రంజీ సెమీస్‌లో బెంగాల్
కోల్‌కతా: రంజీ ట్రోఫీలో బెంగాల్ జట్టు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఇతర మూడు క్వార్టర్ ఫైనల్స్ ఫలితాలు నాలుగో రోజే ఖరారు కాగా... ఆఖరి క్వార్టర్ ఫైనల్ మాత్రం ఐదో రోజుకు సాగింది. 271 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆఖరి రోజు ఆదివారం రైల్వేస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 222 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా బెంగాల్ 48 పరుగుల తేడాతో నెగ్గింది. అరిందమ్ ఘోష్ (50) మినహా ఇతర ఆటగాళ్లు విఫలమయ్యారు. ఈ నెల 18 నుంచి 22 వరకు ఇండోర్‌లో జరిగే రెండో సెమీ ఫైనల్లో బెంగాల్, మహారాష్ట్రతో తలపడుతుంది.
గెలిపించిన పేసర్లు...
ఓవర్‌నైట్ స్కోరు 117/3తో ఉన్న రైల్వేస్... చేతిలో ఉన్న ఏడు వికెట్లతో చివరి రోజు విజయానికి మరో 154 పరుగులు చేయాల్సిన స్థితిలో బరిలోకి దిగింది. అయితే ఆరంభంలోనే భిల్లే (5)ను దిండా అవుట్ చేయడంతో జట్టు పతనం ప్రారంభమైంది. ఆ తర్వాత రావత్ (14)ను శుక్లా పెవిలియన్ పంపించాడు. మరో ఎండ్‌లో కొద్ది సేపు పోరాడిన ఘోష్ అర్ధ సెంచరీ పూర్తి కాగానే వెనుదిరగడంతో బెంగాల్ విజయం దాదాపు ఖాయమైంది. లంచ్ తర్వాత బెంగాల్ ఫీల్డర్లు ఏకంగా నాలుగు క్యాచ్‌లు వదిలేసినా అది గెలుపుపై ప్రభావం చూపలేదు.
శుక్లాకు జరిమానా...
స్లో ఓవర్ రేట్ కారణంగా బెంగాల్ కెప్టెన్ లక్ష్మీరతన్ శుక్లాపై రిఫరీ చర్య తీసుకున్నారు. అతని మ్యాచ్‌లో పూర్తిగా 100 శాతం, జట్టు సభ్యులకు 50 శాతం జరిమానాగా విధించారు. మహారాష్ట్రతో జరిగే సెమీస్ మ్యాచ్‌లో కూడా స్లో ఓవర్ రేట్ నమోదు చేస్తే శుక్లాపై తర్వాతి మ్యాచ్ ఆడకుండా నిషేధం పడుతుంది.