చెన్నై: కట్టుదిట్టమైన బౌలింగ్ చేసిన ఆంధ్ర బౌలర్లు రంజీ ట్రోఫీ సీజన్‌లో తొలి రోజే ఆకట్టుకున్నారు. పటిష్టమైన తమిళనాడు జట్టుతో శుక్రవారం మొదలైన గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ప్రత్యర్థిని తొలి ఇన్నింగ్స్‌లో 176 పరుగులకు ఆలౌట్ చేసింది. మీడియం పేసర్లు యెర్రా పృథ్వీరాజ్ (3/39), బండారు అయ్యప్ప (2/31)లకు తోడుగా ఎడంచేతి వాటం స్పిన్నర్ భార్గవ్ భట్ (4/52) మాయాజాలంతో తమిళనాడు ఇన్నింగ్స్ తడబడింది. చెపాక్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తమిళనాడు తరఫున భారత క్రికెటర్లు మురళీ విజయ్, అభినవ్ ముకుంద్, అశ్విన్ బరిలోకి దిగారు. 15 పరుగులకే ఓపెనర్లు మురళీ విజయ్, ముకుంద్‌లను కోల్పోయిన తమిళనాడు ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. మిడిల్‌ఆర్డర్‌లో బాబా అపరాజిత్ (51; 4 ఫోర్లు) కాస్త నిలదొక్కుకొని అర్ధసెంచరీ చేశాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో మూడు ఓవర్లు ఆడి వికెట్ నష్టపోకుండా ఎనిమిది పరుగులు చేసింది. మరోవైపు వర్షం కారణంగా హైదరాబాద్, మహారాష్ట్ర జట్ల మధ్య తొలి రోజు ఆట రద్దయింది.
ప్రశాంత్ చోప్రా డబుల్ సెంచరీ
ధర్మశాలలో పంజాబ్ జట్టుతో మొదలైన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో హిమాచల్ ప్రదేశ్ జట్టు తొలి రోజే పరుగుల వర్షం కురిపించింది. ఓపెనర్ ప్రశాంత్ చోప్రా (289 బంతుల్లో 271 బ్యాటింగ్; 37 ఫోర్లు, ఒక సిక్స్) అజేయ డబుల్ సెంచరీ చేయడంతో హిమాచల్ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 459 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ప్రశాంత్‌కు జతగా పారస్ డోగ్రా (124 బంతుల్లో 99 బ్యాటింగ్; 11 ఫోర్లు, ఒక సిక్స్) క్రీజ్‌లో ఉన్నాడు.
►2 రంజీ ట్రోఫీ చరిత్రలో ఒకే రోజు అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ప్రశాంత్ చోప్రా (271) రెండో స్థానంలో నిలవడం విశేషం. 1948–49 సీజన్‌లో మహారాష్ట్ర బ్యాట్స్‌మన్ బీబీ నింబాల్కర్ ఒకే రోజు 277 పరుగులు సాధించారు. చతేశ్వర్ పుజారా (సౌరాష్ట్ర–261) మూడో స్థానంలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment