karnataka team
-
బౌలర్లు చెలరేగితే అట్లనే ఉంటది.. ఒకే రోజు 21 వికెట్లు!
బెంగళూరు: కర్ణాటక, ఉత్తరప్రదేశ్ జట్ల మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బౌలర్లు చెలరేగారు. ఫలితంగా మ్యాచ్ రెండో రోజు మంగళవారం మొత్తం 21 వికెట్లు కుప్పకూలాయి. ఓవర్‌నైట్ స్కోరు 213/7తో ఆట కొనసాగించిన కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకు ఆలౌటైంది. శ్రేయస్ గోపాల్ (56 నాటౌట్) కీలక ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకోగా... లెఫ్టార్మ్ స్పిన్నర్ సౌరభ్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం యూపీ తమ తొలి ఇన్నింగ్స్‌లో 155 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో కూడా కర్ణాటక తడబడింది. ఆట ముగిసేసరికి ఆ జట్టు 100 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. సౌరభ్ కుమార్ 3 వికెట్లు పడగొట్టాడు. ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌లో ముంబై తొలి ఇన్నింగ్స్‌ను 8 వికెట్లకు 647 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. జార్ఖండ్‌తో మ్యాచ్‌లో బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 577 పరుగులు సాధించింది. చదవండి: Sunil Gavaskar 174-ball 36 Runs: జిడ్డు ఇన్నింగ్స్‌కు 47 ఏళ్లు.. కోపంతో లంచ్ బాక్స్ విసిరేసిన క్రికెట్ అభిమాని -
SMAT 2021 Winner Tamil Nadu: తమిళనాడు తడాఖా.. మూడోసారి
Syed Mushtaq Ali Trophy 2021 Final: Tamil Nadu Won Their 3rd Syed Mushtaq Ali Trophy Title: దేశవాళీ టి20 క్రికెట్లో తమిళనాడు జట్టు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. సోమవారం ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో తమిళనాడు జట్టు టైటిల్ నిలబెట్టుకుంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన తమిళనాడు ఫైనల్లో నాలుగు వికెట్ల తేడాతో కర్ణాటక జట్టును ఓడించింది. తద్వారా 2019 ఫైనల్ పోరులో కర్ణాటక చేతిలో ఒక పరుగు తేడాతో ఎదురైన ఓటమికి ఈ గెలుపుతో తమిళనాడు ప్రతీకారం తీర్చుకుంది. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తమిళనాడు సరిగ్గా 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసి గెలిచింది. షారుఖ్ ఖాన్ (15 బంతుల్లో 33 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు), సాయికిశోర్ (3 బంతుల్లో 6 నాటౌట్; 1 ఫోర్) తమిళనాడు గెలుపులో కీలకపాత్ర పోషించారు. తమిళనాడు విజయానికి చివరి ఓవర్లో 16 పరుగులు అవసరమయ్యాయి. కర్ణాటక బౌలర్ ప్రతీక్ జైన్ ఆఖరి ఓవర్ వేసేందుకు వచ్చాడు. తొలి బంతికి సాయికిశోర్ ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత ప్రతీక్ రెండు వైడ్లు వేయడంతోపాటు ఐదు పరుగులు ఇచ్చాడు. దాంతో తమిళనాడు విజయసమీకరణం ఆఖరి బంతికి ఐదు పరుగులుగా మారింది. ప్రతీక్ వేసిన ఆఖరి బంతిని షారుఖ్ ఖాన్ డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా సిక్సర్‌గా మలిచి తమిళనాడుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 పరుగులు సాధించింది. ఓపెనర్ రోహన్ కదమ్ ‘డకౌట్’ కాగా... మనీశ్ పాండే (15 బంతుల్లో 13; 2 ఫోర్లు), కరుణ్ నాయర్ (14 బంతుల్లో 18; 2 ఫోర్లు) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. చివర్లో అభినవ్ మనోహర్ (37 బంతుల్లో 46; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), ప్రవీణ్ దూబే (25 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్), సుచిత్ (7 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) ధాటిగా ఆడటంతో కర్ణాటక స్కోరు 150 పరుగులు దాటింది. తమిళనాడు బౌలర్లలో సాయికిశోర్ (3/12) రాణించాడు. 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన తమిళనాడు ఒకదశలో 17.1 ఓవర్లలో 116 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. గెలుపు కోసం 17 బంతుల్లో 36 పరుగులు చేయాల్సిన దశలో షారుఖ్ సూపర్ ఇన్నింగ్స్‌తో తమ జట్టును గెలిపించాడు. ► ముస్తాక్ అలీ ట్రోఫీని అత్యధికంగా మూడుసార్లు గెలిచిన జట్టుగా తమిళనాడు గుర్తింపు పొందింది. 2006–07 సీజన్లో, 2020– 2021 సీజన్లోనూ తమిళనాడు చాంపియన్‌గా నిలిచింది. బరోడా, గుజరాత్, కర్ణాటక జట్లు రెండుసార్లు చొప్పున ముస్తాక్ అలీ ట్రోఫీని సాధించాయి. ► గుర్తింపు పొందిన టి20 క్రికెట్ టోర్నీ ఫైనల్లో ఆఖరి బంతికి సిక్స్ కొట్టి టైటిల్ సాధించిన రెండో జట్టు తమిళనాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన 2018 నిదాహాస్ ట్రోఫీ ఫైనల్లో దినేశ్ కార్తీక్ చివరి బంతికి సిక్స్ కొట్టి భారత్‌ను గెలిపించాడు. Sensational Shahrukh! 💪 💪 Sit back & relive this @shahrukh_35 blitz which powered Tamil Nadu to #SyedMushtaqAliT20 title triumph. 🏆 👏 #TNvKAR #Final Watch his knock 🎥 ⬇️https://t.co/6wa9fwKkzu pic.twitter.com/evxBiUdETk — BCCI Domestic (@BCCIdomestic) November 22, 2021 -
6 మ్యాచ్‌లు 4 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు..
న్యూఢిల్లీ: విజయ్ హజారే ట్రోఫీ ప్రస్తుత సీజన్లో కర్ణాటక ఆటగాడు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్(ఆర్సీబీ) యువ ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ దుమ్మురేపుతున్నాడు. వరుస సెంచరీలతో పరుగుల వరద పారిస్తున్నాడు. సోమవారం కేరళతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సీజన్లో నాలుగో సెంచరీ బాది.. టీమిండియాలో స్థానం కోసం దూసుకొస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో పడిక్కల్ 119 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 101 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతనికి మరో ఓపెనర్, కర్ణాటక కెప్టెన్ సమర్థ్ (22 ఫోర్లు, 3 సిక్స్‌లతో 192) విధ్వంసం తోడవడంతో కర్ణాటక 80 పరుగుల తేడాతో గెలుపొంది సెమీస్‌లోకి దూసుకెళ్లింది. గతేడాది ఆర్సీబీ తరఫున ఐపీఎల్లో అడుగుపెట్టిన పడిక్కల్.. సూపర్ ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకొన్నాడు. ఆ సీజన్లో పడిక్కల్ 15 మ్యాచ్‌ల్లో 124 స్ట్రైక్ రేట్‌తో 473 పరుగులు సాధించి, ఆర్సీబీ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇందులో 5 అర్ధ సెంచరీలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ లాంటి దిగ్గజాలతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకున్న అనుభవంతో అతను ప్రస్తుత దేశవాళీ సీజన్లో రెచ్చిపోతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో 6 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలతో చెలరేగిపోతున్నాడు. ప్రస్తుత సీజన్లో వరుసగా 52, 97, 152, 126*, 145*, 101 స్కోర్లు సాధించి పడిక్కల్ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఈ సీజన్లో పడిక్కల్ మొత్తం 673 పరుగులు సాధించి.. టీమిండియా భవిష్యత్తు ఆశాకిరణంలా తయారవుతన్నాడు. -
నాయర్ నుంచి సారధ్య బాధ్యతలు చేజిక్కించుకున్న సమర్ధ్
సాక్షి, బెంగళూరు: త్వరలో ప్రారంభం కాబోయే విజయ్ హజారే వన్డే టోర్నమెంట్లో కర్ణాటక కెప్టెన్‌గా ఆ జట్టు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఆర్ సమర్ధ్ వ్యవహరించనున్నాడు. 28 ఏళ్ల సమర్ధ్.. ఫామ్ లేమితో బాధపడుతున్న కరుణ్ నాయర్ నుంచి సారధ్య బాధ్యతలను స్వీకరించనున్నాడు. ఫజల్ ఖలీల్ నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ సోమవారం సమావేశమై 22 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. కాగా, తాజాగా ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో సమర్ధ్‌కు జట్టులో స్ధానం దక్కకపోవడం విశేషం. ఈ టోర్నీలో కర్ణాటక జట్టు క్వార్టర్స్‌లోనే నిష్క్రమించింది. తాజాగా ప్రకటించిన కర్ణాటక జట్టులో ఇటీవలి ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున రాణించిన దేవ్‌దత్ పడిక్కల్ కీలక సభ్యుడిగా ఉండగా, గాయం కారణంగా సీనియర్ ఆటగాడు మనీష్ పాండే టోర్నీకి దూరమయ్యాడు. -
సెంచరీతో బెంగాల్‌ను ఆదుకున్న అనుస్తుప్
కోల్‌కతా: మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ అనుస్తుప్ (120 బ్యాటింగ్; 18 ఫోర్లు, సిక్స్) అజేయ సెంచరీతో బెంగాల్‌ను ఆదుకోవడంతో... కర్ణాటకతో ఆరంభమైన రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీ సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 275 పరుగులు చేసింది. బెంగాల్ ఒక దశలో 67 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో అనుస్తుప్... అహ్మద్ (35; 7 ఫోర్లు)తో ఏడో వికెట్‌కు 72 పరుగులు, అకాశ్ దీప్ (44; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 103 పరుగులు జోడించాడు. గుజరాత్‌తో జరుగుతున్న మరో సెమీఫైనల్లో సౌరాష్ట్ర ఆట ముగిసే సమయానికి 5 వికెట్లకు 217 పరుగులు చేసింది. -
ఓవరాల్ చాంపియన్ కర్ణాటక
సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ జూనియర్ ఆక్వాటిక్ చాంపియన్‌షిప్ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిన కర్ణాటక జట్టు ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో మొత్తం 1279 పాయింట్లు సాధించిన కర్ణాటక జట్టు అగ్రస్థానాన్ని దక్కించుకుంది. జూనియర్, సబ్ జూనియర్ విభాగాల్లో కర్ణాటక, తమిళనాడు జట్లు వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. వ్యక్తిగత విభాగం ఓవరాల్ చాంపియన్‌షిప్ జాబితాలో గ్రూప్–1 విభాగంలో రుత్విక్ రెడ్డి (తెలంగాణ), సువన భాస్కర్ (కర్ణాటక)... గ్రూప్–2 విభాగంలో ఉత్కర్ష్ వెంకటేశ్ (కర్ణాటక), నైనా వెంకటేశ్ (కర్ణాటక)... గ్రూప్–3 కేటగిరీలో సుహాస్ ప్రీతమ్ (తెలంగాణ), రేణుకాచార్య (కర్ణాటక), గ్రూప్–4 కేటగిరీలో పీవీ మోనిశ్ (కర్ణాటక), ధినిధి డేసింగు (కర్ణాటక) వరుసగా తొలి రెండు స్థానాలను దక్కించుకున్నారు. తమిళనాడు జట్టు చివరి రోజు ఈవెంట్ల ఫలితాలు 1500మీ. ఫ్రీస్టయిల్ గ్రూప్–2 బాలురు: 1. సర్వేపల్లి కృష్ణ ప్రణవ్ (తమిళనాడు), 2. శివాంక్ విశ్వనాథ్(కర్ణాటక), 3. సంజిత్ (కర్ణాటక); బాలికలు: 1. అష్మిత చంద్ర (కర్ణాటక), 2. మహాలక్ష్మి (తమిళనాడు), 3. మేధ వెంకటేశ్ (కర్ణాటక). 400మీ. ఫ్రీస్టయిల్ గ్రూప్–1 బాలురు: 1. సమర్థ రావు (కర్ణాటక), 2. సీహెచ్ అభిలాష్ (తెలంగాణ), 3. మోహిత్ వెంకటేశ్ (కర్ణాటక); బాలికలు: 1. ప్రీత వెంకటేశ్ (కర్ణాటక), 2. నిధి శశిధర (కర్ణాటక), 3. మిధుల జితేశ్ (కేరళ). 200మీ. బ్యాక్‌స్ట్రోక్ గ్రూప్–2 బాలురు: 1. ఉత్కర్ష్ పాటిల్ (కర్ణాటక), 2. సాయి నిహార్ (తెలంగాణ), 3. అక్షయ్ (కర్ణాటక); బాలికలు: 1. సనా మాథ్యూ (కేరళ), 2. నైషా శెట్టి (కర్ణాటక), మణి జాధవ్ (కర్ణాటక). గ్రూప్–1 బాలురు: 1. డారెల్ స్టీవ్ (తమిళనాడు), 2. జశ్వంత్ రెడ్డి (తెలంగాణ), 3. దీప్ వెంకటేశ్ (కర్ణాటక); బాలికలు: 1. సువన (కర్ణాటక), 2. భూమిక (కర్ణాటక), 3. జాహ్నవి (తెలంగాణ). 100మీ. ఫ్రీస్టయిల్ గ్రూప్–4 బాలురు: 1. మోనిశ్ (కర్ణాటక), 2. సాయి ఆదిత్య (తమిళనాడు), 3. యజ్ఞ సాయి (ఆంధ్రప్రదేశ్); బాలికలు: 1. ధినిధి డేసింగు (కర్ణాటక), 2. క్యారెన్ బెన్నీ (కేరళ), 3. ప్రమితి (తమిళనాడు). 100మీ. బ్రెస్ట్ స్ట్రోక్ గ్రూప్–2 బాలురు: 1. జాషువా థామస్, 2. విదిత్ శంకర్, 3. శుభాంగ్ కుబేర్; బాలికలు: 1. హితైశ్ (కర్ణాటక), 2. అన్విత (కర్ణాటక), 3. నాగ గ్రీష్మిణి(ఆంధ్రప్రదేశ్). గ్రూప్–1 బాలురు: 1. లితీశ్ గౌడ్ (కర్ణాటక), 2. సూర్యాన్షు (తెలంగాణ), 3. గిరిధర్ (కేరళ). రుత్విక్ రెడ్డి (తెలంగాణ), సుహాస్ ప్రీతమ్ (తెలంగాణ) -
6 బంతుల్లో 5 వికెట్లతో చెలరేగిపోయాడు..
గతంలో ఒకసారి... బంగ్లాదేశ్ దేశవాళీ టోర్నీ విక్టరీ డే టి20 కప్ మ్యాచ్ (26డిసెంబర్, 2013)లో అల్ అమీన్ హుస్సేన్ ఒకే ఓవర్లో ఐదు వికెట్ల ఫీట్‌ను సాధించాడు. అబహాని లిమిటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో అల్ అమీన్ యూసీబీ–బీసీబీ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అబహాని ఇన్నింగ్స్ చివరి ఓవర్లో 5 వికెట్లు తీశాడు. తొలి బంతికి మెహదీ మారూఫ్ అవుట్ కాగా... చివరి నాలుగు బంతులకు నజ్ముల్ హుస్సేన్, సొహ్రవర్ది ష్రువో, నయీమ్ ఇస్లామ్, నబీల్ సమద్‌లను అమీన్ అవుట్ చేశాడు. ఈ ఐదు కూడా క్యాచ్‌లే. సూరత్: వికెట్, వికెట్, వికెట్, వికెట్, వైడ్, 1, వికెట్... ఒకే ఓవర్లో కర్ణాటక పేస్ బౌలర్ అభిమన్యు మిథున్ ప్రదర్శన ఇది. దేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీ సెమీస్ మ్యాచ్‌లో ఈ అరుదైన రికార్డు నమోదైంది. హరియాణాతో జరిగిన ఈ మ్యాచ్ చివరి ఓవర్లో చెలరేగిన మిథున్ ‘హ్యాట్రిక్’ సహా ఏకంగా 5 వికెట్లు పడగొట్టడం విశేషం. ఈ ఐదు వికెట్లూ ఫీల్డర్ల క్యాచ్‌ల ద్వారానే వచ్చాయి. తొలి నాలుగు బంతులకు నాలుగు వికెట్లు తీసిన అతను తర్వాతి బంతిని వైడ్‌గా విసిరాడు. అనంతరం సింగిల్ ఇచ్చిన అతను చివరి బంతికి కూడా మరో వికెట్ పడగొట్టాడు. టి20 చరిత్రలో ఈ తరహా ఫీట్ రెండో సారి నమోదు కావడం విశేషం. భారత్ నుంచి ఇదే మొదటి సారి కాగా 2013లో బంగ్లాదేశ్ పేసర్ అల్ అమీన్ హుస్సేన్ ఇలాగే టి20 మ్యాచ్‌లో ఒకే ఓవర్లో 5 వికెట్లు తీశాడు. ఫైనల్లో కర్ణాటక... బౌలింగ్‌లో మిథున్ ప్రదర్శనకు తోడు బ్యాటింగ్‌లో దేవ్‌దత్ పడిక్కల్ (42 బంతుల్లో 87; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (31 బంతుల్లో 66; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) బ్యాటింగ్‌లో చెలరేగడంతో హరియాణాను చిత్తు చేసి కర్ణాటక ఫైనల్లోకి ప్రవేశించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హరియాణా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. హిమాన్షు రాణా (34 బంతుల్లో 61; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), చైతన్య బిష్ణోయి (35 బంతుల్లో 55; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించగా, హర్షల్ పటేల్ (20 బంతుల్లో 34; 6 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ తేవటియా (20 బంతుల్లో 32; 6 ఫోర్లు) రాణించారు. 19వ ఓవర్ ముగిసేసరికి 3 వికెట్లకు 192 పరుగులతో ఉన్న హర్యానా ఆఖరి ఓవర్లో మిథున్ దెబ్బకు 2 పరుగులే చేయగలిగింది. అనంతరం కర్ణాటక 15 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. రాహుల్, దేవ్‌దత్ తొలి వికెట్‌కు 57 బంతుల్లోనే 125 పరుగులు జోడించగా... మయాంక్ అగర్వాల్ (14 బంతుల్లో 30 నాటౌట్; 3 సిక్సర్లు) మిగతా పనిని పూర్తి చేశాడు. తుది పోరుకు తమిళనాడు... మరో మ్యాచ్‌లో రాజస్తాన్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి తమిళనాడు ఫైనల్లోకి ప్రవేశించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 112 పరుగులే చేయగలిగింది. రాజేశ్ బిష్ణోయి (23), రవి బిష్ణోయి (22) మాత్రమే ఫర్వాలేదనిపించారు. అనంతరం తమిళనాడు 17.5 ఓవర్లలో 3 వికెట్లకు 116 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ (46 బంతుల్లో 54 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, రవిచంద్రన్ అశ్విన్ (33 బంతుల్లో 31; 4 ఫోర్లు) రాణించాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 69 పరుగులు జోడించారు. ఆదివారం కర్ణాటక, తమిళనాడు మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ తుది పోరులో కూడా ఈ రెండు జట్లే తలపడ్డాయి. మిథున్ హ్యాట్రిక్‌ల జాబితా రంజీ ట్రోఫీ (ఫస్ట్‌క్లాస్): కర్ణాటక x ఉత్తర ప్రదేశ్ (నవంబర్ 3–6, 2009): పీయూష్‌చావ్లా, ఆమిర్ ఖాన్, ఆర్పీ సింగ్. విజయ్ హజారే ట్రోఫీ (లిస్ట్–ఎ): కర్ణాటక x తమిళనాడు (అక్టోబర్ 25, 2019): షారుఖ్ ఖాన్, ఎం.మొహమ్మద్, ఎం. అశ్విన్ ముస్తాక్ అలీ టోర్నీ (టి20): కర్ణాటక x హరియాణా (నవంబర్ 29, 2019): హిమాన్షు రాణా, రాహుల్ తేవటియా, సుమీత్ కుమార్ (హ్యాట్రిక్), అమిత్ మిశ్రా (నాలుగో బంతి), జయంత్ యాదవ్ (ఆరోబంతి) మూడు ఫార్మాట్లలోనూ... దేశవాళీలో నిలకడైన ప్రదర్శనతో భారత జట్టులోకి వచ్చి అదే జోరును కొనసాగించలేక కనుమరుగైపోయిన పేస్ బౌలర్లలో 30 ఏళ్ల అభిమన్యు మిథున్ కూడా ఒకడు. 2010 జులై నుంచి 2011 డిసెంబర్ మధ్య మిథున్ భారత్ తరఫున 4 టెస్టులు, 5 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 50.66 సగటుతో 9 వికెట్లు, వన్డేల్లో 67.66 సగటుతో 3 వికెట్లు మాత్రమే తీయడంతో అతను సెలక్టర్ల విశ్వాసం కోల్పోయాడు. అయితే ఇప్పటికీ కర్ణాటక జట్టు కీలక ఆటగాళ్లలో అతను కొనసాగుతున్నాడు. తాజా ప్రదర్శనతో అతను భారత దేశవాళీ క్రికెట్‌కు సంబంధించిన మూడు ఫార్మాట్లలోనూ హ్యాట్రిక్ తీసిన ఏకైక బౌలర్‌గా నిలిచాడు. 2009లో తన తొలి రంజీ మ్యాచ్‌లోనే హ్యాట్రిక్‌తో అందరి దృష్టినీ ఆకర్షించిన మిథున్... గత నెలలో తన పుట్టిన రోజున విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్లో తమిళనాడుపై హ్యాట్రిక్ తీశాడు. -
విజేత కర్ణాటక
బెంగళూరు: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీని కర్ణాటక జట్టు నాలుగోసారి కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో కర్ణాటక పేసర్ అభిమన్యు మిథున్ (5/34) హ్యాట్రిక్ తీయగా... బ్యాటింగ్‌లో రాహుల్ (52 నాటౌట్; 5 ఫోర్లు), మయాంక్ అగర్వాల్ ( 69 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ అర్ధసెంచరీలతో జట్టును గెలిపించారు. దీంతో కర్ణాటక వీజేడీ పద్ధతి ప్రకారం 60 పరుగుల తేడాతో తమిళనాడుపై గెలుపొందింది. ముందుగా తమిళనాడు జట్టు 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన మిథున్ 3, 4, 5 బంతుల్లో వరుసగా షారుక్ ఖాన్ (27), మొహమ్మద్ (10), అశ్విన్ (0) వికెట్లను పడగొట్టడంతో తమిళనాడు ఆలౌటైంది. అనంతరం కర్ణాటక 23 ఓవర్లలో వికెట్ నష్టానికి 146 పరుగులు చేసిన దశలో వర్షం వల్ల మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో చేసేదేమీ లేక 23 ఓవర్లలో 87 పరుగులుగా లక్ష్యాన్ని సవరించగా... అప్పటికే దీన్ని కర్ణాటక అధిగమించడంతో విజేతగా ప్రకటించారు. -
కర్ణాటకదే ఇరానీ కప్
బెంగళూరు: దేశవాళీ టోర్నీల్లో కర్ణాటక జట్టు హవా కొనసాగుతోంది. రంజీ ట్రోఫీలాగే ఇరానీ కప్‌నూ నిలబెట్టుకుంది. రెస్టాఫ్ ఇండియాతో చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఇరానీ కప్ ఫైనల్లో కర్ణాటక 246 పరుగులతో ఘన విజయం సాధించింది. 403 పరుగుల విజయలక్ష్యంతో నాలుగో రోజు బరిలోకి దిగిన రెస్ట్ జట్టు 43.3 ఓవర్లలో 156 పరుగులకే కుప్పకూలింది. జాదవ్ (56) మినహా అందరూ విఫలమయ్యారు. స్పిన్నర్ గోపాల్ నాలుగు, మిథున్ మూడు వికెట్లు తీసుకున్నారు. అంతకుముందు కర్ణాటక తమ రెండో ఇన్నింగ్స్‌లో 422 పరుగులకు ఆలౌటయింది. మనీష్ పాండే (123 నాటౌట్) సెంచరీ చేశాడు. ముంబై తర్వాత ఇరానీకప్‌ను రెండు సార్లు గెలిచిన జట్టు కర్ణాటక కావడం విశేషం. -
రంజీ ఫైనల్లో తమిళనాడు
కోల్‌కతా: రంజీ ట్రోఫీ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక జట్టు ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. మహారాష్ట్రతో జరిగిన రెండో సెమీఫైనల్ ‘డ్రా’గా ముగిసినా... తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా తమిళనాడు తుది పోరుకు అర్హత సాధించింది. ఈనెల 8 నుంచి ముంబైలో ఫైనల్ జరుగుతుంది. అటు గతేడాది రన్నరప్ అయిన మహారాష్ట్ర చివరి రోజు ఆదివారం ప్రత్యర్థి బౌలింగ్ ముందు తేలిపోయింది. తమ తొలి ఇన్నింగ్స్‌లో 142 ఓవర్లలో 454 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో తమిళనాడుకు 95 పరుగుల ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన తమిళనాడు ఆట ముగిసే సమయానికి 46.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 119 పరుగులు చేసింది. -
కర్ణాటక ‘హ్యాట్రిక్’
విజయ్ హజారే ట్రోఫీ కైవసం ఆదుకున్న కరుణ్ నాయర్ ఫైనల్లో ఓడిన రైల్వేస్ కోల్‌కతా: దేశవాళీ టోర్నీల్లో కర్ణాటక జట్టు ఎదురులేకుండా దూసుకుపోతోంది. అద్భుత ప్రదర్శనతో ఈ ఏడాది వరుసగా మూడో టైటిల్‌ను తమ ఖాతాలో జమచేసుకుంది. ఇప్పటికే రంజీ, ఇరానీ ట్రోఫీ చాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు తాజాగా విజయ్ హజారే ట్రోఫీని దక్కించుకుని ‘హ్యాట్రిక్’ టైటిల్స్‌తో అదరగొట్టింది. ఈడెన్ గార్డెన్స్‌లో ఆదివారం రైల్వేస్‌తో ఆసక్తికరంగా జరిగిన ఫైనల్లో కర్ణాటక నాలుగు వికెట్ల తేడాతో నెగ్గింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రైల్వేస్‌ను అభిమన్యు మిథున్ (4/19) వణికించాడు. దీంతో 47.4 ఓవర్లలో 157 పరుగులకే కుప్పకూలింది. రైల్వేస్ తొలి 10 ఓవర్లలో కేవలం 20 పరుగులు మాత్రమే చేయగలిగింది. జొనాథన్ (57 బంతుల్లో 46; 3 ఫోర్లు) అర్నిందమ్ (67 బంతుల్లో 33; 3 ఫోర్లు) రాణిం చారు. కాజీ, ఉతప్పలకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం బరిలోకి దిగిన కర్ణాటక 43 ఓవర్లలో ఆరు వికెట్లకు 158 పరుగులు చేసి నెగ్గింది. అయితే ఈ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కర్ణాటక దారుణంగా తడబడింది. 47 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో 22 ఏళ్ల కరుణ్ నాయర్ (86 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు) అద్భుతంగా ఆడాడు. లోకేష్ రాహుల్ (72 బంతుల్లో 38; 4 ఫోర్లు)తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 66 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రాహుల్ వికెట్ పడిన తర్వాత నాయర్ మరింత జాగ్రత్తగా ఆడాడు. కునాల్ కపూర్ (45 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు)తో కలిసి మ్యాచ్‌ను ముగించాడు. కృష్ణకాంత్ ఉపాధ్యాయ్‌కు మూడు, అనురీత్ సింగ్‌కు రెండు వికెట్లు దక్కాయి. -
విజయం దిశగా కర్ణాటక
బెంగళూరు: ఇరానీ కప్‌లో కర్ణాటక జట్టు విజయం దిశగా పయనిస్తోంది. సీఎం గౌతమ్ (168 బంతుల్లో 122; 17 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీతో చెలరేగడంతో మంగళవారం మూడో రోజు కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 145 ఓవర్లలో 606 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో 405 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రెస్టాఫ్ ఇండియా ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 38 ఓవర్లలో 3 వికెట్లకు 114 పరుగులు చేసింది. అపరాజిత్ (42 బ్యాటింగ్), కార్తీక్ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. గంభీర్ (9) మరోసారి నిరాశపర్చగా, జాదవ్ (44) ఫర్వాలేదనిపించాడు. వినయ్ 2 వికెట్లు తీశాడు. ప్రస్తుతం రెస్ట్ ఇంకా 291 పరుగులు వెనుకబడి ఉంది. రెండు రోజుల ఆట మిగిలి ఉంది. అంతకుముందు 390/5 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన కర్ణాటక ఇన్నింగ్స్‌లో బిన్ని (122 బంతుల్లో 122; 15 ఫోర్లు, 3 సిక్సర్లు) తొందరగా అవుటైనా... గౌతమ్ నిలకడగా ఆడాడు. వినయ్ (31)తో కలిసి ఏడో వికెట్ 88, గోపాల్ (16)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 57 పరుగులు జోడించాడు. చివర్లో మిథున్ (34 నాటౌట్) వేగంగా ఆడటంతో భారీ స్కోరు వచ్చింది. రెస్ట్ బౌలర్ పంకజ్ సింగ్ 6 వికెట్లు పడగొట్టాడు. -
రిలేలో రాష్ట్రానికి ఆరు పతకాలు
సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ అక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో చివరి రోజు పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రిలే జట్లు అరడజను పతకాలు సాధించాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ స్విమ్మింగ్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఇందులో కర్ణాటక జట్టు 1300 పాయింట్లతో ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. 700 పాయింట్లతో తమిళనాడు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 400 మీ. ఫ్రీస్టయిల్ బాలుర (గ్రూప్-1) విభాగంలో రేవంత్ రెడ్డి, 200 మీ. బ్యాక్‌స్ట్రోక్‌లో గుణ చక్రవర్తి రజత పతకాలు గెలిచారు. 4x100 మీ. ఫ్రీస్టయిల్ రిలే బాలుర ఈవెంట్లో శివ కుమార్, సాగర్‌దీప్, నిశాంత్, చిన నాగేంద్రలతో కూడిన ఏపీ బృందం కాంస్య పతకం గెలుపొందింది. ఇదే విభాగం గ్రూప్-2లో గృహంత్ సాయి, రాఘవ, శివ సాకేత్, అభిషేక్‌లు ఉన్న ఏపీ జట్టు కూడా కాంస్యం నెగ్గింది. 4ఁ50 మీ. ఫ్రీస్టయిల్ రిలేలో శ్రీభువన్ రెడ్డి, సుశాంత్, రియాన్ చెరియన్, అఖిల్‌ల జట్టు మూడో స్థానంలో నిలిచింది. 400 మీ. ఫ్రీస్టయిల్ బాలికల (గ్రూప్-1) విభాగంలో భవ్య, 200 మీ. బ్యాక్‌స్ట్రోక్‌లో నివేదిత కాంస్య పతకాలు నెగ్గారు. బాలికల 4x100 మీ. ఫ్రీస్టయిల్ రిలేలో అలేఖ్య, స్పందన, శ్రీవల్లూరి, రత్నవల్లూరిలతో కూడిన ఏపీ జట్టు మూడో స్థానంలో నిలిచింది. 50 మీ. ఫ్రీస్టయిల్లో అతమిక కృష్ణన్ బంగారు పతకం గెలుపొందింది. 4ఁ100 మీ. రిలేలో బబిత, ఆశ, స్మృతి మానే, లక్ష్మీలయ గల రాష్ట్ర జట్టు, 4 x50 మీ. ఫ్రీస్టయిల్ రిలే (గ్రూప్-3)లో సాయి కీర్తి, అనిక సోనిగ్, శ్రేష్ట, నదియా ఇషాన్‌లతో కూడిన ఏపీ బృందం కాంస్య పతకాలు సాధించింది. అమిత గొండి మరో స్వర్ణ పతకం నెగ్గింది. 50 మీ. ఫ్రీస్టయిల్లో ఆమె విజేతగా నిలిచింది. బాలికల 100 మీ. ఫ్రీస్టయిల్ (గ్రూప్-4) ఈవెంట్లో త్రిన తనూజ, నికిత వరుసగా రజత, కాంస్యాలు చేజిక్కించుకున్నారు. -
రంజీ కింగ్ కర్ణాటక
నాలుగేళ్ల క్రితం... సొంతగడ్డపై మైసూరులో కర్ణాటక జట్టు రంజీ ట్రోఫీ ఫైనల్ ఆడింది. రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత పోరాట పటిమ కనబర్చినా చివరకు ఆరు పరుగుల తేడాతో పరాజయం పాలవ్వడంతో ఆటగాళ్ల గుండె పగిలింది. అప్పుడు ఫైనల్ ఆడిన జట్టులోని ఎనిమిది మంది కర్ణాటక సభ్యులు ఇప్పుడు కూడా ఫైనల్లో ఉన్నారు. కానీ ఈసారి వారు అవకాశం జారవిడుచుకోలేదు. సమష్టి ప్రదర్శన కనబర్చి రంజీ ట్రోఫీ టైటిల్ నెగ్గిన జట్టులో సభ్యులయ్యారు. సాక్షి, హైదరాబాద్: దేశవాళీ క్రికెట్లో కన్నడ కస్తూరి సుగంధాలు విరజిమ్మాయి. 2013-14 సీజన్ మొత్తం నిలకడగా రాణించిన కర్ణాటక జట్టు రంజీ ట్రోఫీలో విజేతగా నిలిచింది. కర్ణాటక రంజీ టైటిల్ నెగ్గడం ఇది ఏడో సారి. 1998-99లో గెలుపు తర్వా త ఆ జట్టు 15 ఏళ్లకు ఈ టైటిల్ నెగ్గడం విశేషం. ఇక్కడి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఆదివారం ముగిసిన ఫైనల్లో కర్ణాటక ఏడు వికెట్ల తేడాతో మహారాష్ట్రను చిత్తు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో 157 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కర్ణాటక 40.5 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి రంజీ ట్రోఫీని కైవసం చేసుకుంది. టాప్ ఆర్డర్ ఆటగాళ్లంతా తలా ఓ చేయి వేసి జట్టును గెలిపించారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన రాహుల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. విజేత కర్ణాటకకు రూ. 2 కోట్లు, రన్నరప్ మహారాష్ట్రకు రూ. 1 కోటి ప్రైజ్‌మనీగా లభించాయి. మరో 94 పరుగులు... ఓవర్‌నైట్ స్కోరు 272/6 తో ఐదో రోజు ఆట ప్రారంభించిన మహారాష్ట్ర సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు జోడించేందుకు ప్రయత్నించింది. శ్రీకాంత్ ముండే (75 బంతుల్లో 42; 3 ఫోర్లు) ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. చివరి వరుస బ్యాట్స్‌మెన్ కూడా సహకరించడంతో జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో 366 పరుగులకు ఆలౌటైంది. కర్ణాటక బౌలర్లలో వినయ్ (4/116), గోపాల్ (4/47) నాలుగేసి వికెట్లు పడగొట్టారు. సంచలనాలేమీ లేవు... తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగుల ఆధిక్యాన్ని మినహాయించి అందుబాటులో ఉన్న 64 ఓవర్లలో 157 పరుగుల లక్ష్యం కర్ణాటక ముందు నిలిచింది. మ్యాచ్ ఆఖరి రోజు వికెట్ స్పిన్‌కు అనుకూలించకపోతుందా...? అనూహ్యం జరగకపోతుందా? అని ఆశించిన మహారాష్ట్రకు భంగపాటు ఎదురైంది. పిచ్ బ్యాటిం గ్‌కు అనుకూలంగా ఉండటంతో పాటు కర్ణాటక బ్యాట్స్‌మెన్ ఎలాంటి అలసత్వానికి తావీయకుండా చక్కటి షాట్లతో పరుగులు రాబట్టారు. సున్నా పరుగుల వద్ద కీపర్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన అమిత్ (49 బంతుల్లో 38; 6 ఫోర్లు, 1 సిక్స్), ఉతప్ప (47 బంతుల్లో 36; 6 ఫోర్లు) రాణి ంచారు. వీరికి రాహుల్ (66 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), మనీశ్ పాండే (43 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు), నాయర్ (43 బంతుల్లో 20 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) అండగా నిలిచారు. ఖురానా బౌలింగ్‌లో లాంగాన్ మీదుగా నాయర్ భారీ సిక్సర్ కొట్టడంతో కర్ణాటక విజయం పూర్తయింది. స్కోరు వివరాలు మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్: 305; కర్ణాటక తొలి ఇన్నింగ్స్: 515; మహారాష్ట్ర రెండో ఇన్నింగ్స్: 366; కర్ణాటక రెండో ఇన్నింగ్స్: ఉతప్ప (సి) ఖురానా (బి) దరేకర్ 36; రాహుల్ (సి) ఖురానా (బి) ముండే 29; అమిత్ వర్మ (సి అండ్ బి) ఖురానా 38; పాండే (నాటౌట్) 28; నాయర్ (నాటౌట్) 20; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (40.5 ఓవర్లలో 3 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1-65; 2-87; 3-120. బౌలింగ్: సమద్ ఫలా 11-2-28-0; సంక్లేచా 3-2-7-0; దరేకర్ 10-0-46-1; ఖురానా 8.5-0-53-1; ముండే 8-1-20-1. సమష్టి కృషితో... నా వ్యక్తిగత రికార్డులకన్నా రంజీ ట్రోఫీ సాధించడమే గుర్తుంచుకోదగ్గ ఘనత. దీని కోసం మేం ఎంతో శ్రమించాం. ఇవి అద్భుత క్షణాలు. గత కొన్నేళ్లుగా మా జట్టు నిలకడగా ఆడుతున్నా టైటిల్ మాత్రం దక్కలేదు. కాబట్టి ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉన్నాం. సమష్టి కృషితో ఇది సాధ్యమైంది. 25-26 ఏళ్ల వయసులో ఉన్న మా ఆటగాళ్ళంతా కసితో ఆడారు. రంజీ ట్రోఫీని అందుకోవడం అతి పెద్ద గౌరవంగా భావిస్తున్నా. - వినయ్ కుమార్, కర్ణాటక కెప్టెన్ మొదటి మ్యాచ్ నుంచి చక్కటి ప్రదర్శన కనబర్చిన మా జట్టును చూసి గర్వపడుతున్నా. ఐదు క్యాచ్‌లు వదిలేయడం ఈ మ్యాచ్‌లో మా అవకాశాలపై ప్రభావం చూపింది. లేదంటే పరిస్థితి మరో రకంగా ఉండేది. తొలి రోజు బ్యాటింగ్ వైఫల్యం కూడా దెబ్బ తీసింది. క్వార్టర్స్‌లో ముంబైపై అద్భుత విజయం సాధించినప్పుడు మేం రంజీ గెలవగలమనే నమ్మకం కలిగింది. జట్టులో ప్రతీ ఆటగాడు మెరుగైన ప్రదర్శన కనబర్చడంతోనే ఇక్కడి వరకు చేరగలిగాం. మా ఆట పట్ల సంతృప్తిగా ఉన్నా. - రోహిత్ మొత్వాని, మహారాష్ట్ర కెప్టెన్ -
రంజీ ఫైనల్లో కర్ణాటక
మొహాలీ: రంజీట్రోఫీలో కర్ణాటక జట్టు ఫైనల్‌కు చేరింది. పంజాబ్‌తో మొహాలీలో జరిగిన మ్యాచ్‌లో ఐదో రోజు ఆట కూడా వర్షం కారణంగా సాధ్యపడలేదు. దీంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో పంజాబ్ 270 పరుగులకు ఆలౌట్ కాగా... కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 447 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కర్ణాటక ముందుకు వెళ్లింది. 29 నుంచి హైదరాబాద్‌లో జరిగే టైటిల్ పోరులో మహారాష్ట్రతో కర్ణాటక తలపడుతుంది. ఫైనల్‌కు జోల్ దూరం న్యూఢిల్లీ: మహారాష్ర్ట స్టార్ బ్యాట్స్‌మన్ విజయ్ జోల్ రంజీ ఫైనల్‌కు దూరమవుతున్నాడు. అండర్-19 ప్రపంచకప్ కోసం బెంగళూరులో నిర్వహిస్తున్న శిబిరంలో పాల్గొనాల్సిందిగా ఈ యువ క్రికెటర్‌ను బీసీసీఐ ఆదేశించింది. ఈ క్యాంప్ జాతీయ క్రికెట్ అకాడమీలో మంగళవారం ప్రారంభమైంది. తొలి రోజే జోల్ అక్కడ రిపోర్ట్ చేశాడు. బోర్డు నిర్ణయంపై మహారాష్ట్ర కోచ్ సురేంద్ర భావే అసంతృప్తి వ్యక్తం చేశారు.