కర్ణాటక ‘హ్యాట్రిక్’
విజయ్ హజారే ట్రోఫీ కైవసం
ఆదుకున్న కరుణ్ నాయర్
ఫైనల్లో ఓడిన రైల్వేస్
కోల్‌కతా: దేశవాళీ టోర్నీల్లో కర్ణాటక జట్టు ఎదురులేకుండా దూసుకుపోతోంది. అద్భుత ప్రదర్శనతో ఈ ఏడాది వరుసగా మూడో టైటిల్‌ను తమ ఖాతాలో జమచేసుకుంది. ఇప్పటికే రంజీ, ఇరానీ ట్రోఫీ చాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు తాజాగా విజయ్ హజారే ట్రోఫీని దక్కించుకుని ‘హ్యాట్రిక్’ టైటిల్స్‌తో అదరగొట్టింది.
ఈడెన్ గార్డెన్స్‌లో ఆదివారం రైల్వేస్‌తో ఆసక్తికరంగా జరిగిన ఫైనల్లో కర్ణాటక నాలుగు వికెట్ల తేడాతో నెగ్గింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రైల్వేస్‌ను అభిమన్యు మిథున్ (4/19) వణికించాడు. దీంతో 47.4 ఓవర్లలో 157 పరుగులకే కుప్పకూలింది. రైల్వేస్ తొలి 10 ఓవర్లలో కేవలం 20 పరుగులు మాత్రమే చేయగలిగింది. జొనాథన్ (57 బంతుల్లో 46; 3 ఫోర్లు) అర్నిందమ్ (67 బంతుల్లో 33; 3 ఫోర్లు) రాణిం చారు. కాజీ, ఉతప్పలకు రెండేసి వికెట్లు దక్కాయి.
అనంతరం బరిలోకి దిగిన కర్ణాటక 43 ఓవర్లలో ఆరు వికెట్లకు 158 పరుగులు చేసి నెగ్గింది. అయితే ఈ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కర్ణాటక దారుణంగా తడబడింది.
47 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో 22 ఏళ్ల కరుణ్ నాయర్ (86 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు) అద్భుతంగా ఆడాడు. లోకేష్ రాహుల్ (72 బంతుల్లో 38; 4 ఫోర్లు)తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 66 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రాహుల్ వికెట్ పడిన తర్వాత నాయర్ మరింత జాగ్రత్తగా ఆడాడు. కునాల్ కపూర్ (45 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు)తో కలిసి మ్యాచ్‌ను ముగించాడు. కృష్ణకాంత్ ఉపాధ్యాయ్‌కు మూడు, అనురీత్ సింగ్‌కు రెండు వికెట్లు దక్కాయి.