మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఈడెన్ గార్డెన్స్‌లో ఆడనున్న 199వ టెస్టును మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు బెంగాల్ క్రికెట్ సంఘం ప్రయత్నాలు చేస్తోంది.
కోల్‌కతా: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఈడెన్ గార్డెన్స్‌లో ఆడనున్న 199వ టెస్టును మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు బెంగాల్ క్రికెట్ సంఘం ప్రయత్నాలు చేస్తోంది. దీంట్లో భాగంగా ఈ టెస్టు కోసం అమ్మే టిక్కెట్లపై సచిన్ ఫొటోను ముద్రించేందుకు అనుమతివ్వాల్సిందిగా బీసీసీఐని కోరనుంది. నవంబర్ 6 నుంచి 10 వరకు ఈ మ్యాచ్ జరుగుతుంది. ‘మామూలుగా అయితే టిక్కెట్లపై ఎవరి ఫొటోలను ముద్రించం. అయితే ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత ఉంది కాబట్టి ఈడెన్‌లో అతడాడిన ఇన్నింగ్స్ ఫొటోను ముద్రించేందుకు బోర్డును అనుమతి కోరనున్నాం. అనుమతి లభించాక ప్రింట్‌కు ఆర్డర్ ఇస్తాం. ఇది అభిమానులకు చిరకాలం జ్ఞాపకంగా ఉంటుంది’ అని క్యాబ్ కోశాధికారి విశ్వరూప్ డే అన్నారు.
‘క్రీడా శాఖతో కలిసి మాస్టర్ పనిచేయాలి’
న్యూఢిల్లీ: భారత దేశంలో క్రీడలు మరింత అభివృద్ధి సాధించేందుకు భవిష్యత్‌లో సచిన్ టెండూల్కర్ తమ శాఖతో కలిసి పనిచేస్తే బాగుంటుందని క్రీడల మంత్రి జితేంద్ర సింగ్ అభిప్రాయపడ్డారు. అతడి గౌరవార్థం త్వరలో సన్మాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసే ఆలోచన ఉందన్నారు. ‘మా శాఖ తరఫున మాస్టర్‌కు అవార్డు ఇవ్వనున్నాం. అభిమానిగా అతని చివరి టెస్టును ప్రత్యక్షంగా చూసేందుకు ప్రయత్నిస్తాను’ అని జితేంద్ర సింగ్ అన్నారు.