language literature
-
కేశమహిమ
జీవితంలో అప్రధానంగా కనిపించే విషయాలకు కూడా వాటి ప్రాధాన్యం వాటికి ఉంటుంది. ఇందుకు తిరుగులేని ఉదాహరణ జుట్టు. మన భాషా సాహిత్యాలను కొంచెం తరచి చూస్తే, జుట్టుకు ఉన్న ప్రాశస్త్యం అర్థమవుతుంది. జుట్టు చుట్టూ జరిగే వ్యాపారాలను కాస్త నిశితంగా గమనిస్తే,ఎంతటి వారైనా ‘జుట్టే కదా’ అని కేశపాశాలను వెంట్రుక ముక్కలా తీసి పారేయలేరు. అదీ కేశ మహిమ! అందమైన కేశాలు నిండుగా తలమీద ఉండటం వల్లనే శ్రీమహావిష్ణువుకు కేశవుడనే పేరు వచ్చింది. ఆదిభిక్షువే అయినా, పరమశివుడు కేశసంపదలో తక్కువ వాడేమీ కాదు, ఆయన జటాజూటధారి! ఆయన తన జటాజూటంలో గంగను బంధించాడు కాబట్టి గంగను శిరోజతీర్థం అని అంటారు. తలవెంట్రుకలకు గల పురాణ ప్రశస్తికి ఇవి కొన్ని మచ్చుతునకలు మాత్రమే! జుట్టును అల్లుకున్న జాతీయాలు, సామెతలు దాదాపు అన్ని భాషల్లోనూ ఉన్నాయి. ‘ఫలిత కేశాలు ముదిమికి సంకేతాలే గాని, జ్ఞానానికి కాదు’ అని ఇంగ్లిష్ సామెత. ఇది తలపండితులకు చక్కగా వర్తిస్తుంది. ‘తలలు బోడులైన తలపులు బోడులా’ అనే సామెత మనకు ఉండనే ఉంది. ‘అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకోవడం’ కూడా మన నుడికారంలో భాగమే! కొందరు బతకనేర్పరులు ఈ విద్యలో బాగా ఆరితేరి ఉంటారు. ‘జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టినా అందమే’ అని నానుడి. ఇటీవల ఏపుగా జుట్టు పెంచుకోవడానికి హైదరాబాద్‌లో ఒక మహిళ బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది. బ్యూటీపార్లర్ చికిత్సతో ఆమెకు ఉన్న జుట్టు కూడా ఊడిపోయింది. ఇలా ఉంటాయి కేశక్లేశాలు! ‘కాళ్లు్ల వంకరగా ఉన్నప్పుడు నెత్తి మీద వెంట్రుకలు తిన్నగా ఉండి లాభమేంటి?’ అని రష్యన్ సామెత. ‘ప్రతి మనిషి పొద్దున్నే తలదువ్వుకున్నట్లు మనసు దువ్వుకోరెందుకో?’ అని చైనీస్ సామెత. మనుషులకు శిరోజాలంకరణ మీద ఉన్న శ్రద్ధ మనోలంకరణ మీద ఉన్నట్లయితే, ఈ ప్రపంచం ఎప్పుడో బాగుపడిపోయేది! మన పూర్వకవులు మరాళకుంతలలైన నీలవేణుల సౌందర్యాన్ని ఇతోధికంగా వర్ణించారు. ‘ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై నంశోత్తరీయంబుపై...’ పద్యంలో పోతనామాత్యుడు శ్రీమహా విష్ణువు కరవైభవాన్ని వర్ణించడానికి లక్ష్మీదేవి కొప్పునే ఆశ్రయించాల్సి వచ్చింది. ‘అంభోజతాక్షి వేణిన్ హరువు గనిన రోమాతి సౌభాగ్యమెంతే... చమిరి యొనరుపన్ చక్కనౌ తీవెయోనాన్’ అంటూ కొప్పరపు కవులు ఒక అవధానంలో వేణీసౌందర్యాన్ని వర్ణించారు. ‘కలుగక యిచ్చెడు మనుజులు/ తలవెండ్రుకలంత మంది తర్కింపంగా/ కలిగియు నీయని యధములు/ మొల వెండ్రుకలంత మంది మోహన రంగా’ అని ఒక పూర్వకవి సంపన్న లోభుల మీద కసిదీరా తన అక్కసును వెళ్లగక్కాడు. తల మీది వెంట్రుకలకే కాదు, పురుషుల