించే క్రమంలో యూపీ ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ కోల్పోయి 55 పరుగులు చేసింది. అంతకుముందు కర్ణాటక రెండో ఇన్నింగ్స్‌లో 204 పరుగులకే ఆలౌటైంది. రాహుల్ (188 బంతుల్లో 92 నాటౌట్; 13 ఫోర్లు) రాణించాడు. ముర్తజా 6 వికెట్లు పడగొట్టాడు.
జమ్మూకాశ్మీర్ విజయలక్ష్యం 324
వడోదర: రంజీ ట్రోఫీలో తొలిసారి సెమీ ఫైనల్‌కు చేరేందుకు జమ్మూ కాశ్మీర్ ముంగిట అరుదైన అవకాశం నిలిచింది. పంజాబ్‌తో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 324 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కాశ్మీర్ శుక్రవారం ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. ప్రస్తుతం హర్దీప్ (20 బ్యాటింగ్), ఇయాన్‌దేవ్ (17 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 15/2తో మూడో రోజు ఆట ప్రారంభించిన పంజాబ్ రెండో ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌటైంది. మన్‌దీప్ (151 బంతుల్లో 101; 14 ఫోర్లు), గుర్‌కీరత్ (77 బంతుల్లో 66; 9 ఫోర్లు, 1 సిక్స్) ఏడో వికెట్‌కు 113 పరుగులు జోడించారు. యువరాజ్ (58 బంతుల్లో 40; 6 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. పర్వేజ్ రసూల్ 58 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు.
బాల్ ట్యాంపరింగ్ వివాదంలో మురళీ కార్తీక్
మురళీ కార్తీక్‌పై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు వచ్చాయి. బెంగాల్ రెండో ఇన్నింగ్స్‌లో రైల్వేస్ కెప్టెన్ కార్తీక్ ట్యాంపరింగ్ చేశాడంటూ బ్యాట్స్‌మెన్ అంపైర్లకు ఫిర్యాదు చేశారు. దీంతో అంపైర్లు బంతిని పరిశీలించి కార్తీక్‌ను హెచ్చరించారు. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో బంతిని కూడా మార్చారు. లీగ్ దశలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌లో ‘మన్కడింగ్’తో వివాదానికి కారణమైన కార్తీక్‌పై బెంగాల్ అభిమానులు తమ అక్కసు చూపించారు. మెయిన్ గేట్ బయట ఉన్న ఫ్యాన్స్ కార్తీక్, పేసర్ అనురీత్ సింగ్‌లను చూస్తూ తిట్ల పురాణం లంకించుకున్నారు. గో బ్యాక్ కార్తీక్ అంటూ నినాదాలు చేశారు. స్టేడియంలో తగిన భద్రత కూడా లేకపోవడంతో ప్రేక్షకులకు అడ్డు లేకుండా పోయింది. ఒక దశలో అనురీత్ ఆగ్రహంతో ప్రేక్షకుల వైపు దూసుకొచ్చినా పోలీసులు నివారించి వారిని కారులో కూర్చోబెట్టారు.