ఢిల్లీలో రాష్ట్రపతి కోవింద్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్న మోదీ
కోల్‌కతా: శాస్త్ర సాంకేతికాంశాలను విస్తృతపరిచేందుకు వ్యవహారిక భాష వినియోగం పెరగాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని యువతలోనూ సైన్స్‌పై ఆసక్తి పెరుగుతుందన్నారు. భాష ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకునేందుకు అడ్డంకి కారాదన్నారు. ప్రతి శాస్త్రవేత్త, పరిశోధనకారుడు నవభారత నిర్మాణం దిశగా తన సృజనాత్మకతకు పదునుపెట్టాలన్నారు. ప్రముఖ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ సత్యేంద్రనాథ్ బోస్ 125వ జయంతి స్మారక ఉత్సవాల ప్రారంభం సందర్భంగా కోల్‌కతాలో ఏర్పాటుచేసిన కార్యక్రమం కోసం ఢిల్లీ నుంచి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.
భారత శాస్త్రవేత్తలు, పరిశోధనకారులు తమ మేధస్సును దేశ ప్రజలకోసం, వారి సామాజిక–ఆర్థిక అవసరాల కోసం వినియోగించాలని పిలుపునిచ్చారు. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ‘మన యువతలో సైన్స్‌పై ఆసక్తిని, అభిరుచిని పెంచేందుకు సైన్స్ కమ్యూనికేషన్‌ను మరింత విస్తృతపరచాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం భాష అడ్డంకి కారాదు’ అని అన్నారు. ‘2018లో ప్రతి భారతీయుడు మన పూర్వీకులు కన్న నవభారత స్వప్నాన్ని నెరవేర్చేందుకు ప్రతినబూనాలి. 2018 సంవత్సరాన్ని వాటర్‌షెడ్ సంవత్సరంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించినందున శాస్త్రవేత్తలు ఈ దిశగా సృజనాత్మక అంశాలపై దృష్టిపెట్టాలి. విద్యాసంస్థలు, పరిశోధన–అభివృద్ధి సంస్థలు ఒకే వేదికపైకి రావటం ద్వారా పరిశోధన మరింత విజయవంతమయ్యేందుకు అవకాశం ఉంటుందన్నారు.
భారత శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు దేశానికి గర్వకారణమన్న ప్రధాని.. ఇస్రో 100 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపినప్పుడు ప్రపంచమంతా ఆసక్తిగా గమనించిందన్నారు. నీరు, విద్యుత్, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లో కొత్త ఆవిష్కరణలకోసం ఎదురుచూస్తున్నామన్నారు. బెంగాల్ పవిత్రమైన గడ్డపై వివిధ రంగాల ప్రముఖులు పుట్టారని మోదీ ప్రశంసించారు. ఆచార్య జేసీ బోస్, మేఘనాథ్ సాహా, ఎస్‌ఎన్ బోస్ వంటి మహామహులు జన్మించారని.. ఇప్పటికీ వీరి ప్రయోగాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. 1894, జనవరి 1న జన్మించిన భౌతిక శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్ 1920ల్లో క్వాంటమ్ మెకానిక్స్‌లో విశేషమైన ప్రయోగాలు చేశారు. రెండు ఉప కణాలను నిర్వచించే విషయంలో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌తో కలిసి విస్తృత పరిశోధనలు చేశారు. ఈ ప్రయోగంలో కనుగొన్న కణాలకు బోస్ పేరుతో ‘బోసాన్స్’గా పిలుస్తున్నారు.
మన సైంటిస్టులే బెస్ట్: హర్షవర్ధన్
భారత శాస్త్రపరిశోధన సంస్థలు అందులో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు, పరిశోధకులు ప్రపంచంలోని ఉత్తమ జాబితాలో ఉన్నారని.. కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. సత్యేంద్రనాథ్ బోస్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి.. ప్రపంచ నానో టెక్నాలజీలో భారత్ మూడో స్థానంలో ఉన్న విషయాన్ని గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment