వీర ఐపీఎల్ విజయగాథ!
దేశంలో లోక్‌సభ ఎన్నికలకు సమాంతరంగా రెండు నెలల పైగా సాగిన క్రికెట్ వేడి ఎట్టకేలకు ముగిసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ ఎడిషన్‌కు ఆదివారం నాటి ఫైనల్‌తో శుభం కార్డు పడింది. కలకత్తా నైట్ రైడర్స్ (కేకేఆర్), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)ల మధ్య చెన్నైలో జరిగిన తుది సమరం అనూహ్యంగా ఏకపక్షంగా సాగింది. తొమ్మిది ఓవర్లు మిగిలి ఉండగానే, 8 వికెట్ల తేడాతో కేకేఆర్ విజయం సాధించి, కప్ చేజిక్కించుకుంది. 2014 తర్వాత సరిగ్గా దశాబ్ద కాలపు నిరీక్షణకు తెర దించి, మూడోసారి విజేతగా నిలిచింది. ఫైనల్ చప్పగా ముగిసిందన్న మాటే కానీ, గత రెండునెలలుగా ఐపీఎల్ పట్ల జనంలో వ్యక్తమైన ఉత్సాహం, ఉద్వేగాలను తక్కువ చేయలేం. 2008లో ఆరంభమైన ఐపీఎల్ ఏయేటికాయేడు ప్రాచుర్యం పెంచుకుంటూ, ప్రస్తుతం ప్రపంచస్థాయి సంబరంగా మారింది. నరాలు తెగే ఉత్కంఠ, వినోదం అందించే ఈ పొట్టి ఫార్మట్ క్రికెట్ ఆట వీరాభిమానుల నుంచి అదాటుగా చూసేవారి దాకా అందరినీ ఆకర్షించగలుగుతోంది. అంతర్జాతీయ ఆటగాళ్ళతో కలసి ఆడడమే కాక, శిక్షణ, వ్యూహరచనల్లో భాగస్వాములు కావడంతో మన కొత్త తరం ఆటగాళ్ళు రాటుదేలడానికి కావాల్సినంత వీలు చిక్కుతోంది. ఈసారి మొత్తం 74 మ్యాచ్‌ల ఐపీఎల్ అనేక ఆశ్చర్యాలను ఆవిష్కరించింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సులు (1260), అత్యధిక సెంచరీలు, 9 అత్యధిక స్కోర్లలో 8 ఈ సీజన్లోనే వచ్చాయి. వాటిలోనూ 5 అత్యధిక స్కోర్లు ఫైనల్లో తలపడిన కేకేఆర్, ఎస్ఆర్హెచ్లు సాధించినవే! విరాట్ కోహ్లీ ఈ సీజన్లో 741 పరుగులు చేసి తన ఐపీఎల్ కెరీర్లోనే రెండో అత్యధిక పరుగుల వరద పారించాడు. అదీ కనివిని ఎరుగని 154.70 రేటుతో! ఏడు మ్యాచ్‌లలో వరుసగా 6 మ్యాచ్‌లు ఓడి, రెండే రెండు పాయింట్లు సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు ఆపైన వరుసగా 6 మ్యాచ్‌లు భారీ తేడాతో గెలిచి, ప్లేఆఫ్ దశకు చేరడం మరో అబ్బురం. ఆశలు వదులుకోకుండా నిలబడి, కలబడితే ఏదైనా సాధ్యమనే పాఠానికి నిదర్శనం. అలాగే, అంకితభావం ఉంటే వయసనేది అడ్డంకి కాదని, గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 42 ఏళ్ళ ధోనీ గాలిలోకి 3 మీటర్లు గెంతి మరీ ఒంటిచేతితో పట్టిన విజయ్‌శంకర్ క్యాచ్ నిరూపించింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో కప్ గెలిచిన కేకేఆర్ ఈసారి సాధించిన విజయంలో గమనించాల్సిన ఒక ప్రత్యేకత ఉంది. కేకేఆర్‌లో భారత క్రికెట్ జట్టు మెగాస్టార్స్ ఎవరూ లేరు. అయినా సరే టోర్నమెంట్లో అద్భుత ప్రతిభ కనబరిచింది. ఆ జట్టు పక్షాన అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్ సునీల్ నరైన్ నిజానికి మొత్తం పట్టికలో 9వ స్థానంలో ఉంటాడు. కానీ, టాప్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు దిగి స్కోర్‌బోర్డ్‌ను పరుగులెత్తించిన తీరు, చూపిన ప్రభావం అసామాన్యం. కేకేఆర్ జట్టు కప్పు గెలిచిన