రంజీ కింగ్ కర్ణాటక
నాలుగేళ్ల క్రితం... సొంతగడ్డపై మైసూరులో కర్ణాటక జట్టు రంజీ ట్రోఫీ ఫైనల్ ఆడింది. రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత పోరాట పటిమ కనబర్చినా చివరకు ఆరు పరుగుల తేడాతో పరాజయం పాలవ్వడంతో ఆటగాళ్ల గుండె పగిలింది. అప్పుడు ఫైనల్ ఆడిన జట్టులోని ఎనిమిది మంది కర్ణాటక సభ్యులు ఇప్పుడు కూడా ఫైనల్లో ఉన్నారు. కానీ ఈసారి వారు అవకాశం జారవిడుచుకోలేదు. సమష్టి ప్రదర్శన కనబర్చి రంజీ ట్రోఫీ టైటిల్ నెగ్గిన జట్టులో సభ్యులయ్యారు.
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ క్రికెట్‌లో కన్నడ కస్తూరి సుగంధాలు విరజిమ్మాయి. 2013-14 సీజన్ మొత్తం నిలకడగా రాణించిన కర్ణాటక జట్టు రంజీ ట్రోఫీలో విజేతగా నిలిచింది. కర్ణాటక రంజీ టైటిల్ నెగ్గడం ఇది ఏడో సారి. 1998-99లో గెలుపు తర్వా త ఆ జట్టు 15 ఏళ్లకు ఈ టైటిల్ నెగ్గడం విశేషం.
ఇక్కడి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఆదివారం ముగిసిన ఫైనల్లో కర్ణాటక ఏడు వికెట్ల తేడాతో మహారాష్ట్రను చిత్తు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో 157 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కర్ణాటక 40.5 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి రంజీ ట్రోఫీని కైవసం చేసుకుంది. టాప్ ఆర్డర్ ఆటగాళ్లంతా తలా ఓ చేయి వేసి జట్టును గెలిపించారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన రాహుల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. విజేత కర్ణాటకకు రూ. 2 కోట్లు, రన్నరప్ మహారాష్ట్రకు రూ. 1 కోటి ప్రైజ్‌మనీగా లభించాయి.
మరో 94 పరుగులు...
ఓవర్‌నైట్ స్కోరు 272/6 తో ఐదో రోజు ఆట ప్రారంభించిన మహారాష్ట్ర సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు జోడించేందుకు ప్రయత్నించింది. శ్రీకాంత్ ముండే (75 బంతుల్లో 42; 3 ఫోర్లు) ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. చివరి వరుస బ్యాట్స్‌మెన్ కూడా సహకరించడంతో జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో 366 పరుగులకు ఆలౌటైంది. కర్ణాటక బౌలర్లలో వినయ్ (4/116), గోపాల్ (4/47) నాలుగేసి వికెట్లు పడగొట్టారు.
సంచలనాలేమీ లేవు...
తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగుల ఆధిక్యాన్ని మినహాయించి అందుబాటులో ఉన్న 64 ఓవర్లలో 157 పరుగుల లక్ష్యం కర్ణాటక ముందు నిలిచింది. మ్యాచ్ ఆఖరి రోజు వికెట్ స్పిన్‌కు అనుకూలించకపోతుందా...? అనూహ్యం జరగకపోతుందా? అని ఆశించిన మహారాష్ట్రకు భంగపాటు ఎదురైంది. పిచ్ బ్యాటిం గ్‌కు అనుకూలంగా ఉండటంతో పాటు కర్ణాటక బ్యాట్స్‌మెన్ ఎలాంటి అలసత్వానికి తావీయకుండా చక్కటి షాట్లతో పరుగులు రాబట్టారు.
సున్నా పరుగుల వద్ద కీపర్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన అమిత్ (49 బంతుల్లో 38; 6 ఫోర్లు, 1 సిక్స్), ఉతప్ప (47 బంతుల్లో 36; 6 ఫోర్లు) రాణి ంచారు. వీరికి రాహుల్ (66 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), మనీశ్ పాండే (43 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు), నాయర్ (43 బంతుల్లో 20 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) అండగా నిలిచారు. ఖురానా బౌలింగ్‌లో లాంగాన్ మీదుగా నాయర్ భారీ సిక్సర్ కొట్టడంతో కర్ణాటక విజయం పూర్తయింది.
స్కోరు వివరాలు
మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్: 305; కర్ణాటక తొలి ఇన్నింగ్స్: 515; మహారాష్ట్ర రెండో ఇన్నింగ్స్: 366; కర్ణాటక రెండో ఇన్నింగ్స్: ఉతప్ప (సి) ఖురానా (బి) దరేకర్ 36; రాహుల్ (సి) ఖురానా (బి) ముండే 29; అమిత్ వర్మ (సి అండ్ బి) ఖురానా 38; పాండే (నాటౌట్) 28; నాయర్ (నాటౌట్) 20; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (40.5 ఓవర్లలో 3 వికెట్లకు) 157.
వికెట్ల పతనం: 1-65; 2-87; 3-120.
బౌలింగ్: సమద్ ఫలా 11-2-28-0; సంక్లేచా 3-2-7-0; దరేకర్ 10-0-46-1; ఖురానా 8.5-0-53-1; ముండే 8-1-20-1.
సమష్టి కృషితో...
నా వ్యక్తిగత రికార్డులకన్నా రంజీ ట్రోఫీ సాధించడమే గుర్తుంచుకోదగ్గ ఘనత. దీని కోసం మేం ఎంతో శ్రమించాం. ఇవి అద్భుత క్షణాలు. గత కొన్నేళ్లుగా మా జట్టు నిలకడగా ఆడుతున్నా టైటిల్ మాత్రం దక్కలేదు. కాబట్టి ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉన్నాం. సమష్టి కృషితో ఇది సాధ్యమైంది. 25-26 ఏళ్ల వయసులో ఉన్న మా ఆటగాళ్ళంతా కసితో ఆడారు. రంజీ ట్రోఫీని అందుకోవడం అతి పెద్ద గౌరవంగా భావిస్తున్నా.
- వినయ్ కుమార్, కర్ణాటక కెప్టెన్
మొదటి మ్యాచ్ నుంచి చక్కటి ప్రదర్శన కనబర్చిన మా జట్టును చూసి గర్వపడుతున్నా. ఐదు క్యాచ్‌లు వదిలేయడం ఈ మ్యాచ్‌లో మా అవకాశాలపై ప్రభావం చూపింది. లేదంటే పరిస్థితి మరో రకంగా ఉండేది. తొలి రోజు బ్యాటింగ్ వైఫల్యం కూడా దెబ్బ తీసింది. క్వార్టర్స్‌లో ముంబైపై అద్భుత విజయం సాధించినప్పుడు మేం రంజీ గెలవగలమనే నమ్మకం కలిగింది. జట్టులో ప్రతీ ఆటగాడు మెరుగైన ప్రదర్శన కనబర్చడంతోనే ఇక్కడి వరకు చేరగలిగాం. మా ఆట పట్ల సంతృప్తిగా ఉన్నా.
- రోహిత్ మొత్వాని, మహారాష్ట్ర కెప్టెన్