
చెన్నై: రంజీ ట్రోఫీలో భాగంగా తమిళనాడు జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు మంచి అవకాశాన్ని చేజార్చుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆకట్టుకున్న బ్యాట్స్‌మన్ రెండో ఇన్నింగ్స్‌లో రాణించకపోవడంతో కేవలం 21 పరుగుల తేడాతో గెలుపును వదులుకుని మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. 218 పరుగుల లక్ష్యఛేదనకు ఆట చివరిరోజు సోమవారం రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఆంధ్ర జట్టు 41.4 ఓవర్లలో 7 వికెట్లకు 198 పరుగులు మాత్రమే చేసి మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. కేఎస్ భరత్ (86 బంతుల్లో 64; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీ చేయగా, ప్రశాంత్ కుమార్ (33), రికీ భుయ్ (40) రాణించారు. చివర్లో కెప్టెన్ హనుమ విహారి (13), అశ్విన్ హెబర్ (20) ఒత్తిడిలో వికెట్లు కోల్పోయారు. తమిళనాడు బౌలర్లలో విఘ్నేశ్ 3 వికెట్లు దక్కించుకోగా, రవిచంద్రన్ అశ్విన్, రాహిల్ షా చెరో 2 వికెట్లు తీశారు.
అంతకుముందు 112/2 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన తమిళనాడు జట్టుకు బాబా అపరాజిత్ (212 బంతుల్లో 108;10 ఫోర్లు), కెప్టెన్ అభినవ్ ముకుంద్ (200 బంతుల్లో 95; 7 ఫోర్లు), మురళీ విజయ్ (55) భారీ స్కోరును అందించారు. దీంతో తమిళనాడు 105 ఓవర్లలో 6 వికెట్లకు 350 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి 218 పరుగుల లక్ష్యాన్ని ఆంధ్రకు నిర్దేశించింది. తొలి ఇన్నింగ్స్‌లో 133 పరుగుల ఆధిక్యం సాధించిన ఆంధ్ర ఖాతాలో 3 పాయింట్లు చేరాయి. తమిళనాడుకు ఒక పాయింట్ దక్కింది. మరోవైపు వర్షం కారణంగా హైదరాబాద్, మహారాష్ట్ర జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. ఇరుజట్లకు చెరో పాయింట్ లభించింది.
Comments
Please login to add a commentAdd a comment