Tamil Nadu team
-
హ్యాట్రిక్ సెంచరీలతో అదరగొట్టిన త్రీడీ ప్లేయర్ విజయ్ శంకర్
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో త్రీడీ ప్లేయర్‌గా పిలువబడే టీమిండియా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్, తమిళనాడు ఆటగాడు విజయ్ శంకర్ అదరగొడుతున్నాడు. ఎలైట్ గ్రూప్-బిలో భాగంగా అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో సెంచరీ చేసిన శంకర్ (187 బంతుల్లో 112; 7 ఫోర్లు, సిక్సర్).. ప్రస్తుత సీజన్లో హ్యాట్రిక్ సెంచరీలు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌కు ముందు మహారాష్ట్రపై 214 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 107 పరుగులు, అంతకుముందు ముంబైపై 174 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 103 పరుగులు చేసిన శంకర్ వరుసగా మూడు సెంచరీలు చేసి రంజీల్లో తన అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తున్నాడు. 2019 వరల్డ్‌కప్ తర్వాత టీమిండియాలో చోటు కోల్పోయిన శంకర్.. తాజా ప్రదర్శనతో భారత టెస్ట్ జట్టులోకి రావాలని ఆశిస్తున్నాడు. భారత టెస్ట్ టీమ్‌లో ఎలాగూ హార్ధిక్ పాండ్యా ప్లేస్ ఖాళీగా ఉండటంతో ఆ స్థానంపై శంకర్ కన్నేశాడు. రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలింగ్‌తో పాటు లోయర్ ఆర్డర్లో ఉపయోగకరమైన బ్యాటర్ అయిన శంకర్.. 2018-19 మధ్యలో టీమిండియా తరఫున 12 వన్డేలు, 9 టీ20లు ఆడినప్పటికీ, ఆశించినంత ప్రభావం చూపలేక జట్టులో స్థానం కోల్పోయాడు. 2019 వరల్డ్‌కప్ సందర్భంగా నాటి భారత జట్టు ప్రధాన సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ శంకర్‌కు త్రీడీ ప్లేయర్‌గా అభివర్ణిస్తూ టీమిండియాకు ఎంపిక చేశాడు. అప్పట్లో అంబటి రాయుడును తప్పించి శంకర్‌కు జట్టులోకి తీసుకోవడంతో పెద్ద దుమారమే రేగింది. తనను వరల్డ్‌కప్ జట్టులో ఎంపిక చేయకపోవడం పట్ల రాయుడు అసహనం వ్యక్తం చేస్తూ.. వరల్డ్‌కప్‌ను త్రీడీ కళ్లజోడుతో చూస్తానని వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. రాయుడును కాదని నాడు జట్టులో వచ్చిన శంకర్ కేవలం 3 మ్యాచ్‌లు మాత్రమే ఆడి గాయంతో టోర్నీ మధ్యలోనే నిష్క్రమించాడు. నాటి నుంచి జట్టుకు దూరంగా ఉన్న శంకర్ తాజాగా హ్యాట్రిక్ సెంచరీలు బాది తిరిగి వార్తల్లో నిలిచాడు. ఇదిలా ఉంటే, అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో తమిళనాడు జట్టు విజయం దిశగా సాగుతోంది. మూడో రోజు మూడో సెషన్ సమయానికి ఫాలో ఆన్ ఆడుతున్న అస్సాం తమిళనాడు తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 247 పరుగులు వెనుకపడి ఉంది. 17 ఓవర్ల తర్వాత ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. అంతకుముందు తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 540 పరుగులకు ఆలౌటైంది. శంకర్‌తో పాటు జగదీశన్ (125), ప్రదోశ్ పాల్ (153) శతకాలు బాదారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో అస్సాం 266 పరుగులకే ఆలౌటైంది. మరో రోజు ఆట మిగిలి ఉండటంతో ఫలితంగా తేలడం ఖాయంగా కనిపిస్తుంది. -
SMAT 2021 Winner Tamil Nadu: తమిళనాడు తడాఖా.. మూడోసారి
Syed Mushtaq Ali Trophy 2021 Final: Tamil Nadu Won Their 3rd Syed Mushtaq Ali Trophy Title: దేశవాళీ టి20 క్రికెట్లో తమిళనాడు జట్టు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. సోమవారం ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో తమిళనాడు జట్టు టైటిల్ నిలబెట్టుకుంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన తమిళనాడు ఫైనల్లో నాలుగు వికెట్ల తేడాతో కర్ణాటక జట్టును ఓడించింది. తద్వారా 2019 ఫైనల్ పోరులో కర్ణాటక చేతిలో ఒక పరుగు తేడాతో ఎదురైన ఓటమికి ఈ గెలుపుతో తమిళనాడు ప్రతీకారం తీర్చుకుంది. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తమిళనాడు సరిగ్గా 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసి గెలిచింది. షారుఖ్ ఖాన్ (15 బంతుల్లో 33 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు), సాయికిశోర్ (3 బంతుల్లో 6 నాటౌట్; 1 ఫోర్) తమిళనాడు గెలుపులో కీలకపాత్ర పోషించారు. తమిళనాడు విజయానికి చివరి ఓవర్లో 16 పరుగులు అవసరమయ్యాయి. కర్ణాటక బౌలర్ ప్రతీక్ జైన్ ఆఖరి ఓవర్ వేసేందుకు వచ్చాడు. తొలి బంతికి సాయికిశోర్ ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత ప్రతీక్ రెండు వైడ్లు వేయడంతోపాటు ఐదు పరుగులు ఇచ్చాడు. దాంతో తమిళనాడు విజయసమీకరణం ఆఖరి బంతికి ఐదు పరుగులుగా మారింది. ప్రతీక్ వేసిన ఆఖరి బంతిని షారుఖ్ ఖాన్ డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా సిక్సర్‌గా మలిచి తమిళనాడుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 పరుగులు సాధించింది. ఓపెనర్ రోహన్ కదమ్ ‘డకౌట్’ కాగా... మనీశ్ పాండే (15 బంతుల్లో 13; 2 ఫోర్లు), కరుణ్ నాయర్ (14 బంతుల్లో 18; 2 ఫోర్లు) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. చివర్లో అభినవ్ మనోహర్ (37 బంతుల్లో 46; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), ప్రవీణ్ దూబే (25 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్), సుచిత్ (7 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) ధాటిగా ఆడటంతో కర్ణాటక స్కోరు 150 పరుగులు దాటింది. తమిళనాడు బౌలర్లలో సాయికిశోర్ (3/12) రాణించాడు. 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన తమిళనాడు ఒకదశలో 17.1 ఓవర్లలో 116 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. గెలుపు కోసం 17 బంతుల్లో 36 పరుగులు చేయాల్సిన దశలో షారుఖ్ సూపర్ ఇన్నింగ్స్‌తో తమ జట్టును గెలిపించాడు. ► ముస్తాక్ అలీ ట్రోఫీని అత్యధికంగా మూడుసార్లు గెలిచిన జట్టుగా తమిళనాడు గుర్తింపు పొందింది. 2006–07 సీజన్లో, 2020– 2021 సీజన్లోనూ తమిళనాడు చాంపియన్‌గా నిలిచింది. బరోడా, గుజరాత్, కర్ణాటక జట్లు రెండుసార్లు చొప్పున ముస్తాక్ అలీ ట్రోఫీని సాధించాయి. ► గుర్తింపు పొందిన టి20 క్రికెట్ టోర్నీ ఫైనల్లో ఆఖరి బంతికి సిక్స్ కొట్టి టైటిల్ సాధించిన రెండో జట్టు తమిళనాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన 2018 నిదాహాస్ ట్రోఫీ ఫైనల్లో దినేశ్ కార్తీక్ చివరి బంతికి సిక్స్ కొట్టి భారత్‌ను గెలిపించాడు. Sensational Shahrukh! 💪 💪 Sit back & relive this @shahrukh_35 blitz which powered Tamil Nadu to #SyedMushtaqAliT20 title triumph. 🏆 👏 #TNvKAR #Final Watch his knock 🎥 ⬇️https://t.co/6wa9fwKkzu pic.twitter.com/evxBiUdETk — BCCI Domestic (@BCCIdomestic) November 22, 2021 -
హైదరాబాద్ ఖేల్‌ఖతమ్
కోల్‌కతా: మరోసారి ఆల్‌రౌండ్ వైఫల్యంతో హైదరాబాద్ క్రికెట్ జట్టు మూల్యం చెల్లించుకుంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 టోర్నమెంట్లో హైదరాబాద్ నాకౌట్ చేరుకునే అవకాశాలకు తెరపడింది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా తమిళనాడుతో శనివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. సందీప్ (36 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలువగా... ఓపెనర్ ప్రజ్ఞయ్ రెడ్డి (23 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), చివర్లో తనయ్ (6 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్), సీవీ మిలింద్ (11 బంతుల్లో 24 నాటౌట్; 3 సిక్స్‌లు) ధాటిగా ఆడటంతో హైదరాబాద్ స్కోరు 150 దాటింది. అనంతరం తమిళనాడు జట్టు 19.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ జగదీశన్ (51 బంతు ల్లో 78 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), కెప్టెన్ దినేశ్ కార్తీక్ (30 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) నాలుగో వికెట్‌కు అజేయంగా 69 పరుగులు జోడించారు. వరుసగా నాలుగో విజయం సాధించిన తమిళనాడు జట్టు ప్రస్తుతం గ్రూప్ ‘బి’లో 16 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉంది. దాదాపుగా నాకౌట్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. బెంగాల్ జట్టు 12 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఒకే విజయం సాధించిన హైదరాబాద్ నాలుగు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. చివరి లీగ్ మ్యాచ్‌లో తమిళనాడు, బెంగాల్ తలపడనున్నాయి. ఒకవేళ తమిళనాడు ఓడిపోతే బెంగాల్ కూడా 16 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలుస్తుంది. అయితే బెంగాల్‌కంటే తమ నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉండటం తమిళనాడుకు కలిసొచ్చే అంశం. సోమవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో జార్ఖండ్‌తో హైదరాబాద్ తలపడుతుంది. -
విజేత కర్ణాటక
బెంగళూరు: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీని కర్ణాటక జట్టు నాలుగోసారి కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో కర్ణాటక పేసర్ అభిమన్యు మిథున్ (5/34) హ్యాట్రిక్ తీయగా... బ్యాటింగ్‌లో రాహుల్ (52 నాటౌట్; 5 ఫోర్లు), మయాంక్ అగర్వాల్ ( 69 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ అర్ధసెంచరీలతో జట్టును గెలిపించారు. దీంతో కర్ణాటక వీజేడీ పద్ధతి ప్రకారం 60 పరుగుల తేడాతో తమిళనాడుపై గెలుపొందింది. ముందుగా తమిళనాడు జట్టు 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన మిథున్ 3, 4, 5 బంతుల్లో వరుసగా షారుక్ ఖాన్ (27), మొహమ్మద్ (10), అశ్విన్ (0) వికెట్లను పడగొట్టడంతో తమిళనాడు ఆలౌటైంది. అనంతరం కర్ణాటక 23 ఓవర్లలో వికెట్ నష్టానికి 146 పరుగులు చేసిన దశలో వర్షం వల్ల మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో చేసేదేమీ లేక 23 ఓవర్లలో 87 పరుగులుగా లక్ష్యాన్ని సవరించగా... అప్పటికే దీన్ని కర్ణాటక అధిగమించడంతో విజేతగా ప్రకటించారు. -
చార్మినార్ మరమ్మతులకు ఆలయ స్థపతులు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర పురావస్తు సర్వేక్షణ విభాగం (ఏఎస్ఐ) అధీనంలో ఉన్న చార్మినార్ కట్టడానికి దేవాలయాల స్థపతులు మరమ్మతులు చేయబోతున్నారు. గత నెల రెండో తేదీ అర్ధరాత్రి వేళ ఈ చారిత్రక కట్టడానికి మక్కా మసీదు వైపు ఉన్న మినార్ డిజైన్ లోంచి ఓ భాగం ఊడి కింద పడిపోయిన విషయం తెలిసిందే. దాదాపు మూడు మీటర్ల మేర ఈ భారీ పెచ్చు ఉన్నట్టుండి ఊడి కింద పడింది. అంతకుముందు కురిసిన భారీ వర్షానికి ఆ ప్రాంతంలోని సన్నటి పగుళ్ల నుంచి నీటిని భారీగా పీల్చుకోవటంతో అక్కడి డంగు సున్నంతో రూపొందించిన నగిషీల భాగం బాగా బరువెక్కి ఊడిపోయినట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఇప్పుడు ఆ పెచ్చు ఊడిపోయిన చోట మళ్లీ సంప్రదాయరీతిలో డంగు సున్నం మిశ్రమంతో తిరిగి నగిషీలు అద్దాల్సి ఉంది. కేంద్ర పురావస్తు సర్వేక్షణ విభాగం నిపుణులే దాన్ని పూర్తి చేస్తారని అనుకున్నా, ఆ విభాగం తాజాగా ఆ పనిని దేవాలయాల స్థపతులకు అప్పగించింది. తమిళనాడుకు చెందిన ఆ స్థపతుల బృందం ఆది, సోమవారాల్లో నగరానికి రానుంది. ఆ వెంటనే పనులు మొదలుపెడతారు. గతంలో ఈ స్థపతులకు ఇలాంటి పనులు చేసిన అనుభవం ఉండటంతో వారికే అప్పగించాలని అధికారులు నిర్ణయించారు. ఏడెనిమిదేళ్ల క్రితం చార్మినార్‌కు చిన్నచిన్న డిజైన్లు ఊడిపోవటంతో వీరితోనే చేయించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని తాడిపత్రిలో పురాతన దేవాలయాల పునరుద్ధరణలో కూడా వీరు డంగు సున్నంతో పనులు చేశారు. చార్మినార్‌కు కూడా ఇప్పుడు సూక్ష నగిషీలు అద్దాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వారైతేనే సరిగ్గా చేయగలరని నిర్ణయించి పనులు అప్పగించారు. మరో పది రోజుల్లో వానలు కురిసే అవకాశం ఉన్నందున ఈలోపే పనులు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. డంగు సున్నం, నల్లబెల్లం, కరక్కాయ పొడి, రాతి పొడి, గుడ్డు సొనలతో కూడిన మిశ్రమాన్ని ఈ పనుల్లో వినియోగించనున్నారు. కట్టడంలోని చాలా భాగాల్లో చిన్నచిన్న పగుళ్లు ఏర్పడ్డాయి. భారీ పెచ్చు ఊడిన ప్రాంతంలో కూడా మరికొన్ని పగుళ్లున్నట్టు అధికారులు గుర్తించారు. వాటిని కూడా ఇప్పుడు పూడ్చేయనున్నారు. లేకుంటే మరిన్ని పెచ్చులు ఊడిపడే ప్రమాదం ఉంది. త్వరలో ఢిల్లీ నుంచి అధికారులు చార్మినార్ పెచ్చు ఊడి పడడానికి కారణమైన పగుళ్లు ఎందుకు ఏర్పడ్డాయనే విషయంలో మరింత లోతుగా పరిశీలించేందుకు ఢిల్లీ నుంచి ఏఎస్ఐ ఉన్నతాధికారులు త్వరలో నిపుణులతో కలిసి రానున్నారు. పెచ్చు ఊడిపడిన వెంటనే కొందరు నిపుణులు వచ్చి పరిశీలించి వెళ్లారు. వారి నుంచి ఇంకా నివేదిక రాలేదు. కట్టడం చుట్టూ ఏర్పడ్డ వైబ్రేషన్ల వల్లే పగుళ్లు ఏర్పడినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. చార్మినార్ చుట్టూ దశాబ్దాలుగా వాహనాలు తిరుగుతుండటం, ఇటీవల పాదచారుల ప్రాజెక్టులో భాగంగా కట్టడానికి అతి చేరువగా భారీ యంత్రాలతో పనులు చేపట్టడం వల్ల ఇవి ఏర్పడి ఉంటాయని భావిస్తున్నారు. పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాతే మరమ్మతు పనులు చేపట్టాలని తొలుత భావించారు. కానీ వర్షాకాలం ముంచుకు రావడంతో వెంటనే మరమ్మతులు జరపకుంటే మరిన్ని పెచ్చులూడే ప్రమాదం ఉండటంతో వెంటనే పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఇన్ఫ్రారెడ్ థర్మోగ్రఫీ స్కానర్ సాయంతో కట్టడంలో ఎక్కడెక్కడ పగుళ్లున్నాయో గుర్తించనున్నారు. -
విజయాన్ని చేజార్చుకున్న ఆంధ్ర
చెన్నై: రంజీ ట్రోఫీలో భాగంగా తమిళనాడు జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు మంచి అవకాశాన్ని చేజార్చుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆకట్టుకున్న బ్యాట్స్‌మన్ రెండో ఇన్నింగ్స్‌లో రాణించకపోవడంతో కేవలం 21 పరుగుల తేడాతో గెలుపును వదులుకుని మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. 218 పరుగుల లక్ష్యఛేదనకు ఆట చివరిరోజు సోమవారం రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఆంధ్ర జట్టు 41.4 ఓవర్లలో 7 వికెట్లకు 198 పరుగులు మాత్రమే చేసి మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. కేఎస్ భరత్ (86 బంతుల్లో 64; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీ చేయగా, ప్రశాంత్ కుమార్ (33), రికీ భుయ్ (40) రాణించారు. చివర్లో కెప్టెన్ హనుమ విహారి (13), అశ్విన్ హెబర్ (20) ఒత్తిడిలో వికెట్లు కోల్పోయారు. తమిళనాడు బౌలర్లలో విఘ్నేశ్ 3 వికెట్లు దక్కించుకోగా, రవిచంద్రన్ అశ్విన్, రాహిల్ షా చెరో 2 వికెట్లు తీశారు. అంతకుముందు 112/2 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన తమిళనాడు జట్టుకు బాబా అపరాజిత్ (212 బంతుల్లో 108;10 ఫోర్లు), కెప్టెన్ అభినవ్ ముకుంద్ (200 బంతుల్లో 95; 7 ఫోర్లు), మురళీ విజయ్ (55) భారీ స్కోరును అందించారు. దీంతో తమిళనాడు 105 ఓవర్లలో 6 వికెట్లకు 350 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి 218 పరుగుల లక్ష్యాన్ని ఆంధ్రకు నిర్దేశించింది. తొలి ఇన్నింగ్స్‌లో 133 పరుగుల ఆధిక్యం సాధించిన ఆంధ్ర ఖాతాలో 3 పాయింట్లు చేరాయి. తమిళనాడుకు ఒక పాయింట్ దక్కింది. మరోవైపు వర్షం కారణంగా హైదరాబాద్, మహారాష్ట్ర జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. ఇరుజట్లకు చెరో పాయింట్ లభించింది. -
దేవధర్ ట్రోఫీ ఫైనల్లో తమిళనాడు
విశాఖపట్నం: విజయ్ హజారే ట్రోఫీ చాంపియన్ తమిళనాడు జట్టు దేవధర్ ట్రోఫీ వన్డే టోర్నమెంట్లో ఫైనల్లోకి ప్రవేశించింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు 73 పరుగుల తేడాతో భారత్ ‘ఎ’ జట్టుపై గెలుపొందింది. మొదట తమిళనాడు 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. దినేశ్ కార్తీక్ (93; 6 ఫోర్లు, 1 సిక్స్), జగదీశన్ (71; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలు సాధించారు. ప్రత్యర్థి బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ 3 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్ ‘ఎ’ 44.4 ఓవర్లలో 230 పరుగుల వద్ద ఆలౌటైంది. మన్దీప్ సింగ్ (97; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. బుధవారం జరిగే ఫైనల్లో భారత్ ‘బి’తో తమిళనాడు తలపడనుంది. -
ఆంధ్రకు మరో ఓటమి
చెన్నై: ముస్తాక్ అలీ టి20 టోర్నమెంట్లో ఆంధ్ర జట్టుకు మరో ఓటమి ఎదురైంది. గురువారం ఆంధ్రతో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు జట్టు 37 పరుగుల తేడాతో ఆంధ్రపై గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తమిళనాడు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగులు చేసింది. విజయ్ శంకర్ (49 బంతుల్లో 69; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీ చేయగా... సతీశ్ (32 నాటౌట్) ధాటిగా ఆడాడు. అనంతరం హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 142 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. రికీ భుయ్ (44 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విజృంభించినా జట్టుకు ఓటమి తప్పలేదు. హనుమ విహారి (37) రాణించాడు. -
విజేత హైదరాబాద్
ఖమ్మం స్పోర్ట్స్, న్యూస్‌లైన్: జాతీయ బాల్ బ్యాడ్మింటన్‌లో హైదరాబాద్ పురుషుల జట్టు టైటిల్ సాధించింది. ఖమ్మంలో ఐదు రోజుల పాటు జరిగిన ఈ టోర్నీలో మహిళల విభాగంలో తమిళనాడు జట్టు విజయం సాధించింది. పురుషుల విభాగం ఫైనల్లో హైదరాబాద్ జట్టు 29-25, 29-20తో ఇండియన్ రైల్వేస్ జట్టుపై నెగ్గింది. మహిళల ఫైనల్లో తమిళనాడు జట్టు 29-24, 29-17తో కర్ణాటకపై గెలిచింది. పురుషుల విభాగంలో ఆంధ్ర, తమిళనాడు... మహిళల విభాగంలో కేరళ, ఆంధ్ర వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి.