
పచ్చదనం వైపు మహిళల పయనం
పర్యావరణం
ఇక్కడ సైకిళ్లతో కనిపిస్తున్న అమ్మాయిలను ‘గో గ్రీన్ గర్ల్స్’(జి.జి.జి) అని పిలుస్తున్నారు. గత రెండేళ్లలో 2,500 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణం చేసి పర్యావరణాన్ని రక్షించండంటూ పిలుపునిచ్చారు. కలకత్తా నుంచి కన్యాకుమారి వరకూ తమ పయనాన్ని కొనసాగించాలంటూ మొదలుపెట్టిన ఈ మహత్కార్యం ఇప్పటివరకూ ఎలాంటి ఆటంకాలూ లేకుండా విజయవంతంగా కొనసాగుతోంది. ‘ఉమెన్ ఎడ్వంచర్ నెట్‌వర్కింగ్ ఇన్ ఇండియా’ ఆధ్వర్యంలో సాగే ఈ సైకిల్ ప్రయాణంలో ఇరవై నుంచి యాభై ఏళ్ల వయసున్న మహిళలు పాల్గొంటున్నారు.
ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులు, ఏదో రకంగా పచ్చదనాన్ని కాపాడుకోవాలనే తపన ఉన్నవారు ఇందులో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ‘‘మన కోసం మనం చేసే పనుల కన్నా ప్రకృతిని కాపాడుకోవడం కోసం చేసే పనుల్లో తృప్తి ఉంటుంది. ‘ఉమెన్ ఎడ్వంచర్ నెట్‌వర్కింగ్ ఇన్ ఇండియా’వారు ఎప్పుడైతే జిజిజి గురించి చెప్పారో వెంటనే సభ్యురాలిగా చేరిపోయాను. ఇప్పటివరకూ మా ప్రయాణంలో బోలెడన్ని అనుభవాలు ఎదురయ్యాయి. అందమైన పల్లెటూళ్లు, ఇరుకిరుకు పట్టణాలు, చెట్లూ చేమలు, చెత్తా చెదారం...అన్నింటిని దాటుకుంటూ మా సైకిల్ చక్రాలు పచ్చదనంపై ప్రచారం చేసుకుంటూ ముందుకుసాగాయి’’ అంటూ చెప్పుకొచ్చారు కలకత్తాకు చెందిన బంగీ జంప్ ప్లేయర్ రూప.
ఆమెలాంటి చాలామంది జి.జి.జిలో ఉన్నారు. మహారాష్ట్రకు సంబంధించి ఎవరెస్ట్ ఎక్కిన మొదటి మహిళగా పేరుగాంచిన రైనా కూడా జిజిజిలో సభ్యురాలయ్యారు. చేరినప్పుడు చాలామంది ఆమెను ఆదర్శంగా తీసుకున్నారు. ‘‘ఈ ప్రయాణం ఇక్కడితో ఆగదు. ప్రస్తుతం 2,500కి.మీల దగ్గర మా సైకిల్ చక్రాలు తమ పయనాన్ని కొనసాగిస్తున్నాయి. కుటుంబాన్ని కాపాడుకోవడంతో మహిళ పాత్ర ఎంత ఉంటుందో...ఈ భూమిని కాపాడుకోవడంలో కూడా తన పాత్ర పెద్దదే అన్న విషయాన్ని ప్రతి ఒక్క మహిళా గ్రహించాలి. అందుకే కేవలం మహిళలు మాత్రమే ఇందులో పాల్గొనాలనే నిబంధన పెట్టాం’’ అని చెప్పారు రైనా.
కేవలం సాహసాలు చేసే మహిళలే కాకుండా జిజిజిలో సాధారణ మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడానికి ముందుకు రావడం వెనక ఉమెన్ అడ్వెంచర్ నెట్‌వర్కింగ్ ఇన్ ఇండియా వారి కష్టం చాలా ఉంది. తోటి మహిళలకు ఆదర్శంగా ఉంటూ వారిని కూడా తమ బృందంలో చేర్చుకోడానికి ప్రత్యేక కౌన్సెలింగ్‌ల కార్యక్రమం కూడా చేపట్టారు. లేదంటే చదువులు మాని, ఉద్యోగాలకు సెలవులు పెట్టి ఈ సైక్లింగ్‌లో పాల్గొనడానికి అంత సులువుగా ముందుకు రారు కదా! ‘‘నాకు సైకిల్ తొక్కడం అంటే చాలా భయం.
గో గ్రీన్ గర్ల్స్ గురించి తెలియగానే సైకిల్ నేర్చుకున్నాను’’ అని చెప్పారు 30 ఏళ్ల రిష్నా ఠాకూర్. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ప్రయాణించిన జిజిజి బృందానికి ప్రత్యేకంగా ఇన్ని కిలోమీటర్లని లక్ష్యమంటూ ఏమీ లేదు. కలకత్తా, తమిళనాడు, గుజరాత్, కేరళ, మహారాష్ట్రలలో ప్రయాణించిన గో గ్రీన్ గర్ల్స్ తమకెదురైన అనుభవాలను తోటివారితో సంతోషంగా పంచుకుంటున్నారు. పచ్చదనం గురించి వీలైనంత ప్రచారం చేస్తున్నారు.