ఓ మల్లెపువ్వు రక్త చరిత్ర | Story on Calcutta of 1880s | Sakshi
Sakshi News home page

ఓ మల్లెపువ్వు రక్త చరిత్ర

Published Wed, Dec 12 2018 12:01 AM | Last Updated on Wed, Dec 12 2018 12:01 AM

Story on Calcutta of 1880s - Sakshi

‘దారోగర్‌ దప్తార్‌’. 1880లలో కలకత్తాలో జరిగిన వరుస హత్యలు ఈ పేరుతో ఏళ్ల క్రితం పుస్తకంగా వచ్చాయి. ఇప్పుడు అదే పుస్తకం  రెండు వాల్యూములుగా పునర్ముద్రణ అయింది.  కొన్ని నేరాలను పరిశోధించిన ప్రియానాథ్‌ ముఖోపాధ్యాయ్‌ పుస్తకంలోని కథలను ఉత్కఠతో చదివించేలా రచించారు. మొదటి వాల్యూమ్‌లోని 78 వ కథలో పేరుమోసిన నేరస్తురాలు త్రైలోక్య నేర చరిత్రను చదివితే ఆమె జీవితం ఈ పుస్తకంలో ఉండాల్సిన కథ కాదు అనిపిస్తుంది. కానీ నేరం నేరమే. 

బెంగాల్‌లోని చిన్న గ్రామంలో త్రైలోక్య కథ ప్రారంభమవుతుంది. త్రైలోక్య బ్రాహ్మల అమ్మాయి. పెళ్లి అయ్యేనాటికి చిన్న పిల్ల. పెళ్లికొడుకు పెద్ద వయసువాడు.  త్రైలోక్య రజస్వల అయ్యేవరకు పుట్టింట్లోనే ఉంది. భర్త మరణించే లోపు ఒక్కసారి మాత్రమే అతడిని చూసింది. ఆ తరవాత త్రైలోక్యను ఒక వైష్ణవ మహిళ చేరదీసింది.  అక్కడే ఆమె జీవితం మలుపు తిరిగింది. కలకత్తా వేశ్యా గృహాలకు అమ్మాయిలను సరఫరా చేసే ఆ మహిళ.. త్రైలోక్యను ఒక యువకుడికి అప్పచెప్పింది. అతడు త్రైలోక్యను మోసం చేసి, కలకత్తా సోనాగచ్చిలో ఉండే రెడ్‌ లైట్‌ ఏరియాలోని వేశ్యాగృహానికి అమ్మేశాడు. ఇది 1880లో జరిగింది. ఒక సాధారణ పల్లెటూరి పిల్లలా మొదలైన ఆమె జీవితం, ఇక్కడ నుంచే కలకత్తా నేర ప్రపంచంలోకి అడుగు పెట్టేలా చేసింది.

వ్యభిచారం నుంచి మోసగత్తెగా..
యవ్వనంతో అందంగా ఉన్న త్రైలోక్యకు డబ్బు కోసం వెతక్కోవలసిన అవసరం కలగలేదు. చేతికి వస్తున్న ఆదాయంతో విలాసవంతమైన జీవితానికి అలవాటుపడింది. అందం ఎంతోకాలం నిలబడదుగా, క్రమేపీ ఆదాయం కూడా తగ్గసాగడంతో, భవిష్యత్తు గురించి భయం మొదలైంది. ఈ సమయంలోనే కాళి బాబు అనే ఒక వివాహితుడిని ప్రేమించింది. అతడి భార్య మరణించగానే, హరి అనే పేరు గల వారి కొడుకుని దత్తత తీసుకుంది. కాళిబాబు నిత్యం అక్కడే ఉండటం వల్ల, త్రైలోక్య దగ్గరకు వచ్చే విటుల సంఖ్య తగ్గిపోయింది. దానికి తోడు హరి చదువు ఖర్చు కూడా పెరగటంతో, త్రైలోక్య పరిస్థితి దీనంగా మారిపోయింది. వ్యభిచార వృత్తి నుంచి నేర ప్రవృత్తిలోకి మారవలసి వచ్చింది. కలకత్తాకు చెందిన ఇద్దరు సంపన్నులు త్రైలోక్య ఇంట్లో ఉంటూ, అక్కడకు వచ్చే విటులకు అమ్మాయిలను సరఫరా చేయడంతో పాటు, వారు మత్తులో ఉన్నప్పుడు వారిని లూటీ చేసి, వీధిలోకి తోసేయడం త్రైలోక్య లక్ష్యం. రోడ్డు మీద పడిపోయిన వ్యక్తిని చూసి వాడు తాగి పడిపోయాడనుకునే పోలీసులు ఆ రాత్రికి వారిని లాకప్‌లో ఉంచుతారు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచేదాకా వారికి ప్రతిఘటించే శక్తి ఉండదు. ఫిర్యాదు చేయడం వలన అక్కర్లేని ప్రచారం జరుగుతుంది కాబట్టి, వారు మౌనంగా వెళ్లిపోతారు. ఇదీ త్రైలోక్య కుటిల ఆలోచన. ఆనోటా ఈనోటా త్రైలోక్య విషయం నలుగురికీ తెలిసిపోవడంతో మరో కొత్త నేరానికి దారి వెతుక్కుంది.

వరుల కోసం వల
బెంగాల్‌లోని శోత్రియ బ్రాహ్మణ కుటుంబాలలో వరకట్నం కాకుండా, కన్యాశుల్కం ఆచారంగా ఉండేది. అందువల్ల ఆడపిల్లల తండ్రులు ఎవరు ఎక్కువ కన్యాశుల్కం ఇస్తే వారితోనే సంబంధం కలుపుకునేవారు. ఇది అదనుగా చేసుకుంది త్రైలోక్య. అబ్బాయికి పెళ్లి చేయడం కష్టంగా ఉన్న వారి గురించి సన్నిహితుల ద్వారా కాళిబాబు తెలుసుకున్నాక  కలకత్తా నగరంలోని రెడ్‌ లైట్‌ ఏరియాకి దూరంగా త్రైలోక్యం, కాళిబాబు ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నారు. అబద్ధపు చుట్టాలను తెచ్చుకున్నారు. ఒక సుముహూర్తాన అబ్బాయి కుటుంబానికి కబురు చేశారు. అందంగా ఉండే ఒక వ్యభిచారిని పెళ్లికూతురుగా పరిచయం చేశారు. అమ్మాయిని చూడగానే అబ్బాయి తన అంగీకారం తెలిపాడు. అడిగినంత కన్యాశుల్కం, పెళ్లి ఖర్చులు ఇచ్చారు. నెల తిరిగేలోపు వివాహం అయిపోయింది. అమ్మాయి అత్తవారింటికి వెళ్లింది. ఒంటి నిండా నగలతో దర్జాగా ఉంది. తన కన్నతల్లి పరిచారిక వేషంలో వచ్చింది. మరొక వ్యక్తి మేనమామలా నటించాడు. వివాహం జరిగిన నెల రోజులకు, పెళ్లికూతురు తన తల్లిదండ్రులను చూసి వస్తానని అత్తగారి అనుమతి తీసుకుని భర్తతో కలిసి బయలుదేరింది. ఒంటి నిండా నగలతో, పరిచారికలుగా వచ్చిన ఇద్దరు వ్యక్తులతో కలిసి మొత్తం నలుగురు కలకత్తా ౖరైలు ఎక్కారు. అర్ధరాత్రి నిద్రలో ఉండగా, భర్తను వదిలి ముగ్గురూ త్రైలోక్య దగ్గరకు పారిపోయారు. నగలన్నీ అమ్మేశారు. వారు ముగ్గురికీ త్రైలోక్య కొద్ది మొత్తం మాత్రమే ఇచ్చింది. మిగిలినదంతా తాను తీసేసుకుంది. ఇదే మోసాన్ని పదేపదే చేసి డబ్బు
సంపాదించింది త్రైలోక్య. కొంతకాలం తరవాతఅమ్మాయిలను కిడ్నాప్‌ చేసి, అమ్మేయడం మొదలుపెట్టింది త్రైలోక్య. మాయమైన అమ్మాయిలు కనిపించకపోవడంతో, ఆ వార్త సంచలనమైంది. విషయం గ్రహించిన పోలీసులు, త్రైలోక్య, కాళిబాబులకు.. ఇటువంటి పనులు మానుకోమని హెచ్చరించారు. అక్కడ నుంచి మరో దారిలోకి వెళ్లింది త్రైలోక్య.

హత్యలు మొదలు
ఉత్తరప్రదేశ్‌లో ఒక రాజుగారికి మధ్యవర్తినని చెప్పుకునేవాడు కాళిబాబు. బారాబజార్‌ నుంచి నగలను తక్కువ ధరకు తీసుకువస్తానని చెప్పి, షాపు వారికి కబురు చేసి, వారి దుకాణంలో పనిచేసే వ్యక్తి ద్వారా నగలను తెప్పించి, నగలు తీసుకు వచ్చిన వ్యక్తిని చంపేసి, నగలన్నీ తీసుకుని, ఆ వ్యక్తిని వారు అద్దెకు ఉన్న ఇంటి గదిలో పాతేసేవారు. కాళిబాబు ఆ నగలను స్వయంగా రాజావారి దగ్గరకు తీసుకువెళ్లి, డబ్బులు తీసుకుని, తన జేబులో వేసుకునేవాడని అంటారు. ఈ కేసును పరిశీలించమని నేర పరిశోధకుడైన ముఖోపాధ్యాయకు అప్పచెప్పారు అధికారులు. అద్దెకు ఉన్న ఇంటిని గుర్తించి, శవాన్ని బయటకు తీశాడు ముఖోపాధ్యాయ. కాళిబాబును ఉరి తీశారు. కోర్టులో త్రైలోక్య నేరం నిరూపణ కాలేదు. ఆమె స్వేచ్ఛగా బయటకు వెళ్లిపోయింది. నిస్పృహలో ఉన్న త్రైలోక్య తన ఇంటిని, నగలను బలవంతంగా అమ్మవలసి వచ్చింది. సోనాగచ్చిలో గతంలో తనతో ఉన్న వారిని కలిసింది. వారంతా ఈసడించుకున్నారు. కాని, ఆమెలాగే, చాలామంది వయసు మీద పడటంతో భవిష్యత్తు గురించి భయపడసాగారు. వారందరి అభద్రతతో సైతం చెలగాటమాడింది త్రైలోక్య. ఒక మహానుభావుడు వారందరి కష్టాలను గట్టెక్కిస్తాడని వారిని నమ్మించింది. వారంతా ఒంటి నిండా నగలతో వస్తే, వారిని రెట్టింపుగా ఆశీర్వదిస్తాడని నమ్మపలికింది. మూడేళ్ల కాలంలో త్రైలోక్య అలా ఐదుగురు మహిళలను చేరదీసింది. వారిని కలకత్తాలో తన ఇంటి దగ్గరలో ఉన్న మాణిక్‌తాలా చెరువు దగ్గరకు ఒక్కొక్కరిగా తీసుకువెళ్లి, వారిని అందులో స్నానం చేయమంది. వారంతా వారి ఒంటి మీద నగలను తీసి, ఒడ్డున పెట్టారు. స్నానం చేస్తుండగా, తలను నీటిలో ముంచి వారు మునిగిపోయేవరకు అలానే పట్టుకునేది. ఇలా చేస్తుండగా ఒకసారి దూరం నుంచి ఎవరో గమనించారు. త్రైలోక్యను పోలీసు స్టేషనుకి ఈడ్చుకెళ్లారు. త్రైలోక్య తప్పించుకోవాలని చూసింది. ఆమెను ముఖోపాధ్యాయకు అప్పగించారు. అప్పటికే త్రైలోక్య మీద అనుమానాలున్న ముఖోపాధ్యాయ ఆమెను విచారణకు పంపారు. ఈసారీ అదృష్టం ఆమె వైపే ఉంది. ఆమె మరోసారి స్వేచ్ఛగా ప్రపంచంలోకి వచ్చింది.

