నల్లగొండ జిల్లా వెల్వర్తి లోని పేద చేనేత కార్మికుల కుటుంబంలో పుట్టిన (1943) ఒక కుర్రవాడు యాదగిరి లక్ష్మి నరసింహ స్వామి సంస్మృత విద్యా పీఠంలో చేరడమే విశేషమైతే అందులోని అంతా బ్రాహ్మణ సహ విద్యార్థులతో పోటీపడి ఉన్నత స్థానంలో నిలవడం మరో విశేషం.
కష్టపడి డీవోఎల్, బివోఎల్, బిఏ, ఎంఏ వంటి ఎన్నో మెట్లు ఎక్కి డాక్టరేట్ కూడా చేసి (1973), హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయం లో బహుకాలం బోధనచేసి, ద్రావిడ విశ్వ విద్యాలయం ఉపాధ్యక్షుడు కాగలిగాడు (2002), ఉత్తమ పాలకుడిగా పేరు తెచ్చుకున్నాడు. సంస్కృతంలో,తెలుగులో భాషా సాహిత్యాలపై ఎన్నో పరిశోథనాత్మకమైన రచనలు చేసి 'మహా మహోపాధ్యాయ' అనిపించుకున్న మహనీయుడు ఆచార్య రవ్వా శ్రీహరి ఇక లేరు అన్న వార్త వారి కుటుంబ సభ్యులను బంధుమిత్రులనే కాదు నా లాంటి ఎంతో మంది వారి అభిమానులను కూడా శోక సాగరంలో ముంచింది.
అన్నమయ్య పదకోశాన్ని తయారుచేసిన, శ్రీహరి నిఘంటువు రూపొందించిన, నల్లగొండ జిల్లా మండలికాలు అక్కడి ప్రజల భాషపై ఎన్నో గ్రంధాలు రచించిన అంతటి గొప్ప పండితుడు. వరంగల్ కు చెందిన, సహకార శాఖలో నా సీనియర్ అయిన డాక్టర్ ఏ.సురేంద్ర కుమార్ గారి ద్వారా మా అన్న కీశే వేముల పెరుమాళ్ళు గారి ప్రసిద్ధ గ్రంథం 'తెలంగాణ జాతీయాలు' పుస్తకం గురించి విని తెప్పించుకొని చదివి ప్రశంసించడం ఇంకా గొప్ప విషయం.
2005లో 'మానవతా పరిమళాలు' పేరుతో మా అన్నగారి స్మారక సంచిక ప్రచురించి నప్పుడు దానికి సందేశం పంపుతూ ' రాజకీయ రంగంలో ఉంటూ ప్రజాహిత కార్యాల్లో తలమునకలౌతూ కూడా భాషా, సాహిత్య రంగాల్లో కృషి చేయడం ప్రశంసనీయం. పెరుమాళ్ళు గారి 'తెలంగాణ జాతీయాలు' అన్న గ్రంధం భాషా రంగంలో వారు చేసిన కృషికి అద్దం పడుతుంది.తెలంగాణ భాష ప్రత్యేకతను విశిష్ట తను చాటుతుంది కూడా ' అని అభినందించారు. అంతేకాదు 12 సెప్టెంబర్ 2009 నాడు హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఆ గ్రంధావిష్కరణ సభకు ముఖ్యఅతిథిగా హాజరై ఆనాటి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
-వేముల ప్రభాకర్, రచయిత , రిటైర్డ్ ప్రభుత్వ అధికారి
Comments
Please login to add a commentAdd a comment