
నిశ్శబ్దం..!
...ఎంత భయంకరంగా ఉంటుందో రెండోరోజు ఆటలో ఈడెన్ గార్డెన్స్‌లో అభిమానులకు తెలిసి ఉంటుంది. సచిన్ టెండూల్కర్ అవుట్ కాగానే స్టేడియం అంతా షాక్. అయితే అది కొన్ని సెకన్ల పాటే. ఆ వెంటనే స్టేడియంలో అందరూ నిలబడి మాస్టర్‌కు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.
సచిన్ బ్యాటింగ్ కోసం రెండో రోజు ఉదయం అభిమానులు ఆత్రంగా స్టేడియానికి వచ్చారు. ఆటలో 39 నిమిషాలు గడిచాక విజయ్ అవుట్ కాగానే... సచిన్... సచిన్... అంటూ అభిమానులు హోరెత్తించారు. మొత్తం 41 నిమిషాల పాటు క్రీజులో గడిపిన మాస్టర్ రెండు క్లాసికల్ బౌండరీలతో అలరించాడు. ఆ తర్వాత షిల్లింగ్‌ఫోర్డ్ దూస్రాకు మాస్టర్ అవుట్ కాగానే స్టేడియంలో సూదిపడ్డా వినిపించేంత నిశ్శబ్దం ఆవరించింది.
ఎంత పని చేశావు లాంగ్!
అంపైర్లు పొరపాట్లు చేయడం సహజం. వాళ్లు కూడా మనుషులే. కానీ ఒక్కోసారి అంపైర్ పొరపాటు ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. తొలిటెస్టులో ఇంగ్లండ్ అంపైర్ నైజిల్ లాంగ్ చేసింది కూడా అలాంటిదే. తన ఒక్క తప్పుడు నిర్ణయంతో కోట్లాది మంది హృదయాల్ని బాధపెట్టాడు. షిల్లింగ్‌ఫోర్డ్ వేసిన బంతి సచిన్ వెనక కాలికి పైభాగంలో తగిలింది. ఇది వికెట్ల కంటే కనీసం నాలుగు నుంచి ఆరు అంగుళాలు పైకి వెళుతుందని రీప్లేల్లో తేలింది. లాంగ్ తప్పుడు నిర్ణయంతో సచిన్‌ను అవుట్‌గా ప్రకటించాడు. దీంతో భారత అభిమానులంతా తీవ్రంగా నిరాశ చెందారు. మళ్లీ భారత్ రెండో ఇన్నింగ్స్ ఆడి, సచిన్‌కు బ్యాటింగ్ అవకాశం వస్తే తప్ప... ఈడెన్‌లో ఇక ఇంతే..!
‘ఓయ్’ బెస్ట్..!
భారత్‌లో పాపులారిటీ రావాలంటే మైదానంలో ఏదో ఒకటి చేయాలి... చాలామంది విదేశీ క్రికెటర్లకు తెలిసిన విషయం ఇది. వెస్టిండీస్ బౌలర్ బెస్ట్ కూడా తన ‘అతి’ వేషాలతో కాస్త పాపులారిటీ తెచ్చుకోవాలనుకున్నాడు. ఇన్నింగ్స్ 56వ ఓవర్లో రోహిత్ శర్మపై స్లెడ్జింగ్‌కు దిగాడు. అయితే భారత స్టార్ మాత్రం మౌనంగానే ఉన్నాడు. ప్రతి బంతికీ రోహిత్ దగ్గరకి వెళ్లి బెస్ట్ కవ్వించాడు. దీంతో ప్రేక్షకులు బౌలర్‌పై గోలకు లేచారు. రోహిత్ దగ్గరకు బెస్ట్ వెళ్లినప్పుడల్లా ‘ఓయ్’ అంటూ కేకలు పెట్టారు. భారత ప్రేక్షకుల ధాటి తెలుసుకున్న బెస్ట్ ఆ తర్వాత మళ్లీ రోహిత్ జోలికి రాలేదు. కాకపోతే ప్రేక్షకులకు నమస్కారం, ఫ్లయింగ్ కిస్‌లతో సందడి చేశాడు.