చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)కి ముందు టీమిండియాకు చేదువార్త!.. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ఈ ఐసీసీ టోర్నీ మొత్తానికి దూరం కానున్నట్లు తెలుస్తోంది. వెన్నునొప్పి కారణంగా మరికొంత కాలం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మెగా ఈవెంట్‌కు అతడు అందుబాటులోకి రావడం కష్టమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
అంతా తానై నడిపించిన బుమ్రా
ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో జస్‌ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ పితృత్వ సెలవుల కారణంగా తొలి టెస్టుకు దూరం కాగా బుమ్రా సారథ్య బాధ్యతలు చేపట్టాడు. పెర్త్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో బౌలర్‌గా, కెప్టెన్‌గా రాణించి టీమిండియాకు 295 పరుగుల భారీ తేడాతో విజయం అందించాడు.
ఇక ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో.. ఫామ్‌లేమి దృష్ట్యా రోహిత్ శర్మ ఆఖరిదైన సిడ్నీ మ్యాచ్‌కు దూరం కాగా బుమ్రా మరోసారి జట్టు పగ్గాలు తీసుకున్నాడు. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా అతడు వెన్నునొప్పితో విలవిల్లాడాడు. ఈ క్రమంలో ఆస్పత్రికి తీసుకువెళ్లి స్కానింగ్ చేయించుకున్న తర్వాత బుమ్రా మళ్లీ మైదానంలో దిగి బౌలింగ్ చేశాడు.
32 వికెట్లతో
కానీ దురదృష్టవశాత్తూ జట్టును గెలిపించలేకపోయాడు. ఈ క్రమంలో 3-1 తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన టీమిండియా.. పదేళ్ల తర్వాత ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కోల్పోయింది. ఏదేమైనా అద్బుత ప్రదర్శనతో ఈ సిరీస్‌లో అదరగొట్టిన బుమ్రా 32 వికెట్లతో లీడింగ్ వికెట్‌టేకర్‌గా నిలిచాడు.
ఇదిలా ఉంటే.. టీమిండియా తదుపరి ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై టీ20, వన్డేలు ఆడనుంది. అనంతరం ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనాల్సి ఉంది. అయితే, బుమ్రా వెన్నునొప్పి నుంచి ఇంకా కోలుకోలేనట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో అతడు ఇంగ్లండ్‌తో వన్డేలతో పాటు.. చాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యాచ్‌లకు కూడా దూరమవుతాడని తొలుత వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. అతడు నాకౌట్ దశకు కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది.
బెడ్ రెస్ట్ అవసరం
‘‘బుమ్రా వచ్చేవారం బీసీసీఐకి చెందిన, బెంగళూరులో ఉన్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రిపోర్టు చేయాల్సి ఉంది. అయితే, ఇప్పటి వరకు అందుకు సంబంధించిన తేదీ ఖరారు కాలేదు. అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. కండరాల నొప్పితో పాటు వాపు కూడా ఉంది.
కాబట్టి వైద్యులు అతడిని ఇంటి వద్ద బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు. ఇది నిజంగా జట్టుకు ఎదురుదెబ్బలాంటిదే. డిస్క్ బాహ్య పొర ఉబ్బినట్లు తేలినా, కండరాల వాపు ఎక్కువగా ఉన్నా మరింత కష్టమే.
అతడొక విలువైన ఆటగాడు. కాబట్టి అతడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మేనేజ్‌మెంట్‌పై ఉంది’’ అని బీసీసీఐ సన్నిహిత వర్గాలు అన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది.
అవే కీలకం
అదే విధంగా.. టీమిండియా మాజీ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ రాంజీ శ్రీనివాసన్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘ఎడిమా(శరీర కణజాలాల్లో ఫ్లూయిడ్స్) ఫామ్ అయితే.. వాపు వస్తుంది. అయితే, గాయం, నొప్పి తీవ్రత ఆధారంగా ఓ వ్యక్తి ఎన్నిరోజులు విశ్రాంతి తీసుకోవాలనే అంశాన్ని నిర్ణయిస్తారు.
ఆ వ్యక్తి శరీరతత్వం, వైద్యుల పర్యవేక్షణ, వాడే మందులు.. అన్నీ ఇందులో కీలకం’’ అని పేర్కొన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. కాగా ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది.
చదవండి: అందుకే ఐదు సెంచరీలు కొట్టినా అతడిని పక్కన పెడుతున్నారా?: భజ్జీ
Comments
Please login to add a commentAdd a comment