veerendra sehwag
-
సచిన్, సెహ్వాగ్ లాంటి ఆటగాళ్లు లేరు..
సిడ్నీ : ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత్ వరుస పరాజయాల పట్ల అభిమానులతో పాటు మాజీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దూసుడైన ఆటతీరుకు చిరునామాగా ఉన్న ఆసీస్ గడ్డపై సరైన ప్రణాళిక లేకుండా టీమిండియా బరిలో నిలిచిందనే విమర్శ వినిపిస్తోంది. ప్రత్యర్థి ఆటగాళ్లను కట్టడిచేయకపోగా.. అనుభవజ్ఞులైన పేసర్లు సైతం ధారాళంగా పరుగులు సమర్పించడం ఆందోళన కలిగిస్తోంది. మూడు వన్డే సిరీస్‌లో భాగంగా ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారత బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేదు. ప్రధాన బౌలర్లు షమీ, బుమ్రాతో పాటు ఐపీఎల్ ద్వారా జట్టులో చోటుదక్కించుకున్న నవదీప్ సైనీ సైతం చేతులెత్తేశాడు. ఓవైపు బలమైన బ్యాటింగ్ ఆర్డర్ కలిగి ఉన్నప్పటికీ.. బౌలింగ్‌లో పసలేకపోవడం టీమిండియా ఓటమికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. పసలేని భారత్ బౌలింగ్‌ను చితకబాదిన ఆసీస్ ఆటగాళ్లు.. తొలి వన్డేలో 375, రెండో వన్డేలో 390 పరుగులు సాధించారు. ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో ఓటమిచెంది సిరీస్‌ను కోల్పోయిన భారత్.. చివరిదైన మూడే వన్డేకు సిద్ధమయ్యింది. (రవి శాస్త్రిని టీంనుంచి బయటకు పంపాలి) ఈ నేపథ్యంలో గత మ్యాచ్‌ల్లో భారత ఆటగాళ్ల ప్రదర్శపై టీమిండియా మాజీ ఆటగాడు సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ స్పందించాడు. భారత్ టాప్ ఆర్డర్లో వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండుల్కర్ వంటి ఆటగాళ్ల లేరని అభిప్రాయపడ్డారు. మంగళవారం ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో బద్రీనాథ్ మాట్లాడుతూ.. ‘ఆసీస్ సీరిస్‌లో భారత బౌలర్ల వైఫల్యం ప్రధానంగా కనిపిస్తోంది. ప్రధాన బౌలర్లు షమీ, బుమ్రా ధారాళంగా పరుగులు ఇచ్చారు. వికెట్ల వేటలో వెనుకబడ్డారు. అయితే అన్ని పిచ్‌లు బౌలర్లుకు అనుకూలంగా ఉంటాయని చెప్పలేం. భారత టాప్ఆర్డర్లో సెహ్వాగ్, సచిన్, గంగూలీ వంటి ఆటగాళ్ల లేనిలోటు స్పష్టంగా కనిపిస్తోంది. వీరు బ్యాటింగ్‌తో పాటు వీలైన సందర్భాల్లో బౌలింగ్ కూడా చేయగలరు. బౌలర్లు అలసిపోయినప్పుడు, పిచ్‌కు పేస్‌కు అనుకూలించనప్పుడు వీరు బౌలింగ్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. (ఆసీస్ గడ్డపై ఇదే తొలిసారి..) వీరు ముగ్గురు కలిసి 10 ఓవర్ల వరకు బౌలింగ్ చేయగలరు. కానీ ఇప్పుడు పరిస్థితి అలాలేదు. భారమంతా బౌలర్ల మీదే పడుతోంది. వారు విఫలమైన సందర్భాల్లో ఆదుకోవడానికి టీంలో ఒక్కరు కూడా పార్ట్‌టైం బౌలర్లు లేరు. ధావన్, అగర్వాల్, శ్రేయస్ అయ్యార్, కేఎల్ రాహుల్, వీరిలో ఎవరూ కూడా బౌలింగ్ చేయలేరు. గతంలో రోహిత్ స్పిన్నర్‌గా జట్టుగా అందుబాటులో ఉండేవాడు. ఇప్పుడు దూరంగా ఉంటున్నారు. ఆల్‌రౌండర్ హర్థిక్ పాండ్యా సైతం బౌలింగ్ చేసే పరిస్థితిలో లేడు. ఈ పరిణామం టీమిండియాకు ఇబ్బందికరంగా మారింది.’ అని అభిప్రాయపడ్డాడు. కాగా చివరి వన్డే బుధవారం జరుగనున్న విషయం తెలిసిందే. -
రాయని డైరీ: వీరేందర్ సెహ్వాగ్ (కామెంటేటర్)
‘‘సర్, మిమ్మల్ని కలవాలి’’ అని సునీల్ గావస్కర్ సర్కి ఫోన్ చేశాను. ‘‘ఒకే బాక్సులోనే కదా ఉంటాము, పని కట్టుకుని కలవడం దేనికి?’’ అని అడిగారు గావస్కర్ సర్. ‘‘బాక్సుకు దూరంగా కలవాలి సర్, నా మనసేం బాగోలేదు’’ అని చెప్పాను. ‘‘సరే’’ అన్నారు సర్. ‘‘సర్, మిమ్మల్ని కలవాలి’’ అని సంజయ్ మంజ్రేకర్ సర్కి ఫోన్ చేశాను. ఆయన బాక్సులో లేరు కనుక ‘‘ఎక్కడ కలుద్దాం?’’ అని మాత్రం అడిగారు. ఐపీల్ మొదలైనప్పట్నుంచీ మంజ్రేకర్ సర్ ఇక్కడిక్కడే దుబాయ్‌లో తిరుగుతున్నారు. నోరు మంచిది కాదని, బీసీసీఐ ఈసారి ఆయన్ని కామెంటరీ బాక్సుకు దూరంగా పెట్టింది. ముగ్గురం ఒక చోట కలుసుకున్నాం. ‘‘గావస్కర్ సర్ కూడా వస్తున్నట్లు చెప్పలేదు!’’ అని నా వైపు చూస్తూ ఆశ్చర్యపోయారు మంజ్రేకర్ సర్. ‘‘మనసు బాగోలేక, చెప్పడం మర్చిపోయాను సర్’’ అన్నాను. పెద్దగా నవ్వారు గావస్కర్ సర్, మంజ్రేకర్ సర్. ‘‘మనసు బాగుంటుందని, బాగుండాలని ఎలా అనుకుంటావు సెహ్వాగ్! నూట నలభై కోట్ల మనోభావాల మధ్య మనం జీవిస్తున్నాం, మర్చిపోకు’’ అన్నారు గావస్కర్ సర్. అవునన్నట్లు నవ్వారు మంజ్రేకర్ సర్. ‘‘కామెంటేటర్‌కు ఉండవా సర్, మనోభావాలు?! సన్‌రైజర్స్‌కు బ్యాటింగ్ దమ్ము లేదు అన్నందుకు ‘నీ దమ్మెంతో చూపించు చూస్తాం’ అని సోషల్ మీడియాలో నన్ను ట్రోల్ చేస్తున్నారు. రిటైర్ అయినవాణ్ణి నేనేం చూపిస్తాను. దమ్ము లేదు అని నేను రెచ్చగొట్టినందుకే కదా కింగ్స్ లెవన్ మీద సన్‌రైజర్స్ గెలిచింది. ఒకటేదైనా అంటే ఇంకోటేదో అర్థం చేసుకోవడమేనా ఈ మనోభావాల పని!’’ అన్నాను. గావస్కర్ సర్ నా వైపు ఆవేదనగా చూశారు. ఆయన ఆవేదనగా చూస్తున్నారు కదా మళ్లీ తను కూడా ఆవేదనగా చూడటం ఎందుకు అనేమో మంజ్రేకర్ సర్ నా వైపు మామూలుగా చూశారు. ‘‘సెహ్వాగ్. ఏదో ఒకటి అనకుండా ఉండ కూడని వృత్తిలో ఉన్నవారు, ఏదో ఒకటి అనిపించుకోకుండా ఉండరు. కోహ్లీ భార్య మనోభావాలను నువ్వు వినే ఉంటావు. ‘సన్‌రైజర్స్‌కి బ్యాటింగ్ దమ్ము లేదు’ అని నువ్వు ఇప్పుడు ప్రేరణ కలిగించినట్లే, ‘భార్య బౌలింగ్‌లో మాత్రమే ప్రాక్టీస్ చేసి ఉండకపోతే కోహ్లీ బ్యాటింగ్‌కి దమ్ము ఉండేది’ అని నేను మొన్న ప్రేరణ కలిగించాను. ఆ మాటకు ఆమె హర్ట్ అయ్యారు. మరికొన్ని మనోభావాలకైతే నా మాటల్లో డబుల్ మీనింగ్ కూడా కనిపించింది. ఇవన్నీ పట్టించుకోకు’’ అన్నారు గావస్కర్ సర్. ‘‘మరి నేనేం అనుకోవాలి?’’ అన్నారు మంజ్రేకర్ సర్. ‘‘అవును, మంజ్రేకర్ ఏమనుకోవాలి..’’ అంటూ పెద్దగా నవ్వి మంజ్రేకర్ సర్ భుజం తట్టారు గావస్కర్ సర్. ‘‘నన్నసలు ఈసారి కామెంటరీ బాక్సు లోనికే రానివ్వలేదు. సచిన్‌ని ఓసారెప్పుడో ఏనుగు అని అన్నానట. మనోభావాలు నాపైకి బ్యాట్లు పట్టుకుని వచ్చేశాయి. నేనన్నది వేరే. సచిన్ ఏనుగులాంటి వాడు అన్నాను. ఎంత సేపని ‘సచిన్ బాగా ఆడుతున్నాడు’ అని కామెంటరీ ఇవ్వగలం. అదే భావాన్ని వేరే మాటల్లో చెప్పాలని ఉండదా కామెంటేటర్‌కు?!’’ అన్నారు మంజ్రేకర్ సర్. సర్లు ఇద్దరిలో ఇంత వాక్యూమ్ ఉందని నాకు తెలియదు! ‘‘ఎలా సర్ మరి, మనోభావాలకు భంగం కలిగించకుండా ఉండటం?!’’ అన్నాను. ఇద్దరూ మళ్లీ పెద్దగా నవ్వారు. ‘‘భంగం కలిగించకూడదని ప్రయత్నించకు. మరింతగా భంగపడతాయి’’ అన్నారు! - మాధవ్ శింగరాజు -
నువ్వా.. నేనా.. తేలేది నేడే!!
ఒకటిన్నర నెలలకు పైగా మురిపించిన క్రికెట్ సమరం.. ముగింపు దశకు వచ్చేసింది. అడుగడుగునా సంచలనాలు నమోదు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు ఎక్కడలేని మజాను అందించింది. దిగ్గజాలు అనుకున్న ధోనీసేన క్వాలిఫయర్ దశలో పంజాబ్ చేతిలో అనూహ్యంగా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. వీరేంద్ర సెహ్వాగ్ ఒక్కసారిగా విరుచుకుపడి ఏకంగా 122 పరుగులు చేయడంతో సురేష్ రైనా 87 పరుగులు చేసినా కూడా చెన్నై సూపర్ కింగ్స్ తన లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. అలాంటి అరివీర భయంకరమైన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టును లీగ్ దశలో ఓడించిన ఏకైక టీమ్.. కోల్‌కతా నైట్ రైడర్స్. గౌతమ్ గంభీర్ సారథ్యంలోని ఈ జట్టు మరోసారి ఐపీఎల్ కప్పును అందుకోడానికి ఉరకలెత్తే ఉత్సాహంతో మంచి దూకుడుమీద ఉంది. కాగా, ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ విజేతగా నిలవలేక, నీరసించిన పంజాబ్.. తొలిసారి ఫైనల్ దశకు చేరుకోవడంతో ఈసారి అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేజార్చుకోకూడదని మంచి పట్టుదలతో ఉంది. దానికితోడు.. వీరేంద్ర సెహ్వాగ్ మంచి దూకుడుమీద ఉండటం.. కేవలం 58 బంతుల్లోనే అరివీర భయంకరంగా సిక్సులు, ఫోర్ల వరదతో 122 పరుగులు చేసిన అనుభవం ఉండటంతో కాస్త ఆశాభావంతో కూడా కనిపిస్తోంది. రాత్రి 8 గంటలకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మొదలయ్యే ఈ మ్యాచ్ ఎంతటి నరాలు తెగే ఉత్కంఠను సృష్టిస్తుందో చూడాలి మరి!! -
అక్కడ పిల్ల.. ఇక్కడ పిల్లోడు!
