ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్‌ను ఉద్దేశించి ఆ జట్టు మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మాక్సీకి టెస్టు జట్టులో ఉండే అర్హతే లేదన్నాడు. కాగా మాక్స్‌వెల్ ఆస్ట్రేలియా తరఫున టెస్టు బరిలో దిగి దాదాపు ఏడేళ్లు అవుతోంది. బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా 2017లో తన చివరి టెస్టు ఆడాడు.
ఏడు టెస్టులు
చట్టోగ్రామ్ వేదికగా నాటి మ్యాచ్‌లో 36 ఏళ్ల మాక్సీ రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 28, 25* పరుగులు చేశాడు. ఇక 2013లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఇప్పటివరకు మొత్తంగా.. తన కెరీర్‌లో ఏడు టెస్టులు ఆడాడు.
టెస్టుల్లోనూ పునరాగమనం చేయాలనే ఆశ
ఇందులో నాలుగు టీమిండియా, ఒకటి పాకిస్తాన్, రెండు బంగ్లాదేశ్‌తో ఆడిన మ్యాచ్‌లు. వీటన్నింటిలో కలిపి 339 పరుగులు చేసిన మాక్సీ.. ఎనిమిది వికెట్లు మాత్రమే తీశాడు. ఇక వన్డే, టీ20లలో అదరగొడుతున్న ఈ ఆల్‌రౌండర్.. టెస్టుల్లోనూ పునరాగమనం చేయాలని ఆశపడుతున్నాడు.
వచ్చే ఏడాది జనవరిలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న ఆసీస్ టెస్టు జట్టులో తనకు చోటు దక్కితే బాగుంటుందని.. ఇటీవల మాక్సీ తన మనసులోని మాట బయటపెట్టాడు.
అతడి ఆ అర్హత కూడా లేదు
ఈ విషయంపై మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్పందిస్తూ.. ‘‘నీకు దేశీ టోర్నీ జట్టులోనే చోటు దక్కనపుడు.. జాతీయ జట్టులో స్థానం కావాలని ఆశించడం సరికాదు!.. నిజానికి నీకు టెస్టుల్లో ఆడాలనే కోరిక మాత్రమే ఉంది. ఆ కారణంగా నిన్నెవరూ జట్టుకు ఎంపిక చేయరు.
క్లబ్ క్రికెట్ ఆడుతూ.. అక్కడ నిరూపించుకుంటే.. టెస్టు క్రికెట్ జట్టు నుంచి తప్పకుండా పిలుపు వస్తుంది. కానీ.. అతడు అలాంటిదేమీ చేయడం లేదు. కాబట్టి.. నా దృష్టిలో మాక్సీకి టెస్టు జట్టు చోటు కోరుకునే అర్హత కూడా లేదు’’ అని వార్నర్ ఘాటు విమర్శలు చేశాడు.
కాగా గతేడాది ఇంగ్లండ్ కౌంటీల్లో భాగంగా వార్విక్‌షైర్ తరఫున మాక్స్‌వెల్ ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడాడు. అనంతరం దేశీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్‌లో విక్టోరియా తరఫున అతడు బరిలోకి దిగాల్సింది. అయితే, పాకిస్తాన్‌తో ఇటీవల పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ సమయంలో మాక్సీకి తొడ కండరాల గాయమైంది. ఫలితంగా అతడు ఆటకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో డేవిడ్ వార్నర్ కోడ్ స్పోర్ట్స్ షోలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
టీమిండియాతో టెస్టులతో ఆసీస్ బిజీ
ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా ప్రస్తుతం టీమిండియాతో టెస్టు సిరీస్‌తో బిజీగా ఉంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో ఐదు టెస్టులు ఆడతున్న కంగారూ జట్టు సిరీస్‌ను ప్రస్తుతం 1-1తో సమం చేసింది. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా చేతిలో ఓడిన ఆసీస్.. అడిలైడ్‌లో జరిగిన పింక్ టెస్టులో ఘన విజయం సాధించింది. ఇరుజట్ల మధ్య డిసెంబరు 14 నుంచి మూడో టెస్టు జరుగనుంది. బ్రిస్బేన్‌లోని ‘ది గాబా’ మైదానం ఇందుకు వేదిక.
Comments
Please login to add a commentAdd a comment