ముంబై: ఫిబ్రవరి 18న ఐపీఎల్-2021 వేలం పురస్కరించుకొని బీసీసీఐ తెచ్చిన కొత్త నిబంధన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌కు తలనొప్పిలా మారనుంది. ప్రతి జట్టు ఆటగాళ్ల కొనుగోలుకు సంబంధించి మొత్తం కేటాయించిన దాంట్లో (ప్రతీ జట్టుకు రూ.85కోట్లు) 75 శాతం ఖర్చు చేయాలని.. అలా లేని పక్షంలో ఆ డబ్బులు బీసీసీఐ ఖాతాలోకి జమకానున్నాయి. ఈసారి ఐపీఎల్ వేలంలో పాల్గొననున్న ఫ్రాంచైజీల్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ వద్ద అత్యధికంగా రూ. 53.2 కోట్లు ఉన్నాయి. పంజాబ్ జట్టు 16 మందిని రిటైన్ చేసుకొని మిగిలిన వారిని రిలీజ్ చేసింది. వీరిలో గత ఐపీఎల్‌లో తీవ్రంగా నిరాశపరిచిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ సహా షెల్డన్ కాట్రెల్, కె. గౌతమ్, ముజీబ్ ఉర్ రెహమాన్, జిమ్మి నీషమ్, హార్డస్ విల్‌జెన్‌లోపాటు కరుణ్ నాయర్, సుచిత్, తేజిందర్ సింగ్ దిల్లాన్ తదితరులు ఉన్నారు.
బీసీసీఐ వెల్లడించిన కొత్త నిబంధనల ప్రకారం రిటైన్ చేసుకున్న 16 మంది ఆటగాళ్లకు పంజాబ్ రూ. 31.8 కోట్లు చెల్లించగా.. ఇప్పుడు వారి వద్ద 53.2 కోట్లు ఉన్నాయి. ఆటగాళ్ల వేలానికి మిగిలిఉన్న మొత్తంలో 75 శాతం ఖర్చు చేయాలని బీసీసీఐ తెలిపిన నేపథ్యంలో 53.2 కోట్లలో 75 శాతం అంటే 31.7 కోట్లు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ డబ్బుతోనే ఆటగాళ్లను వేలంలో పొందే అవకాశం కింగ్స్ పంజాబ్‌కు ఉండనుంది. ఆ లెక్కన చూసుకుంటే పంజాబ్ దగ్గరుండే దాదాపు రూ. 21.5 కోట్లు బీసీసీఐ ఖాతాలోకి వెళ్లిపోనున్నాయి. ఇది కింగ్స్ పంజాబ్‌కు నష్టం కలిగించే అంశం అని చెప్పవచ్చు.
పంజాబ్ తర్వాత రూ. 37.85 కోట్లతో రాజస్తాన్ ఉండగా, ఆర్‌సీబీ రూ. 35.40 కోట్లు, సీఎస్‌కే రూ. 19.9 కోట్లు, ముంబై ఇండియన్స్ రూ. 15.35 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 13.4 కోట్లు, సన్‌రైజర్స్, కేకేఆర్ ఫ్రాంచైజీలు రూ. 10.75 కోట్లతో ఉన్నాయి. ఐపీఎల్ 2021 వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 18న చెన్నైలో జరిగే వేలంలో మొత్తం 292 క్రికెటర్లు అందుబాటులోకి రానున్నారు. ఐపీఎల్ వేలంలో పాల్గొనేందుకు 1114 మంది ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకోగా... ఫ్రాంచైజీ యాజమాన్యాల సూచనల ప్రకారం 292 మందిని షార్ట్ లిస్ట్ చేశారు.
వేలంలో గరిష్టంగా 61 స్థానాలు ఖాళీలు ఉండగా, ఇందులో 22 మంది వరకు విదేశీ ఆటగాళ్లను ఎనిమిది జట్లు ఎంచుకోవచ్చు. అత్యధికంగా బెంగళూరు జట్టులో 13 స్థానాలు ఖాళీ, సన్‌రైజర్స్ జట్టులో 3 స్థానాలు ఖాళీ ఉన్నట్టు తెలిసింది. కనీస రూ.2 కోట్ల జాబితాలో భారత్ నుంచి హర్భజన్, కేదార్ జాదవ్, విదేశాల నుంచి.. స్మిత్, మ్యాక్స్‌వెల్ ఉన్నారు. కాగా గతేడాది కేఎల్ రాహుల్ సారథ్యంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ అంతగా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 8 ఓటములతో పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో నిలిచింది. రాహుల్ 14 మ్యాచ్‌ల్లో 670 పరుగులతో ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నా జట్టుగా విఫలమయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న మ్యాక్స్‌వెల్ గత సీజన్‌లో దారుణంగా నిరాశపరిచాడు.
చదవండి: 15 నెలల తర్వాత.. అన్ని స్వదేశంలోనే
'కమాన్ రోహిత్.. యూ కెన్ డూ ఇట్'
Comments
Please login to add a commentAdd a comment