సిడ్నీ : ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత్ వరుస పరాజయాల పట్ల అభిమానులతో పాటు మాజీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దూసుడైన ఆటతీరుకు చిరునామాగా ఉన్న ఆసీస్ గడ్డపై సరైన ప్రణాళిక లేకుండా టీమిండియా బరిలో నిలిచిందనే విమర్శ వినిపిస్తోంది. ప్రత్యర్థి ఆటగాళ్లను కట్టడిచేయకపోగా.. అనుభవజ్ఞులైన పేసర్లు సైతం ధారాళంగా పరుగులు సమర్పించడం ఆందోళన కలిగిస్తోంది. మూడు వన్డే సిరీస్‌లో భాగంగా ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారత బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేదు. ప్రధాన బౌలర్లు షమీ, బుమ్రాతో పాటు ఐపీఎల్ ద్వారా జట్టులో చోటుదక్కించుకున్న నవదీప్ సైనీ సైతం చేతులెత్తేశాడు. ఓవైపు బలమైన బ్యాటింగ్ ఆర్డర్ కలిగి ఉన్నప్పటికీ.. బౌలింగ్‌లో పసలేకపోవడం టీమిండియా ఓటమికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. పసలేని భారత్ బౌలింగ్‌ను చితకబాదిన ఆసీస్ ఆటగాళ్లు.. తొలి వన్డేలో 375, రెండో వన్డేలో 390 పరుగులు సాధించారు. ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో ఓటమిచెంది సిరీస్‌ను కోల్పోయిన భారత్.. చివరిదైన మూడే వన్డేకు సిద్ధమయ్యింది. (రవి శాస్త్రిని టీంనుంచి బయటకు పంపాలి)
ఈ నేపథ్యంలో గత మ్యాచ్‌ల్లో భారత ఆటగాళ్ల ప్రదర్శపై టీమిండియా మాజీ ఆటగాడు సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ స్పందించాడు. భారత్ టాప్ ఆర్డర్‌లో వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండుల్కర్ వంటి ఆటగాళ్ల లేరని అభిప్రాయపడ్డారు. మంగళవారం ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో బద్రీనాథ్ మాట్లాడుతూ.. ‘ఆసీస్ సీరిస్‌లో భారత బౌలర్ల వైఫల్యం ప్రధానంగా కనిపిస్తోంది. ప్రధాన బౌలర్లు షమీ, బుమ్రా ధారాళంగా పరుగులు ఇచ్చారు. వికెట్ల వేటలో వెనుకబడ్డారు. అయితే అన్ని పిచ్‌లు బౌలర్లుకు అనుకూలంగా ఉంటాయని చెప్పలేం. భారత టాప్‌ఆర్డర్‌లో సెహ్వాగ్, సచిన్, గంగూలీ వంటి ఆటగాళ్ల లేనిలోటు స్పష్టంగా కనిపిస్తోంది. వీరు బ్యాటింగ్‌తో పాటు వీలైన సందర్భాల్లో బౌలింగ్ కూడా చేయగలరు. బౌలర్లు అలసిపోయినప్పుడు, పిచ్‌కు పేస్‌కు అనుకూలించనప్పుడు వీరు బౌలింగ్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. (ఆసీస్ గడ్డపై ఇదే తొలిసారి..)
వీరు ముగ్గురు కలిసి 10 ఓవర్ల వరకు బౌలింగ్ చేయగలరు. కానీ ఇప్పుడు పరిస్థితి అలాలేదు. భారమంతా బౌలర్ల మీదే పడుతోంది. వారు విఫలమైన సందర్భాల్లో ఆదుకోవడానికి టీంలో ఒక్కరు కూడా పార్ట్‌టైం బౌలర్లు లేరు. ధావన్, అగర్వాల్, శ్రేయస్ అయ్యార్, కేఎల్ రాహుల్, వీరిలో ఎవరూ కూడా బౌలింగ్ చేయలేరు. గతంలో రోహిత్ స్పిన్నర్‌గా జట్టుగా అందుబాటులో ఉండేవాడు. ఇప్పుడు దూరంగా ఉంటున్నారు. ఆల్‌రౌండర్ హర్థిక్ పాండ్యా సైతం బౌలింగ్ చేసే పరిస్థితిలో లేడు. ఈ పరిణామం టీమిండియాకు ఇబ్బందికరంగా మారింది.’ అని అభిప్రాయపడ్డాడు. కాగా చివరి వన్డే బుధవారం జరుగనున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment