అక్కడ పిల్ల.. ఇక్కడ పిల్లోడు!
క్రికెట్ అభిమానికి ఎప్పటికీ గుర్తుండే మ్యాచ్ ఏదైనా ఉందంటే.. అది నిన్న జరిగిన ఐపీఎల్ 7 క్వాలిఫయర్ 2 మ్యాచ్ . పంజాబ్ కింగ్స్ ఎలెవన్-చెన్నైసూపర్ కింగ్స్ లు వీరోచితంగా తలపడిన శుక్రవారం నాటి మ్యాచే ఇందుకు ఉదాహరణ. ఆ మ్యాచ్ ల్లో రెండు విధ్వంసకర ఇన్నింగ్స్ లు. ఒకటి పంజాబ్ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ది అయితే.. రెండోది చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేష్ రైనాది. ఆ రెండు ఇన్నింగ్స్ ల వెనుక చాలా చిత్రమైన కారణాలే ఉన్నాయట.. సెహ్వాగ్ ఇన్నింగ్స్ కు అతని కుమారుడు ఆర్యవీర్ నే ప్రధాన కారణం.
ఎందుకు డాడీ ఊరికే అవుటవుతున్నావు? మీడాడీకి పరుగులు చేయడం చేతకాదంటూ స్కూల్ లో స్నేహితులు ఏడిపిస్తున్నారు' అంటూ కొద్ది రోజుల క్రితం సెహ్వాగ్ కు ఫోన్ చేసిన ఆర్యవీర్ వ్యక్తం చేసిన ఆవేదనకు ప్రతిఫలమే ఇది. 'నేను తప్పకుండా భారీ పరుగులు చేస్తా' అని చెప్పిన వీరూ..చెన్నైతో జరిగిన మ్యాచ్ లో రెచ్చిపోయి తన కుమారుడు గర్వపడేలా చేశాడు. కేవలం 58 బంతులను ఎదుర్కొన్న సెహ్వాగ్ 122 పరుగులు చేసి పంజాబ్ 226 భారీ స్కోరు చేయడంలో తోడ్పడ్డాడు. దీంతో పంజాబ్ తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని అంతా భావించారు.
కాగా, ఛేజింగ్ తో బరిలోకి దిగిన చెన్నై మాత్రం గెలిచేంత పనిచేసింది. డుప్లిసెస్ తొలి ఓవర్లనే అవుటయ్యి అభిమానులను నిరాశపరిచినా.. రైనా తుఫాను వేగంతో ఆడిన తీరు మాత్రం నిజంగా వెలకట్టలేనిదే. కేవలం 25 బంతులను మాత్రమే ఎదుర్కొన్న రైనా 12 ఫోర్లు, 6 సిక్స్ లతో 87 పరుగులు చేశాడు. దీని ఫలితంగా చెన్నై ఆరు ఓవర్లనే 100 పరుగులు చేసింది. రైనా సూపర్ ఇన్నింగ్స్ లు ఆడుతూ ముందుకు వెళ్లడానికి కూడా కారణం ఉందట.
విశ్వవిఖ్యాత నటుడు కమల్ హాసన్ కుమార్తె శ్రుతి హాసన్ ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ ఏస్ బ్యాట్స్మన్ సురేష్ రైనాతో రొమాన్స్ చేయడమేనట. రైనా ఎక్కడ మ్యాచ్ ఆడినా అక్కడకు వెళ్తూ చెన్నై టీంకు తన మద్దతు పలుకుతూ ఐపీఎల్-6 సీజన్లో ఈ చిన్నది సందడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అది మరింత దూరం వెళ్లి వీళ్లిద్దరి రొమాన్స్కు దారితీసిందని ఒక జాతీయ పత్రిక తెలిపింది. సాధారణంగా శ్రుతి వచ్చిందంటే చాలు.. రైనా రెచ్చిపోయి ఆడేవాడట. ఈసారి ఆమె మైదానాలకు రాకపోయినా రైనా రెచ్చిపోయి ఆడటానికి శ్రుతినే కారణమనే ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి.