‘సూపర్ ఫాస్ట్’ షమీ | super fast baller Mohammed Shami | Sakshi
Sakshi News home page

‘సూపర్ ఫాస్ట్’ షమీ

Published Sun, Nov 10 2013 1:03 AM | Last Updated on Sat, Sep 2 2017 12:28 AM

‘సూపర్ ఫాస్ట్’ షమీ

‘సూపర్ ఫాస్ట్’ షమీ

స్పిన్నర్లకు అనుకూలించే భారత పిచ్‌లపై ఒక పేసర్ మ్యాచ్ గెలిపించడం పెద్ద సంచలనం. అదీ ఒక భారత్ పేసర్ ఒంటిచేత్తో టెస్టు మ్యాచ్ గెలిపించగలడనేది ఇన్నాళ్లూ ఓ ఊహ, ఓ ఆశ మాత్రమే. దీనిని నిజం చేశాడు మహ్మద్ షమీ. వెస్టిండీస్‌తో తొలి టెస్టులో సంచలన రివర్స్ స్వింగ్ బౌలింగ్‌తో తన కెరీర్‌కు అద్భుతమైన ఫ్లాట్‌ఫామ్ సిద్ధం చేసుకున్నాడు.
 
 సాక్షి క్రీడా విభాగం: సచిన్ టెండూల్కర్ చివరి సిరీస్‌లో ఆడే అవకాశం రావడం... అది కూడా సొంత ప్రేక్షకుల మధ్య ఈడెన్‌గార్డెన్స్‌లాంటి ప్రతిష్టాత్మక మైదానంలో టెస్టు అరంగేట్రం చేయడం... టెస్టులు చూడటానికి ప్రేక్షకులు కరువైన రోజుల్లో వేలాది మంది మధ్య బౌలింగ్ చేసే అవకాశం రావడం.... మహ్మద్ షమీకి అంతా కలలా ఉండి ఉంటుంది. మొత్తం ప్రపంచం అంతా సచిన్ కోసం చూస్తున్న మ్యాచ్‌లో 23 ఏళ్ల షమీ హీరోలా మారాడు. భారత్‌కు పేస్ బౌలర్ అవసరం బాగా ఎక్కువగా ఉన్న సమయంలో ఆశాకిరణంలా కినిపించాడు. 140కి.మీ.ల వేగంతో స్థిరంగా బంతులు విసురుతూ మన దగ్గరా ఓ పేసర్ ఉన్నాడని చూపించాడు. వేగంతో పాటు రివర్స్ స్వింగ్ ను రాబట్టడం షమీ ప్రత్యేకత. తన బౌలింగ్‌తో తొలి రోజే భారత్ వైపు మ్యాచ్‌ను తిప్పా డు. తన పేస్‌తో మూడో రోజే ‘కథ’ ముగించాడు.
 
 స్వింగే కలిసొచ్చింది
 జట్టులో ఇప్పుడు ప్రధాన పేసర్‌గా భువనేశ్వర్‌కు చోటు ఖాయంగా ఉంది. ఇషాంత్ శర్మ ఇటీవలి ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో దారుణంగా చతికిల పడడంతో రెండో పేసర్ కోసం ఉమేశ్ యాదవ్, షమీ మధ్య పోటీ నెలకొంది. ఓకవేళ పేస్ ప్రధానాంశంగా తీసుకుంటే ఆ స్థానం కచ్చితంగా ఉమేశ్ యాదవ్‌కే వెళుతుంది. కానీ షమీ బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలడు. అంతేకాకుండా విండీస్ ఆటగాళ్లు షమీ బౌలింగ్‌ను ఎప్పుడూ ఎదుర్కొంది లేదు. ఇదే అతడికి కలిసొచ్చింది. తొలి టెస్టుకు రెండు రోజుల ముందు భువనేశ్వర్‌తో కలిసి తన పేస్‌తో నెట్స్‌లో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందిపెట్టాడు.
 
  తుది జట్టులో చోటు దక్కడంతో ఇదే ఊపును ప్రత్యర్థి ఆటగాళ్లపై ప్రదర్శించాడు. అదీగాకుండా సొంత మైదానంలో కెరీర్ తొలి మ్యాచ్ ఆడుతున్నప్పుడు సహజంగానే ఒత్తిడి ఉంటుంది. అయితే సచిన్ ఫేర్‌వెల్ టెస్టు కావడంతో అందరి ఆలోచనలు అటువైపే కొనసాగడంతో షమీ ఎలాంటి ఆందోళన లేకుండా తన పని తాను కానిచ్చాడు. ఇక ఇప్పుడు తనపై ఏర్పడిన అంచనాలను అందుకుంటూ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం షమీ భుజస్కంధాలపై ఉంది.
 
 పాత బంతితో ప్రమాదకారి
 వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో షమీ తీసిన తొమ్మిది వికెట్లలో ఏకంగా ఏడు వికెట్లు రివర్స్ స్వింగ్ ద్వారా తీసినవే. అయితే ఈ సామర్థ్యాన్ని షమీ 16 ఏళ్లప్పుడే సాధించాడు. అండర్-16 విభాగంలో ఆడుతూ స్వింగ్‌తో ప్రత్యర్థి ఆటగాళ్లను బెంబేలెత్తించేవాడు. రివర్స్ డెలివరీ కోసం చాలా సాధన చేసేవాడు. ఈ నైపుణ్యాన్ని అతడు సొంత ఊరు మొరాదాబాద్‌లోనే నేర్చుకున్నాడు. కోచ్‌లను అడిగి వాడిన బంతులను ఇంటికి తీసుకెళ్లి వాటితో సాధన చేసేవాడు.
 
 చిన్న పట్టణం నుంచి అంతర్జాతీయ స్థాయికి..
 షమీది పూర్తిగా గ్రామీణ నేపథ్యం. ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు సమీపంలోని సహస్‌పూర్ గ్రామం లో షమీ జన్మించాడు. తండ్రి రైతు. క్రికెటర్‌గా మారేందుకు ఎలాంటి కనీస సౌకర్యాలు కూడా లేని ప్రాంతం నుంచి షమీ పట్టుదలగా పైకి వచ్చాడు. పేస్ బౌలింగ్ తనకు కుటుంబ వారసత్వంగా వచ్చిందని షమీ చెబుతుంటాడు. తండ్రి, మామయ్య, అన్నయ్య అందరూ పేస్ బౌలర్లేనని కానీ వారెప్పుడూ ఏ స్థాయి క్రికెట్ కూడా ఆడలేదంటాడు. యూపీ అండర్-19 జట్టులో చోటు దక్కకపోవడంతో 2006 కోల్‌కతాకు మకాం మార్చాడు. అక్కడ మాజీ క్రికెటర్ అరుణ్ లాల్ అకాడమీలో చేరి రాటుదేలి క్లబ్ స్థాయి క్రికెట్ ఆడాడు. బెంగాల్ అండర్ -22 జట్టు సభ్యుడయ్యాడు. అలాగే బెంగాల్ రంజీ జట్టుకి, ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఆడుతున్నాడు. 18 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లోనే 71 వికెట్లు తీసుకోవడంతో సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఈ ఏడాది జనవరిలో పాక్‌పై వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఇటీవల ఆసీస్‌తో చివరి మూడు వన్డేలు ఆడి ఏడు వికెట్లు తీశాడు.
 
 ఓ తలనొప్పి తగ్గినట్లే!
 డిసెంబరులో దక్షిణాఫ్రికా పర్యటన భారత జట్టుకు పెద్ద సవాల్. పేస్ బౌలింగ్ వికెట్లపై ఈ లైనప్‌తో వెళ్లి ఏం చేయాలనేది ఇన్నాళ్లూ ధోనికి ఉన్న పెద్ద తలనొప్పి. ఇప్పుడు షమీ రూపంలో జట్టుకు కాస్త ఊరట లభించినట్లే. వేగంలో చూపిస్తున్న నిలకడ... బంతిని రెండు వైపులా స్వింగ్ చేయడం... ముఖ్యంగా పాత బంతితో రివర్స్ స్వింగ్ రాబట్టడం... ఇవన్నీ ఒకే బౌలర్ స్థిరంగా చేయడంతో పేస్ విభాగంలో కాస్త కష్టాలు తీరినట్లే. అయితే ఇక ప్రత్యర్థులంతా షమీని జాగ్రత్తగా పరిశీలించి మ్యాచ్‌కు వస్తారు. దీనికి తగ్గట్లే ఈ యువ బౌలర్ కూడా నిరంతరం మెరుగుపడుతూ ఉండాలి. లేకపోతే వన్ మ్యాచ్ వండర్‌గా మిగిలే ప్రమాదం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement