6 బంతుల్లో 5 వికెట్లతో చెలరేగిపోయాడు.. | Karnataka Reached Finals In Mushtaq Ali T20 Tournament | Sakshi
Sakshi News home page

అభిమన్యు పంచతంత్రం

Published Sat, Nov 30 2019 12:30 AM | Last Updated on Sat, Nov 30 2019 9:46 AM

Karnataka Reached Finals In Mushtaq Ali T20 Tournament - Sakshi

గతంలో ఒకసారి... బంగ్లాదేశ్‌ దేశవాళీ టోర్నీ విక్టరీ డే టి20 కప్‌ మ్యాచ్‌ (26డిసెంబర్, 2013)లో అల్‌ అమీన్‌ హుస్సేన్‌ ఒకే ఓవర్లో ఐదు వికెట్ల ఫీట్‌ను సాధించాడు. అబహాని లిమిటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో అల్‌ అమీన్‌ యూసీబీ–బీసీబీ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అబహాని ఇన్నింగ్స్‌ చివరి ఓవర్లో 5 వికెట్లు తీశాడు. తొలి బంతికి మెహదీ మారూఫ్‌ అవుట్‌ కాగా... చివరి నాలుగు బంతులకు నజ్ముల్‌ హుస్సేన్, సొహ్రవర్ది ష్రువో, నయీమ్‌ ఇస్లామ్, నబీల్‌ సమద్‌లను అమీన్‌ అవుట్‌ చేశాడు. ఈ ఐదు కూడా క్యాచ్‌లే.

సూరత్‌: వికెట్, వికెట్, వికెట్, వికెట్, వైడ్, 1, వికెట్‌... ఒకే ఓవర్లో కర్ణాటక పేస్‌ బౌలర్‌ అభిమన్యు మిథున్‌ ప్రదర్శన ఇది. దేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్‌ అలీ ట్రోఫీ సెమీస్‌ మ్యాచ్‌లో ఈ అరుదైన రికార్డు నమోదైంది. హరియాణాతో జరిగిన ఈ మ్యాచ్‌ చివరి ఓవర్లో చెలరేగిన మిథున్‌ ‘హ్యాట్రిక్‌’ సహా ఏకంగా 5 వికెట్లు పడగొట్టడం విశేషం. ఈ ఐదు వికెట్లూ ఫీల్డర్ల క్యాచ్‌ల ద్వారానే వచ్చాయి.

తొలి నాలుగు బంతులకు నాలుగు వికెట్లు తీసిన అతను తర్వాతి బంతిని వైడ్‌గా విసిరాడు. అనంతరం సింగిల్‌ ఇచ్చిన అతను చివరి బంతికి కూడా మరో వికెట్‌ పడగొట్టాడు. టి20 చరిత్రలో ఈ తరహా ఫీట్‌ రెండో సారి నమోదు కావడం విశేషం. భారత్‌ నుంచి ఇదే మొదటి సారి కాగా 2013లో బంగ్లాదేశ్‌ పేసర్‌ అల్‌ అమీన్‌ హుస్సేన్‌ ఇలాగే టి20 మ్యాచ్‌లో ఒకే ఓవర్లో 5 వికెట్లు తీశాడు.

ఫైనల్లో కర్ణాటక...
బౌలింగ్‌లో మిథున్‌ ప్రదర్శనకు తోడు బ్యాటింగ్‌లో దేవ్‌దత్‌ పడిక్కల్‌ (42 బంతుల్లో 87; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), కేఎల్‌ రాహుల్‌ (31 బంతుల్లో 66; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) బ్యాటింగ్‌లో చెలరేగడంతో హరియాణాను చిత్తు చేసి కర్ణాటక ఫైనల్లోకి ప్రవేశించింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన హరియాణా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. హిమాన్షు రాణా (34 బంతుల్లో 61; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), చైతన్య బిష్ణోయి (35 బంతుల్లో 55; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలు సాధించగా, హర్షల్‌ పటేల్‌ (20 బంతుల్లో 34; 6 ఫోర్లు, 1 సిక్స్‌), రాహుల్‌ తేవటియా (20 బంతుల్లో 32; 6 ఫోర్లు) రాణించారు.

19వ ఓవర్‌ ముగిసేసరికి 3 వికెట్లకు 192 పరుగులతో ఉన్న హర్యానా ఆఖరి ఓవర్లో మిథున్‌ దెబ్బకు 2 పరుగులే చేయగలిగింది. అనంతరం కర్ణాటక 15 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. రాహుల్, దేవ్‌దత్‌ తొలి వికెట్‌కు 57 బంతుల్లోనే 125 పరుగులు జోడించగా... మయాంక్‌ అగర్వాల్‌ (14 బంతుల్లో 30 నాటౌట్‌; 3 సిక్సర్లు) మిగతా పనిని పూర్తి చేశాడు.

తుది పోరుకు తమిళనాడు... 
మరో మ్యాచ్‌లో రాజస్తాన్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి తమిళనాడు ఫైనల్లోకి ప్రవేశించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 112 పరుగులే చేయగలిగింది. రాజేశ్‌ బిష్ణోయి (23), రవి బిష్ణోయి (22) మాత్రమే ఫర్వాలేదనిపించారు. అనంతరం తమిళనాడు 17.5 ఓవర్లలో 3 వికెట్లకు 116 పరుగులు చేసింది.

వాషింగ్టన్‌ సుందర్‌ (46 బంతుల్లో 54 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, రవిచంద్రన్‌ అశ్విన్‌ (33 బంతుల్లో 31; 4 ఫోర్లు) రాణించాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 69 పరుగులు జోడించారు. ఆదివారం కర్ణాటక, తమిళనాడు మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది. దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ తుది పోరులో కూడా ఈ రెండు జట్లే తలపడ్డాయి.

మిథున్‌ హ్యాట్రిక్‌ల జాబితా 
రంజీ ట్రోఫీ (ఫస్ట్‌క్లాస్‌): కర్ణాటక x ఉత్తర ప్రదేశ్‌ (నవంబర్‌ 3–6, 2009): పీయూష్‌చావ్లా, ఆమిర్‌ ఖాన్, ఆర్పీ సింగ్‌. 
విజయ్‌ హజారే ట్రోఫీ (లిస్ట్‌–ఎ):  కర్ణాటక x తమిళనాడు (అక్టోబర్‌ 25, 2019): షారుఖ్‌ ఖాన్, ఎం.మొహమ్మద్, ఎం. అశ్విన్‌ 
ముస్తాక్‌ అలీ టోర్నీ (టి20): కర్ణాటక x హరియాణా (నవంబర్‌ 29, 2019): హిమాన్షు రాణా, రాహుల్‌ తేవటియా, సుమీత్‌ కుమార్‌ (హ్యాట్రిక్‌), అమిత్‌ మిశ్రా (నాలుగో బంతి), జయంత్‌ యాదవ్‌ (ఆరోబంతి)

మూడు ఫార్మాట్‌లలోనూ...
దేశవాళీలో నిలకడైన ప్రదర్శనతో భారత జట్టులోకి వచ్చి అదే జోరును కొనసాగించలేక కనుమరుగైపోయిన పేస్‌ బౌలర్లలో 30 ఏళ్ల అభిమన్యు మిథున్‌ కూడా ఒకడు. 2010 జులై నుంచి 2011 డిసెంబర్‌ మధ్య మిథున్‌ భారత్‌ తరఫున 4 టెస్టులు, 5 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 50.66 సగటుతో 9 వికెట్లు, వన్డేల్లో 67.66 సగటుతో 3 వికెట్లు మాత్రమే తీయడంతో అతను సెలక్టర్ల విశ్వాసం కోల్పోయాడు.

అయితే ఇప్పటికీ కర్ణాటక జట్టు కీలక ఆటగాళ్లలో అతను కొనసాగుతున్నాడు. తాజా ప్రదర్శనతో అతను భారత దేశవాళీ క్రికెట్‌కు సంబంధించిన మూడు ఫార్మాట్‌లలోనూ హ్యాట్రిక్‌ తీసిన ఏకైక బౌలర్‌గా నిలిచాడు. 2009లో తన తొలి రంజీ మ్యాచ్‌లోనే హ్యాట్రిక్‌తో అందరి దృష్టినీ ఆకర్షించిన మిథున్‌... గత నెలలో తన పుట్టిన రోజున విజయ్‌ హజారే ట్రోఫీ ఫైనల్లో తమిళనాడుపై హ్యాట్రిక్‌ తీశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement