సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో మరో సెమీ ఫైనలిస్టు ఖరారైంది. బెంగాల్‌పై 41 పరుగుల తేడాతో గెలిచిన బరోడా టాప్-4లో అడుగుపెట్టింది. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరోడా జట్టుకు కృనాల్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక అతడి తమ్ముడు, టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సైతం ఈసారి దేశవాళీ క్రికెట్ బరిలో దిగాడు.
ప్రపంచ రికార్డు
కాగా కృనాల్ సారథ్యంలో బరోడా జట్టు ఈసారి అద్భుతాలు సృష్టించింది. లీగ్ దశలో భాగంగా సిక్కిం జట్టుపై పరుగుల విధ్వంసానికి పాల్పడింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 349 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సాధించింది. పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా నిలిచింది.
ఇదే జోరులో క్వార్టర్ ఫైనల్ వరకు చేరుకున్న బరోడా జట్టు.. బుధవారం బెంగాల్ జట్టుతో తలపడింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగాల్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.
రాణించిన ఓపెనర్లు
పాండ్యా బ్రదర్స్ హార్దిక్(10), కృనాల్(7) పూర్తిగా విఫలమైనా.. ఓపెనర్లు శశ్వత్ రావత్(40), అభిమన్యు సింగ్(37) ఆకట్టుకున్నారు. వీరికి తోడు శివాలిక్ శర్మ(24), భాను పనియా(17), విష్ణు సోలంకి(16 నాటౌట్) రాణించారు. ఇక బెంగాల్ బౌలర్లలో మహ్మద్ షమీ, కనిష్క్ సేత్, ప్రదీప్త ప్రమాణిక్ తలా రెండు వికెట్లు దక్కించుకోగా.. సాక్షిమ్ చౌదరి ఒక వికెట్ పడగొట్టాడు.
ఇక లక్ష్య ఛేదనకు దిగిన బెంగాల్‌కు ఓపెనర్ అభిషేక్ పోరెల్(13 బంతుల్లో 22) మెరుపు ఆరంభం అందించినా.. మరో ఓపెనర్ కరణ్ లాల్(6), వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ సుదీప్ కుమార్ ఘరామి(2) పూర్తిగా విఫలమయ్యారు. నాలుగో స్థానంలో వచ్చిన రితిక్ ఛటర్జీ సైతం డకౌట్‌గా వెనుదిరిగాడు.
షాబాజ్ మెరుపు హాఫ్ సెంచరీ
ఈ క్రమంలో రిత్విక్ చౌదరి(18 బంతుల్లో 29)తో కలిసి టీమిండియా బౌలింగ్ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 36 బంతుల్లోనే 55 పరుగులతో షాబాజ్ చెలరేగాడు.
అయితే, రితిక్‌ను హార్దిక్ పాండ్యా, షాబాజ్‌ను అతిత్ సేత్ అవుట్ చేయడంతో బెంగాల్ ఇన్నింగ్స్ గాడి తప్పింది. బరోడా బౌలర్ల ధాటికి.. మిగతా వాళ్లలో ప్రదీప్త 3, సాక్షిమ్ చౌదరి 7, షమీ 0, కనిష్క్ 5(నాటౌట్), సయాన్ ఘోష్(0) చేతులెత్తేశారు.
ఫలితంగా 18 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌట్ అయిన బెంగాల్.. 41 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. మరోవైపు.. బరోడా సెమీ ఫైనల్స్‌కు దూసుకువెళ్లింది.
సెమీస్‌లో బరోడా
బరోడా బౌలర్లలో హార్దిక్ పాండ్యా, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ లుక్మాన్ మెరివాలా, అతిత్ సేత్ మూడేసి వికెట్లతో చెలరేగగా.. అభిమన్యు ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అంతకు ముందు జరిగిన మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ సౌరాష్ట్రను ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టింది.
చదవండి: అతడికి ఆసీస్ జట్టులో ఉండే అర్హత లేదు: డేవిడ్ వార్నర్
Comments
Please login to add a commentAdd a comment