మీసాలకు, గడ్డాలకు కూడా మన భాషా సాహిత్యాల్లో తగిన ప్రశస్తి ఉంది. మీసాలను పౌరుష చిహ్నాలుగా గుర్తిస్తారు. అందుకే ‘మీసము పస మగ మూతికి’ అన్నాడు చౌడప్ప. వైదికులకు మీసాలు పెంచే ఆచారం లేకపోయినా, తిరుపతి వేంకట కవులు మీసాలను పెంచారు. ఈ జంటకవులు మీసాలను పెంచడాన్ని కొందరు ఆక్షేపిస్తే, ‘దోసమ టంచెరింగియును దుందుడుకొప్పగ పెంచినారమే/ మీసము రెండు బాసలకు మేమె కవీంద్రుల మంచు దెల్పగా/ రోసము గల్గినన్ కవి వరుల్ మము గెల్వుడు గెల్చిరేని ఈ/ మీసము దీసి మీ పాద సమీపములన్ తలలుంచి మ్రొక్కమే!’ అని సవాలు విసిరారు. అదీ వారి కవన పౌరుషం! కేశ సంరక్షణ కోసం స్త్రీ పురుష భేదం లేకుండా మనుషులు నానా తంటాలు పడటం శతాబ్దాల నుంచే ఉంది. తలకట్టు నిండుగా కనిపించడానికి వివిధ సుగంధ తైలాలను వాడేవారు. గాంభీర్యా నికి గురుతైన మీసకట్టు ఏపుగా పెరగడానికి కూడా రకరకాల పద్ధతులు పాటించేవారు. ‘అంబలి తాగేవాడొకడైతే మీసాలెత్తేవాడు ఇంకొకడు’, ‘మింగ మెతుకు లేదు గాని, మీసాలకు సంపెంగ నూనె’ వంటి సామెతలు సమాజంలోని డాంబిక ఆడంబరాలను బయటపెడతాయి. బ్రిటిష్ హయాంలో ఆధునిక పోకడలు మొదలయ్యాక మన దేశంలో అలంకరణల పద్ధతుల్లో చాలా మార్పులే వచ్చాయి. తల వెంట్రుకలను, మీసకట్టును చిత్రవిచిత్రమైన పద్ధతుల్లో తీర్చిదిద్దుకోవడం మొదలైంది. ఈ మార్పులు మొదలైన కొత్తలో కొంత విచిత్రంగా చూసేవారు. అప్పటికింకా సంప్ర దాయాలను వదులుకోని ఛాందసులు ఈ విచిత్ర కేశాలంకరణలను ఆక్షేపించేవారు. ‘గొంగడి పురుగు కట్టింగు మీసాల వాడు/ గంపశ్రాద్ధపు తలకట్టువాడు’ అని మాధవపెద్ది బుచ్చి సుందర రామ శాస్త్రి ‘కన్యాశుల్కం’లోని గిరీశం పాత్రను వర్ణిస్తూ ఒక పద్యం రాశారు. తలకు చక్కగా నూనె పట్టించి, నున్నగా దువ్వుకోవడం పెద్దమనుషుల లక్షణంగా ఉండేది. ఆ రోజుల్లో టంగుటూరి ప్రకాశం పంతులు అలా నున్నగా దువ్విన తలకట్టుతో ఉండేవారు. ఆయన తలకట్టు సొగసును– ‘ఈగ వ్రాలిన గాని వేగ జారెడునట్లు మువ్వంపు కురులను దువ్వినాడు/... చెవుల సందున గిర జాలు చిందులాడ మొగము మీదను చిరునవ్వు మొలకలెత్త/ టంగుటూరి ప్రకాశము రంగు మెరయ ధవళగిరి తీర్థమునకు తరలివచ్చె’ అంటూ చిలకమర్తివారు వర్ణించారు. ఆ రోజులే వేరు. సామాజిక, రాజకీయ జీవితాల్లో సరసత ఉండేది. ఇప్పుడు రాజకీయాలు బొత్తిగా మొరటుదేరిపోయాయి. అయితే, ఇప్పటికీ రాజకీయ నాయకుల ప్రసంగాల్లో తరచుగా కేశ ప్రస్తావన వస్తూనే ఉంటుంది గాని, వారి ప్రసంగాల్లో కేశాలకు సంబంధించి దొర్లే ముతక పదాలు జనాల చెవులను చిల్లులు పొడుస్తుంటాయి. అయినా, గొంగట్లో భోంచేసేటప్పుడు వెంట్రుకలను ఏరుకోక తప్పదు కదా! -
పేదరికాన్ని జయించి భాషా సాహిత్యాలలో రాణించిన ఆచార్య రవ్వా శ్రీహరి
నల్లగొండ జిల్లా వెల్వర్తి లోని పేద చేనేత కార్మికుల కుటుంబంలో పుట్టిన (1943) ఒక కుర్రవాడు యాదగిరి లక్ష్మి నరసింహ స్వామి సంస్మృత విద్యా పీఠంలో చేరడమే విశేషమైతే అందులోని అంతా బ్రాహ్మణ సహ విద్యార్థులతో పోటీపడి ఉన్నత స్థానంలో నిలవడం మరో విశేషం. కష్టపడి డీవోఎల్, బివోఎల్, బిఏ, ఎంఏ వంటి ఎన్నో మెట్లు ఎక్కి డాక్టరేట్ కూడా చేసి (1973), హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయం లో బహుకాలం బోధనచేసి, ద్రావిడ విశ్వ విద్యాలయం ఉపాధ్యక్షుడు కాగలిగాడు (2002), ఉత్తమ పాలకుడిగా పేరు తెచ్చుకున్నాడు. సంస్కృతంలో,తెలుగులో భాషా సాహిత్యాలపై ఎన్నో పరిశోథనాత్మకమైన రచనలు చేసి 'మహా మహోపాధ్యాయ' అనిపించుకున్న మహనీయుడు ఆచార్య రవ్వా శ్రీహరి ఇక లేరు అన్న వార్త వారి కుటుంబ సభ్యులను బంధుమిత్రులనే కాదు నా లాంటి ఎంతో మంది వారి అభిమానులను కూడా శోక సాగరంలో ముంచింది. అన్నమయ్య పదకోశాన్ని తయారుచేసిన, శ్రీహరి నిఘంటువు రూపొందించిన, నల్లగొండ జిల్లా మండలికాలు అక్కడి ప్రజల భాషపై ఎన్నో గ్రంధాలు రచించిన అంతటి గొప్ప పండితుడు. వరంగల్ కు చెందిన, సహకార శాఖలో నా సీనియర్ అయిన డాక్టర్ ఏ.సురేంద్ర కుమార్ గారి ద్వారా మా అన్న కీశే వేముల పెరుమాళ్ళు గారి ప్రసిద్ధ గ్రంథం 'తెలంగాణ జాతీయాలు' పుస్తకం గురించి విని తెప్పించుకొని చదివి ప్రశంసించడం ఇంకా గొప్ప విషయం. 2005లో 'మానవతా పరిమళాలు' పేరుతో మా అన్నగారి స్మారక సంచిక ప్రచురించి నప్పుడు దానికి సందేశం పంపుతూ ' రాజకీయ రంగంలో ఉంటూ ప్రజాహిత కార్యాల్లో తలమునకలౌతూ కూడా భాషా, సాహిత్య రంగాల్లో కృషి చేయడం ప్రశంసనీయం. పెరుమాళ్ళు గారి 'తెలంగాణ జాతీయాలు' అన్న గ్రంధం భాషా రంగంలో వారు చేసిన కృషికి అద్దం పడుతుంది.తెలంగాణ భాష ప్రత్యేకతను విశిష్ట తను చాటుతుంది కూడా ' అని అభినందించారు. అంతేకాదు 12 సెప్టెంబర్ 2009 నాడు హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఆ గ్రంధావిష్కరణ సభకు ముఖ్యఅతిథిగా హాజరై ఆనాటి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. -వేముల ప్రభాకర్, రచయిత , రిటైర్డ్ ప్రభుత్వ అధికారి -
ప్రాంతీయ భాషలోనే సైన్స్
కోల్‌కతా: శాస్త్ర సాంకేతికాంశాలను విస్తృతపరిచేందుకు వ్యవహారిక భాష వినియోగం పెరగాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని యువతలోనూ సైన్స్‌పై ఆసక్తి పెరుగుతుందన్నారు. భాష ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకునేందుకు అడ్డంకి కారాదన్నారు. ప్రతి శాస్త్రవేత్త, పరిశోధనకారుడు నవభారత నిర్మాణం దిశగా తన సృజనాత్మకతకు పదునుపెట్టాలన్నారు. ప్రముఖ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ సత్యేంద్రనాథ్ బోస్ 125వ జయంతి స్మారక ఉత్సవాల ప్రారంభం సందర్భంగా కోల్‌కతాలో ఏర్పాటుచేసిన కార్యక్రమం కోసం ఢిల్లీ నుంచి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. భారత శాస్త్రవేత్తలు, పరిశోధనకారులు తమ మేధస్సును దేశ ప్రజలకోసం, వారి సామాజిక–ఆర్థిక అవసరాల కోసం వినియోగించాలని పిలుపునిచ్చారు. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ‘మన యువతలో సైన్స్‌పై ఆసక్తిని, అభిరుచిని పెంచేందుకు సైన్స్ కమ్యూనికేషన్‌ను మరింత విస్తృతపరచాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం భాష అడ్డంకి కారాదు’ అని అన్నారు. ‘2018లో ప్రతి భారతీయుడు మన పూర్వీకులు కన్న నవభారత స్వప్నాన్ని నెరవేర్చేందుకు ప్రతినబూనాలి. 2018 సంవత్సరాన్ని వాటర్‌షెడ్ సంవత్సరంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించినందున శాస్త్రవేత్తలు ఈ దిశగా సృజనాత్మక అంశాలపై దృష్టిపెట్టాలి. విద్యాసంస్థలు, పరిశోధన–అభివృద్ధి సంస్థలు ఒకే వేదికపైకి రావటం ద్వారా పరిశోధన మరింత విజయవంతమయ్యేందుకు అవకాశం ఉంటుందన్నారు. భారత శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు దేశానికి గర్వకారణమన్న ప్రధాని.. ఇస్రో 100 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపినప్పుడు ప్రపంచమంతా ఆసక్తిగా గమనించిందన్నారు. నీరు, విద్యుత్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లో కొత్త ఆవిష్కరణలకోసం ఎదురుచూస్తున్నామన్నారు. బెంగాల్ పవిత్రమైన గడ్డపై వివిధ రంగాల ప్రముఖులు పుట్టారని మోదీ ప్రశంసించారు. ఆచార్య జేసీ బోస్, మేఘనాథ్ సాహా, ఎస్ఎన్ బోస్ వంటి మహామహులు జన్మించారని.. ఇప్పటికీ వీరి ప్రయోగాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. 1894, జనవరి 1న జన్మించిన భౌతిక శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్ 1920ల్లో క్వాంటమ్ మెకానిక్స్‌లో విశేషమైన ప్రయోగాలు చేశారు. రెండు ఉప కణాలను నిర్వచించే విషయంలో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌తో కలిసి విస్తృత పరిశోధనలు చేశారు. ఈ ప్రయోగంలో కనుగొన్న కణాలకు బోస్ పేరుతో ‘బోసాన్స్’గా పిలుస్తున్నారు. మన సైంటిస్టులే బెస్ట్: హర్షవర్ధన్ భారత శాస్త్రపరిశోధన సంస్థలు అందులో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు, పరిశోధకులు ప్రపంచంలోని ఉత్తమ జాబితాలో ఉన్నారని.. కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. సత్యేంద్రనాథ్ బోస్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి.. ప్రపంచ నానో టెక్నాలజీలో భారత్ మూడో స్థానంలో ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. -
భాషా సంఘంలో రాజకీయం తగదు
భాషా సాహిత్యాల మీద ఉన్నతమైన పదవులలో ఉన్నవారు చెప్పే మాటలలో, ఇచ్చే వాగ్దానాలలో, చేసే నిర్ణయాలలో నిజాయితీ అవసరం. ఆగస్ట్ 29న విజయవాడలో జరిగిన గిడుగు రామమూర్తి 132వ వర్ధంతి సభలో ప్రభుత్వ పెద్దలు ఆడిన మాటలు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఇవాళ తెలుగును మరిచిపోతున్నామనీ, భాషను కాపాడుకో వడమంటే ఉనికిని కాపాడుకోవడమేననీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రసంగంలో అన్నారు. నిజంగా మన నేతలు భాషను కాపాడుకునే విధం గా, ఉనికిని చాటే అంశంగా గుర్తించి గౌరవిస్తున్నారా? త్వరలో ఏర్పాటు చేసే అధికార భాషా సంఘానికి పొట్లూరి హరికృష్ణ అనే ‘ప్రముఖ రచయి త’ను నియమించనున్నట్లు సీఎం ప్రకటించడం ఇలాంటి ప్రశ్నలకు ఆస్కారమిస్తుంది. ఇది ఎంతవరకు సమంజసం? ‘తెలుగు భాషా పరిర క్షణకు నడుం బిగిద్దాం’ అని ఆ సభలోనే సీఎం చెప్పిన మాటకూ ఈ చర్య కూ పొంతన ఉందా? ఆ హరికృష్ణ ఎవరు? తెలుగు భాషా సాహిత్యాలకు సంబంధించి, తెలుగువారి చరిత్రకు సంబంధించి ఆయన రాసిన పుస్త కాలు ఏమైనా ఉన్నాయా? పరిశోధన, రచన వంటి ఏ ఇతర కృషిలోనూ అంతగా పేరు వినిపించని వారిని తీసుకు వచ్చి అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి నియమిస్తామని చెప్పడం, ఆ సంఘాన్ని రాజకీయ పున రావాస కేంద్రంగా మార్చే ప్రయత్నంగా ప్రజలు అర్థం చేసుకునే అవ కాశం లేదంటారా? గతంలో వావిలాల గోపాలకృష్ణయ్య, వందేమాతరం రామచంద్రరావు, దాశరథి కృష్ణమాచార్య, నండూరి రామకృష్ణమాచా ర్యులు, కొత్తపల్లి వీరభద్రరావు, పాకాల యశోదారెడ్డి ప్రభృతులు ఆ పద వికి ఎంపికయ్యారు. కానీ సీఎం నోటి నుంచి వచ్చిన వ్యక్తి పేరు ఇంత ప్రసిద్ధమైనదేనా? పోనీ ఆయన కృషి ఈ వ్యక్తుల కృషి స్థాయిలో ఉన్న దా? భాషా సేవ గురించి సీఎం చెప్పారు కాబట్టి, మైసూరులో ఏర్పాటైన తెలుగు పీఠం విషయం కూడా గుర్తుచేసుకోవాలి. ఆ పీఠం తెలుగు సాహి త్య, సాంస్కృతిక, చరిత్ర, సర్వతోముఖ సత్వర వికాస సంస్థగా ఏర్పాటైంది. కానీ అది ఇప్పటికీ అక్కడే ఎందుకు ఉండిపోయింది? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కోట్ల రూపాయల నిధులు మైసూరులో ఉన్న ఆ సంస్థకు వెళుతున్నాయన్న వాస్తవాన్ని ఎందుకు పరిగణనలోనికి తీసుకోవడం లేదు? తెలుగుకు ప్రాచీన భాషగా గుర్తింపు వచ్చి పదేళ్లు గడుస్తున్నాయి. మరి గుర్తింపు వచ్చినా ఏమిటి ఉపయో గం? అలాగే కూచిపూడి పూర్వ వైభవం కోసం ఆ గ్రామానికి రూ.100 కోట్లు కేటాయించినట్టు కూడా విజయవాడ సభలో చెప్పారు. మరి ఆ గ్రామంలోనే ఉన్న తెలుగు విశ్వవిద్యాలయం వారి దృశ్య, లలిత, అభి నయ కళాపీఠం భవిష్యత్తు ఏమిటి? తెలుగు భాష, కూచిపూడి నృత్యా లను అంతా నేర్వాలని, సజీవంగా ఉంచుకోవాలని పెద్దలు ఆకాంక్షిం చారు. వారి కుటుంబాలు కూడా ముందుకువస్తే దీనికి సార్థకత వస్తుంది. డాక్టర్ అక్కిరాజు రమాపతిరావు హైదరాబాద్