టీమిండియా పేసర్ మహ్మద్ షమీ మరికొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకోనున్నాడు. ఈ క్రమంలో విజయ్ హజారే ట్రోఫీ 2024-25 సీజన్‌లో తొలి మ్యాచ్‌కు ఈ బెంగాల్ బౌలర్ దూరం కానున్నాడు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న షమీ.. దాదాపు ఏడాది తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు.
మోకాలు ఉబ్బిపోయింది!
ఇటీవల జరిగిన దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్ తరఫున షమీ బరిలోకి దిగాడు. ఈ టోర్నీలో మొత్తం తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన ఈ రైటార్మ్ పేసర్ పదకొండు వికెట్ల తీశాడు. అయితే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సందర్భంగా షమీ మరోసారి గాయపడినట్లు సమాచారం. అతడి మోకాలు ఉబ్బిపోయినట్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు.
అందుకే షమీని హడావుడిగా తిరిగి జట్టులోకి చేర్చుకునే పరిస్థితి లేదని.. ఆస్ట్రేలియా పర్యటనకు అతడు మొత్తంగా దూరమయ్యాడనే సంకేతాలు ఇచ్చాడు. అందుకు తగ్గట్లుగానే దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్‌కు ప్రకటించిన బెంగాల్ జట్టులో షమీ పేరు కనిపించింది.
విశ్రాంతినిచ్చాం
ఇక డిసెంబరు 21 నుంచి మొదలుకానున్న ఈ టోర్నీలో బెంగాల్ తొలుత ఢిల్లీ జట్టుతో తలపడనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానంలో జరుగనున్న ఈ మ్యాచ్‌కు షమీ దూరంగా ఉండనున్నాడు. ‘‘విజయ్ హజారే ట్రోఫీలో మా తొలి మ్యాచ్‌కు షమీ అందుబాటులో ఉండడు. ఈ టీమిండియా వెటరన్ బౌలర్‌కు విశ్రాంతినిచ్చాం’’ అని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ పేర్కొంది.
చాంపియన్స్ ట్రోఫీకి సన్నద్ధం
ఈ పరిణామాల నేపథ్యంలో షమీ ఆస్ట్రేలియా పర్యటనకు పూర్తిగా దూరమైనట్లు తెలుస్తోంది. టెస్టు క్రికెట్ ఆడేందుకు అతడు ఫిట్ లేని కారణంగా.. టీమిండియా మేనేజ్‌మెంట్ మరికొన్నాళ్లపాటు అతడిని పక్కన పెట్టనుందట.
ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 జరుగనున్న విషయం తెలిసిందే. అయితే, అంతకంటే ముందు టీమిండియా ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడుతుంది. అప్పుడే షమీ.. భారత జట్టులో పునరాగమనం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన టీమిండియా మూడు టెస్టులు ముగిసే సరికి 1-1తో సమంగా ఉంది. తదుపరి మెల్‌బోర్న్, సిడ్నీల్లో భారత్- ఆసీస్ మధ్య మిగిలిన రెండు టెస్టులు జరుగనున్నాయి.
చదవండి: భారత్‌తో టెస్టులకు ఆసీస్ జట్టు ప్రకటన.. అతడిపై వేటు.. ‘జూనియర్’ పాంటింగ్‌కు చోటు
Comments
Please login to add a commentAdd a comment