అప్పటికే అనుమానాలు
అప్పటికే త్రైలోక్య గురించి దుష్ప్రచారం జరుగుతోంది. త్రైలోక్య ఈసారి చిత్‌పూర్‌లోని పంచు ధోబానీ లేన్‌లో ఇల్లు అద్దెకు తీసుకుంది. గతంలో చేసిన నేరాల తాలూకు ధనం ఖర్చు చేస్తోంది. ఇప్పుడు మరో కొత్త నేరం చేయడం కోసం ఎదురు చూస్తోంది. అదే ఇంట్లో నివసిస్తున్న రాజకుమారి అనే మరొక వ్యభిచారి దగ్గర ఉన్న బంగారాన్ని లాక్కోవాలనుకుంది. రెండుమూడు సార్లు గట్టిగానే ప్రయత్నించింది. విఫలం కావడంతో, కోపంతో ఊగిపోయి, ఆమెను చంపి మరీ నగలు తెచ్చుకుంది. ఈ హత్య జరిగిన కొంత కాలానికి ముఖోపాధ్యాయకు ఈ కేసును అప్పగించారు. త్రైలోక్య ఆ ఇంట్లో ఉంటోందని తెలిసిన మరుక్షణం, ఆమే ఈ హత్య చేసిందని అర్థం చేసుకున్నాడు. పుస్తకంలోని శేష్‌ లీలా (ద లాస్ట్‌ యాక్ట్‌)లో ముఖోపాధ్యాయ త్రైలోక్యను తాను ఏ విధంగా పట్టుకున్నాడో వివరించాడు. పెంపుడు కొడుకు హరిని హత్యానేరంలో ఇరికించినట్లు నటించాడు ముఖోపాధ్యాయ. సంకెళ్లతో ఉన్న హరిని చూసిన త్రైలోక్య మనసు కరిగింది. తాను దాచి ఉంచుకున్న బంగారమంతా పోలీసుల స్వాధీనం చేసింది. ఆ తరవాత తనను మోసం చేశారని తెలియగానే, మళ్లీ తన గత జీవితానికి వెళ్లిపోవాలనుకుంది. ఈలోగా కేసు హైకోర్టుకి వెళ్లింది. బెంగాల్‌ గవర్నర్‌ అయిన సర్‌ అగస్టస్‌ రివర్స్‌ థాంప్సన్‌కి క్షమాభిక్ష అప్పీలు చేసింది. ఆమె అదృష్టం శరవేగంతో దూరానికి పరుగులు తీసింది. ఆమెకు ఉరిశిక్ష వేశారు. ఆ రోజు ముఖోపాధ్యాయ ఆమెను జైలు గదిలో చూశాడు. ఒకపక్కన భయంకరమైన హత్యలు చేసింది, మరోపక్క, ఒక మహిళ మరణానికి కారణం అయ్యింది. త్రైలోక్యతో చేసిన సుదీర్ఘ ఇంటర్వ్యూలో ఆమె తాను చేసిన నేరాలన్నీ ఒకటొక్కటిగా స్వయంగా బయటపెట్టింది. ముఖోపాధ్యాయతో ఆమె పలికిన చివరి మాటలు, ‘హరి బాధ్యతను మీకు అప్పచెబుతున్నాను. అతడిని జాగ్రత్తగా చూడండి. లేదంటే అతడు కష్టాలపాలవుతాడు’ అని. 1884లో త్రైలోక్యను ఉరి తీశారు.
– జయంతి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement