ఐదోసారి విజయ్ హజారే ట్రోఫీ కైవసం
ఫైనల్లో విదర్భపై 36 పరుగుల తేడాతో విజయం
స్మరణ్ సూపర్ సెంచరీ
ధ్రువ్ షోరే, హర్ష్ దూబే మెరుపులు వృథా
‘ప్లేయర్ ఆఫ్ ద టోర్ని’గా కరుణ్ నాయర్
వడోదర: దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక జట్టు విజేతగా నిలిచింది. సీజన్ ఆసాంతం నిలకడగా రాణించిన కర్ణాటక... తుది పోరులోనూ భారీ స్కోరు చేసి టైటిల్ ఖాతాలో వేసుకుంది. ఐదోసారి ఫైనల్‌కు చేరిన కర్ణాటక ఐదు సార్లూ టైటిల్ సొంతం చేసుకోవడం మరో విశేషం. శనివారం జరిగిన ఫైనల్లో కర్ణాటక 36 పరుగుల తేడాతో విదర్భను చిత్తుచేసింది.
ఈ సీజన్‌లో పరుగుల వరద పారించిన విదర్భ సారథి కరుణ్ నాయర్ (31 బంతుల్లో 27; 4 ఫోర్లు) ఆఖరి పోరులో ఎక్కువసేపు నిలవకపోవడంతో ఆ జట్టుకు పరాజయం తప్పలేదు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక జట్టు నిర్ణిత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 348 పరుగులు చేసింది. రవిచంద్రన్ స్మరణ్ (92 బంతుల్లో 101; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో కదంతొక్కగా... క్రిష్ణన్ శ్రీజిత్ (74 బంతుల్లో 78; 9 ఫోర్లు, ఒక సిక్స్), అభినవ్ మనోహర్ (42 బంతుల్లో 79; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ శతకాలతో విజృంభించారు.
కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (32; 5 ఫోర్లు), టీమిండియా ఆటగాడు దేవదత్ పడిక్కల్ (8), అనీశ్ (21) విఫలమయ్యారు. 67 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో శ్రీజిత్‌తో కలిసి స్మరణ్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఈ జంట నాలుగో వికెట్‌కు 160 పరుగులు జోడించారు. ఇక చివర్లో అభినవ్ మనోహర్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో కర్ణాటక భారీ స్కోరు చేయగలిగింది. విదర్భ బౌలర్లలో దర్శన్ నల్కండే, నచికేత్ భూటె చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో విదర్భ జట్టు 48.2 ఓవర్లలో 312 పరుగులకు ఆలౌటైంది.
ఓపెనర్ ధ్రువ్ షోరే (111 బంతుల్లో 110; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో పోరాడగా... హర్ష్ దూబే (30 బంతుల్లో 63; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) వీరవిహారం చేశాడు. క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్లోనూ సెంచరీలు చేసిన ధ్రువ్ షోరే తుది పోరులోనూ అదే జోరు కొనసాగించగా... అతడికి సహచరుల నుంచి సరైన సహకారం లభించలేదు. కెపె్టన్ కరుణ్ నాయర్, యశ్ రాథోడ్ (22), యష్ కదమ్ (15); జితేశ్ శర్మ (34), శుభమ్ దూబే (8), అపూర్వ వాంఖడే (12) విఫలమయ్యారు. కర్ణాటక బౌలర్లలో వాసుకి కౌషీక్, ప్రసిద్ధ్ కృష్ణ, అభిలాశ్ శెట్టి తలా 3 వికెట్లు పడగొట్టారు. సెంచరీతో చెలరేగిన కర్ణాటక బ్యాటర్ స్మరణ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. తాజా టోర్నిలో 389.5 సగటుతో 779 పరుగులు చేసి ‘టాప్ స్కోరర్’గా నిలిచిన కరుణ్ నాయర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు లభించింది.
Comments
Please login to add a commentAdd a comment