గడచిన రెండుసార్లు (2012, 2014) కూడా ఆ యా సీజన్లలో అత్యధిక వికెట్లు (24, 21) తీసింది ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ కమ్ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నరే! ఈ సీజన్లోనూ 15 వికెట్లు, 488 పరుగులు సాధించి, ముచ్చటగా మూడోసారి ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్’ అవార్డు అందుకున్నాడు. సునీల్ కాక మరొక్క టాప్ 20 ఆటగాడు మాత్రమే కేకేఆర్ జట్టులో కనిపిస్తాడు. అయితేనేం, ఆ జట్టు మైదానంలో జోరు కొనసాగించి, విజయతీరాలు చేరింది.పరుగుల వరద ఎప్పటి కన్నా మరో మెట్టు పైకెక్కి బ్యాట్స్మన్ల రాజ్యంగా సాగిన టోర్నీ ఇది. ఈ పరిస్థితుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టే బౌలర్ లేకున్నా టాప్5 బౌలర్లలో ముగ్గురున్న కేకేఆర్ గెలుపు నమోదు చేసింది. అలాగే, కొన్నేళ్ళుగా విజయాలు రాకున్నా... ఇష్టారీతిన జట్టును మార్చేయకుండా, ఆటగాళ్ళను నమ్మి వారిని కొనసాగిస్తే అద్భుతాలు సాధ్యమేనని నిరూపించింది. పస అయిపోందని పలువురు విమర్శించినా... సునీల్, వరుణ్ చక్రవర్తి, వెంకటేశ్ అయ్యర్‌లను దీర్ఘకాలంగా జట్టులోనే అట్టిపెట్టుకుంది. ఆసిస్ పేసర్ మిషెల్ స్టార్క్ తాజా టోర్నీలో మొదట రాణించకున్నా అతణ్ణి కొనసాగించింది. అవన్నీ కీలక సమయంలో ఫలించాయి. వెరసి, పేరున్న ఆటగాళ్ళపై అతిగా ఆధారపడ్డ ఇతర ఫ్రాంఛైజీలకు కేకేఆర్ కథలో ఓ పాఠముంది. భారతజట్టులో ఆడకపోతేనేం, ప్రతిభావంతులైన యువతరంతో అద్భుతాలు చేయవచ్చని కేకేఆర్ ప్రస్థానం చాటింది.ఆదాయంలో, ఆకర్షణలో భారత జాతీయక్రీడ హాకీ సహా అన్నింటినీ క్రికెట్ ఎన్నడో మించిపోయింది. ఐపీఎల్ దెబ్బతో స్థానిక, రాష్ట్ర స్థాయుల్లోనూ టీ20 క్రికెట్ పోటీలొచ్చాయి. మన ఐపీఎల్ మూసలో ఆస్ట్రేలియాలో బిగ్‌బాష్, సౌతాఫ్రికాలో ఎస్ఏ 20 లీగ్, వెస్టిండీస్‌లో కరేబియన్ ప్రీమియర్ లీగ్, పాకిస్తాన్ – బంగ్లాదేశ్ – శ్రీలంకల్లోనూ ఆ యా దేశాల ప్రీమియర్ లీగ్‌లు వచ్చేశాయి. ప్రతిభావంతులైన యువ భారతీయ క్రికెటర్ల ప్రత్యామ్నాయ కెరీర్‌కు ఇది ద్వారాలు తెరిచింది. అదే సమయంలో ఈ వెర్రి పెచ్చుమీరిన బెట్టింగ్ బెడద తెచ్చింది. బ్యాట్‌కూ బంతికీ మధ్య పోటీలో సమతూకాన్ని చెడగొట్టింది. గత 16 విడతల ఐపీఎల్ టోర్నీల్లో మొత్తం 1032 మ్యాచ్‌లు ఆడితే, వాటిలో 250 పైచిలుకు స్కోర్లు వచ్చింది రెండు, మూడు మ్యాచ్‌లలోనే. కానీ, ఈ తడవ ఏకంగా 8సార్లు అది జరిగింది. బ్యాట్స్మన్లదే పైచేయిగా మారుతున్న ఈ లోపాన్ని సరిదిద్దేందుకు బీసీసీఐ కొత్త రూల్‌ను ఆలోచించకపోతే కష్టమే. ఏమైనా, ఈ ఏటి ఐపీఎల్ సీజన్ ముగిసింది. రెండేళ్ళకు ఒకసారి జరిగే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఆదివారం మొదలవుతోంది. రోహిత్‌శర్మ జట్టులో సభ్యులైనæ కోహ్లీ, పంత్ తదితరులు గనక ప్రస్తుత ఐపీఎల్ ప్రతిభాప్రదర్శననే ఆ వరల్డ్ కప్‌లోనూ కొనసాగిస్తే అంతకన్నా కావాల్సింది ఏముంది! చాలాకాలంగా ఊరిస్తున్న కప్పు మళ్ళీ మన ఇంటికొస్తుంది!!