సవాళ్లను ఎదుర్కొనే ‘ఇంప్రింట్’
ప్రాజెక్టును ఆవిష్కరించిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ: దేశంలోని అత్యున్నత విద్యాసంస్థల సంయుక్త ప్రాజెక్టు అయిన ‘ఇంప్రింట్ ఇండియా’ను రాష్ట్రపతి ప్రణబ్ ఆవిష్కరించారు. ఇంజనీరింగ్, సాంకేతిక రంగాల్లో ఎదురవుతున్న పెద్ద సవాళ్లను అధిగమించేందుకు అవసరమైన పరిశోధనలకు రోడ్‌మ్యాప్ రూపొందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. గురువారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రణబ్ మాట్లాడుతూ, తరగతి గదులు, గ్రేడ్‌లకు అతీతంగా విద్యార్థుల్లో ఊహాశక్తిని పెంపొందించాలంటే వారిలో సైంటిఫిక్ టెంపర్‌ను పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు.
ప్రణబ్‌పై మోదీ ప్రశంసలు
రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీలో ఒక విశ్వవిద్యాలయం దాగుందని ప్రధాని కితాబిచ్చారు. తనకున్న అనంతమైన విజ్ఞానంతో దేశానికి ఒక విద్యా భాండాగారంగా మారారన్నారు. ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ, ‘మన రాష్ట్రపతిలో ఒక యూనివర్సిటీ దాగుంది. ఆయనకు మహాసముద్రమంత విజ్ఞానముంది’ అని ప్రశంసించారు. మీకు లభించిన అతిపెద్ద ప్రయోజనమేంటని ఎవరైనా ప్రశ్నిస్తే.. ఆయనకు దగ్గరయ్యేందుకు మంచి అవకాశం దొరకడమే అని చెబుతానన్నారు.
కాలంచెల్లిన సిలబస్: సీఎన్‌ఆర్ రావు
దేశంలోని 90 శాతం యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలు కాలంచెల్లిన సిలబస్‌తో ఉన్నాయని ప్రముఖ శాస్త్రవేత్త, భారతరత్న అవార్డు గ్రహీత సీఎన్‌ఆర్ రావు ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే ప్రపంచంలోని ఉత్తమ సంస్థలతో పోటీపడలేకపోతున్నాయన్నారు. మన హైటెక్ తరగతి గదుల్లో బోధించే సబ్జెక్టులో ఎలాంటి మెరుగుదల లేదని చెప్పారు.