విజయం దిశగా కర్ణాటక
బెంగళూరు: ఇరానీ కప్‌లో కర్ణాటక జట్టు విజయం దిశగా పయనిస్తోంది. సీఎం గౌతమ్ (168 బంతుల్లో 122; 17 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీతో చెలరేగడంతో మంగళవారం మూడో రోజు కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 145 ఓవర్లలో 606 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో 405 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రెస్టాఫ్ ఇండియా ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 38 ఓవర్లలో 3 వికెట్లకు 114 పరుగులు చేసింది. అపరాజిత్ (42 బ్యాటింగ్), కార్తీక్ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. గంభీర్ (9) మరోసారి నిరాశపర్చగా, జాదవ్ (44) ఫర్వాలేదనిపించాడు. వినయ్ 2 వికెట్లు తీశాడు. ప్రస్తుతం రెస్ట్ ఇంకా 291 పరుగులు వెనుకబడి ఉంది.
రెండు రోజుల ఆట మిగిలి ఉంది. అంతకుముందు 390/5 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన కర్ణాటక ఇన్నింగ్స్‌లో బిన్ని (122 బంతుల్లో 122; 15 ఫోర్లు, 3 సిక్సర్లు) తొందరగా అవుటైనా... గౌతమ్ నిలకడగా ఆడాడు. వినయ్ (31)తో కలిసి ఏడో వికెట్ 88, గోపాల్ (16)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 57 పరుగులు జోడించాడు. చివర్లో మిథున్ (34 నాటౌట్) వేగంగా ఆడటంతో భారీ స్కోరు వచ్చింది. రెస్ట్ బౌలర్ పంకజ్ సింగ్ 6 వికెట్లు పడగొట్టాడు.