
మూడు పతకాలు గెలుస్తాం
సింగిల్స్‌లో ఎదురులేదు
డబుల్స్‌లోనే పోటీ క్లిష్టం
‘కామన్వెల్త్’ బ్యాడ్మింటన్‌పై జ్వాల వ్యాఖ్య
కోల్‌కతా: ‘కామన్వెల్త్ గేమ్స్’ బ్యాడ్మింటన్ ఈవెంట్‌లో భారత్ కనీసం మూడు పతకాలు గెలుస్తుందని డబుల్స్ స్టార్ గుత్తా జ్వాల ధీమా వ్యక్తం చేసింది. సింగిల్స్‌లో సైనా, సింధులకు ఎదురేలేదని... డబుల్స్‌లోనే పోటీ తీవ్రంగా ఉంటుందని డబుల్స్ డిఫెండింగ్ చాంపియన్ అయిన ఆమె వ్యాఖ్యానించింది.
ఉబెర్ కప్‌లో రాణించిన అనుభవంతో గ్లాస్గోలోనూ ముందంజ వేస్తామని చెప్పింది. ఈసారి మిక్స్‌డ్ విభాగంలో ఆడటం లేదని తెలిపింది. స్కాట్లాండ్‌లోని గ్లాస్గో ఆతిథ్యమిచ్చే ఈ మెగా ఈవెంట్ కోసం భారత బ్యాడ్మింటన్ బృందం 19న అక్కడికి వెళ్లనుంది. 24 నుంచి పోటీలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఆమె మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించింది.
సత్తాచాటుతాం
గత ‘కామన్వెల్త్’లో నాలుగు పతకాలు గెలిచిన మేం... ఈసారి మూడు పతకాలు సాధిస్తాం. సింగిల్స్‌లో భారత క్రీడాకారిణిలకు ఎదురులేదు. సైనా, సింధులే ఫైనల్‌కు చేరుతారు. ఆటతీరు చూసినా ర్యాంకింగ్స్ పరంగా చూసినా వీరిద్దరిని ఓడించే సత్తా ఎవరికీ లేదు. కానీ డబుల్స్‌లోనే తీవ్రమైన పోటీ నెలకొంది. మలేసియా, ఇంగ్లిష్, సింగపూర్ క్రీడాకారులతో క్లిష్టమైన పోరు ఉంటుంది.
అశ్విని బెస్ట్ ప్లేయర్
మహిళల డబుల్స్‌లో అశ్విని మేటి క్రీడాకారిణి. ప్రపంచ బెస్ట్ ప్లేయర్లలో ఆమె ఒకరు. స్మాష్‌లలో దిట్ట. తనదైన శైలిలో రాణిస్తుంది. ఆమెతో కలిసి ఆడటం అదృష్టం. మేమిద్దం మహిళల డబుల్స్ టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు పోరాడతాం. ఢిల్లీ అయినా, గ్లాస్గో అయినా పోటీలో మార్పేమీ ఉండదు. విదేశాల్లో గతంలోనూ గెలిచిన రికార్డు మాకుంది.
సచిన్ తెలీదంటే వివాదమా
రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవా తనకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తెలీదన్నంత మాత్రాన వివాదాస్పదం చేయడం తగదు. క్రికెట్ 12 దేశాలే ఆడతాయి. అదే టెన్నిస్ అయితే 200, బ్యాడ్మింటన్‌ను 150 దేశాలు ఆడతాయి. ఒక ఆట దిగ్గజం గురించి మరొకరి తెలియకపోతే ఏంటి? ఈ మాత్రానికే రాద్దాంతం చేయడం తగదు.