వెటరన్ పేసర్ మహ్మద్ షమీ(Mohammed Shami) టీమిండియా పునరాగమనానికి సై అంటున్నాడు. ఇప్పటికే దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సత్తా చాటిన ఈ బెంగాల్ బౌలర్.. వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ ఆకట్టుకుంటున్నాడు. మధ్యప్రదేశ్‌తో ఇటీవల జరిగిన మ్యాచ్‌లో బ్యాట్‌తో(42 పరుగులు నాటౌట్)నూ సత్తా చాటిన షమీ.. తాజాగా ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో బంతితో రాణించాడు.
వడోదర వేదికగా తొలి ప్రిలిమినరీ క్వార్టర్ ఫైనల్లో బెంగాల్ - హర్యానా(Haryana vs Bengal) మధ్య గురువారం మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన బెంగాల్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన హర్యానాకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు అర్ష్ రంగా(23), హిమాన్షు రాణా(14) తక్కువ స్కోర్లకే వెనుదిరగగా.. కెప్టెన్, వన్‌డౌన్ బ్యాటర్ అంకిత్ కుమార్(18) కూడా నిరాశపరిచాడు.
రాణించిన మిడిలార్డర్ బ్యాటర్లు
అయితే, మిడిలార్డర్‌లో పార్థ్ వత్స్(62), నిశాంత్ సింధు(64) మాత్రం దుమ్ములేపారు. ఇద్దరూ అర్ధ శతకాలతో రాణించి.. జట్టును కష్టాల నుంచి గట్టెక్కించారు. మిగిలిన వాళ్లలో రాహుల్ తెవాటియా(29) ఫర్వాలేదనిపించగా.. ఎనిమిదో స్థానంలో వచ్చిన సుమిత్ కుమార్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 32 బంతుల్లో 41 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి హర్యానా 298 పరుగులు చేసింది.
ఇక ఈ మ్యాచ్‌లో బెంగాల్ పేసర్ మహ్మద్ షమీ తన బౌలింగ్ కోటా పూర్తి చేయడంతో పాటు.. వికెట్లు తీయడం టీమిండియాకు సానుకూలాంశంగా పరిణమించింది. హర్యానాతో మ్యాచ్‌లో షమీ పది ఓవర్లు బౌల్ చేసి.. 61 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. ఆరంభంలో ఓపెనర్ హిమాన్షు రాణాను అవుట్ చేసిన షమీ.. డెత్ ఓవర్లలో దినేశ్ బనా(15), అన్షుల్ కాంబోజ్(4)లను వెనక్కి పంపాడు.
సర్జరీ తర్వాత నో రీ ఎంట్రీ
ఇలా ఓవరాల్‌గా తన ప్రదర్శన ద్వారా షమీ.. తాను పూర్తి ఫిట్‌గా ఉన్నాననే సంకేతాలు ఇచ్చాడు. మిగతా బెంగాల్ బౌలర్లలో ముకేశ్ కుమార్ రెండు, సయాన్ ఘోష్, ప్రదీప్త ప్రామాణిక్, కౌశిక్ మైటీ, కరణ్ లాల్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా షమీ టీమిండియాకు చివరగా ఆడాడు.
స్వదేశంలో జరిగిన నాటి ఐసీసీ టోర్నీలో ఈ రైటార్మ్ పేసర్ 24 వికెట్లతో సత్తా చాటాడు. చీలమండ గాయం వేధిస్తున్నా ఈ మెగా ఈవెంట్లో కొనసాగిన షమీ.. అనంతరం శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఈ క్రమంలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందిన మహ్మద్ షమీ.. ఇంత వరకు భారత జట్టులో రీఎంట్రీ ఇవ్వలేకపోయాడు.
నేను సిద్ధం.. సెలక్టర్లకు మెసేజ్!
కాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తొమ్మిది మ్యాచ్‌లు ఆడి.. పదకొండు వికెట్లు తీసినా.. ఆస్ట్రేలియా పర్యటన నుంచి అతడిని పక్కనపెట్టారు. టెస్టుల్లో బౌలింగ్ చేసే స్థాయిలో ఫిట్‌నెస్ సాధించలేదన్న కారణంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి ఎంపిక చేయలేదు.
అయితే, తదుపరి టీమిండియా సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. జనవరి 22 నుంచి ఐదు టీ20, మూడు వన్డేలు ఆడనుంది. ఈ నేపథ్యంలో షమీ పది ఓవర్ల కోటా ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేసి.. తానూ రేసులో ఉన్నానని సెలక్టర్లకు గట్టి సందేశం ఇచ్చాడు.
చదవండి: ‘చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టు ఇదే.. వాళ్లిద్దరికి నో ఛాన్స్!’
Comments
Please login to add a commentAdd a comment