వరి దిగుబడిలో రెండో స్థానంలో తెలంగాణ
కోల్‌కతా సదస్సులో మంత్రి పోచారం
సాక్షి, హైదరాబాద్: గత రెండేళ్లలో తెలంగాణ ప్రాంతం వరి దిగుబడిలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి గురువారం కోల్‌కతాలో ప్రారంభమైన వ్యవసాయు సదస్సులో పేర్కొన్నారు. ఇక్కడి రైతులు 2012-13లో హెక్టారుకు 3277 కిలోలు, 2013-14లో హెక్టారుకు 3302 కిలోల వరి దిగుబడి సాధించారని ఆయన వెల్లడించారు.
ఇండియా ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్ ఆధ్వర్యంలో..‘వరి సాగు బలోపేతం, ఆహార భద్రత చర్యలు’ అంశంపై కోల్‌కతాలో ప్రారంభమైన రెండు రోజుల సదస్సుకు ప్రధాన భాగస్వామిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేశారు. కేంద్ర వ్యవసాయ మంత్రి రాధా మోహన్ సింగ్, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో పాటు పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ..వరి సాగుపై వాతావరణం కంటే రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలే ఎక్కువ ప్రభావం చూపుతాయన్నారు. రైతుగా తనకు ఈ విషయంపై అవగాహన ఉందన్నారు. తెలంగాణలో రైతు అనుకూల విధానాలను అమలు చేస్తున్నామన్నారు.