క్రికెట్ అభిమానికి ఎప్పటికీ గుర్తుండే మ్యాచ్ ఏదైనా ఉందంటే.. అది నిన్న జరిగిన ఐపీఎల్ 7 క్వాలిఫయర్ 2 మ్యాచ్ . పంజాబ్ కింగ్స్ ఎలెవన్-చెన్నైసూపర్ కింగ్స్ లు వీరోచితంగా తలపడిన శుక్రవారం నాటి మ్యాచే ఇందుకు ఉదాహరణ. ఆ మ్యాచ్ ల్లో రెండు విధ్వంసకర ఇన్నింగ్స్ లు. ఒకటి పంజాబ్ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ది అయితే.. రెండోది చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేష్ రైనాది. ఆ రెండు ఇన్నింగ్స్ ల వెనుక చాలా చిత్రమైన కారణాలే ఉన్నాయట.. సెహ్వాగ్ ఇన్నింగ్స్ కు అతని కుమారుడు ఆర్యవీర్ నే ప్రధాన కారణం. ఎందుకు డాడీ ఊరికే అవుటవుతున్నావు? మీడాడీకి పరుగులు చేయడం చేతకాదంటూ స్కూల్ లో స్నేహితులు ఏడిపిస్తున్నారు' అంటూ కొద్ది రోజుల క్రితం సెహ్వాగ్ కు ఫోన్ చేసిన ఆర్యవీర్ వ్యక్తం చేసిన ఆవేదనకు ప్రతిఫలమే ఇది. 'నేను తప్పకుండా భారీ పరుగులు చేస్తా' అని చెప్పిన వీరూ..చెన్నైతో జరిగిన మ్యాచ్ లో రెచ్చిపోయి తన కుమారుడు గర్వపడేలా చేశాడు. కేవలం 58 బంతులను ఎదుర్కొన్న సెహ్వాగ్ 122 పరుగులు చేసి పంజాబ్ 226 భారీ స్కోరు చేయడంలో తోడ్పడ్డాడు. దీంతో పంజాబ్ తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని అంతా భావించారు. కాగా, ఛేజింగ్ తో బరిలోకి దిగిన చెన్నై మాత్రం గెలిచేంత పనిచేసింది. డుప్లిసెస్ తొలి ఓవర్లనే అవుటయ్యి అభిమానులను నిరాశపరిచినా.. రైనా తుఫాను వేగంతో ఆడిన తీరు మాత్రం నిజంగా వెలకట్టలేనిదే. కేవలం 25 బంతులను మాత్రమే ఎదుర్కొన్న రైనా 12 ఫోర్లు, 6 సిక్స్ లతో 87 పరుగులు చేశాడు. దీని ఫలితంగా చెన్నై ఆరు ఓవర్లనే 100 పరుగులు చేసింది. రైనా సూపర్ ఇన్నింగ్స్ లు ఆడుతూ ముందుకు వెళ్లడానికి కూడా కారణం ఉందట. విశ్వవిఖ్యాత నటుడు కమల్ హాసన్ కుమార్తె శ్రుతి హాసన్ ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ ఏస్ బ్యాట్స్‌మన్ సురేష్ రైనాతో రొమాన్స్ చేయడమేనట. రైనా ఎక్కడ మ్యాచ్ ఆడినా అక్కడకు వెళ్తూ చెన్నై టీంకు తన మద్దతు పలుకుతూ ఐపీఎల్-6 సీజన్లో ఈ చిన్నది సందడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అది మరింత దూరం వెళ్లి వీళ్లిద్దరి రొమాన్స్‌కు దారితీసిందని ఒక జాతీయ పత్రిక తెలిపింది. సాధారణంగా శ్రుతి వచ్చిందంటే చాలు.. రైనా రెచ్చిపోయి ఆడేవాడట. ఈసారి ఆమె మైదానాలకు రాకపోయినా రైనా రెచ్చిపోయి ఆడటానికి శ్రుతినే కారణమనే ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి.