నువ్వా.. నేనా.. తేలేది నేడే!!
ఒకటిన్నర నెలలకు పైగా మురిపించిన క్రికెట్ సమరం.. ముగింపు దశకు వచ్చేసింది. అడుగడుగునా సంచలనాలు నమోదు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు ఎక్కడలేని మజాను అందించింది. దిగ్గజాలు అనుకున్న ధోనీసేన క్వాలిఫయర్ దశలో పంజాబ్ చేతిలో అనూహ్యంగా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. వీరేంద్ర సెహ్వాగ్ ఒక్కసారిగా విరుచుకుపడి ఏకంగా 122 పరుగులు చేయడంతో సురేష్ రైనా 87 పరుగులు చేసినా కూడా చెన్నై సూపర్ కింగ్స్ తన లక్ష్యాన్ని అందుకోలేకపోయింది.
అలాంటి అరివీర భయంకరమైన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టును లీగ్ దశలో ఓడించిన ఏకైక టీమ్.. కోల్కతా నైట్ రైడర్స్. గౌతమ్ గంభీర్ సారథ్యంలోని ఈ జట్టు మరోసారి ఐపీఎల్ కప్పును అందుకోడానికి ఉరకలెత్తే ఉత్సాహంతో మంచి దూకుడుమీద ఉంది. కాగా, ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ విజేతగా నిలవలేక, నీరసించిన పంజాబ్.. తొలిసారి ఫైనల్ దశకు చేరుకోవడంతో ఈసారి అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేజార్చుకోకూడదని మంచి పట్టుదలతో ఉంది. దానికితోడు.. వీరేంద్ర సెహ్వాగ్ మంచి దూకుడుమీద ఉండటం.. కేవలం 58 బంతుల్లోనే అరివీర భయంకరంగా సిక్సులు, ఫోర్ల వరదతో 122 పరుగులు చేసిన అనుభవం ఉండటంతో కాస్త ఆశాభావంతో కూడా కనిపిస్తోంది. రాత్రి 8 గంటలకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మొదలయ్యే ఈ మ్యాచ్ ఎంతటి నరాలు తెగే ఉత్కంఠను సృష్టిస్తుందో చూడాలి మరి!!