
బెంగళూరు: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీని కర్ణాటక జట్టు నాలుగోసారి కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో కర్ణాటక పేసర్ అభిమన్యు మిథున్ (5/34) హ్యాట్రిక్ తీయగా... బ్యాటింగ్‌లో రాహుల్ (52 నాటౌట్; 5 ఫోర్లు), మయాంక్ అగర్వాల్ ( 69 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ అర్ధసెంచరీలతో జట్టును గెలిపించారు. దీంతో కర్ణాటక వీజేడీ పద్ధతి ప్రకారం 60 పరుగుల తేడాతో తమిళనాడుపై గెలుపొందింది. ముందుగా తమిళనాడు జట్టు 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది.
ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన మిథున్ 3, 4, 5 బంతుల్లో వరుసగా షారుక్ ఖాన్ (27), మొహమ్మద్ (10), అశ్విన్ (0) వికెట్లను పడగొట్టడంతో తమిళనాడు ఆలౌటైంది. అనంతరం కర్ణాటక 23 ఓవర్లలో వికెట్ నష్టానికి 146 పరుగులు చేసిన దశలో వర్షం వల్ల మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో చేసేదేమీ లేక 23 ఓవర్లలో 87 పరుగులుగా లక్ష్యాన్ని సవరించగా... అప్పటికే దీన్ని కర్ణాటక అధిగమించడంతో విజేతగా ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment